సబ్ ఫీచర్

‘‘ఏ దేశమును ప్రేమించుమన్నా?’’ ( గోరాశాస్ర్తీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురజాడ మహాకవి లౌక్యమెరిగిన నియోగి. కవిత్వ వ్యాసంగ మొక వంక, తనను ఆదరించి ఆందోళిక నెక్కించి కోర్టుకేసుల దస్తావేజులు కైఫీయతులూ వగైరా అప్పగించిన విజయనగర సంస్థాన ప్రభువుల రాచకార్యాలొకవంక, అలనాటి విద్యా విధానాన్ని ఇస్ర్తిపట్టవలసిన కార్యభారాన్ని స్వీకరించి కుస్తీపట్టడం వేరొకవంక- ఇన్నింటినీ మరెన్నింటినో భుజస్కంధంపై వేసుకొని అన్నింటిలోనూ ‘ఓహో!’ అనిపించుకున్న సవ్యసాచి గురజాడ.
అట్టి మహామనీషికి భవిష్యద్దర్శన శక్తి విధిగా ఉండితీరాలి. అందుకే ఆయన-
‘‘దేశమును ప్రేమించుమన్నా!’’ అనే పాదంతో ప్రారంభమయ్యే గీతాన్ని వ్రాశారు. కవిగా ఆయన గడుసరి. ‘‘దేశమును ప్రేమించుమన్నా!’’ అన్నారు కాని ఏ దేశాన్ని ప్రేమించాలో చెప్పలేదు. ‘‘్ఫలానా దేశాన్ని ప్రేమించు!’’ అని ఎందుకు చెప్పాలి?
‘విపులాచపృథ్వీ’ అన్నారు మన మూల పురుషులు. ఎవరికి ఇష్టమైన దేశాన్ని వారు నిరాఘాటంగా ప్రేమించవచ్చును. గురజాడ- కవులలో లౌక్యుడు- లౌక్యులలో కవి. మున్ముందు మనదేశంలో అభ్యుదయ కవులుదయిస్తారనీ వాళ్ళ వెనుకొక అంతర్జాతీయ రాజకీయ పార్టీ ఉండి సాంద్ర వ్యవసాయం చేసి ఎక్కువగా అభ్యుదయాన్ని పండించటమే కాక తమ పార్టీకి చెందిన మహాకవిగా తనను దత్తత చేసుకొని గుత్తకు తీసుకొంటుందనీ గురజాడకు ఆనాడే తెలుసును.
దానినే భవిష్యద్దర్శనమంటారు. వాళ్ళు సమయానుకూలంగా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క దేశాన్ని ప్రేమిస్తుంటారు. అన్ని దేశాలు ప్రేమించదగినవే కాబట్టి మహాకవి గురజాడ-
‘‘దేశమును ప్రేమించుమన్నా!’’ అన్నారు. ఏ దేశమైతేనేమి, ముఖ్యమైనది ప్రేమించడం.
గురజాడ విశ్వజనీన దృష్టిని ఈనాడు అర్థం చేసుకోగల్గుతున్నాము. ఆయన గీతిక వ్రాసిననాటికి ప్రపంచంలో పదిహేడు స్వతంత్ర పరతంత్ర రాజ్యాలు మాత్రమే వుండేవి. ఇవాళ ఐక్యరాజ్యసమితి సభ్యత్వాన్ని ఆధారంగా తీసుకొన్న 115 స్వతంత్ర దేశాలు ఉన్నాయి (స్వతంత్రం లేనివెన్ని?)
మనం దేశంలో ఒకానొక పార్టీ కమ్యూనిస్టు చైనాను ‘గురువుగా, హితునిగా, కూర్మి నెచ్చెలిగా’ ప్రేమిస్తుంది. భూలోక స్వర్గానికి పర్యాయపదమే చైనా అని జాగరిత, స్వప్న, సుషుప్తి అవస్థలు. మూడింటిలోనూ కలవరిస్తుంది.
మరొక పార్టీ ‘రష్యా’ పేరు వింటే చాలు కృష్ణుని పేరు వింటే రాధ పొందెడిదని పురాణ కవులు వర్ణించిన తన్మయావస్థలోనికి పోతుంది. మరికొందరు అమెరికా పేరు గాలిలో తేలివచ్చినాసరే తక్షణం మైమరచి నిమీలిత నేత్రాలతో స్వర్గ్ధానువు మధుర స్వప్నాలలో మున్కలు వేస్తుంటారు.
ఇపుడు సరికొత్తగా చకస్లవేకియాపట్ల ప్రేమ నిండు పూర్ణిమ నాటి సంద్రంవలె పొంగుతున్నది. పక్షం రోజుల క్రితం ‘కమ్యూనిజం’ పేరు వినబడితే చాలు- సచేల స్నానం చేసేవారు సైతం నేడు చకస్లవేకియా క్షేమాన్ని హృదయానికి హత్తుకొని ప్రేమిస్తున్నారు.
వీరందరూ భారతీయులే! ఐతేనేంగాక తమ మాతృభూమిని తప్ప తక్కిన దేశాలన్నింటినీ నిండు హృదయంతో ప్రేమిస్తారు. అనగా అట్టి మహనీయులు మొత్తం వసుంధరను తమ స్వగృహంగా భావిస్తారు గానీ, స్వగృహం సంగతి అంతగా పట్టించుకోరు.
తమ చిత్తవృత్తిననుసరించి విశ్వజనీనమైనవి తాము విశ్వసించిన సిద్ధాంతాల ప్రకారం ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క ముఠా వరిస్తూంటూంది.
ద్రష్టయైన గురజాడకు ఆ సంగతి అర్ధశతాబ్దం క్రిందటనే తెలిసింది. అద్భుతం కాదా!
శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారికి ముందుచూపు మర్మం పట్టుబడలేదు. అందువల్లనే-
ఏ దేశమేగినా ఎందుఁ గాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గర్వమ్ము
లేదురా ఇటువంటి భూదేవి ఎందు
లేరురా మనవంటి ధీరులింకెందు!
అని కవితనల్లారు.
ఎందుకొచ్చిన ప్రగల్భమది? అందులో ప్రతి పాదమూ అసందర్భమై కూర్చుంది. ‘‘ఏ దేశమేగినా’’ అన్నారు. ముందుచూపులేని ఉత్సాహమది. నేటి భారతీయుడు ఏ దేశం వెళ్ళగలడు? మొట్టమొదట ‘పాస్‌పోర్ట్’ కావాలి. ఎవరినో ఆశ్రయించి సంపాదించినా వెళ్ళదలచుకొన్న దేశ ప్రభుత్వం ‘వీసా’ను అనుగ్రహించాలి. రెండు దొరికినా మన కేంద్ర ఆర్థిక శాఖ ‘పి ఫారమ్’ను నిరాకరిస్తుంది. ఎలాగో ప్రాధేయపడి సదరు పత్రాన్ని సంపాదించినా విదేశ మారక ద్రవ్యాన్ని రిజర్వు బ్యాంకు కొసరి, కొసరి ఇస్తుంది. ఇచ్చిన మొత్తం దారిలో కాఫీ ఖర్చుకు చాలదు.
అన్ని కష్టాలనూ తట్టుకొని ఆ విదేశమేదో అక్కడకు చేరుకున్నా ‘్భమి భారతి’ని పొగడడం ఏవిధంగానూ సాధ్యంకాదు. ‘‘్భమి భారతి’’ సంగతి వాళ్ళకు పూర్తిగా మనకంటే ఎక్కువగా తెలుసు.
మనల్ని రానిచ్చే దేశాలు రాను రాను తగ్గిపోతున్నవి. ఆఫ్రికా, ఆసియా దేశాలలో తరతరాలుగా నివశిస్తున్న భారతీయులనే ‘చెంబూ తప్పేలా’ సైతం లాక్కొని పంపించివేస్తున్నారు.
‘‘లేరులా మనవంటి ధీరులింకెందు’’ అన్నారు రాయప్రోలు. మన ధీరత్వం అంత దొడ్డది కనుకనే యింతటి ధీరులను భరించలేక ప్రతి దేశమూ భారతీయులను గెంటివేస్తున్నారు.
ఐతే ఒకటి. స్వదేశాభిమానాన్ని సంకుచిత్వంగా ముద్రవేసి వేన వేల యోజనాల అవతల వున్న దేశాలకు హృదయమర్పించడమే ధీరత్వమైతే మనవంటి ధీరులు ప్రపంచంలో యింకెక్కడా లేరు. మనకు మనమే సాటి!
ఇటువంటి భూదేవి ఇంకెక్కడా లేదనే మాట యదార్థం. విలక్షణమైన అసమర్థతను ఇంత ప్రేమతో భరించే భూదేవి ఇంకెక్కడుంటుంది? తనను విస్మరించి పరిహసించి దృష్టి ఎల్లప్పుడూ దూరతీరాలపై నిగుడించి వ్యామోహితులైనవారిని కన్నీళ్ళ చిరునవ్వుతో ఆదరించే భూదేవి ఇంకెక్కడుంటుంది? ఆ మేరకు రాయప్రోలు వాక్కు సత్యమైంది. అప్రయత్నంగా వెలువడింది.
గురజాడ లౌక్య కవి. నాడీనిదానం చేసి జాతి హృదయ స్పందనను అర్ధశతాబ్దానికి పూర్వమే గ్రహించారు. భవిష్యద్దర్శన భాగ్యం ఆయనకు లభించింది. అందుకనే ‘దేశమును ప్రేమించుమన్నా!’ అనేసి నేర్పుగా తప్పించుకున్నారు. గురజాడ భక్తులు తొందరపడి ఆవేశం తెచ్చుకోకుండా సమకాలీన రాజకీయ పార్టీల పోకడలను శ్రద్ధగా గమనిస్తే సత్యాన్ని తెలుసుకొని పునీతులు కాగలరు. అటు తర్వాత భూగోళ పటాన్ని జాగ్రత్తగా పరిశీలించి తాము ఏ దేశాన్ని ప్రేమిస్తే లాభసాటిగా వుంటుందో నిర్ణయించుకోగలరు.
(ఆంధ్రభూమి సంపాదకీయం)