సబ్ ఫీచర్

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షాలు మొదలవడంతో అపుడే పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా వీధులన్నీ చెత్తాచెదారంతో నిండిపోతున్నాయి. ఈ సమయంలో ప్రజలు, స్థానిక సంస్థల అధికారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోని పక్షంలో పలురకాల వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉంది. మన ఇంటిని ఏ విధంగా శుభ్రపర్చుకుంటామో అలాగే మన పరిసరాలను సైతం అలా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు గ్రహించాలి.
ప్లాస్టిక్ వస్తువులను నియంత్రించాలని ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆచరణలో అది జరగడం లేదు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ సీసాలు, పాలిథిన్ కవర్లు ఇతర వ్యర్థ పదార్థాలు దర్శనమిస్తున్నాయి. వాతావరణ కాలుష్యం వల్ల ఏడాదికేడాది ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ మానవాళికి పెనుముప్పు పొంచి ఉంది. ప్రపంచం యావత్తూ ఈ విషయంపై దృష్టిని కేంద్రీకరించకపోతే భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రచార ఆర్భాటం తప్ప శాశ్వత పరిష్కార మార్గాల వైపు పాలకులు మొగ్గుచూపడం లేదన్నది వాస్తవం.
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ్భారత్ పేరిట ఒక బృహత్కర కార్యక్రమం ప్రారంభించింది. చాలాచోట్ల ఇది మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. ఇలాంటి కార్యక్రమాలను కొన్ని రోజులకే పరిమితం చేస్తే ఆశించిన లక్ష్యం నెరవేరదు. గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు ఈ కార్యక్రమాన్ని మహోద్యమంలా చేపట్టాల్సి ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు ప్రజలందరి తోడ్పాటు అవసరం. స్వచ్ఛత అన్నది ముందుగా ఇంటి నుంచి ప్రారంభం కావాలి. పాలిథిన్ కవర్లను, ప్లాస్టిక్ వస్తువులను, వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ వేయకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేసుకోవాలి. భూమిలో శిథిలం కాని వస్తువులను వాడకుండా బహిష్కరించాల్సి ఉంది. భూమిలో చెత్త కరగక పోవడం వల్ల ఎన్నో ఉపద్రవాలున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు అన్ని స్థాయిల్లో స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంచేలా సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేస్తుండాలి. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కేవలం వేదికలకే పరిమితం కారాదు. నిపుణులు సూచనలు, ప్రభుత్వ ఆదేశాలు ఆచరణలో మాత్రం అనుకున్నంతమేర కొనసాగడం లేదన్నది జగమెరిగిన సత్యం. ప్రతి ఒక్కరూ పూనుకుంటేనే అపరిశుభ్రతను కొంతవరకు తగ్గించడానికి వీలవుతుంది. వీధుల్లో వ్యర్థాలను పడేస్తే అవికాస్తా వర్షపునీటితో మమేకమై క్రిమికీటకాలకు అడ్డాగా మారి, జనం అనారోగ్యాల బారిన పడటానికి దారితీస్తుంది. రోగాలు విజృంభించాక ఇతరులను నిందిస్తే మనకొచ్చే ప్రతిఫలం ఏమీ ఉండదు. మన జాగ్రత్తలో మనముంటే వ్యాధుల బెడదను, అకాల మరణాలను నివారించడానికి వీలవుతుంది.
ఏడాదికేడాది వాతావరణంలో ఎన్నో మార్పులు చోటుచేసుకొని ఉష్ణోగ్రతలు పెరిగి వేసవికాలమంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. అడవులు క్షీణతకు గురై వర్షాలు పడకుండాచేసి భూగర్భజలాలు అడుగంటిపోవడానికి కారణమయ్యాయి. అభివృద్ధి నెపంతో డబ్బు ఖర్చుపెట్టినప్పుడు వాటివల్ల ఉపయోగం లేకుంటే శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. తెలంగాణలో ఇప్పటి వరకూ హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టి ఎన్ని మొక్కలు నాటారో ఆ గణాంకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఎన్ని చెట్లు బతికాయో అందరికీ తెలిసిందే. సకాలంలో వర్షాలు లేకపోవడంతో అనుకున్నంత మేరలో ప్రతిఫలం పొందలేకపోయాము. ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకున్నట్లయితే హరితహారం కొంతవరకైనా విజయవంతమయ్యేది.
తెలంగాణ ప్రభుత్వం గ్రామానికో నర్సరీ ఏర్పాటుచేసి మొక్కలు పెంచాలని నిర్ణయించడం శుభ పరిణామమే కానీ గతంలో జరిగిన వైఫల్యాలను దృష్టిలోపెట్టుకొని కేవలం వరుణునే్న నమ్ముకోకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకుని మొక్కలు నాటాలి. దుకాణాల్లో ప్లాస్టిక్ వస్తువులు, కవర్లను వాడకుండా చర్యలు తీసుకోవాలి. వాటిని వాడితే కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి. పరిశుభ్రతకు పాటుపడే ఉద్యోగులకు ప్రోత్సాహకాలను అందించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ప్లాస్టిక్ రహిత వస్తువులను వాడుకుంటూ, పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చినపుడు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. కాలుష్యాన్ని వెదజల్లే ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకుంటూ, జన సమూహం మధ్యలో ఉన్న పరిశ్రమలను దూరంగా నెలకొల్పేలా చర్యలు చేపట్టాలి.

-డా. పోలం సైదులు