సబ్ ఫీచర్

నాణ్యమైన ఆహారంతో ‘ఆరోగ్యసిరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ నాగరికత ఆదిమ సమాజం నుండి ప్రారంభమైంది. లక్షల సంవత్సరాల క్రితం ఆదిమ మానవుడు అడవుల్లో ఉంటూ ఫలాలు, దుంపలు, వన్యప్రాణుల మాంసం తింటూ, పరిణామక్రమంలో నాగరికతను సంతరించుకొని పలు రంగాల్లో అభివృద్ధిని సాధించాడు. ఆ తర్వాత పోడు వ్యవసాయంలో భాగంగా వివిధ రకాల పంటలు పండించడం మొదలుపెట్టాడు. అంచెలంచెలుగా ప్రజలు ఎదుగుతూ స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని కుటుంబంతో సంతోషంగా గడుపుతూ వివిధ రకాల ఆహార పంటలను పండించుకుంటూ సంతోషంగా గడిపేవారు.
ఆరోజుల్లో అనారోగ్యం అనే మాటకు అర్థం తెలియదు. ఎందుకంటే అప్పటి వారు తీసుకునే ఆహార పదార్థాలు పోషకాలతో కూడి ఉండేవి. ఆధునిక యుగంలో మార్పుల ఫలితంగా మనిషి అతివేగంగా పరుగెడుతున్నాడు. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి అంతగా లేనప్పుడు సహజ వనరులపై ఆధారపడి జొన్నలు, సజ్జలు, తైదలు, బొబ్బర్లు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, సామెలు, అరికెలు, ఉలవలు, రాగులు, కందులు, పెసర్లు లాంటి పంటలను ఎలాంటి కృత్రిమ రసాయనిక ఎరువులు వాడకుండా పండించేవారు. వాటినే ఆహార పదార్థాలుగా తీసుకుంటూ, స్వచ్ఛమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లాంటి పదార్థాలను తీసుకుంటూ ఎలాంటి రోగాల బారిన పడకుండా సుదీర్ఘకాలం పాటు సుఖంగా జీవించేవారు. ఆరోజుల్లో వివిధ రకాల మందుల అవసరం ఉండేది కాదు.
నేడు ఎంతో పురోగతి సాధించామని మురిసిపోతున్నా రకరకాల రోగాలు మనలను వెంటాడుతున్నాయి. వ్యవసాయ భూములను అమ్ముకొని నగరాలకు వలస వెళ్ళడం, పంటలపై రసాయనిక మందులు, కల్తీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడుతున్నాము. రసాయనాలతో పండిన పంటలను తీసుకుంటూ అనారోగ్యాల బారిన పడుతున్నాము. సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల ఫలితంగా మనిషి యాంత్రిక జీవనాన్ని గడపడం మొదలుపెట్టాడు. ఆహార పదార్థాలపై జాగ్రత్త వహించడం లేదు. ఆరోగ్యానికి భంగం కలిగించే పిజ్జాలు, బర్గర్లు, కేకులు, ఐస్‌క్రీమ్స్, జామ్‌లు, నూడుల్స్ వంటివి తింటూ రోగాల బారిన పడుతున్నాము.
మార్కెట్‌లో నాణ్యమైన వేరుశనగ నూనె ధర కిలోకు 80నుండి 100 రూపాయల వరకు ఉంటుంది. మనమే కిలో పల్లీనూనెను పొందాలంటే 3నుంచి 4 కేజీల వరకు వేరుశనగ అవసరం. వాటి ఖరీదు రూ. 200 నుండి 300 వరకూ ఉంటుంది. ఇంత డబ్బు వెచ్చించి తక్కువ ధరకు నూనె ఇవ్వడానికి వ్యాపారులు సామాజిక సేవకులా? లాభార్జనే ధ్యేయంగా పనిచేసే వ్యాపార సంస్థలు మనుషుల ఆరోగ్యానికి పాటుపడతాయంటే నమ్మశక్యమా? నేడున్న పరిస్థితులలో మార్కెట్‌లో దొరికే ప్రతి ఆహార పదార్థం వివిధ రసాయనాలతో కూడుకొని ఉంటుంది. వివిధ రకాల పండ్లు నిగనిగలాడుతున్నాయంటే కారణం కార్బైడ్ లాంటి పదార్థాలను వాడి మనుషుల ఆరోగ్యంతో వ్యాపారాలు చేస్తున్నారు. ఉదయం తెచ్చుకున్న అరటి పండ్లు సాయంత్రానికే చెడిపోతున్నాయంటే కారణం రసాయనాలే. మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థం వివిధ రకాల రసాయనిక ఎరువులు వాడి పండించడం చూస్తున్నాము.
సమాజంలో ప్రతిదీ కలుషితమై పోవడంతో మానవుని ఆరోగ్యానికి ముప్పు తప్పదనడంలో ఎలాంటి అవాస్తవం లేదు. దాహం తీర్చుకోవడానికి నీటిని సేవించాలన్నా ఎన్నో రసాయనాలను ఉపయోగించి విక్రయిస్తున్న నీటికి ప్యూరిఫైడ్ వాటర్ అని పిలుస్తున్నారు. కలుషిత నీటిని తాగితే కీళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు లాగడం, ఒంట్లో సత్తువ కోల్పోవడం లాంటి పరిస్థితులకు దారితీస్తున్నాయి. బియ్యం, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, తేనె, మంచినూనె, నిత్యావసర సరకులు రసాయనాలతో కలుషితమై లభిస్తున్నాయి. కలుషిత పంటలపై జనంలో ఇపుడిపుడే చైతన్యం మొదలైంది. వరి బియ్యం, గోధుమలకు బదులుగా సిరి ధాన్యాలైన కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, సామెలు, అరికెలు వంటివి వాడితే ఆరోగ్యంగా జీవించవచ్చని నేడు చాలామంది భావిస్తున్నారు. ఈ ఉద్దేశంతోనే నేడు విద్యావంతులైన కొందరు తిరిగి పల్లెలకు చేరుకొని ఆరోగ్యకరమైన పంటలు పండించాలని ప్రయత్నిస్తున్నారు. మానవుడి జీవితం ఎక్కడి నుండి మొదలయ్యిందో మళ్ళీ అక్కడికే చేరుకుంటుందనడంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు. ఈ నేపథ్యంలో నిత్యం మనం వాడే ఆహార పదార్థాలకు సంబంధించి నిపుణులు చేస్తున్న కొన్ని సూచనలు పాటించడం ఎంతో అవసరం.
* కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలను- చింతపండును నానబెట్టిన నీటిలో వేసి శుద్ధిచేసుకోవచ్చు.
* వంటపాత్రలు కడగటానికి వివిధ రకాల సబ్బులు వాడకుండా కుంకుడుకాయ, నిమ్మకాయ, చింతపండు వంటివి ఉపయోగించాలి.
* రాగి బిందెలు, రాగి పాత్రల్లో నీటిని నాలుగైదు గంటల సేపు ఉంచి, ఆ తర్వాత వాడుకుంటే మలినాలు తొలగిపోతాయి.
* వండిన ఆహార పదార్థాలను, చట్నీలను ప్లాస్టిక్ డబ్బాలకు బదులు గాజు పాత్రల్లో ఉంచితే మంచి ఫలితాలను పొందవచ్చు.
* గోధుమలు, వరి బియ్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
* ముడి బియ్యం (పాలిష్ చేయని బియ్యం) వాడితే ఆరోగ్యానికి మేలు.
* ప్యాకేజీ ఫుడ్‌ను తీసుకొంటే గుండె, కాలేయ వ్యాధులు తప్పవు.
* కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, సామెలు, అరికెలతో పలురకాల తినుబండారాలను తయారుచేసుకొని తింటే రోగాలు రాకుండా జాగ్రత్త పడొచ్చు.
యాంత్రిక జీవనంలో భాగంగా ఏదిపడితే అది తినకుండా, పోషకాలను అందించే పరిశుభ్రమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. సాంప్రదాయ పద్ధతుల్లో పంటలను పండించాలి. రసాయన ఎరువులు వాడని ఆహార పదార్థాలనే వాడాలి. ఇందుకోసం ‘రైతుకు చేయూతనిద్దాం, మనకు కావాల్సింది పొందుదాం..’ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ గట్టిగా వినిపించాలి.

-డా. పోలం సైదులు 94419 30361