సబ్ ఫీచర్

మనపై చంద్రుడి ప్రభావం ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చంద్రయాన్-2’ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. అమెరికా,రష్యాలు చంద్రునిపై అనేక ప్రయోగాలు చేశాక, భారత్ ఇక పరిశీలించడానికి ఏముంటుందని సందేహం వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు. గెలీలియో వంటి శాస్తవ్రేత్తలు చేసిన పరిశోధనల ఫలితంగా చంద్రునిపై మనకొక అవగాహన వచ్చింది. చంద్రబింబం మానవుడిని ఆది నుండి ఆకర్షిస్తూనే ఉంది. తొలుత చంద్రుడు దైవమని విశ్వసించిన మానవుడు శాస్తవ్రిజ్ఞానం పెంపొందుతున్నకొద్దీ తన అవగాహనను వృద్ధిచేసుకుంటున్నాడు. చివరికి చంద్రుడుపైనే కాలుమోపగలిగిన స్థితికి చేరుకున్నాడు.
చంద్రుడి ప్రభావం మనపై ఏ విధంగా ఉంటుందోనన్న విషయమై మనలో పలురకాల విశ్వాసాలున్నాయి. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందని దశలో చంద్రుడ్ని ప్రపంచంలో ఎన్నో సమాజాలు దేవుడిగా భావించాయి. భారత్‌కు సంబంధించినంత వరకు అది పితరుల (పూర్వీకుల) నివాస స్థలమని భావించేవారు. పురాణాల ప్రకారం పాము మింగడం వల్ల చంద్ర గ్రహణం, సూర్య గ్రహణం ఏర్పడతాయని చాలామంది నమ్ముతారు. చంద్రుడు భూమిపై అన్ని దిశల్లోనూ తన ఆకర్షణ శక్తి ప్రసరింపచేస్తాడు. చంద్రుడు లేకపోయినా సముద్రపు ఆటుపోట్లు తప్పక ఏర్పడతాయి. అయితే ‘పోటు’ అంత తీవ్రంగా ఉండదు. సముద్రపు ఆటుపోట్లు వల్ల నీటిలో కదలిక ఏర్పడి నాచు ఏర్పడుతుంది. ఈ నాచుపై ఎన్నో జలచరాలు జీవిస్తుంటాయి. నేలపై నివసించే జీవరాశుల పరిణామం చెందేందుకు ఈ సముద్రపు ఆటుపోట్ల ప్రాంతం ప్రధానమైన పాత్ర నిర్వర్తించిందని పరిశోధకులు భావిస్తున్నారు. జీవరాశి ఆవిర్భవించిన కొత్తలో భూమి వేగంగా తిరిగింది. అప్పుడు భూమికి రోజూ 12 గంటలే. క్రమంగా భూమి వేగం తగ్గింది. చంద్రుడి కారణంగా సంభవించిన సముద్ర ఆటుపోట్ల వల్ల గతి నిరోధకం ఏర్పడింది. ఇందువల్ల భూమికి ఒక రోజు 24 గంటలుగా స్థిరపడింది. మరోవైపు భూమికి దగ్గరలో ఉన్న చంద్రుడు మెల్లమెల్లగా దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఏడాదికి మూడు సెంటీమీటర్ల లెక్కన చంద్రుడి దూరం పెరుగుతోంది. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత భూమిపై ఒక భాగంలో ఉన్నవారికే చంద్రుడు కనబడతాడు. ఇలా జరిగితే చంద్రుని ప్రభావం మనపై తగ్గుతుంది. చంద్రుడి ధృవ ప్రాంతాలలో నీరున్నట్లు అది మంచురూపంలో ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. చంద్రుడిలో వాయు మండలం లేదు. నీటి కదలికలు లేవు. అయితే చంద్రుని మట్టి లోపల కొంత తేమ ఉన్నట్లు శాస్తవ్రేత్తలు వివరిస్తున్నారు. ఈ విషయంపై మరికొంత పరిశోధన చేయాల్సి ఉంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ కృషివల్ల చంద్రుడిపై మానవుడు కాలుమోపాడు. చంద్రునిపై పరిశోధనలలో తొలుత రష్యా అగ్రపథంలో ఉన్నా ఆ తర్వాత అమెరికా పుంజుకుంది. ఇప్పుడు భారత్ వాటి సరసన చేరింది. చంద్రయాన్-2 ప్రయోగానంతరం ‘గగన్‌యాన్’ వైపుభారత్ అడుగులు వేస్తుంది. శాస్తవ్రేత్తల అంచనా ప్రకారం సూర్యగోళంలో సౌరశక్తి ఫలితంగా నీటిని సృష్టింవచ్చు. చంద్రుడి మట్టినుండి సులభంగానే ఆక్సిజన్ తయారుచేయొచ్చు. కనుక చంద్రునిలో కృత్రిమ నివాసాలని ఏర్పాటుచేయవచ్చని వారంటున్నారు. ఇది సమీప భవిష్యత్తులో సాధ్యమయితే భూమిపై పెరుగుతున్న జనాభాకి నివాస యోగ్యంగా చంద్రుని రూపంలో మంచి ప్రత్యామ్నాయం దొరికినట్లే. సందేహమేమిటంటే చంద్రునిపై కూడా ధనవంతులదే ఆధిపత్యం కానున్నదా? అక్కడ కూడా అన్ని రకాల వివక్షలు కొనసాగుతాయా? చంద్రునిపై పేదవారికి స్థానముంటుందా?
చంద్రుడుపై మానవుడు అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోపి చరిత్ర సృష్టించాడు. ప్రఖ్యాత భౌతిక ఖగోళ శాస్తవ్రేత్త స్టీఫెన్ హాకింగ్ భూమిపై పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని చూసి మరో వందేళ్ళలో భూగ్రహం వ్యర్థపదార్థాలకు నిలయంగా మారుతుందని, మానవాళి సకాలంలో మేల్కొనకపోతే నివసించానికి మరొక గ్రహాన్ని వెతుక్కోవలసిందేనని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ‘నాసా’ సహా అనేక ఖగోళ పరిశోధనా సంస్థలు చంద్రుడిపై పరిస్థితులను పరిశోధించడానికి ఆసక్తి చూపుతున్నాయి. మనిషి భూమిపై వున్న జీవవైవిధ్యం వల్ల సులభంగా నివసిస్తున్నాడు. చంద్రుడిపై జీవవైవిధ్యాన్ని ఏర్పరచడం సులభ సాధ్యం కాదు. కేవలం ధనవంతులకు, పలుకుబడి వున్నవారికి మాత్రమే చంద్రునిపై జరిగే పరిశోధనలు ఉపయోగపడితే వాటివల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరదు. ఈ పరిశోధనలు కొనసాగిస్తూనే మరోవైపు భూతాపం, మతోన్మాద ఉగ్రవాదం, పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలపై ఉమ్మడిగా పాలకులు కృషిచేస్తే మానవ నివాసానికి శాశ్వత పునాదులు ఈ నేలపైనే ఏర్పరచుకోవడానికి అవకాశముంటుంది. లేనట్లయితే మన గ్రహంపైన ఏర్పడిన సమస్యలే చంద్రునిపై కూడా ఉత్పన్నమై అదికూడా మానవుని వికృత చేష్టలతో వ్యర్థపదార్థాల నిలయంగా మారే ప్రమాదం ఉంటుంది.

-ఎం.రాంప్రదీప్ 94927 12836