సబ్ ఫీచర్

సమాజం ‘రీడిజైన్’లో కులమెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చదవేస్తే ఉన్నమతి పోయిందన్నమాట’ వాడుకలో ఉంది. కొందరు సామాజిక, రాజకీయవాదులు దీ న్ని మరోసారి నిజం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ తెలంగాణ (మార్క్సిస్టు- అంబేద్కరిస్టు) (సిపీటిఎం-ఎ) పేర ఓ కొత్త రాజకీయ పార్టీని వారు ప్రకటించారు. ఈ ప్రకటన పై మాటకు సరిగ్గా సరిపోతుంది. భారత్‌లో 90 ఏళ్ళ కమ్యూనిస్టు పార్టీ, దాని భావజాలం విఫలమైందని కళ్లముందు కనిపిస్తోంది. ‘70 ఏళ్ళ అంబేద్కరిజం’ కేవలం దళితుల ఆశాజ్యోతి అని భావిస్తున్నారు. అది పూర్తిగా ‘హ్రస్వదృష్టి’ అని ఎప్పుడో తేలిపోయింది. ఆ హ్రస్వదృష్టికి, విఫలమైన జావజాలానికి పెళ్లిచేసి చూద్దామని చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘లాల్-నీల్’ పేర గతంలో భారీ సభలు, సమావేశాలు, ర్యాలీలు జరిపారు. ఆ నినాదంతో ఎన్నికల్లో ఓట్లు దండుకుని రాజ్యాధికారానికి దగ్గరవడానికి ప్రయత్నం చేసినా, ఆ ఎత్తుగడ పారలేదు. ప్రజలు దాన్ని తిరస్కరించారు.
ఆ ‘దృశ్యం’ కళ్ళముందున్నా తాజాగా కొత్త పార్టీని- ఆ భావనతో, రాజ్యాధికారం ‘యావ’తో, ఆతృతతో ఆవిష్కరిస్తే ఒరిగేదేమిటి? బలహీన వర్గాల సాధికారత కీలకమని తలచి ఇలాంటి ప్రయోగాలకు తెర లేపుతున్నారు. అభినందనీయమే! కాని వర్తమానంలో సాధికారత ‘రాజ్యాధికారం’తో రాదన్న సంగతి అంబేద్కర్ పరోక్షంగా చెప్పారు, మరెందరో మేధావులు పేర్కొన్నారు. అది నిజమని మన చుట్టూ వున్న వాతావరణమే చెబుతోంది. దాన్ని తిలకించకుండా, పట్టించుకోకుండా, పరిశీలించకుండా, అధ్యయనం చేయకుండా ‘లేడికి లేచిందే పరుగు’ అన్నట్టు ఇప్పుడున్న అసంఖ్యాక రాజకీయ పార్టీల సరసన మరో రాజకీయ పార్టీని నిలపడంవల్ల బడుగులకు సాధికారత సాధ్యమా?
విచిత్రమేమిటంటే- సమాజంలో కులం పునాదులు పెకిలించి వేయాలని, కుల నిర్మూలన జరగాలని అటు మార్క్సిస్టు భావధారగల వారు, ఇటు అంబేద్కరిస్టులు (అంబేద్కర్ రాసిన ‘అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్’గ్రంథాన్ని తలపై పెట్టుకుని) ఉపన్యాసాలు చేస్తూ, పుస్తకాలు ప్రచురిస్తూ, మీడియాలో గంభీరంగా బోధ చేస్తూ తిరిగి అంతిమంగా కుల ‘కూపం’లోనే తేలడం. ఇంతవరకు మార్క్సిస్టులు కులసంఘాలకు దూరంగా ఉండి, కేవలం ‘వర్గం’ గూర్చి పోరాడారు కాబట్టి వారు విఫలమయ్యారని తమని తాము సంతృప్తిపరచుకునే ఓ ‘విశే్లషణ’ చేసుకుని, ఓ కొత్త సిద్ధాంతానికి ఊపిరిలూదుతున్నామని భావిస్తూ రెండింటి సంయోగం (్ఫ్యజన్)తో సరికొత్త విప్లవం దేశంలో అత్యంత వేగంగా తీసుకొస్తామని ఆశిస్తూ చాలామంది అడుగులు వేస్తున్నారు. ఆ ప్రయోగం, ఆ సమీకరణ సిద్ధాంతం వెలవెలబోయిందని, ఉత్తర భారత్‌లో ఆ సామాజిక ఇంజినీరింగ్ విఫలమైందని, కొంత అంతర్జాతీయ దృక్పథాన్ని తగ్గించుకుని కరడుగట్టిన మార్క్సిస్టు నాయకులు లాల్‌లో నీల్ కలిపి ఉద్యమించినా ఫలితం లేదని వెల్లడయ్యాక కూడా ఇలా మార్క్సిస్టు- అంబేద్కరిస్టు భావజాల సంయోగ ప్రయోగంతో ఏకంగా పార్టీనే ప్రకటించడం బడుగులను అయోమయానికి గురి చేయడమే అవుతుంది. ఆ చేదు అనుభవం ‘తాజా’గా ఉన్నప్పటికీ ఆ నిష్ఫల ప్రయోగాన్ని మరోసారి చేయబూనుకోవడం విచిత్రం, విడ్డూరం.
దేశంలో వృత్తులన్నా.. కులమన్నా ఒకటిగానే ధ్వనిస్తాయి. ఆ కులాలలోని న్యూనతాభావం అంతరించిపోయేందుకు ఇప్పుడు సమాజం ‘రీడిజైన్’ అవుతోంది. ఆ రీడిజైన్ స్పష్టంగా కనిపిస్తోంది. పారిశ్రామిక విప్లవాలు తీసుకొచ్చిన ఫలితాలు ఆ రీడిజైన్‌కు దోహదపడుతున్నాయి. దేశంలో వృత్తులు గతంలో ఉన్నట్టు లేవు. అంటే కులాలు అలాగే లేవని అర్థం. ఆ సాంద్రతతో కొనసాగడం లేదు. సరికొత్త సమీకరణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రక్రియ ఎప్పుడో మొదలైంది. దాన్ని పసిగట్టకుండా ఇంకా కుల సమాజం, పురాతన వృత్తులు అంటూ ఊరేగడంలో అర్థం ఉందా? మానసిక వికసనతో వర్తమాన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, ఆకాశమే హద్దుగా బడుగు వర్గాల యువత సాగిపోతుంటే.. ఆ వేగాన్ని పెంచాల్సిన వారు, వారి ప్రయత్నాలకు ఆలంబనగా నిలవాల్సిన వారు, మరింత సాంద్రతతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఔపోసన పట్టేందుకు ఉపకరించాల్సినవారు- ఇంకా కులం, కుల సంఘాలు, కుల సమీకరణలు, భేరీలు అంటూ మీడియాకు ఎక్కితే గందరగోళం తప్ప ఒరిగేది ఏమీ ఉండదు. తమ ఉనికిని చాటుకునేందుకు అవి ఉపకరించవచ్చు గాని విశాల ప్రజానీకానికి ఏమాత్రం దోహదపడవు. ఈ విషయాన్ని ఆయా ‘కులాల’కు చెందిన యువతనే చాటుతోంది.
ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీ సంస్థలు కులాన్ని అడగడం లేదు.. జ్ఞానాన్ని అడుగుతున్నాయి.. చూస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి జ్ఞానం- సృజన, శక్తి-యుక్తి ఏ విధంగా ఉపయోగపడతాయో పరిశీలిస్తున్నాయి. కులమంటే ఏమిటో తెలియని బహుళ జాతి సంస్థలు అనేకం మన దేశంలో సర్వత్రా పనిచేస్తున్నాయి. మరిన్ని రానున్నాయి. ఆ పని సంస్కృతిని, నియామక సంస్కృతిని మిగతా సంస్థలు సైతం పాటిస్తున్నాయి. సంపదను సృష్టిస్తున్నాయి. ఈ మొత్తం ప్రక్రియలో జ్ఞానం, సంపద సృష్టికి అవసరమైన తెలివితేటలు, అవగాహన- అభివ్యక్తి కనిపిస్తోంది తప్ప ‘కులం’ ఎక్కడుంది?
లేని కులాన్ని, కనుమరుగవుతున్న కులాన్ని కొందరు ఇలా సంఘాల పేర, రాజకీయ పార్టీల పేర తెరపైకి తేవడం వారి వెనుకబాటు తనానికి నిదర్శనం తప్ప మరొకటి కాదు. ఓవైపు కులం లేని జ్ఞానం వ్యాప్తి చెందుతుండగా మరోవైపు రాజ్యాధికారం, పెత్తనం, పది మందిలో పలుకుబడి పేర ఇలా కుల సంఘాలను, కులాల పేర రాజకీయ పార్టీలను తెరపైకి బలవంతంగా తీసుకొస్తే కొత్త తరాల్లో ‘స్పష్టత’ ఎలా ఏర్పడుతుంది?
4జీ స్మార్ట్ఫోన్ వాడుతూ (త్వరలో 5జీని వాడబోతున్నారు) గరిష్టంగా అందులోని యాప్స్ ఉపయోగిస్తూ నాల్గవ పారిశ్రామిక విప్లవ సారాంశాన్ని అనుభవిస్తూ, ఆ ‘్ఫ్లట్‌ఫాం’పై నిలబడి పనులు కొనసాగిస్తూ, కుల వాసనలు ఏమాత్రం లేని ఆ జ్ఞానాన్ని అదే పనిగా ఆస్వాదిస్తూ వేదికలపై, మైకుల ముందు మాత్రం కుల సంఘాల ప్రాశస్త్యం గూర్చి, కుల సంఘాల ఐక్యత గూర్చి, వాటికి రాజ్యాధికారం దక్కాలని, అందుకోసం ఉద్యమించాలని ఆవేశపడుతూ ప్రసంగిస్తే ఎలా? కుల ప్రాసంగికతను తగ్గించాల్సిన సమయంలో ఇలా పెంచేలా.. తమకు తెలియకుండానే వాటి ఉనికిని కాపాడుతూ పోతే ఎన్ని శతాబ్దాలకు కుల నిర్మూలన జరిగేను? అంబేద్కర్ ఆశించిన ‘అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్’ ఎప్పుడు అయ్యేను? కుల సంఘాలను, కుల రాజకీయ పార్టీలను పటిష్టం చేస్తే అన్హిలేషన్ కాస్ట్ కుదురుతుందా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న!
ఎవరు అవునన్నా, కాదన్నా మార్క్సిస్టు భావజాలం భూస్థాపితమైంది. ఆ చైతన్యాన్ని మానవుడు దాటేసి ఎంతో ముందుకు పయనించాడు. కొత్త కొత్త ఆవిష్కరణలతో, సంస్కరణలతో మానవ ఆవరణమంతా విప్లవీకరించబడింది. సాధారణ ప్రజలే సర్వోన్నతులుగా నిలుస్తున్నారు. వారి వెన్నంటి ఉన్నది జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, అవగాహన, వర్తమాన ఆలోచన. దీన్ని పూర్తిగా పూర్వాపరం చేస్తూ కులం... మార్క్సిజం అంటూ శివాలు ఊగితే ఎలా? ఇంకెప్పుడు ‘మన’ జ్ఞాన చక్షువులు విప్పారుతాయి మిత్రమా!

-వుప్పల నరసింహం 99857 81799