సబ్ ఫీచర్

గోరక్షకులా.. గోస్మగ్లర్లా.. ఎవరు ప్రమాదకారులు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతిలో గోసంరక్షణకు అత్యంత ప్రధాన స్థానముంది. వేదాలలో గోవు ‘అఘ్న’ అని పేర్కొనబడింది. దానికి అర్థం ‘వధింపబడరానిది’ అని. గోసంరక్షణ అనేది ఒక ఆధ్యాత్మిక సాధన గానే కాదు, సమాజ ఆర్థిక వికాసంలో ప్రధాన పాత్ర వహించింది కూడా. చక్రవర్తుల నుంచి అతి సాధారణ పౌరుని వరకు ప్రతి ఒక్కరూ గోసంరక్షణ, పోషణతో పాటు వాటిని ఆరాధన గావించారు. తరతరాలుగా వ్యవసాయ ప్రధాన దేశంగా వస్తూన్న మన దేశానికి గోవు వెనె్నముకగా నిలచింది. గోవుని తల్లిగా భావించిన మన దేశంలోనే ప్రస్తుత 21వ శతాబ్దంలో గో సంపద ఎంతో నిర్లక్ష్యానికి గురవుతోంది. గోసంరక్షణకు అలనాడు రాజుల కాలంలో ఎన్నో చర్యలు తీసుకొన్నారు.
* మనునీతి చోళుడు చోళ వంశానికి చెందిన గొప్ప రాజు. తన కుమారుడు నడుపుతున్న రథం కింద పడి లేగదూడ ఒకటి చనిపోయిందన్న విషయం తెలుసుకుని కుమారుడికే మరణశిక్ష విధిస్తాడు.
* గోసంరక్షణకు ఛత్రపతి శివాజీ కఠిన చట్టాలు చేశాడు.
* పంజాబ్‌కి చెందిన రాజా రంజిత్‌సింగ్ గోవధను నిషేధించాడు.
* శ్రీ దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ్ గోసంరక్షణ కోసం ఒక ఉద్యమమే చేసింది.
* బాలగంగాధర్ తిలక్, లాలాలజపతి రాయ్, మదనమోహన మాలవ్యా వంటి స్వాతంత్య్ర సమరయోధులు గోవధను తీవ్రంగా ఖండించారు.
భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మత ఘర్షణలు 1714లో గుజరాత్‌లో జరిగాయి. హరిరాం అనే హిందువు హోలీ పండుగ నాడు అహమ్మదాబాద్‌లో పెద్ద మంటను వేద్దామనుకున్నాడు. దానిని వ్యతిరేకిస్తూ అక్కడి ముస్లింలు కొందరు ఒక ఆవును అక్కడికి తీసుకువచ్చి వధించడంతో ఘర్షణలు చెలరేగాయి. ముస్లింలు తమకు అండగా ఆప్ఘన్ సైన్యాన్ని వెంటబెట్టుకువచ్చారు. హిందువులు కపూర్‌చంద్ బన్సాలీ నాయకత్వంలో ముస్లింలను ప్రతిఘటించారు.
1880 ప్రాంతంలో దయానంద సరస్వతి మార్గదర్శనంలో ఆర్యసమాజ్ గోవధను వ్యతిరేకిస్తూ ధార్మిక ఉద్యమం మొదలుపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ 1893లో ముస్లింలు బొంబాయి , మాపు, ఆజంగఢ్ (ఉత్తరప్రదేశ్)లలో హింసాకాండకు పాల్పడ్డారు. 1900-1947 మధ్యకాలంలో గోవధ ప్రధానాంశంగా లెక్కలేనన్ని మత ఘర్షణలు జరిగాయి. చరిత్రలో గోవధ-సంరక్షణ విషయమై జరిగిన ఘర్షణలన్నింటిలోనూ గోసంరక్షణ ఒక పవిత్రకార్యంగా, అందుకోసం పోరాడిన వారిని వీరులుగానే భావించారు హిందువులు.
కానీ ఇటీవలి కాలంలో గోసంరక్షణ అన్నది ఒక మతతత్వ పూరిత, నేరపూరితమైన చర్యగా భావించబడుతోంది. మరోవైపు గోవులను బహిరంగంగా విచక్షణారహితంగా వధించి ‘బీఫ్ ఫెస్టివల్’ జరుపుకోవడం, బహిరంగంగా పచ్చి గోమాంసాన్ని తింటూ ప్రదర్శనలు చేయడం ఆధునిక, నాగరిక ధోరణిగా, భావ వ్యక్తీకరణకు, వినియోగ స్వేచ్ఛకు నిదర్శనంగా భావించబడుతోంది.
గాంధీజీ గోహత్యను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన నాయకత్వంలో దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన, ఆ తరువాత ‘గాంధీ కుటుంబీకుల’ నాయకత్వంలో సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన యువజన కార్యకర్తలు కేరళలో ఆవుదూడలను బహిరంగంగా వధించి, తరువాత బీఫ్ పార్టీ జరిపి అదేదో ఘన కార్యమన్నట్టు వీడియోలు తీసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించారు. ‘ఇది అత్యంత హేయమైన పాశవిక చర్య’ అని ఎవరైనా నిరసన తెలిపితే వారిని భావ స్వాతంత్య్ర విరోధకులుగా ప్రచారం చేస్తున్నారు. అసలు ‘గోరక్షకులు’ అంటేనే నేడు తీవ్రవాదులుగా, హంతకులుగా ముద్రవేస్తున్నారు. ‘సెక్యులర్ ముఠా’ తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా తయారుచేసుకున్న వార్తలను ఎలా ప్రచారం చెయ్యాలా? అన్నదే నేడు మీడియాకు ముఖ్యమైపోయింది. దానికి అనుగుణంగా వారు గంటల తరబడి చర్చాకార్యక్రమాలను ప్రసారం చేస్తుంటారు. గోరక్షకులు ఎవరిమీదైనా తిరగబడితే- గంటల తరబడి చర్చలు పెడుతుంది మీడియా. గోవులను అక్రమంగా తరలిస్తున్నవారి చేతిలో గోరక్షకులు, పోలీసులు లేదా అమాయక రైతులు చనిపోతే ఆ విషయం మీడియాకి పట్టనే పట్టదు. అలాచేయడం మీడియా పొలిటికల్ ఎజెండాకి వ్యతిరేకం కదా! మీడియా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కొన్ని ఉదంతాలను చూద్దాం.
జూన్ 2013: ఉత్తరప్రదేశ్‌లోని భాదోని జిల్లా సంత్ రవిదాస్‌నగర్‌లో ఆవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నందుకు 27 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్‌ను చంపేశారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
ఫిబ్రవరి 2014: నవాబ్‌జంగ్ (ఉత్తరప్రదేశ్) తాలూకాలోని అహ్మదాబాద్ గ్రామంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న ఖేలాల్ అనే వ్యక్తిని దుండగులు దారుణంగా చంపేశారు. ఆ గ్రామానికి చెందిన మరొక వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు.
ఫిబ్రవరి 2015: పాటియాలా (పంజాబ్) జిల్లాలోని అజీజ్‌పూర్ గ్రామంలోని కోసి కాలన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ‘గోస్మగ్లర్లు’ తాము నడుపుతున్న వాహనంతో ఢీకొట్టి ఘనశ్యాం అనే హోమ్‌గార్డును చంపేశారు. అక్కడితో ఆగకుండా ఆ స్మగ్లర్లు పోలీసు జీపును ఢీకొట్టగా రామ్‌వకీల్ అనే కానిస్టేబుల్ చనిపోయాడు. రాజీవ్, భానుప్రతాప్ అనే ఇద్దరు కానిస్టేబుళ్ళు తీవ్రంగా గాయపడ్డారు.
సెప్టెంబర్ 2015: మనోజ్ మిశ్రా ఫరీదాబాద్ (హర్యానా)కి చెందిన సబ్-ఇన్స్‌పెక్టర్. అరవై ఆవులను అక్రమంగా రవాణాచేస్తున్న వారిని అడ్డుకున్నందుకు గోస్మగ్లర్లు మిశ్రాతోపాటు మరో కానిస్టేబుల్‌ని తుపాకీతో కాల్చిచంపారు.
అక్టోబర్ 2015: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి.ఎఫ్.ఐ) అనేది జీహాదీ శక్తులతో సంబంధాలున్న సంస్థ. మంగళూరులోని మూద్ బిద్రి అమ్మవారి గుడి సమీపంలో వీళ్ళు అక్రమంగా పశువధశాలను నెలకొల్పారు. అందుకు నిరసన తెలిపిన ప్రశాంత్ పూజారి అనే ఒక పూల వ్యాపారిని పి.ఎఫ్.ఐకి చెందిన ఆరుగురు కత్తులతో పొడిచి దారుణంగా చంపారు.
ఫిబ్రవరి 2016: అరుణ్‌కుమార్ మహార్ ఆగ్రాకి చెందిన దళిత నాయకుడు. అక్కడ అక్రమంగా నిర్వహిస్తున్న పశువధశాల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసినందుకు అతడిని ఐదుగురు ముస్లింలు కాల్చి చంపారు. మరి మీడియా ఈ అన్యాయం పట్ల నోరైనా విప్పలేదు!
జూన్ 2016: అహమ్మదాబాద్ గ్రామానికి (లోని ఈటా జిల్లా, ఉత్తరప్రదేశ్) చెందిన నిర్దేశ్‌సింగ్ అనే పదహారేళ్ళ బాలిక రెండు ఆవులను అపహరించడాన్ని అడ్డుకొన్నందుకు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను కాల్చి చంపారు.
జూన్ 2016: ఫిరోజాబాద్ జిల్లా (ఉత్తరప్రదేశ్)కి చెందిన 35 ఏళ్ళ దినేష్‌కుమార్ అర్ధరాత్రి ఒంటి గంటకు- ట్రక్కులో అక్రమంగా పశువులను తరలిస్తున్నవారిని అడ్డుకున్నాడు. వారు ఆ ట్రక్కుతో తొక్కించి దినేశ్‌ని చంపేశారు. మీడియాకి ఈ సంగతే పట్టలేదు.
ఆగస్టు 2016: జావున్‌పూర్ జిల్లాలో సరాయ్‌పోఖ్తా అవుట్‌పోస్ట్ వద్ద త్రిలోకి తివారీ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతడి వయస్సు 56 ఏళ్ళు. అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నందుకు- ఆ వాహనాన్ని అతడిపైకి ఎక్కించి చంపేశారు గో స్మగ్లర్లు.
ఆగస్టు 2016: అమరావతి (మహారాష్ట్ర) నుండి అక్రమంగా తరలిస్తున్న డెబ్భై ఆవులు ఆహారం, నీరు అందకపోవడం వల్ల, వాటన్నింటినీ ఒక వ్యాన్‌లో కుక్కడం వల్ల ఊపిరాడక చనిపోయాయి.
నవంబర్ 2016: అస్రౌరి (ఈటా జిల్లా, ఉత్తరప్రదేశ్) గ్రామంలో తెల్లవారు జామున 3 గంటలకు గోవులను అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకున్నందుకు యశోద అనే 20 ఏళ్ళ యువతిని గోస్మగ్లర్లు చంపేశారు.
జూన్ 2017: నిబోరా పోలీస్‌స్టేషన్ (ఉత్తరప్రదేశ్) పరిధిలోని కోత్రేకపుర గ్రామానికి చెందిన చరణ్‌సింగ్ అనే 45 ఏళ్ళ వ్యక్తిని ఆవులను దొంగిలిస్తుండగా అడ్డుకున్నందుకు తుపాకీతో కాల్చిచంపేశారు దుండగులు.
పైన పేర్కొన్న ఉదాహరణలు మచ్చుకు కొన్ని మాత్రమే. మన దేశంలో గోస్మగ్లర్ల దౌర్జన్యాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. వీరి దురాగతాల విషయంలో మీడియా నోరు మెదపడం లేదు. పైగా మన దేశంలోని మేధావులుగా చెలామణీ అవుతున్నవారు- ‘గోస్మగ్లర్లని అడ్డుకుంటున్న వారిని’ దుర్మార్గులుగా చిత్రిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇదివారి పక్షపాత ధోరణికి నిలువెత్తు నిదర్శనం.
పాల ఉత్పత్తిని పెంచేందుకు ‘శే్వత విప్లవం’, ‘నేషనల్ డైరీ ప్లాన్’వంటి ఎన్నో పథకాలను భారత ప్రభుత్వం చేబడుతోంది. నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ 1970లో ‘‘ఆపరేషన్ ఫ్లడ్’’ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం. ఈ పథకాలు, కార్యక్రమాల కోసం పెట్టుబడిగా భారత ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులను కేటాయించింది. ఒకప్పుడు పాల కరువుతో కటకటలాడిన మన దేశం 1998 సంవత్సరం నాటికి అమెరికాను వెనక్కి నెడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ బృహత్తర పథకాన్ని ‘గోస్మగ్లింగ్’ తప్పక దెబ్బతీస్తుంది.
1998-2014 సంవత్సరాల మధ్య ఏం జరిగింది? పెద్ద మొత్తంలో గోవుల అక్రమ రవాణా, వధ జరిగింది. ఇది ప్రపంచంలో పాల ఉత్పత్తిదారుగా మన దేశానికి ఉన్న స్థానాన్ని దెబ్బతీసింది. కానీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల కారణంగా 2017 వచ్చేనాటికి పాల ఉత్పత్తిలో మన దేశం పూర్వవైభవాన్ని సంతరించుకుంది. అంటే గోస్మగ్లర్లను నియంత్రిస్తూ తగిన చర్యలు తీసుకుంటేనే మన దేశంలో పశుసంరక్షణ జరిగి, పాల ఉత్పత్తి పెరిగి మన దేశం ఆర్థికంగా పుంజుకుంటుందన్న మాట!

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690