సబ్ ఫీచర్

పాఠశాల విద్యలో ‘ప్రైవేటు’ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో ఉచిత నిర్బంధ విద్య అమలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలపై పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉంది. భారత రాజ్యాంగంలో 1 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలకలకు నిర్బంధ విద్యనందించాలని నిర్దేశించారు. కాని 72 సంవత్సరాల స్వతంత్ర భారతంలో నిర్భంధ విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు సఫలీకృతం కావడం లేదు. దారిద్య్రరేఖకు కిందనున్న బాల బాలికలకు ప్రభుత్వం పాఠశాలలను అందుబాటులోనికి తీసుకురాలేక పోయింది.
ప్రభుత్వేతర పాఠశాలలను యథేచ్ఛగా అనుమతించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గుముఖం పడుతోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలలను వేల సంఖ్యలో మూసివేయడం అనివార్యమవుతోంది. కార్పొరేటు విద్యనందిస్తామనే పేరుతో మాతృభాష మాధ్యమానికి తిలోదకాలిచ్చి ఆంగ్లమాధ్యమంలో ప్రైవేటు పాఠశాలలను నడిపిస్తున్నందున గ్రామాలలో పాఠశాలలు కనుమరుగవుతున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వేతర పాఠశాలల్లో ఫీజులు కట్టగలిగినవారు మాత్రమే విద్యనభ్యసించే అవకాశం ఉంది. దారిద్య్రరేఖకు కిందనున్న బాలబాలికలకు బతుకుతెరువే కష్టమైనందున వారికి విద్యకంటే కార్మికులుగా కొనసాగడమే ప్రధానమైనది. ఈ కారణంగా మన దేశంలో అక్షరాస్యత శాతం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు.
పేద విద్యార్థులకు విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలన్న సంకల్పంతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. అయితే, ఒక్కపూట భోజనం నిమిత్తమే పాఠశాలలకు కొందరు పేద విద్యార్థులు వస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యాప్రమాణాలు పెరగడం అసాధ్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వేతర పాఠశాలలో ఉపాధ్యాయులు తగినంతగా ఉన్నప్పటికీ, తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండడంతో అక్కడ కూడా విద్యాప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పలేం. నూటికి ఐదు ఆరుగురు విద్యార్థులకు ర్యాంకులు వస్తే, తాము ఏదో ఘనకార్యం సాధించినట్టు అడ్మిషన్ల సమయంలో ప్రైవేటు విద్యాసంస్థలు విస్తృతంగా ప్రకటనలు ఇస్తుంటారు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పాఠ్యప్రణాళిక (సిలబస్) లేకపోవడం వల్ల విద్యాప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేకున్నా ఉత్తీర్ణత శాతం బాగానే ఉంటుంది. విద్యాప్రమాణాలు ఉన్న చోట ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుంది.
దేశవ్యాప్తంగా పాఠశాల ప్రణాళిక ఒకే విధంగా ఉండటం అనివార్యం. వీటితోపాటు ఆయా రాష్ట్రాల్లో స్థానిక భాషా మాధ్యమంలో 1తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యాబోధన జరగాలి. త్రిభాషా సూత్రాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా భారతీయ భాషలకు మాతృక అయిన సంస్కృతం భాషను 3వ తరగతి నుండి ఆంగ్ల భాషను 4 తరగతి నుండి ప్రవేశపెట్టాలి. ప్రాథమిక స్థాయిలో పంచతంత్రం కథలను, వివిధ శతక పద్యాలను 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పాఠ్యప్రణాళికలో చేర్చి విద్యార్థులకు బోధించాలి. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు రామాయణము, మహాభారతము, భాగవతములలోని పద్యాలను తరగతి స్థాయి ఆధారంగా విభజన చేసి బోధించవలెను. భారతీయ పురాణేతిహాసాల్లోని ప్రధాన ఘట్టాలను ఉపవాచకంలో పొందుపరచి బోధించాలి. చరిత్రలో యాభై శాతం దేశవ్యాప్తమైన చరిత్రను, మిగిలిన యాభై శాతం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన చరిత్ర అంశాలను చేర్చాలి.
ప్రాథమిక స్థాయిలో భాషాబోధనలో శుద్ధలేఖనము, ఉక్తలేఖనము, శీగ్రలేఖనములను విధిగా అమలుజరపాలి. ప్రాథమిక స్థాయిలో సెలవు పత్రము వ్రాయుట, ప్రాథమికోన్నత స్థాయిలో తల్లిదండ్రులకు, స్నేహితులకు ఉత్తరములు వ్రాయుట, ఉన్నతస్థాయిలో అధికారులకు వ్రాయవలసిన అభ్యర్థన పత్రములు వ్రాయుట నేర్పించాలి. ప్రాథమికోన్నత స్థాయిలో ప్రతి విద్యార్థికి జాతీయ గీతము (జనగణమన), జాతీయ గేయము (వందేమాతరము), ప్రతిజ్ఞ వంటివి కంఠస్థము వచ్చునట్లు పాఠ్యప్రణాళికలో చొప్పించి నేర్పించాలి. ఈ మూడు ఉన్నత స్థాయి విద్యార్థులకు కంటస్థముతోబాటు వ్రాయగలిగే విధంగా పాఠ్యప్రణాళికలో పొందుపర్చి పరీక్షాపత్రములలో ప్రశ్నించే విధంగా ఉండాలి.
బోధనాంశాలతోబాటు విద్యార్థులకు సర్వాంగ వికాసము నిమిత్తం క్రీడలు, యోగ, ఐచ్ఛిక విషయాలు (చిత్రలేఖనము, సంగీతము, హస్తకళలు, నాట్యము మొదలగునవి) సాంస్కృతిక కార్యక్రమాలు, పరిశుభ్రత కార్యక్రమాలు, ఉపన్యాస ప్రతిభాపాఠవాలు మొదలైన వాటిని అమలు చేయాలి. ప్రాథమికోన్నత స్థాయిలో భాషలు బోధించే ద్వితీయశ్రేణి పండితులకు టీటీసీ ఉపాధ్యాయులు పొందే వేతనాలకు సమానంగా వేతనం ఉండాలి. ఉన్నతస్థాయిలో భాషలు బోధించే ప్రథమశ్రేణి పండితులకు స్కూల్ అసిస్టెంట్స్ పొందే వేతనాలకు సమానంగా ఉండాలి. ఒక సెక్షన్‌కు కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండేలా నియామకాలు జరగాలి.
ప్రభుత్వేతర పాఠశాలలను అనుమతించడం వల్ల ఇస్లాం మతస్థుల మదరసాలు, క్రైస్తవుల పాఠశాలల్లో వారి సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులపై రుద్దడం వంటివి చూస్తున్నాము. కొన్ని ప్రైవేటు సంస్థలు వారి నియమాలకు అనుగుణంగా పాఠశాలలను నడుపుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో జాతీయ గీతం, కొన్ని పాఠశాలల్లో జాతీయ గేయం, కొన్ని పాఠశాలల్లో వారి ప్రాంతాలకు సంబంధించిన ప్రార్థన, మరికొన్ని పాఠశాలల్లో మతాలకు సంబంధించిన ప్రార్థనలు చేయించడం పరిపాటిగా మారింది. వీటి ప్రభావం కారణంగా విద్యార్థులు చిన్నతనం నుండే వివిధ వర్గాలుగా ఏర్పడుచున్నారు. వివక్షకు గురవుతున్నారు.
బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపాలంటే నిర్బంధ విద్యను పకడ్బందీగా అమలు పరచాలి. దేశవ్యాప్తంగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒకే విధమైన పాఠ్య ప్రణాళిక అమలు చేయాలి. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠశాలలను నడిపేందుకు ప్రభుత్వేతర సంస్థలకు అనుమతించకూడదు. పాఠశాలలను నడిపే పూర్తి బాధ్యత ప్రభుత్వాలే తీసుకొన్నపుడు దేశవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించవచ్చు. ఉన్నవారు, లేనివారు అనే తేడాలేకుండా అందరూ ఒకే రకమైన విద్యను అభ్యసించగలరు. భాషాపరమైన, ప్రాంతీయపరమైన, మతపరమైన పద్ధతులను రూపుమాపవచ్చు. పూర్వ ప్రాథమిక- ప్రీప్రైమరీ పాఠశాలలను మాత్రం ప్రభుత్వాలు కాకుండా ప్రభుత్వేతర సంస్థలు నడిపేందుకు అవకాశం కల్పించాలి. వాటిపై ప్రభుత్వ పర్యవేక్షణ, అజమాయిషీ మాత్రం ఉండాలి.
1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠశాలలను ప్రభుత్వం నడిపేందుకు కావలసిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, సిలబస్‌ను తయారు చేసుకోవడం తక్షణ అవసరం. రాబోయే అయిదేళ్ల కాలంలో విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికను అమలు చేయాలి. ఈ దిశగా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకొని- ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’’నినాదాన్ని నిజం చేయాలి.

-బలుసా జగతయ్య 90004 43379