సబ్ ఫీచర్

నరసింహుని మదిలో మధుస్మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుస్మృతి
మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీగారి
శారదావరణ స్ఫురణాలు
రచన: శ్రీ సన్నిధానం నరసింహశర్మ,
వెల: రు.100/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లో-
*
ఇది మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీగారి శత జయంతి సంవత్సరం- అందువలన వారిని స్మరించుకుంటూ సభలు, సమావేశాలూ జరుగుతున్నాయి. వారిలో తమకు గల పరిచయాలను అనుభూతులను నెమరువేసుకుంటూ పండితులు కవులు వ్యాసాలు వ్రాస్తున్నారు. గ్రంథాలు వెలువరిస్తున్నారు. మధునాపంతుల వారి అంతేవాసులలో ప్రముఖులు సన్నిధానం నరసింహశర్మగారు. వీరి జీవితమంతా రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలో పుస్తకాలు గుట్టల చాటున గడిచింది. అప్పజోస్యుల సత్యనారాయణగారి ప్రేరణతో మధువ్రతునితో తన సన్నిధానాన్ని జ్ఞప్తిచేసుకుంటూ నరసింహశర్మగారు ఒక కృతిని వెలువరించారు. దాని పేరు ‘మధుస్మృతి’. నరసింహశర్మగారు లోగడ చాలా రచనలు చేసి లబ్ధప్రతిష్టితుడైనా ఈ కృతిలో వారి ఆకృతి స్తంభం చీల్చుకొని వచ్చిన నరసింహుని వలె విశ్వరూపంలో కన్పడింది. మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీగారు 1920 మార్చి 5 తూ.గో.జిల్లా ఐలండ్ పోలవరంలో మాతామహుల ఇంట జన్మించారు. వారిది సంప్రదాయ విద్వత్కుటుంబం. ఆంధ్ర మాసపత్రిక నిర్వహించారు. విద్యాబోధనలో జీవితం తరింపజేసుకున్నారు. ఆంధ్ర రచయితలు తోరణం వంటి రచనలతో కవితాతోరణాలు అల్లారు. నన్నయ్య తర్వాత మరో నన్నయ్యగా రాణ్మహేంద్రవరంలో రాణించారు. వారి జీవిత విశేషాలు ఇతరులకు తెలియని అనేకానేక సంఘటనలు సన్నిధానంవారు రసవంతంగా మధుస్మృతి పేర ఈ గ్రంథంలో వెలువరించారు. మధువ్రతము తేనెటీగ చేసిన తపస్సు. ఆయన మధువ్రతుడు. ఈయన మధుస్మతీ పరీమళ వ్రతుడు.
ఇది ఆంధ్ర పురాణ సమీక్షకాదు. మధునా సాహితీమూర్తిత్వం వ్యక్తిత్వం స్థాలీపులాకంగా పరిచయం చేసే గ్రంథం. ఇందులో ఎం.ఎస్. తాను మెచ్చుకున్న వారిని గూర్చి తనను మెచ్చుకున్న వారిని గూర్చి ఎనె్నన్నో దృష్టాంతాలున్నాయి. మధునావారి ట్రంకు పెట్టెకు సన్నిధానం వారు తాళంచెవి.
ఫలముల పేర వానిదిను పక్షుల పేర / మృణాళిపేర నిష్కలుషములై యెసంగుక్రిమి స్థలములపేర/ సంతతి పేర మహేశ్వరాంచిత స్ర్తిపురుష సంతతి పేరను / నిండి యుండె భూతలమున రామనామము / ముదంబును నచ్చెము సంఘటించుచున్
ఈ పద్యం రామదాసు నాటకంలోనిది. రచించినవారు లక్కవరం రాజావారి ఆస్థాన కవి శ్రీ కొత్తపల్లి సుందర రామయ్యగారు. వారు స్వయంగా సన్నిధానం నరసింహశర్మగారికి తాతగారు. సందర్భం ఏమిటంటే మధునాపంతుల వారి దగ్గర ఒక ట్రంకు పెట్టె ఉండేది. దానిని తీరిక వేళలలో సర్దుతుంటే ఈ పద్యం బయటపడింది. అంటే ఇది మధునాపంతులవారికి బాగా నచ్చి ఓ కాగితం మీద వ్రాసి దాచిపెట్టారన్నమాట. ఆ కాగితాన్ని రాజమండ్రిలో పురాణపండ రాధాకృష్ణమూర్తిగారికి పంపించారు. ఇంకేముంది అది పడవలసిన వారి చేతిలోనే పడినట్లయింది. ఇలా మధునా పీటిక ధర్మపీఠిక అయింది. ఇలాంటిదే మరో సన్నివేశం. అదే ట్రంకు పెట్టి కథ. మధునాపంతులవారు ఆంధ్ర రచయితలు రెండవ భాగంకోసం వ్రాసిన వ్యాసాలు సవరిస్తూ ఉండగా ములుగు పాపయారాధ్యుల వారి మీద వ్రాసిన వ్యాసం బయటకు వచ్చింది. అదే సమయంలో సన్నిధానం నరసింహశర్మగారు అక్కడికి వచ్చి పెట్టెలో నుండి మరికొన్ని కాగితాలు తీసి సర్దుతుండగా ఓ త్రిరత్న పత్రం బయటకు వచ్చింది. త్రిరత్నం అంటే వివాహవేళ వధూవరులకు ఆశీర్వదిస్తూ కవిగారు వ్రాసిన మూడు పద్యాలు. ఇందులో ఒకటి వరుని మీద రెండవది వధువు మీద సందర్భోచితంగా ఉండగా మూడవది మాత్రం యూనివర్సల్‌గా ఉంది.
ఆ పద్యం ఇది.
‘‘ఇతర క్షోణిని లక్షలిచ్చినను గానీ పుట్టనీ భారత
క్షితిపై వేద పురాణశాస్త్ర కృతి రాశి స్థానమీమంగళ
క్షితిపై గర్భదరిద్రునింటనయినన్ క్షేమంబుగా పుట్టి సు
వ్రతివై సాగెదనన్న భావమిది దీవ్య జ్జీవ సంస్కారవౌ’’.
ఈ పద్యాన్ని విడిగా వ్రాసిపెట్టుకొని ఏదైనా పుస్తకంలో వేద్దామా? అన్నారు సన్నిధానంవారు. మధునావారు అంగీకరించారు. ఇంకేముంది ఆ పద్యానికి అసాధారణ ప్రాచుర్యం లభించింది. ఇలాంటిదే ఒక స్వవిషయం చెపుతాను. రాజమండ్రిలో జాతీయ సాహిత్యపరిషత్ మహాసభలు జరుగుతున్నాయి. కార్యవర్గ సభ్యునిగా నేను హైదరాబాదు నుండి వెళ్లాను. మధ్యాహ్నం రెండు గంటల సదస్సుకు మధునావారు ముఖ్యఅతిథులు. యోగక్షేమాలు పలకరింపులు అయిన తర్వాత వారు తెలుగులో పద్యశిల్పం గూర్చి ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. వారు ఉమామహేశ్వర పండితుల మీద వ్రాసిన ఒక పద్యం పట్టుకొని వచ్చారు. దానిని కొన్ని వందల సభలలో చదివి ప్రాచుర్యం కల్పించాను ఆ పద్యం ఇది.
‘‘ఆదుకొనంగ దక్షులగునట్టి బుధుల్ / కరవైనవాడు గాధోదకమత్స్యమై / సడలుచుండిన ధర్మము భారతీయమున్ / ప్రోది యొనర్పనాంధ్ర ధర పుట్టిన కారణ / జన్ముడైనమే? ధోదయితున్ ప్రభాకర / బుధున్ మదిలోన గొల్చెదన్’’
ఇందులో గాధోదకమత్స్యము అనేది ప్రౌఢ ప్రయోగం. ఇది వేదరక్షణ చేసిన మత్స్యావతారాన్ని సూచిస్తుంది.- ఈ గాథ పురాణాల్లో ఉంది కదా! అదీ ప్రయోగం! మధునాపంతులవారు ఆర్ద్రంగా మంత్రస్థాయిలో ఆంధ్ర పురాణం గానం చేసేవారు. సన్నిధానం నరసింహశర్మగారు దానిని అనుకరించి హైదరాబాదులో వినిపించారు. విచిత్రమేమంటే అటు మధునావారి కావ్యపఠన సభలోను ఇటు సన్నిధానం వారి సన్నిధానంలోను ఉండి అనుకరణ గానాన్ని వినే అవకాశం నాకు లభించింది. నేను విన్న ప్రకారం ఆంధ్ర పురాణం మొత్తం ఒకేసారి వ్రాయలేదు. ముందు కొన్ని ఖండాలు వ్రాసి తర్వాత కాకతీయ ఖండం వంటివి మధ్యలో చేర్చారు. కాకతీయ ఖండం హైదరాబాదులో స్వయంగా సినారె పాఠం చెపుతూ ఆనందించి తన సంతోషం మధునాశాస్ర్తీగారికి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. అష్టావధాన శతావధానములు ఉదాహరణము తెలుగువారి స్వంత ప్రక్రియలు. ఉదాహరణములో ఏడు విభక్తులలో రచనలుంటాయి. చివర సార్వవిభక్తికంగా ఒక పద్యం ఉంటుంది. ఇటీవల ఉదాహరణములు సంస్కృతంలోనూ కొందరు రచిస్తున్నారు కాని ఇది పాల్కురికి సోమనాథుని బసవోదాహరణంలో 12వ శతాబ్దంనుండి తెలుగులో దర్శనమిస్తున్నాయి. మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీగారు రాజమండ్రిలోని కందుకూరి వీరేశలింగం ఉన్నత పాఠశాలలో చాలాకాలం పనిచేశారు. అందువలన కందుకూరి వారి వ్యక్తిత్వం మీద సాహిత్యం మీద మధువ్రతునికి సహజంగానే ప్రేముడి పల్లవించింది. పైగా ఇరువురిదీ రాజమండ్రి అనుబంధమేకదా! కందుకూరి వీరేశలింగోదాహరణం మధునావారు రచించారు. అది మధురంగా ఉన్నదని వేరే చెప్పనక్కరలేదు. ఉదాహరణం నుండి ఒక ఉదాహరణం:
ఆరని సౌరభంబు భరతావని నాల్గు చెరంగులందు పొం
గారెడి తీరునన్ శత శతాబ్దులు నెండని నిండుటేరులై
పారి రసజ్ఞ చిత్తములు పండువు చేసిన కందుకూరి మం
దార మరందములో తెలుగు నాటను జిందిన జీవబందువుల్
ఇది ప్రథమావిభక్తిలోని వృత్తము-
‘‘భవ్య సంస్కార రూపక మహారంగము
నవ్య కవిత్వపు నాంది శ్రీలింగము’’
ఇందులో ఆధునికాంధ్ర కవిత్వ పితామహుడు కందుకూరి వారేనని మధునాపంతులవారు తీర్మానించారు. వివిధ నూతన ప్రక్రియలు తెలుగులో కందుకూరి శ్రీలింగముతోనే ప్రారంభమైన మాట నిజము. మధునాపంతులవారు రచనలోను జీవితంలోనూ పరమ సాత్వికుడు. కొమ్ములు కూడా లేని గంగిగోవు. మధునాపంతుల కేరాఫ్ సన్నిధానం నరసింహశర్మ అని ఎవరో గౌతమీ గ్రంథాలయానికి ఓ జాబు వ్రాశారు. దానిని సన్నిధానం వారు మధునావారికి ఇచ్చి ‘క్షమించండి- ఇతడెవరో మీ అడ్రసు తెలియక నా పేర వ్రాశాడు. ఇదే కేరాఫ్ అడ్రసు లేఖ’ అన్నారు. మధునావారు నవ్వి ‘అతడు సరిగ్గానే వ్రాశాడు. ఎందుకంటే నా కేర్ చూడవలసిన శిష్యుడివి నీవే కదా’ అన్నారు. సన్నిధానము వారికి పెండ్లి అయింది. మధునావారి పద్యపు తేనె చినుకులు వర్షించారు.
‘గ్రంథముల గుట్టలో గుట్టె కాని వేరె / బంధమెరుగని ఒక యువ ప్రాణి పాణి / నాలి చిటికెన కుడి చేతి వేలి గోరు / రాసి కొనువేళ రసఝరీ రక్షనిడుము’
‘‘భారతి’’ మాసపత్రికలో నోరి నరసింహశాస్ర్తీగారు ‘అరవై ఏండ్లలో నిలిచే కవులు, నిలువని కవులు’ అంటూ ఒకే సంచలన వ్యాసం వ్రాశారు. అందులో సినారె రచన ఒక్కటీ తర్వాతి కాలంలో నిలువదు అని తీర్పు చెప్పారు. సన్నిధానంవారు దానిని సినారె దృష్టికి తీసుకొని వెళ్తే ‘సన్నిధానం.. నోరివారి నోటి తీరు తెలుస్తున్నది. నీ బోటి రసజ్ఞుల మనస్సుకెక్కిన రచన నిలువక ఏం చేస్తుంది?’ అని జవాబిచ్చారు. అలాగే అదే వ్యాసంలో నోరివారు ‘ఆంధ్ర పురాణములో ఆంధ్రత్వం ఎక్కువైంది’ అని విమర్శించారు. దీనిని మల్లంపల్లి శరభయ్య చూచి ‘ఆంధ్ర పురాణంలో ఆంధ్రత్వం కాక తమిళత్వం ఉంటుందా సన్నిధానం!’ అని చురక అంటించారు.
మధునా వారికీ ఆరుద్రకూ సత్సంబంధాలుండేవి. మధునావారింటి పెళ్లికి ఆరుద్ర వచ్చి విందు ఆరగించారు. ఆరుద్ర పోయినప్పుడు మధునావారు వ్రాసిన కంద పద్యం చూడండి.
‘మద్రపురవాసి మన ఆ / రుద్రకు భాషాదురంధరునకు / నవవచో భద్రునకు సినీ గేయ స / ముద్రునకీ కంద పద్యమున్ జదివింతున్’
రాణ్మహేంద్రవరంలో గంటపు కంఠము సవరించిన నన్నయ అనే పుంస్కోకిలపై మధువ్రతానికి అంతులేని అభిమానం. అలాగే శ్రీపాద కృష్ణమూర్తిశాస్ర్తీ వంటి వారిపై కూడా మధునావారు తేనెజల్లు కురిపించారు.
మధునావారు సంప్రదాయ శీలి- మనిషి వామనుడైనా ఆంధ్రత్వంలో త్రివిక్రముడు. భారతీయతకు చిరునామా - సన్నిధానంవారు ఈ గ్రంథాన్ని వ్రాయటం, అజోవిభోవారు సందర్భోచితంగా సకాలంలో ముద్రించటం ఒక శబ్ద్ధ్వారం’’. మధునాపంతుల వారి ఆంధ్ర పురాణము నేడు వివిధ విశ్వవిద్యాలయాలల్లోను కళాశాలల్లోను పాఠ్యగ్రంథంగా పెట్టాలి. లోగడ హైదరాబాదులో ఆధునిక పంచకావ్యములు పేరుతో 1) ఆంధ్ర పురాణము 2) రాణాప్రతాప చరిత్ర 3) శివభారతము 4) పోతన చరిత్ర 5)వందేమాతరం గ్రంథాలపై సాహితీ సదస్సులు నిర్వహించాము. ఈ జాబితాలో సౌందర నందము వంటి ఒకటి- రెండుచేర్చి సాహితీ సప్తాహం నిర్వహించాలి. అదే ప్రాతఃస్మరణీయులైన ఈ శబ్దబ్రహ్మలకు తెలుగు జాతి సమర్పించుకోవలసిన శత జయంతి శ్రద్ధాంజలి. జయంతితే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః.

- ప్రొ. ముదిగొండ శివ్రపసాద్