సబ్ ఫీచర్

పల్లం నుంచి పర్వత’నేనికి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నీ అనుకున్నట్టే సాగితే -అది జీవితం ఎందుకవుతుంది. అందుకే -అనుకున్నట్టే సాగిపోతున్న టైంని అదృష్టం అనుకుంటాం. ఒడిదుడుకులు ఎదురైతే దురదృష్టమంటాం. ఈ రెండూ భౌతికంలో -అభౌతికమని ముందే గ్రహిస్తారు కొందరు. ఇలాంటి వాళ్లు -వాళ్లే పూలబాటలేసుకుంటారు. వాళ్లే -ముళ్లబాటల్లోకీ వెళ్తుంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే -వాళ్లను వాళ్లే నడిపిస్తుంటారు. ఎంచుకున్న దారిలోకి వెళ్లాలంటే -వెనుకుండి నడిపించే శక్తి మనలోనే ఉందన్న విషయాన్ని ముందే గ్రహిస్తారు. అలాంటి -ఆర్ట్ ఆఫ్ లివింగ్ (బతుకు కళ)ను పుట్టుకతోనే పుణికిపుచ్చుకున్న కళాకారుడు సాంబ. అనుకున్నా, అనూహ్యంగా జరిగినా -పల్లం నుంచి పర్వత ఎత్తులకు ఎదగాలన్నదే ఆయన లక్ష్యం. ఆ చోదకశక్తి ముందు అదృష్ట దురదృష్టాల ఆటలు సాగవు. అలాంటి మార్గదర్శక జీవిత ప్రయాణీకుడు -ఈవారం మన వెనె్నల అతిథి. ఆయనే -పర్వతనేని సాంబశివరావు ఉరఫ్ అర్థరాత్రి సాంబ. ఎన్నో బతుకు కథలను వెండితెరపై రంగుల చిత్రాలుగా చూపించిన దర్శకుడు. ఆయన జ్ఞాపకాలు ఈవారం వెనె్నల పాఠకుల కోసం.

జగ్గయ్య, భారతి జోడీగా ‘అర్థరాత్రి’ అనే సినిమా వచ్చింది. ఆ చిత్రం విడుదలైన పదిహేనేళ్ల వరకూ -ఆ సినిమా పేరే ఇంటిపేరుగా ఇండస్ట్రీకి సాంబ పరిచయమయ్యాడు. ఆ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించింది -పర్వతనేని సాంబశివరావు. కాని -పరిశ్రమకు అర్థరాత్రి సాంబశివరావుగానే గుర్తుండిపోయారు. దర్శకుడిగా తొలి అడుగు ఎంత బలంగా పడిందన్న విషయాన్ని చెప్పడానికే ఇదంతా. తరువాత దాదాపుగా 40 సినిమాలకు దర్శకత్వం వహించారు.
ఏలూరులో నారాయణరావు, శశిరేఖమ్మల తనయుడు సాంబశివరావు. ఆయన అన్న నవశక్తి గంగాధరరావు. ఏలూరులోనే బిఎస్సీ వరకూ చదివిన సాంబశివరావు, అన్నయ్యవున్న పరిశ్రమకు అనుకోకుండానే వచ్చారు. ఖాళీగా ఉండటమెందుకని -మదరాసు విక్రమ్ లాబ్‌లో అప్రెంటీస్ చేశారు. తరువాత అన్నయ్యతోపాటు హైదరాబాద్‌కు వచ్చి సారథి స్టూడియోలో అప్రెంటీస్‌గా చేరారు. ఆ టైంలో రూపొందుతున్న చిత్రం ‘మా ఇంటి మహాలక్ష్మి’. ఆ షూటింగ్‌లో తన సేవలందించారు సాంబశివరావు. దర్శకుడు సిఎస్ రావును గురువుగా భావిస్తాడాయన. తొలిసారి మాత్రం దర్శకుడు తాపీ చాణక్య దగ్గర జగ్గయ్య, జమున జంటగా రూపొందించిన ‘జల్సారాయుడు’ చిత్రానికి పనిచేశారు. ఆదుర్తి సుబ్బారావువద్ద రెండు తమిళ చిత్రాలకు పనిచేశారు. ‘సిఎస్ రావు దగ్గర నేర్చుకున్న విద్యే -ఆ తరువాత నాకు అక్కరకొచ్చింది’ అని ధీమాగా చెబుతారాయన. అర్థరాత్రి చిత్రం తరువాత వెనక్కితిరిగి చూసుకునే అవసరం లేకపోయింది. మనస్సాక్షి, వంశోద్ధారకుడు, కుమారరాజా, కొత్తల్లుడు, కొత్తపేట రౌడీ, ఉద్దండుడు, ఇంటింటి రామాయణం, ప్రేమనక్షత్రం, కలియుగ స్ర్తి, ఈనాడు, రామరాజ్యంలో రక్తపాశంలాంటి విజయవంతమైన చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కింది. గుండమ్మకథ చిత్రాన్ని హిందీలో సంజీవ్‌కుమార్, శశికపూర్, విద్యాసిన్హా, వౌసమీ ఛటర్జీ, నాదీరా ప్రధాన తారాగణంగా రూపొందించి బాలీవుడ్‌లోనూ విజయపతాక ఎగురేశారు సాంబశివరావు. శ్రీదేవి- కునాల్ గోస్వామి జంటగా ‘కళాకార్’ చిత్రాన్ని, సుమంత్ ‘సత్యం’ సినిమాను బెంగాలీలో ‘శక్తి’గా రూపొందించారు. ‘మాటైంలో కథకు తగిన నటీనటులను ఎంపిక చేసుకునేవాళ్లం. వాళ్ల మానరిజమ్స్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి తగిన విధంగానే డైలాగు రాసుకొని ఏ ఇబ్బందీలేకుండా షూటింగ్‌లు చేసేవాళ్లం. నావరకూ నాకు నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి ఎలాంటి ఇబ్బందీ ఎదురవలేదు. అందరం ఒక కుటుంబంగా కలిసి పోయేవాళ్లం. మనందరి ప్రాజెక్టుకు పని చేస్తున్నామన్న భావనే వుండేది’ అంటూ అప్పటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
‘సినిమా రూపొందించడానికి ఎటువంటి ఇబ్బందులు పడకపోయినా, అవి ప్రజల్లోకి రావడానికి మాత్రం సెన్సార్ రూపంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న దర్శకుడిని నేను’ అంటారు సాంబశివరావు. ‘హైవే క్వీన్ అనే హాలీవుడ్ చిత్రాన్ని తెలుగులో రూపొందించే యోచనతో కెమెరామెన్ విఎస్‌ఆర్ స్వామి, రచయిత సత్యానంద్‌ను సంప్రదించా. చాలా బాగుంది, చేద్దామని ప్రేరేపించారు. అదొక వేశ్య పాత్ర. ఆ పాత్రను జయసుధ పోషించారు. హైవేల వెంబడి తిరిగే వేశ్యల కథనంతో రూపొందించిన చిత్రానికి మొదట ‘కలియుగ సీత’ అన్న పేరు నిర్ణయించాం. కలియుగ సీత ఓ వ్యభిచారిణిగా వుంటుందా? అంటూ సెన్సార్ అభ్యంతరం లేవదీసింది. ఆ పేరును మార్చమని సూచించింది. తరువాత అందరం కూర్చుని సీతను కాస్తా స్ర్తిగా చేసి ‘కలియుగ స్ర్తి’ అన్నాం. ఆ సినిమా ఓపెనింగ్ షాట్‌లో జయసుధ బీడీ తాగుతూ కనిపిస్తుంది. ఆ షాట్స్ తీసివేయమని, పాత్ర ఔచిత్యం దెబ్బతింటుందని దర్శకుడు ఎల్‌వి ప్రసాద్ సూచించారు. కానీ నిర్మాతలు అందుకు ఇష్టపడలేదు. హిందీలోనూ ఇటువంటి సన్నివేశాలు ఉన్నాయని నిర్మాతల వాదన. కానీ జయసుధ ఇమేజ్‌కి బీడీ కాలుస్తూ కనిపించిన సన్నివేశాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఆ సినిమా అంతగా ఆదరణ పొందలేదు. అలా అటు సెన్సార్ నుంచి ఇటు ప్రేక్షకులనుండి తొలిసారిగా నేను ఇబ్బంది ఎదుర్కొన్నా’ అంటారు సాంబశివరావు.
ప్రేమనక్షత్రం చిత్రంకోసం కృష్ణ, శ్రీదేవిలపై చిత్రీకరించేందుకు ఓ శోభనం పాటను వేటూరి రాశారు. ‘ఇచ్చిపుచ్చుకోవడమే జీవితం’ అన్న పంక్తిలో అశ్లీలం ఉందని వాదించింది సెన్సారు. చాలామంది మేధావులకు ఆ చిత్రాన్ని చూపించి కమిటీ చూడడానికి ఒప్పుకున్నాం. చివరికి అది అంతగా అశ్లీలమైన మాట కాదని తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నాం. ‘అమ్మాయిలూ జాగ్రత్త’ అనే ఓ చిత్రం కోసం ‘మునగచెట్టు ఎక్కించి మోజు తీర్చుకుంటారు.. జాగ్రత్తో.. జాగ్రత్త.. అమ్మాయిలూ జాగ్రత్త’ అన్న ఓ పాటను చిత్రీకరించాం. మునగచెట్టు అని ఎందుకు అనాల్సి వచ్చింది, మరో చెట్టు పేరు చెప్పొచ్చు కదా అంటూ రచయిత్రి మాలతీ చందూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి మేము మునగచెట్టయితే త్వరగా విరిగిపోయే అవకాశం వుంది అని, అందుకే అలా రాయించామని చెప్పి వారు ఒప్పుకునేటట్టుగా చేశాం. తెలుగులో ఇన్ని రకాల తప్పులు పడుతుంటే, హిందీవాళ్లు మాత్రం చాలా విశాలమైన దృక్పథంతో చిన్న చిన్న విషయాలను పట్టించుకోరు. ఇక్కడొక రూలు, అక్కడొక రూలు ఉండటంవల్ల ఇలాంటి ఇబ్బందులు నాకు ఎదురయ్యాయి’ అంటూ చెప్పుకొచ్చారు.
అదేవిధంగా కృష్ణ- విజయనిర్మల- చంద్రమోహన్ ప్రధాన తారాగణంగా ‘రామరాజ్యంలో రక్తపాతం’ అనే చిత్రాన్ని రూపొందించాం. రామరాజ్యం అంటే సస్యశ్యామలంగా వుండాలికాని రక్తపాతం వుంటుందా? అని సెన్సార్ అభ్యంతరం లేవనెత్తారు. విచిత్రమేమంటే ఆ సినిమా మూడు టైటిల్స్‌తో ప్రజల్లోకి వెళ్లింది. ఒకటి రామరాజ్యంలో రక్తపాతం, రెండు రామరాజ్యంలో రక్తపాతమా?, మూడు రామరాజ్యంలో రక్తపాశం అనే టైటిల్స్ ప్రేక్షకులను గందరగోళంలోకి నెట్టాయి. వాల్‌పోస్టర్లపై కూడా రక్తపాతం అన్నచోట ‘పాశం’ అని ప్రింటుచేసిన చిన్న చిన్న స్టిక్కర్లు అంటించడం జరిగింది. మొత్తానికి ఆ చిత్రానికి ‘రామరాజ్యంలో రక్తపాశం’ అన్న పేరు స్థిరపడింది అంటూ నవ్వేశారాయన. మలయాళంలో విజయవంతమైన ‘ఈనాడు’ చిత్రాన్ని పద్మాలయ స్టూడియోస్ ముత్యాలముగ్గు శ్రీ్ధర్ కథానాయకుడిగా రూపొందించాలన్న ఆలోచనతో హక్కులు తీసుకున్నారు. దర్శకుడిగా ననే్న ఎంపిక చేయమని నటశేఖర్ కృష్ణ కూడా సిఫారసు చేశారు. నేను వెళ్లి స్క్రిప్ట్ అంతా చూశాను. వెంటనే కృష్ణ వద్దకెళ్లి పద్మాలయ చిత్రం అంటే కృష్ణ లేకపోతే బాగోదని, మీరే నటించాలని అభ్యర్థించాను. దానికాయన ఒక్కరోజు కాల్షీట్ కూడా ఖాళీలేదన్నారు. మీ కాల్షీట్లు పదిరోజులు ఇచ్చినా చాలు, నేను సినిమా పూర్తిచేస్తానని మాటిచ్చాను కృష్ణకు. అదేవిధంగా ఆయన షూటింగ్ పూర్తయ్యాక రాత్రిపూట పదిరోజులు కాల్షీట్లు ఇచ్చారు. ఆ పదిరోజుల్లోనే చిత్రాన్ని అనేక కాంబినేషన్‌లలో తీర్చిదిద్దాను. సినిమా మొదలుపెట్టినపుడు చూస్తే అది కృష్ణ నటిస్తున్న 200వ చిత్రంగా నమోదైంది. దీంతో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. సినిమాకోసం ప్రేక్షకులు ఎదురుచూశారు. గుంటూరు, తెనాలి, విజయవాడలలో చిత్రాన్ని రూపొందించాం. ఆ చిత్రంలో సైకిల్‌పై ఓ పాట వుంది. 10వ రీల్‌లో రావలసిన ఆ పాట ఫ్లాష్‌బ్యాక్‌లో రెండో రీల్‌లోనే వచ్చింది. అదే సమయంలో నటరత్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ గుర్తు సైకిల్. దాంతో ప్రేక్షకుల్లో ఆ సైకిల్ పాటకు మంచి అప్లాజ్ వచ్చింది. అటు ఎన్టీఆర్ పార్టీకి, ఇటు సినిమాకు మంచి ప్రచారం లభించింది. సైకిల్‌పై కృష్ణను చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ థియేటర్స్‌లో గగ్గోలు పెట్టేశారంటే నమ్మండి’ అంటూ అప్పటి విషయాలను నెమరేసుకున్నారు.
ఇక ఇంటింటి రామాయణం చిత్రంకోసం మూడు జంటలపై ఓ పాటను చిత్రీకరించాం. అందులో ఒక జంట నూతన్‌ప్రసాద్- రమాప్రభ. నూతనప్రసాద్‌ను తొలిసారిగా డ్యాన్స్ చేయించిన దర్శకుడిని నేనే. ఆయన కలిసినపుడల్లా నా చేత డ్యాన్స్ చేయించారు కదండీ.. అంటూ ఛోలోక్తి విసిరేవారు. అదే చిత్రంలో విషాదాంతమైన దేవదాసు పాటను హాస్యంగా చిత్రీకరించాం. విషాదాంతమైన కథను హాస్యంగా చెప్పేసరికి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కొత్తపేటరౌడీ చిత్రంకోసం చిరంజీవి, కృష్ణల ఫైట్‌ను చెన్నై ఆర్కాట్ రోడ్డులోవున్న వాహిని స్టూడియో ముందు మెయిన్ రోడ్డుపై చిత్రీకరించాం. అది ఇప్పటికీ మంచి సన్నివేశంగా గుర్తుంటుంది నాకు. కుమారరాజాలో ‘అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే’ పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రాన్ని 22రోజులపాటు కాశ్మీర్‌లో చిత్రీకరించాం. జయంతి- లత- జయప్రద కథానాయికలు. అంత చలివున్నా, అక్కడ సాయంత్రం 7 గంటలైనా చీకటి పడేది కాదు. దాంతో మా పని చాలా సులభంగా జరిగేది. ‘్ఫ్యనీ’ అనే హాలీవుడ్ చిత్రాన్ని బాలీవుడ్ వారు ‘ఏక్ ఫూల్ దో మాలి’గా రీమేక్ చేశారు. దానే్న తెలుగులో శోభన్‌బాబు- కాంచన జంటగా ‘వంశోద్ధారకుడు’గా రూపొందించాను. బేబీ సులక్షణను ఆ చిత్రం ద్వారా పరిచయం చేశాం.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అంటూ సింహావలోకనం చేసుకున్నారాయన. సీరియల్స్ ఎన్ని రూపొందించారో ఆయనకే గుర్తులేదు. నేషనల్ అవార్డ్సు, ఇండియన్ పనోరమ, రీజినల్ ఇండియన్ పనోరమ, నంది అవార్డ్స్‌కు జ్యూరీ సభ్యుడిగా, ఛైర్మన్‌గా అనేక సంవత్సరాలు సేవలందించారు.

-సరయు శేఖర్, 9676247000