సబ్ ఫీచర్

చైనా ఎదుగుదలతో అమెరికా బెంబేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంతొమ్మిదవ శతాబ్ది ఆరంభంలో ఫ్రెంచ్ యోధుడు నెపోలియన్ బోనపార్టీ -‘సింహం లాంటి చైనాను పడుకోనిస్తేనే మంచిది.. అది నిద్ర లేస్తే ప్రపంచానే్న కబళిస్తుందని’ అన్నట్లు నిజంగానే చైనా ప్రపంచ ఆర్థిక వాణిజ్యశక్తిగా ఎదుగుతోంది. దాని వాణిజ్య, ఆర్థికాభివృద్ధిని చూసి అమెరికా ఉలిక్కిపడుతోంది. అమెరికా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రపంచ దేశాలపై తన ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి పడుతున్న తపనలో భాగంగానే ఇప్పుడు చైనాపై వ్యాపార యుద్ధం ప్రకటించింది. నిజానికి అమెరికా చేస్తున్న ఎగుమతుల కన్నా, దిగుమతులే ఎక్కువ. అందుకే ఆ దేశ ఆర్థిక రంగం అప్పుల పాలైపోతోంది. అప్పుల భారాన్ని తగ్గించుకొంటూ, తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడానికి అమెరికా చైనా ఉత్పత్తులపై అధిక సుంకాలు ప్రకటిస్తూ, చైనా కంపెనీ అయిన హ్యూవావేపై నిషేధం విధించిందని పరిశీలకులు భావిస్తున్నారు.
అమెరికా విదేశీ వాణిజ్య లోటు పెరిగిపోతుంది. అమెరికా సూపర్‌బజార్‌లా మారిందే తప్ప, కొత్తగా చేస్తున్న ఉత్పత్తులు అంటూ ఏవీ లేకపోవడం, తన మేధోహక్కులను, పరిశోధన ఫలితాలను విదేశాలకు అమ్ముకొని, లేదా లీజుకిచ్చి తమకు కావల్సిన ఉత్పత్తులను ఇతర దేశాలనుండి దిగుమతి చేసికోవడంవల్ల ఈ వాణిజ్య లోటు పెరిగిపోతోంది. ఉదాహరణకు ఆపిల్ లాంటి సంస్థ తన ఐ-్ఫన్ కానీ కంప్యూటర్‌ల వంటి ఉత్పత్తులన్నింటిని ఇతర దేశాలనుండి సమీకరించుకొని, చైనాలో అన్నింటిని కలిపి ఆపిల్ ఉత్పత్తిగా అమెరికాకు ఎగుమతి చేస్తుంది. దక్షిణ కొరియా సంస్థలైన సాంసంగ్, ఎల్‌జి లాంటి అనేక కంపెనీలు చైనాలో పరిశ్రమలను స్థాపించి, అక్కడ తయారుచేసిన ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేయడం మరో కారణం. తన దేశంలోని వనరులు, తక్కువ వేతనాలకు లభించే కార్మికులను చూపి ఇతర దేశాల కంపెనీలను చైనా ఆహ్వానిస్తోంది. చౌక ధరల ఉత్పత్తులతో ప్రపంచ వాణిజ్యంలో చైనా తన ఉనికిని చాటుకుంటోంది. ఈ క్రమంలో అమెరికాకు చైనా దాదాపు 4.1 ట్రిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. చైనా అమెరికా నుండి చేసుకొంటున్న లేదా అమెరికా చైనాకు చేయగలిగే ఎగుమతుల విలువ 2.5 ట్రిలియన్ల డాలర్లు మాత్రమే. 600 బిలియన్ డాలర్ల నికర వాణిజ్య లోటు పూడ్చుకోవడం అమెరికా ప్రభుత్వానికి సాధ్యపడడం లేదు.
అమెరికాలోని యూఎస్ ట్రెజరీ సెక్యూరిటీలలో 2016 మార్చినాటికి చైనా వాటాయే అగ్రభాగాన ఉంది. ట్రెజరీ సెక్యూరిటీలలో 11.20 శాతం (1120.5 బిలియన్ డాలర్లు) ఉన్న చైనా పెట్టుబడులు ఆగస్ట్ నాటికి 1165 బిలియన్ డాలర్లకు పెరగడం, విదేశీ పెట్టుబడులలో చైనా వాటాయే అధికం కావడం కూడా అమెరికాను బెంబేలెత్తిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో చైనా పెట్టుబడులే అత్యధికంగా ఉన్నాయి. అమెరికా అప్పుల్లో దాదాపు 28 శాతం చైనా పెట్టుబడులే. అమెరికాను చైనా అప్పులు బాధిస్తుంటే, మరో వైపు చైనా 2025వరకు అమెరికాలో కనీసం మరో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. రియల్ ఎస్టేట్, పర్యాటక, ఆతిథ్య రంగాల్లో చైనా ఎక్కువ పెట్టుబడులు పెడుతుంది. అమెరికాలోని సినీ రంగంలో కూడా ప్రవేశించిన చైనా, అక్కడ థియేటర్లను నిర్మించడం లేదా అప్పటికే ఉన్నవాటిలో అత్యధిక థియేటర్లను స్వాధీనం చేసుకొంటోంది.
ఉత్పత్తి, రవాణా రంగంలో చైనా కంపెనీలు హెచ్‌ఎన్‌ఏ గ్రూప్, ఏఏం సి గ్రూప్ కూడా అమెరికాలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ గ్రూప్ కంపెనీలు 2016లో 45.6 బిలియన్ల పెట్టుబడులు పెట్టాయి. ఏఏంసి ఒక్క సినిమా రంగంలోనే 2.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడమే చూస్తుంటే- ఏ రంగంలోనైనా తన ఆధిపత్యం కొనసాగాలని చైనా యోచిస్తున్నట్లు అర్థం అవుతుంది. హెచ్‌ఎన్‌ఏ గ్రూప్ అమెరికా విమాన రంగంలో కూడా అడుగుపెట్టాలని చూస్తోంది. 2025 నాటికి అమెరికాలో ప్రవేశించాలని చైనా కార్ల కంపెనీలు ప్రణాళికలు వేస్తున్నాయి.
చైనా 5జి సాంకేతికలో అమెరికా కంటే ముందుండడంతో తట్టుకోలేని అమెరికా- 5జి ఉత్పత్తులలో హ్యూవావే కంపెనీ గూఢచర్య పరికరాలు అమర్చిందన్న ఆరోపణతో ఆ కంపెనీ ఉత్పత్తులను తాను నిషేధించడమే కాకుండా తన మిత్ర దేశాలన్నీ నిషేధించాలని అమెరికా ఆదేశించింది. తమ ఉత్పత్తులలో ఎలాంటి గూఢచర్య పరికరాలు లేవని హ్యూవావే కంపెనీ ప్రకటించినా అమెరికా నమ్మడం లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం నిరంకుశంగా 2018 జనవరి నుండి చైనా ఉత్పత్తులపై దాదాపు 450 బిలియన్ డాలర్ల అదనపు సుంకాలను విధించింది. అదే తరహాలో భారతదేశ ఎగుమతులపై కూడా అమెరికా సుంకాలను విధించి, భారత్‌కు ఇన్నాళ్ళు ఉన్న ‘సాధారణ ప్రాధాన్యత దేశం’ హోదాను తొలగించింది. 1995లో ప్రారంభించిన ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’నుండి వైదొలుగుతామని ప్రకటించడం ట్రంప్ తిక్కతనానికి, అమెరికా ఆర్థిక దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ ఆ దేశ ఆర్థికవేత్తలే ప్రకటిస్తున్నారు.
అమెరికాలోని ప్రముఖ వ్యాపార సంస్థలైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, ఒరాక్లే సంస్థ అధినేత వార్న్‌బఫ్ఫెట్ లాంటి అనేకమంది మేధావులు, చార్లీ థామస్ ముంజర్ లాంటి పెట్టుబడి సలహాదారు కూడా చైనాపట్ల అమెరికా ధోరణిని తీవ్రంగా విభేదిస్తున్నారు. అమెరికా తన పౌరులకు ఉపాధి అవకాశాలు కల్పించుకోలేక చైనా ఉత్పత్తులను నిషేధిస్తే తమ ఆర్థిక రంగం మరింత దిగజారుతుందని అక్కడి ఆర్థికవేత్తలు ప్రకటించారు.
చైనా సహా ఇతర దేశాల ఉత్పత్తులపై సుంకాలు పెరగడంతో అమెరికాలోని అనేక సంస్థల లాభాలు హరించిపోవడమే కాకుండా తమ ఉద్యోగులను కూడా వ్యాపార సంస్థలు తగ్గించుకొంటున్నాయని, ఇది అమెరికాలో నిరుద్యోగుల సంఖ్యను పెంచుతుందని అక్కడి మేధావులు, రాజకీయ విశే్లషకులు, ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు.
చైనా తన ఆర్థిక, పారిశ్రామిక ప్రణాళికలన్నీ ప్రపంచ రాజకీయ రంగంలో మొదటి స్థానంలో ఉండాలని భావిస్తోంది. ఇప్పటికే వేల బిలియన్ డాలర్ల ప్రాజెక్టులతో దాదాపు సగానికి పైగా ఆఫ్రికా దేశాలలో చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రపంచమంతటా తన ఉత్పత్తులను చేరవేయడానికి బెల్ట్ రోడ్ ప్రాజెక్టును చేపట్టడం, చైనాకు రష్యా, ఉత్తర కొరియాలతో బలపడుతున్న సంబంధాలు వంటివి అమెరికా కోపానికి కారణాలు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ముందే చైనా పట్ల తన వ్యతిరేకతను బహిరంగంగా వెల్లడించాడు. 2014 మే 19న చేసిన ట్వీట్‌లో ‘చైనా అమెరికాకు ఎన్నటికీ స్నేహితుడు కాలేడని’ వెల్లడించాడు. ఆ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడానికి ఇన్నాళ్ళు ఆగి, ఇప్పుడు తన అసలు రూపం ప్రకటిస్తున్నాడు.
చైనా పట్ల వ్యవరిస్తున్న ధోరణినే ఇతర దేశాల పట్ల కూడా ట్రంప్ ప్రదర్శించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థతో అభివృద్ధి చెందిన అమెరికాకు ఎన్నటికీ కమ్కూనిస్ట్ దేశాల ప్రగతిని జీర్ణించుకొనే మంచి మనసు ఉండదు.
ఆర్థికంగా చితికిపోయిన రష్యా మళ్ళీ పుంజుకొని తన దారికి అడ్డువస్తుందని, దానికి చైనా, ఉత్తర కొరియాలతోపాటు ఆసియా ఖండంలోని కొన్ని దేశాలు సహకరిస్తాయని అమెరికా భయపడుతోంది.
ఇటీవల జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జీ-20 దేశాధినేతల సమావేశంలో నాటో మిత్రా దేశాలు కూడా అంతగా ఆసక్తి చూపలేదు. అందులో నామమాత్రపు చర్చలే కానీ ఫలప్రదమైన ఒప్పందాలేవీ జరగలేదు. చైనా- అమెరికాల సమావేశంగానే ప్రపంచం చూసింది కానీ దాన్ని జీ-20 దేశాల సమావేశంగా మాత్రం అంతర్జాతీయ నాయకులు విశే్లషకులు భావించడం లేదు.
సుంకాల సమస్యను అక్కడే తేల్చుకోవాలని నాటో మిత్ర దేశాలు నిర్ణయించడం, ఇరాన్ అణు ఒప్పందం నుండి అమెరికా ఏకపక్షంగా వైదొలగడం, ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి కూడా అమెరికా వైదొలుగుతుందని ప్రకటించడం వంటి పరిణామాలు నాటో మిత్ర దేశాల్లో విభేదాలను మళ్ళీ తట్టిలేపుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ట్రంప్ ఆర్థిక, వాణిజ్య వ్యవహార తీరు మరో నూతన ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు రూపం కల్పించవచ్చని ఆశావాదులు నమ్ముతున్నారు.
ఇప్పుడు సైబర్ సమాచార సాంకేతిక రంగంలో అమెరికా కంటే పలు దేశాలు ఎంతో ముందున్నాయి. మేధో హక్కుల పేర అమెరికా పొందుతున్న కోట్ల బిలియన్ల రాయల్టీని అధిగమించి, డేటా కోసం అమెరికా అనేక దేశాలకు రాయల్టీని ఇవ్వాల్సి వచ్చే పరిస్థితులు మరెంతో దూరం లేవని, అవే పరిస్థితులు వస్తే అమెరికా మరో యుఎస్‌ఎస్‌ఆర్‌లా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని జిమ్ రోజర్ లాంటి పెట్టుబడుల సలహాదారులు పేర్కొంటున్నారు.

-సిహెచ్‌వి ప్రభాకర్‌రావు 93915 33339