సబ్ ఫీచర్

‘డిజిటల్’ జెండా ఎగురుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిజిటల్ ఎకానమీ వైపు 2018-19 సంవత్సర ఆర్థిక సర్వే వేలు చూ పింది. ప్రపంచ మార్కెట్లను చేరేందుకు 5జీ సాంకేతిక పరిజ్ఞానం చక్కటి అవకాశమని సూచించింది. ఈ ఏడాది 5జీ స్ప్రెక్ట్రమ్ వేలం వేస్తే రూ.4.9 లక్షల కోట్లు రావొచ్చునన్న అభిప్రాయం వ్యక్తమైంది. 5జీని వచ్చే ఏడాదికల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడం వల్ల దేశీయ, ప్రపంచ మార్కెట్లలోకి దూసుకుపోయి ఘనమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు అవకాశాలున్నాయని ఆ సర్వేలో పేర్కొనడం ముదావహం. నూతన సాంకేతికతతో వ్యయాలు గణనీయంగా తగ్గడమే గాక, విద్య, వైద్యం, వినోద రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకొంటూ ఉద్యోగ కల్పనకు అవకాశముంది. అదే సమయంలో స్టార్టప్ సంస్థలకు రాయితీలు- పన్నులు హేతుబద్ధం చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని సర్వే పేర్కొన్నది. 2019 మార్చి నాటికి దేశంలో 16,578 స్టార్టప్ సంస్థలు నమోదు చేసుకోగా వీటిలో 47 శాతం స్టార్టప్ సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉండటం గొప్ప విషయం. వీటివల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయి కాబట్టి పన్నులు హేతుబద్ధీకరణ కీలకమని సర్వే సూచించడం చూస్తే డిజిటల్ విప్లవానికి దారి సుగమం అవుతోందనిపిస్తోంది.
మన ఐటీ ఎగుమతుల్లో 90 శాతం అమెరికా, బ్రిటన్, యూరప్ సమాఖ్యలకే ఉన్నాయని, ఇకముందు చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్, ఆఫ్రికాకు సైతం చేరేలా ప్రోత్సాహకాలు చేపట్టాలని కూడా సర్వే సూచించింది. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నది. ఐటీ- బీపీవో ఎగుమతుల విలువ రూ.9.52 లక్షల కోట్లుగా ఉందని తెలుస్తోంది. ఈ కీలకమైన రంగాన్ని మరింత విస్తరిస్తే ఆదాయం పెరగడమే గాక ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది. ఈ రంగంలోనే ఆశాజనకమైన అభివృద్ధి సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలో పలు దేశాలు ఐటీ ఆధారిత సేవలపై ఎక్కువ ఆధారపడ్డాయి. అక్కడ ఆటోమేషన్ స్థాయి పెరిగింది. సహజంగానే నూతన ఆవిష్కరణలకు స్వాగతం పలికే అవకాశముంది. పొరుగు సేవల రంగంలోనే గాక ఎగుమతుల ద్వారా ఆర్థికంగా బలపడే వీలుంది.
ఇక విద్యుత్ వాహనాలకు అవసరమైన ‘వ్యవస్థ’ను తీర్చిదిద్దడంలో వేగాన్ని ప్రదర్శించాలని సర్వే సూచన. భవిష్యత్‌లో విద్యుత్ వాహనాల వాడకం పెరగనున్నందున ఛార్జింగ్ వ్యవస్థను పటిష్టపరచాలని, ద్విచక్ర, వ్యక్తిగత కార్లు, వాణిజ్య కార్లు, బస్సులను విద్యుత్‌తో నడిచేలా చూస్తే కర్బన ఉద్గారాలను నివారించి, కాలుష్యం పెరగకుండా చూడటమేగాక, ఇంధనాన్ని ఆదా చేసినట్టు అవుతుందని సర్వే పేర్కొన్నది. ఇది జరగాలంటే విద్యుత్ వాహనాలపై ఆర్థిక భారం కొంత తగ్గించాలని సూచించింది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ రూ.192 కోట్లు ఉందని, సరైన దిశలో ప్రయాణిస్తే 7 శాతం వృద్ధిరేటు కష్టమేమీ కాదని, వచ్చే ఐదేళ్ళలో 8 శాతం వృద్ధిరేటుకు చేరుకుని రూ.5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ కలను సాకారం చేసుకునే వీలుందని భావిస్తున్నారు.
మేక్ ఇన్ హైదరాబాద్...
డిజిటల్ ఎకానమీ నేపథ్యంలో, ఆ దారిలో హైదరాబాద్ నగరంలో అనేక అంకుర (స్టార్టప్) సంస్థల విజయ గాథలతో ఇటీవల ‘మేడ్ ఇన్ హైదరాబాద్’ పేర ఒక పుస్తకాన్ని ముద్రించారు. ఇది ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సాధించాలన్న దృఢ సంకల్పం, అడ్డంకులను అధిగమించి విజయాన్ని ముద్దాడేతత్వం, సాహసమే ఊపిరిగా భావించి, వినూత్న ఆలోచనలకు పెద్దపీటవేసి తాము ఎదగడమేగాక ఇతరులకు దారి చూపుతూ జాబ్ సీకర్స్‌గా గాక, జాబ్ ప్రొవైడర్స్‌గా నిలిచి పాతిక మంది ప్రపంచానికి తమ సత్తా చాటిన వైనం ఈ పుస్తకంలో దర్శనమిస్తోంది. ఇదికదా ఈనాటి చైతన్యం.. ఇది కదా విప్లవాత్మక విధానం.. ఇది కదా ఆధునిక సరళి.. ఇది కదా విద్యను సార్థకం చేసుకోవడం అనిపిస్తోంది.
నడవలేని స్థితిలో వీల్‌చైర్‌లో కార్యాలయానికి వస్తూ కోట్లాది రూపాయల టర్నోవర్‌తో తన వ్యాపారాన్ని నడుపుతున్న కిరణ్ బిలిగిరి సాహసం ఎందరికో స్ఫూర్తిదాయకం. హైదరాబాద్‌కు చెందిన కిరణ్ తొలుత క్రిమిసంహారక మందుల వ్యాపారం చేసినా అనంతరం హోటల్స్ నిర్వహించే రంగంలోకి మళ్ళారు. ఊహించని విధంగా వింత వ్యాధి సోకి నడవలేని స్థితి వచ్చినా చికిత్స తీసుకుని, వీల్‌చైర్‌లో విధులు నిర్వహిస్తూ తోటి ఉద్యోగుల్లో ఉత్సాహం నింపి వ్యాపారాన్ని ఉన్నతికి తీసుకొచ్చారు. ఎందరికో ఉపాధిని కల్పించారు. స్టార్టప్ సంస్థ వాస్తవ స్వరూపాన్ని కిరణ్ కళ్ళముందు నిలిపారు.
ఓ రైతు కుటుంబంలో పుట్టిన గెదెల శ్రీనుబాబు కేవలం రూ.10వేలతో తన అంకుర సంస్థలైన పల్స్, ఓమ్మిక్స్‌ను రూ.వెయ్యి కోట్ల టర్నోవర్ జరిగేలా తీర్చిదిద్దారు. నూతన శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు దోహదపడే అంతర్జాతీయ కార్యక్రమాల రూపకల్పన చేయడం ఆయన పని. ఉన్నతంగా రాణించాలంటే ఉన్నత ఆలోచనలు ఉండాలని ఈ తెలుగు బిడ్డ చెబుతున్నాడు. ‘టిమ్లాఫుడ్స్’ను స్థాపించిన ప్రశాంత్ గిరిరాజు ‘పాపికాన్’ను ఉత్పత్తిచేసి దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. ఈ చిరుతిండిని 14 నగరాలలో అమ్ముతూ ఎందరికో ఉపాధి కల్పిస్తున్నారు. తన కాళ్ళపై తాను నిలబడాలన్న ఆకాంక్షను ఆయన పూర్తిచేసుకున్నారు. సాంకేతిక పరకరాల తయారీలో హేమంత్ సత్యనారాయణ, ‘జిప్పర్’ ద్వారా చిరునామా తెలుసుకునే సౌలభ్యం కల్పించిన ఆదిత్య.. ఇలా విభిన్న రంగాలలో వినూత్న ఆలోచనలతో విజయయాత్ర కొనసాగిస్తున్న అంకుర సంస్థల వ్యవస్థాపకుల విశేష కృషికి దర్పణం పడుతోంది ఈ ‘మేడ్ ఇన్ హైదరాబాద్’ పుస్తకం.
తాజాగా కేంద్ర బడ్జెట్‌లో అంకుర (స్టార్టప్‌ల) సంస్థల కోసం ప్రత్యేకంగా ఒక టీవీ ఛానల్‌ను ప్రతిపాదించారు. దీంతో ప్రభుత్వం ఈ రంగానికి ఏ రకమైన ప్రాధాన్యతనిస్తోందో బోధపడుతోంది. స్టార్టప్‌ల రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక టెలివిజన్ ఛానల్ దారిచూపగలదని భావిస్తున్నారు. అంతిమంగా ఇదొక వేదికగా ఉపకరించగలదని భావిస్తున్నారు. అలాగే స్టార్టప్‌లకు అండగా నిలుస్తున్న ఏంజెల్స్ ఎదుర్కొంటున్న పన్ను కష్టాలను పరిష్కరించేందుకు కేంద్రం చొరవ చూపింది. ఈ రంగానికి చెందిన బిగ్ డేటా, 3డీ ప్రింటింగ్, రోబోటిక్స్, కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి పరిజ్ఞానాన్ని విస్తృత పరిచేందుకు కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చారు. ఇది సత్వర అభివృద్ధికి కీలకమని పాలకులు గుర్తించారు. నూతన తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి మార్గం చూపింది. బడ్జెట్‌లో ప్రత్యేకంగా దీన్ని ప్రస్తావించారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. జాతీయ పరిశోధన ఫౌండేషన్‌ను ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధమైంది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలకు బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించారు. అంచనాల కంటే ఇది చాలా ఎక్కువ. అంతేగాక ‘భారతదేశంలో చదవండి’ అనే కొత్త నినాదంతో సర్కారు ముందుకొచ్చింది. ఈ మొత్తం ‘దృశ్యం’ డిజిటల్ ఎకానమీ జెండాను సమున్నతంగా ఎగరేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వర్తమానంలో కావలసింది బుద్ధుని ధ్యానమో, మావోయిస్టుల దండకారణ్యమో కాదు. ప్రజల సాధికారతను పెంచుతున్నది.. పెంచనున్నది డిజిటల్ సాంకేతికత మాత్రమే! అటుగా అడుగులు వేద్దాం!

-వుప్పల నరసింహం 99857 81799