సబ్ ఫీచర్

నార్ల సంపాదకీయాల్లో మహాత్ముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాస్వప్నం మహాత్మాగాంధీ( నార్ల వెంకటేశ్వరరావు సంపాదకీయాలు, ఇతరుల వ్యాసాలు)
సంపాదకులు : డా. నాగసూరి వేణుగోపాల్
- ప్రతులకు - రామ్ మనోహర్ లోహియా సమతా ట్రస్ట్, లోహియా విజ్ఞాన సమితి
101, గోధా నిలయం, మయూరి మార్గ్, బేగంపేట, హైదరాబాద్ - 500 016
=============================================================
ప్రస్తుతం దేశమంతా గాంధీజీపై చర్చ జరుగుతూ వుంది. గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలని ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్వహిస్తున్నాయి. పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో గాంధీజీపై అనేక విశే్లషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో, 1944-1973 మధ్య కాలంలో సుప్రసిద్ధ తెలుగు మేధావి, పత్రికా సంపాదకులు, రచయిత అయిన నార్ల వేంకటేశ్వరరావుగారు గాంధీజీపై వ్రాసిన సంపాదకీయాలు, పుస్తక సమీక్షలని ‘‘మహాస్వప్నం-మహాత్మాగాంధీ’’ పేరుతో నేటి తరానికి గుర్తుచేయడం చాలా ఆహ్వానించదగ్గ ప్రయత్నం.
ఇందులో మొత్తం 33 రచనలు నార్లవారివి కాగా, నెహ్రూ, వినె్సంట్ షీన్‌ల రెండు వ్యాసాలు, డా.నాగసూరి స్వయంగా వ్రాసిన మరో నాలుగు రచనలు ఒకటి ఉపోద్ఘాతంలో, మరో మూడు అనుబంధంలోనూ ఉన్నాయి. గాంధీజీ గురించి అసంఖ్యాకమైన పుస్తకాలు, వ్యాసాలు, రచనలూ వచ్చినా, గాంధీజీగారు మరణించిన 70వ సంవత్సరాల తరువాత కూడా అనేక విషయాలలో లోతైన అధ్యయనం జరుగుతూనే ఉంది. గాంధీజీ అంత విస్తృతంగా ప్రశంసకూ, విమర్శకూ గురైన వ్యక్తి ప్రపంచ చరిత్రలో బహుశా ఎవరూ లేరేమో? హిందూవాదులు హిందూ వ్యతిరేకి అంటే, ముస్లిం లీగు, అంబేద్కరైటులు ‘‘పచ్చి హిందూ’’ అన్నారు. కమ్యూనిస్ట్‌లు- సామ్రాజ్యవాదపు, ధనిక స్వామ్యపు ‘తొత్తు’ అంటే, బ్రిటిష్‌వారు ‘బోల్షెనిక్’ అన్నారు. స్వాతంత్య్ర పోరాటం ఒక స్థాయికి చేరగానే ఆయన శిష్యులే ఆయన్ని మెల్లగా వదిలేశారు. కానీ దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలకి ఆయన మరణానంతరం, నేటికి కూడా స్ఫూర్తిగా ఉండడం మనం గమనిస్తూనే వున్నాం.
ఈ వ్యాసాల సంకలనం ప్రత్యేకత ఏమిటంటే- ఇందులో అధిక భాగం గాంధీజీ బ్రతికి వున్నపుడు నార్లవారి స్పందనలు. నార్లవారి 33 రచనలలో 25 రచనలు 1945-1949 మధ్యకాలంలో రాసినవి. అంటే గాంధీజీ జీవించిన లేదా, ఆయన మరణానంతరం తక్షణమే వ్రాసినవి. అందువల్ల ఆనాటి సమాజం గాంధీజీని ఎలా అంచనావేసింది అనేది ఇందులో మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. 1945లో వ్రాసిన ‘నాయకత్వం’, ‘యుగపురుషుడు’, 1946లో వ్రాసిన ‘ఒక తేజస్సు, ఒక ఓజస్సు’ ఈ విషయాన్ని మనకు ఇంకా బాగా తెలియజేస్తాయి. ‘యుగపురుషుడు’లో హింసని విశే్లషిస్తూ- ‘‘ఈ యుగ సంధ్యలో- సర్వవినాశపుటంచున- విలయ ప్రాంగణంలో ప్రపంచం నిలిచివున్న ఈనాడు గాంధీ శాంతి సందేశానికి మరింత ప్రత్యేకత ఇతోధిక విశిష్టత లేవా?’’ అని ప్రశ్నిస్తారు నార్ల. ‘‘అహింసా పరమోధర్మః’’ అని హిందువుల ఉపనిషత్తులు ఉద్ఘోషించాయి. ఈ సందేశానే్న గౌతమ బుద్ధుడిచ్చాడు. ఈ ఉద్భోధనే ఏసుక్రీస్తు చేశాడు. నేడు గాంధీ ఈ పురాతన ధర్మసూత్రానే్న- ఈ మహిమాన్విత సూక్తినే- కేవలం పునశ్చరణ చేయడంలేదు. దానికి ఆయన ఒక కొత్త స్వరూపం కూర్చాడు; ఒక కొత్త అర్ధాన్ని కల్పించాడు: ఒక కొత్త శక్తిని ఆపాదించాడు. ఆ కొత్త స్వరూపం సత్యాగ్రహం; ఆ కొత్త అర్థం సహాయ నిరాకరణ; ఆ కొత్త శక్తి శాంతి సమరం.’’ అని విశే్లషించడంలో ‘‘అహింస’’కి గాంధీ ఓ సామాజిక ఉద్యమకోణాన్ని ఇవ్వడం అర్థమవుతోంది. అప్పటిదాకా ప్రపంచ చరిత్ర అంతా బలం, ఆయుధం అనే అంశాలపైనే ఆధారపడినాయి. మొదటిసారిగా మనిషి, అతని ఆత్మశక్తికూడా ఉద్యమాలలో బలమైన ఆయుధం అనీ, నిజానికి ఆయుధాలకంటే మరింత బలమైనదనీ గుర్తించడం, ఆచరణలో పెట్టడం- గాంధీజీ ప్రత్యేకత.
‘‘స్వాతంత్య్ర భానూదయవేళ’’ (8 ఆగస్టు, 1947) స్వాతంత్య్ర దినానికి ఓ వారంరోజులముందు వ్రాసింది. అందులో ముఖ్యంగా బ్రిటిష్‌వారు మన దేశాన్ని జయించడానికి ‘మన జాతి నైతిక పతనం ప్రధాన కారణం’అన్న మొదటి వాక్యం గాంధీజీ ‘‘హింద్ స్వరాజ్’’లో చేసిన విశే్లషణకి చాలా దగ్గరగా వుంది. ‘గాంధీ ప్రారంభించిన ఈ నైతిక విప్లవం పరిపూర్తి చెందితేనే, మనకు మరి ఏడురోజులలో సంక్రమించనున్న స్వాతంత్య్రం సార్థకం కావడమైనా, సుస్థిరత్వాన్ని పొందడమైనా’అన్న ముగింపు గొప్ప హెచ్చరిక. అయితే విచిత్రమేమిటంటే గాంధీజీ బ్రతికి వున్నపుడే, కాంగ్రెస్ ప్రభుత్వాల నైతిక పతనం ఆయన దృష్టికివచ్చింది. ‘ఆయనప్పుడు ‘గాంధీజీ అగు జాడలలోనే మనం తప్పక నడవాలి’ అని దాదాపు ప్రతి ప్రముఖుడు ప్రకటన చేయడం తగునా?’’ అని ప్రశ్నిస్తారు నార్ల. ‘‘గాంధీజీ మహాస్వప్నం’’ అనే (11 ఫిబ్రవరి, 1948)న వ్రాసిన ఆంధ్రప్రభ సంపాదకీయంలో! నిజానికి మన రాజ్యాంగ పరిషత్‌లో తొలి రోజులలో శ్రీమాన్ నారాయణ అగర్వాల్ అనే గాంధేయవాది గాంధీ రాజ్యాంగ ప్రతిపాదనలని ఇచ్చినప్పుడు- పరిషద్‌లో నెహ్రూ- ‘గాంధీ సామాజిక దృక్పథాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ పరిగణనలోనికి తీసుకోలేదు’ అన్న మాట గాంధీజీ శిష్యులే గాంధీ మార్గాన్ని కేవలం ఉద్యమంలో ఓ పనిముట్టుగా వాడుకున్నారే కానీ, దానిపట్ల వారికి నిబద్ధత లేదనీ తెలుపుతోంది.
1 ఫిబ్రవరి 1948న గాంధీజీ హత్య అనంతరం వెంటనే వచ్చిన సంపాదకీయంలో నార్లగారు రాసిన మాటలు వచనంకంటే పద్యానికి దగ్గరగా వుంటాయి. ‘బాపూజీ’ అన్న ఈ రచన ఆద్యంతం ఓ విషాద గీతం. ‘‘ఆవురుమని ఒక్కసారి రోదించగలిగితే, గుండె బరువు తగ్గవచ్చు. ఆలోచన తట్టవచ్చు. కలం సాగవచ్చు... తండ్రిని చంపుకొనడమా? గురువును పొట్టన పెట్టుకొనడమా? మనం సభ్యమానవులమేనా? ఈ సిగ్గును మనం ఎలా భరించగలం? ఈ కష్టంనుంచి ఎలా గట్టెక్కగలం? మనకు ఏమిదిక్కు? ఏది దారి? అబ్బ! ఎంత చీకటి! గుండెలపై ఎంత పెద్ద రాయి!! ఉహు! ఇక రాయలేము. చేతినుంచి కలం జారి...’’ సంపాదకుడు కవిగా మారి, వేదన గీతంగా మారింది!
ఈ పుస్తకంలో డా.నాగసూరిగారు చేర్చిన నార్లవారి ప్రతి రచనా అద్భుతమైనదే. గాంధీజీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా 2 అక్టోబర్, 1969న వ్రాసిన ఆంధ్రజ్యోతిలోని సంపాదకీయం చాలా విశిష్టమైన రచన. ‘గాంధీజీ జీవిత కాలంలో కంటే నేడు- నిజమే- పంటలు ఎక్కువ పండుతున్నాయి; పారిశ్రామికోత్పత్తి అధికంగా సాగుతున్నది... కానీ, వీటన్నిటిని మించినవి గాంధీజీ దృష్టిలో వేరే వున్నాయి... నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చేవాడు ఈనాటి సంఘంలో ‘‘కాంజినిటల్ ఇడియట్’’గా పరిగణించబడుతున్నాడు. మానవతకు ప్రాధాన్యమిచ్చేవాడు ‘‘ఇంప్రాక్టికల్ ఐడియాలజిస్టు’’గా త్రోసివేయబడుతున్నాడు...’’ అన్న వాక్యాలు 1969నాటి రాజకీయ, సామాజిక రంగంలో దేశంలో జరుగుతున్న మార్పులకి అద్దం పడుతోంది.
ఇందులో సంచలనం చేసిన ప్రతి నార్లవారి రచనా తత్కాలీన సమాజపు చిత్రీకరణే. వీటితోపాటు డా.నాగసూరిగారు ‘‘గాంధీ-లోహియా అపూర్వ మైత్రి’’ అని స్వయంగా వ్రాసిన వ్యాసం అలాగే అనుబంధంలో గాంధీజీకి సైన్సు, టెక్నాలజీలపైన ఉన్న అభిప్రాయాలన్ని వివరించే రెండు వ్యాసాలు చాలా అవసరమైనవి. స్వాతంత్య్రం తరువాత గాంధీజీ ఆర్థిక, రాజకీయ, పోరాట విధానాలకి అత్యంత దగ్గరగా వెళ్ళిన వ్యక్తి లోహియా ఒక్కరే! అలాగే హింద్ స్వరాజ్ నుండి అనేక గాంధీ రచనలు, మాటలు ప్రజలలో మేధావులలో (నార్లగారితో సహా) గాంధీజీ సైన్స్, టెక్నాలజీల వ్యతిరేకి అనే భావనని కల్పించాయి. గాంధీజీ సైన్స్, టెక్నాలజీలని చాలా అవసరంగా భావించినా, దానిలో అంతర్లీనంగా వాటి తీరుతెన్నులు, అవి ఎలా మనుషుల్ని నైతికంగా బలహీనుల్ని చేస్తున్నాయో అనేదే ప్రధానమైన అంశంగా భావించారు. గాంధీజీ పట్ల ఉన్న కొన్ని తప్పుడు అభిప్రాయాలని సరిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉంది.
మొత్తంమీద డా.నాగసూరి గారి కృషికి, ఈ పుస్తకాన్ని ముద్రించి మనకందించిన రామమనోహర్ లోహియా సమతా ట్రస్ట్, లోహియా విజ్ఞాన సమితి వారికి అభినందనలు. నార్లవారి ఆలోచనలు గాంధీజీపై తాత్కాలిక రాజకీయ, మేధావి వర్గాల అభిప్రాయాలకి అద్దంపడుతాయి. అందరూ తప్పనిసరిగా చదవతగ్గ గొప్ప సంకలనం!

- డా. అవధానం రఘుకుమార్