సబ్ ఫీచర్

కృత్రిమ మేధ వర్థిల్లుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్రిమ మేధ విప్లవానికి నేడు సర్వత్రా మరింత ఊతం లభిస్తోంది. భవిష్యత్ అంతా కృత్రిమమేధదే అన్న నిర్ణయానికొచ్చిన ప్రముఖ వాణిజ్య సంస్థలు పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రభుత్వాలు సైతం ఇదే దారిలో పయనిస్తున్నాయి.
జపాన్‌కు చెందిన ‘సాఫ్ట్ బ్యాంక్’ గ్రూప్ ఈ రంగంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. కృత్రిమమేధ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకుగాను ఆ గ్రూప్ ఆపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ కంపెనీలలో 108 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు తీర్మానించింది. తమకున్న ‘విజన్ ఫండ్’ ద్వారా ఈ పెట్టుబడులను సమీకరించనున్నది. గతంలో కొన్ని సాంకేతిక సంస్థల్లో, కంపెనీల్లో ఈ రకమైన పెట్టుబడులు పెట్టింది. దీన్ని కొనసాగించాలని కృత్రిమ మేధ విప్లవంలో తామూ భాగస్వాములం కావాలని భావిస్తూ ఉంది.
ఇదిలాఉండగా కృత్రిమ మేధకు ప్రాధాన్యమిచ్చే 5జీ టెక్నాలజీని పెద్దఎత్తున ముందుకు తీసుకెళ్ళేందుకుగాను చైనా రానున్న రోజుల్లో 150 బిలియన్ డాలర్లను వెచ్చించేందుకు సిద్ధమైంది. ఆటోమేషన్‌కు ఈ నిర్ణయం మరింత ఊపిరిపోయనున్నది. దీంతో కృత్రిమమేధ రంగంలో అమెరికాను అధిగమించేందుకు అవకాశముందని భావిస్తున్నారు.
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల అమెరికాను భవిష్యత్‌లో ఈ విధంగా అధిగమించే అవకాశముందని చైనా భావిస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్ష్యంతోనే చైనా చాలాకాలంగా క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా టెక్నాలజీలో నైపుణ్యాలను ప్రోదిచేస్తూ ఉంది. దాంతో ఇప్పుడు 5జీ నెట్‌వర్క్‌తో, కృత్రిమ మేధతో పనిచేసే అసంఖ్యాక పరికరాలను, అప్లికేషన్స్‌ను ‘యాక్టివేట్’ చేసేందుకు సిద్ధమైంది. ఈ డిజిటల్ యుగంలో బిగ్ డేటాను ‘ఇంధనం’గా భావిస్తున్నారు. ఆ ఇంధనాన్ని చైనా చాలాకాలంగా ప్రోదిచేస్తోంది. ఆ ఇంధనాన్ని 5జీ ‘పైపుల’ద్వారా ప్రవహింపజేయాలని చైనా చూస్తోంది. అందుకే 5జీపై పెద్దమొత్తంలో నిధులు ఖర్చుపెట్టేందుకు సిద్ధమైంది. ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్దసంఖ్యలో 5జీ ఫోన్లు పనిచేసేందుకు చైనా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ ప్రయాణం అప్పడే ప్రారంభం కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో భారత్‌లో విద్యార్థులు కృత్రిమ మేధ, రోబోటిక్స్ కోర్సుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంజినీరింగ్‌లో అంతర్భాగంగా ఈ విభాగాలు ఉబికి వస్తున్నాయి. ‘స్టెమ్’గా పిలిచే (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) రంగాలకు చెందిన విద్యార్థులు కృత్రిమ మేధ, రోబోటిక్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. దాంతో పాఠశాలల్లోనూ రోబోలకు సంబంధించిన పాఠాలు బోధించనున్నారు. ఆ డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘అటల్ టింకరింగ్ లాబొరెటరీ’ (ఎటిఎల్)లను స్థాపించింది. విద్యార్థులకివి ఎంతో విజ్ఞానదాయకంగా ఉన్నాయి. విద్యార్థుల్లో సృజన, కల్పనను పెంచేందుకు వీటిని ఉద్దేశించారు. నైపుణ్యాల అభివృద్ధికి సైతం ఇవి ఉపకరించనున్నాయి. భవిష్యత్‌లో ప్రజల జీవనంలో రోబోలు కీలక భాగం కానున్న విషయాన్ని విద్యార్థులకు నొక్కి చెప్పేందుకు ఈ ‘ఎటిఎల్’లు కృషిచేస్తున్నాయి.
వాస్తవికత...
ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సాంకేతిక పరిజ్ఞానం పుష్పంలా వికసన చెందిన ఈ ‘స్మార్ట్’ సమయంలో ఆటోమేషన్ అంతటా విస్తరిస్తోంది. కార్యాలయాలు, ఆసుపత్రులు, విద్యాలయాలు, విమానాశ్రయాలు, పరిశ్రమలు ఇలా అంతటా నాల్గవ పారిశ్రామిక విప్లవం జాడలు దండిగా కనిపిస్తున్నాయి. దాంతో ప్రజల జీవన శైలిలో గణనీయమైన మార్పులొచ్చాయి. దీన్ని విద్యార్థులు లోతుగా అవగాహన చేసుకునే వాతావరణం కల్పిస్తున్నారు. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్, స్వయ చోదిత వాహనాల రాక వల్ల మానవ జీవనం గతంలో ఎన్నడూ లేనంతగా మారిపోయింది. ఈ మార్పు ఇంకా కొనసాగుతోంది. ఆటోమేషన్ పరిజ్ఞానంతో ‘అసెంబ్లింగ్’ పని మరింత సులువవుతోంది, వేగవంతమవుతోంది, లాభదాయకమవుతోంది. ఈ మూడు అంశాలే చాలా కీలకమైనవి. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో వీటికి అధిక ప్రాధాన్యత ఉంది. అందుకే ఉత్పత్తిరంగంలో అనూహ్యమైన, గుణాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ ప్రక్రియను మరింతగా మెరుగుపరుస్తున్నారు. మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఐఓటీ కారణంగా యంత్రాలే, రోబోలే పనులన్నీ చక్కబెట్టే కాలం రానున్నది. అటానమస్ (స్వయం చాలిత) వాహనాలు పెద్దఎత్తున రోడ్లమీదకు వస్తే నైపుణ్యం దండిగా ఉన్నవారి అవసరం మరింత పెరుగుతుంది. ఆ దిశగా విద్యార్థులను, యువతను తీర్చిదిద్దుతున్నారు. అలాగే బ్లాక్‌చైన్ సాంకేతిక పరిజ్ఞానం పట్ల పూర్తి అవగాహన కల్పించడం, దానివల్ల కలిగే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ చైన్ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటుచేయనున్నది. వర్తకం- వాణిజ్యం, ఆర్థిక రంగం, నగదు బదిలీ, చెల్లింపుల సేవల విషయంలో ఈ పరిజ్ఞానం ఎంతో ఉపయుక్తమైనదని భావిస్తున్నారు.
స్టార్టప్‌లకు చేయూత...
సామాజిక సమస్యలకు కృత్రిమ మేధ (ఏఐ) పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్న స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పడిన ఇండియా ఇన్నోవేషన్ యాక్సిలరేటరీ కార్యక్రమానికి 10 స్టార్టప్ సంస్థలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాన్ని ఫేస్‌బుక్, టీ-హబ్ సంయుక్తంగా చేపట్టాయి. వ్యవసాయం, ప్రజారోగ్యం, రక్షిత మంచినీరు, వౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రత తదితర అంశాలపై పనిచేస్తున్న స్టార్టప్ సంస్థలను ఎంపికచేశారు. ఈ సంస్థలకు అవసరమైన సహాయ సహకారాలన్నింటినీ అందించనున్నారు. సాంకేతిక, ఆర్థిక సహాయంతోపాటు మార్కెట్ సౌకర్యం కూడా కల్పిస్తారు.
మేధో సామర్థ్యం...
మనిషి తన మేధో సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశముందని అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ‘ఆవిష్కర్త’ ఇలాన్ మస్క్ పేర్కొన్నారు. కంప్యూటర్‌ను మెదడుతో అనుసంధానం చేసి మేధో సామర్థ్యాన్ని పెంచే ప్రక్రియపై తాను నెలకొల్పిన ‘స్టార్టప్ సంస్థ’ పనిచేస్తోందని, ఇందుకోసం కొన్ని రహస్య పరిశోధనలు జరిపామని కూడా ఆయన చెప్పారు. వెంట్రుకంతటి సెన్సర్‌ను మెదడులో ప్రవేశపెట్టి, చెవిలో పెట్టుకునే మరో పరికరంతో ఆ సెన్సర్‌ను అనుసంధానం చేసి, చెవిలో పెట్టుకునే పరికరాన్ని స్మార్ట్ ఫోన్‌తో నియంత్రించవచ్చని, ఆ రకంగా అవసరమైన రీతిలో మేధో సామర్థ్యాన్ని పెంపొందించవచ్చని, ఇది పక్షవాతం వచ్చినవారికి వరప్రదాయినిగా ఉంటుందని అంటున్నారు.
మెదడులోని సమాచారాన్ని, జ్ఞాపకాలను ‘బ్రెయిన్ చిప్’ ద్వారా కలకాలం భద్రపరచుకోవచ్చునని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. మెదడు పొరల్లోని అనేక విషయాలను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం ఏర్పడనున్నదని భావిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఈ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే మెదడుకు సంబంధించిన సమస్యలను ముఖ్యంగా పక్షవాతం లాంటివి నయం చేసేందుకు ఎంతో ఉపకరిస్తుందని ఆశిస్తున్నారు. దీని ఆధారంగా ‘బ్రెయిన్ టూ బ్రెయిన్ కాంటాక్ట్’ పద్ధతి ఆవిష్కారం కానున్నది, అప్పుడు అనేక పనులు ఇప్పుడున్న పద్ధతిలోగాక మరో రూపంలో పూర్తవుతాయి. ఓ కొత్త వ్యవస్థ ఆవిష్కృతమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సంప్రదాయ సంగతులన్నింటికీ ‘సమాధి’కట్టి, సరికొత్త పని సంస్కృతికి తెరలేపాల్సి వస్తుంది. సాంకేతిక పరిజ్ఞానానికి ‘జై’కొట్టాల్సి ఉంటుంది!

-వుప్పల నరసింహం 99857 81799