సబ్ ఫీచర్

శిశు మరణాలను అరికడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ ప్రజల ఆరోగ్యంమీదే ఆధారపడి ఉంటుందనేది నగ్న సత్యం. నేటి ఆధునిక కాలంలో వైద్యం పేదలకు అందని ద్రాక్ష అయింది. నిరక్షరాస్యత, అవగాహన లోపం కారణంగా ఏటా మాతా శిశు మరణాలు కొనసాగుతుండటం విచారకరం. ఇటీవల ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాలు బాధను కల్గిస్తున్నాయి. వివిధ కారణాలతో చిన్నారుల మరణాలు సంభవిస్తున్నాయి. ఇటీవల బీహార్‌లోని ముజాఫర్ జిల్లాలో కేవలం వంద మందికి పైగా పసి పిల్లలు మెదడువాపు వ్యాధితో మరణించడం బాల్యానికి మనమిస్తున్న భరోసాను మరోసారి బోనులో నిలబెట్టింది. మాతా శిశువులకు పోషకాహార లభ్యత అత్యంత అధ్వాన్న స్థితిలో ఉంది. శిశు మరణాల సంఖ్య తగ్గినప్పటికీ ప్రపంచ దేశాలతో పోలిస్తే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. శిశు మరణాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత్ ముందుంది. ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న ప్రతీ వంద మంది చిన్నారుల్లో 29 మంది భారత్‌కు చెందిన వారేనట. అన్ని దేశాల కంటే లక్సంబర్గ్‌లో శిశు మరణాలు తక్కువగా ఉన్నట్లు తేలిందట. భారత్‌లో పౌష్టికాహార లోపం వల్లే ఎక్కువ శిశు మరణాలు నమోదవుతున్నాయి. తట్టు వ్యాధి టీకాలు అందని పిల్లలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో నైజీరియా తర్వాత భారత్ నిలుస్తుంది.
శిశు మరణాలకు బాధ్యత ఎవరిది?
భారత్‌లో 2000-2015 మధ్యకాలంలో పుట్టిన పిల్లల్లో నవ జాత (నెల రోజుల్లోపు) శిశు మరణాలు తొలి ఏడాది నుంచి అయిదేళ్ల లోపు చిన్నారుల మరణాలపై ‘ది లానె్సట్’ నిపుణుల బృందం అధ్యయనం చేసింది. 2015లో మన దేశంలో 2.51 కోట్ల మంది శిశువులు జన్మించారు. వారిలో 12.01 లక్షల పసి మొగ్గలు అయిదేళ్ల వయసు నిండక ముందే వివిధ కారణాలతో మరణించారు. ప్రతి వెయ్యి ప్రసవాలలో అయిదేళ్లలోపు చిన్నారులు సగటున 47.81 మంది కన్నుమూస్తున్నట్లు తేలింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అయిదేళ్ళలోపు శిశు మరణాల సంఖ్య ప్రతి వెయ్యి జననాలకు 39.61 నమోదైంది. అస్సాంలో 73.1 మంది చనిపోయారు. ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల మధ్య మరణాల రేటు నిష్పత్తి బాగా పెరిగిందట. అమెరికాలోని జాన్స్ హిస్కిన్స్ బ్లూమ్ బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైంటిస్టులు దేశంలో రాష్ట్రాల వారీగా శిశు మరణాల రేటుపై సర్వే చేశారు. శిశు మరణాల రేటును తగ్గించడంలో ఇండియా సఫలమైనా ప్రపంచంలో శిశుమరణాలు ఎక్కువగా ఉన్న దేశాలలో మాత్రం ప్రసిద్ధికెక్కింది. 2030 నాటికి ప్రతి వెయ్యి ప్రసవాలకు ఐదేండ్లలోపు చిన్నారుల మరణాలు 25 లోపు, నవజాత శిశువు మరణాలు 12లోపుకు తీసుకురావాలంటే ప్రభుత్వం కష్టించాలి. నీరు, పారిశుద్ధ్యం, ప్రాథమిక ఆరోగ్య సేవలు కొరవడి భారత్‌లో ప్రతి రెండు నిముషాలకు ముగ్గురు శిశువులు ప్రాణాలు కడతేరిపోతున్నాయని ఐక్యరాజ్యసమితి గత సెప్టెంబరులో వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. మన దేశంలో టీకాలు అందని చిన్నారులెందరో ఉన్నారు. 2015-2030ల మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఏడు కోట్ల మంది పసి పిల్లలు ఉండే సంభావ్యత ఉండగా దాంట్లో 18 శాతం భారత్‌లోనే ఉంటారని అంచనా.
నివేదికలు ఏమంటున్నాయి?
2015లో మరణించిన ఐదేళ్ల లోపు పిల్లల్లో 57.9 శాతం మంది పుట్టిన నాలుగు నెలలలోపు వారేనని సైంటిస్టులు గుర్తించారు. పుట్టుకతో వచ్చిన లోపాల వల్లే చాలామంది చిన్నారులు చనిపోయారు. 15.9% మంది న్యుమోనియాతో చనిపోయారు. పేద రాష్ట్రాలు, శిశు మరణాలరేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనే న్యుమోనియాతో పిల్లలు ప్రాణాలు వదిలారు. దేశంలో శిశు మరణాల రేట్లు తగ్గుతున్నా పేద, ధనిక రాష్ట్రాల్లో తేడాలున్నాయని గుర్తించారు. దేశంలో పసి బిడ్డల ఆరోగ్యానికి పూచీలేని వాతావరణం నెలకొంది. నెలలు నిండకముందే పుట్టడం, ప్రసవ సమయంలో సమస్యలు, రక్తంలో లోపాలు వంటి కారణాలతోపాటు అపరిశుభ్రత, అరక్షిత తాగునీరు వంటి కారణాలవల్ల ఏటా వేల సంఖ్యలో చిన్నారులు మరణిస్తున్నట్లు ‘ది లానె్సట్’ అధ్యయన వేదిక తేటతెల్లం చేసింది. ఏటేటా వేర్వేరు అనారోగ్య కారణాలవల్ల అయిదేళ్ల లోపు పసి మొగ్గలు పనె్నండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు వాస్తవాన్ని తెలిపింది. పిల్లల వికాసంలో పెద్దలు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. మెరుగైన పోషకాహారం, సకాలంలో టీకాలు, చౌకగా యాంటి బయోటిక్స్, సమకూరిస్తే ఇండియాలో లక్షల సంఖ్యలో శిశు మరణాలను అడ్డుకోగల వీలుందని కొద్ది రోజుల క్రితం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ప్రతి వెయ్యి ప్రసవాలకు అయిదేళ్లలోపు చిన్నారుల సగటున 47.81 శాతం మంది కన్నుమూస్తున్నట్లు తేలింది.
డయేరియా కూడా కారణమే!
ఐదేళ్ల లోపు పిల్లలు మృతి చెందడానికి ఉన్న అతి ముఖ్య కారణాల్లో నీళ్ల విరేచనాలు (డయేరియా) ఒకటి, ఏటా సుమారు 10 శాతం మంది చిన్నారులు నీళ్ల విరేచనాల బారిన పడి మృతి చెందుతుండడం గమనార్హం. ముఖ్యంగా పోషకాహార లోపమున్న చిన్నారుల పాలిట ఇది మృత్యువుగా మారుతోంది. వేసవిలో నీటి కొరత కారణంగా వర్షాకాలంలో కొత్త నీటి రాకతో నీటి కాలుష్యం ఏర్పడి నీళ్ల విరేచనాల కేసులు ఎక్కువవుతాయి. నీళ్ల విరేచనాలతో అనారోగ్యానికి గురైన చిన్నారులకు శరీరంలోని ద్రావణాలు బయటకు వెళ్లి నీరసించిపోతారు. దీనే్న వైద్య పరిభాషలో ‘డీ హైడ్రేషన్’ అని అంటారు. ఇలా నీరసించినవారికి తిరిగి ఏదో రూపంలో నోటి ద్వారా ద్రావణాలు (ఓఆర్‌ఎస్) అందించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణలో డయేరియా బాధిత చిన్నారుల్లో 35% ఏ రూపంలో తిరిగి నోటి ద్వారా ద్రావణాలను పొందలేకపోతున్నారు. వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవడం వల్ల శరీరంలోని జింక్ ఎక్కువగా నష్టపోతుందట. అందుకే దీన్ని అరికట్టడానికి వైద్యశాఖలో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓఆర్‌ఎస్ పాకెట్స్ సరఫరా చేసి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. పోషక విలువలుండే ఆహారాన్ని పిల్లలకు అందించాలి. రక్షిత తాగునీటిని తీసుకోవడంలో అవగాహన పెంపొందాలి. అంగన్‌వాడీలు ఈ దిశగా కృషిచేయాలి. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో నీళ్ల విరేచనాలతో ఎక్కువ చిన్నారులు బాధపడుతున్నారు.
ఐదేళ్లలోపు ఉన్న చిన్నారుల మరణాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో అసోం మొదటి స్థానంలో ఉంది. చిన్నారుల మరణాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో వాక్సిన్ కవరేజ్, శిశువుల సంరక్షణపై శ్రద్ధను పెంచడం వల్ల మరణాల రేటును తగ్గించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. భారతదేశంలో శిశు మరణాల తీరు ఆందోళన కల్గిస్తున్నది. ఇండియాలో శిశు మరణాల రేటు 42 శాతం తగ్గిందని, 2006లో ప్రతి వెయ్యి జననాలకు 57 శాతం మరణాలు ఉండగా, 2017లో 33 శాతానికి తగ్గిందని శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే వెల్లడించింది. ఐదు సంవత్సరాల లోపు పిల్లలలో మరణానికి అతిసార వ్యాధి రెండవ ప్రధాన కారణం. ఐదేళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపానికి అతిసారం ప్రధాన కారణం అవుతున్నది. కాన్పు చేసే నర్సులు, తల్లులు చేతులు శుభ్రంగా కడుక్కుంటే నవ జాత శిశువులు మనుగడ సాగించే అవకాశాలు 44 శాతం మేర పెరుగుతాయి. అందుకే తల్లుల్లో చైతన్యం పెంచి శిశువుల మరణాలు తగ్గిద్దాం. ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం.

- కె.రామ్మోహన్‌రావు