సబ్ ఫీచర్

‘అమెజాన్’ ముందు ‘ఆయుధం’ వెలవెల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం ఎటువైపు పరుగులు పెడుతున్నదో పరిశీలించాల్సిన అవసరముంది. ముఖ్యంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలపై ఆసక్తిగలవారు ఈ విషయమై కించిత్ ఎక్కువ పరిశీలన చేయాల్సి ఉంటుంది. సమాజాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తామని, మార్పులు తీసుకొస్తామని, విప్లవం తెస్తామని కలవరించేవారు ఈ కీలక అంశాన్ని విస్మరించి తమ తమ ఊహాలోకాల్లో విహరిస్తూ, తమదైన ప్రత్యేక లోకానికే పరమితమై అదే ప్రపంచం.. అదే సర్వస్వం.. అని అనుకుంటున్నారు. వాస్తవంగా జరుగుతున్న పరిణామాలకు, వారు చెప్పే మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. అంటే ప్రపంచ పరిణామాలపై వారికి అవగాహన లేదనుకోవాలి.. లేదా దృష్టికోణం లోపమైనా అయి ఉండాలి.
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రపంచంలోనే అతి పెద్దదైన 15 అంతస్తుల, 30 లక్షల చదరపు అడుగుల ప్రాంగణాన్ని ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభించింది. రూ.400 కోట్లకు పైగా వెచ్చించి అత్యాధునిక పద్ధతిలో ఈ ప్రాంగణాన్ని నిర్మించారు. దాదాపు పదివేల మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నారు. ప్రపంచం ఏ దిశన పయనిస్తున్నదో చెప్పడానికిదో చిన్న ఉదాహరణ మాత్రమే!
మన వంటింట్లోకి అవసరమైన నిత్యావసర సరకులను, ఇతర వస్తువులను ‘ఆన్‌లైన్’లో ఆర్డర్ చేస్తే సరఫరా అయ్యే వ్యవస్థ ఉబికి వచ్చిన వేళ... మొత్తం అమ్మకం, కొనుగోళ్ల వ్యవహారాలన్నీ ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్న సందర్భంలో, ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం వ్యవస్థీకృతమయ్యాక ప్రపంచంపై సామాజిక కార్యకర్తలకు, రాజకీయ పార్టీల నాయకుల ఈ దృష్టికోణం గతంలో మాదిరి గానే ఉండాలా? లేక రూపాంతరం చెంది పూర్తిగా మారాలా? సంపూర్ణంగా మారాలనే సమాధానమొస్తుంది. మరి ఆ ఆలోచనలతో, అవగాహనతో, అభిప్రాయాలతో, ఆకాంక్షలతో వారి మాటలు.. చేతలు కనిపిస్తున్నాయా? ముఖ్యంగా సమాజాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తామని దశాబ్దాలుగా చెబుతున్న వామపక్ష పార్టీల నాయకుల ఉపన్యాసాలు, ఉల్లేఖనలు ఇందుకనుగుణంగా కనిపిస్తున్నాయా? ఇక ఆ తానులోంచి వచ్చిన మావోయిస్టుల సంగతి చూస్తే వింతగాను.. విచిత్రంగానూ తోస్తుంది. ఆదిమకాలపు ఆలోచనలతో దండకారణ్యంలో వారు పొద్దుపుచ్చుతున్నారు. వారి అభిప్రాయాలకు, పాడే పాటలకు, చేసే ఉపన్యాసాలకు వర్తమాన సంస్కృతికి జీవన విధానానికి, జరుగుతున్న పరిణామాలకు పొంతన కుదురుతున్నదా?
తెలుగు నేలపై ఒక్క అమెజాన్ రాగానే మొత్తం ‘దృశ్యం’ మారుతుందా? అని వారి అభిమానులు ఓ అమాయక ప్రశ్న వేస్తారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీల కార్యాలయాలిప్పుడు హైదరాబాద్‌లో కొలువుదీరాయి. మైక్రోసాఫ్ట్, ఐ.బి.ఎం., ఒరాకిల్, గూగుల్, యాపిల్ లాంటి దిగ్గజ సంస్థలు చాలాకాలంగా ఇక్కడ పనిచేస్తున్నాయి. తాజాగా భారీఎత్తున అమెజాన్ ప్రాంగణం ప్రారంభం కావడంతో మరిన్ని సంస్థలు తమ కార్యక్రమాల్ని ప్రారంభించే అవకాశాలు పెరిగాయి, ఇప్పటికే కొలువై ఉన్నవి విస్తరణ పనులకు శ్రీకారం చుడుతున్నాయి.
ఈ సంస్థలు కమ్యూనిస్టులు- మావోయిస్టులు చెప్పే విప్లవాల కన్నా గొప్ప విప్లవాలను సమాజంలో తీసుకొచ్చాయి. వాస్తవానికి సమాజాన్ని ‘రీ డిజైన్’ చేశాయి. ఆ రీ డిజైన్‌లో అంతర్భాగమే అమెజాన్ ఈ-కామర్స్ సంస్థకు చెందిన హైదరాబాద్ ప్రాంగణం. ప్రపంచం ఎటు వైపు కదులుతున్నదో ఈ ప్రాంగణం పట్టి చూపుతోంది. మరి ఈ పరిణామాన్ని పట్టించుకోవాలా? వద్దా?
ఈ అమెజాన్ ప్రాంగణం నుంచే ఆ సంస్థ ప్రపంచవ్యాప్త కార్యకలాపాలను నిర్వహించబోతోంది. సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపరిచేందుకు పూనుకుంటోంది, విస్తరణకు వ్యూహాలు రూపొందించనున్నది. ఒక బహుళజాతి సంస్థ, ప్రపంచ దిగ్గజ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచవ్యాప్త కార్యకలాపాల్ని నిర్వహించగలదని గతంలో ఎవరైనా ఊహించారా? కమ్యూనిస్టులు... ముఖ్యంగా మావోయిస్టులు ఊహించగలిగారా? కాని అతి స్వల్పకాలంలో తెలుగునేల అంతర్జాతీయ పటంలో చోటు సంపాదించుకుంది. కేంద్ర బిందువు అయింది. ఈ పరిణామానికి గత నాలుగు దశాబ్దాల నక్సలైట్ల ప్రస్థానానికి ఏ దశలోనైనా, ఏ మలుపులోనైనా పొంతన కుదురుతోందా?
ప్రస్తుత 21వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవాలకు తప్ప సాయుధ విప్లవాలకు తావులేదు. ఆ విషయం ఎప్పుడో రుజువైంది. దీన్ని పసిగట్టిన చైనా నాయకుడు డెంగ్ జియావోపింగ్ సంస్కరణలు పెద్దఎత్తున తీసుకొచ్చాడు. అనంతరం ఆయనను ఆధునిక చైనా పితామహుడిగా కీర్తిస్తున్నారు. మావోతో భుజం-్భజం కలిపి ‘లాంగ్ మార్చ్’ చేసిన డెంగ్ జియావో పింగ్ దశాబ్దాల క్రితమే మేల్కొన్నప్పుడు భారతదేశ కమ్యూనిస్టులు- నక్సలైట్లు మరింత వేగంగా మేల్కొని తమ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు పూనుకోవాలి కదా? మరి అలా జరిగిందా?
20వ శతాబ్దం పరిస్థితుల్లో చెప్పిన సమీకరణలు- సూత్రాలను, పద్ధతులను భారతదేశానికి ఈ 21వ శతాబ్దంలోనూ ‘అన్వయించుకుంటాం’ అని మావోయిస్టులు బహిరంగంగా పేర్కొనడం ఎంతటి హాస్యాస్పదం? మావోతో కలసి నడిచిన నాయకుడే సరికొత్త దారిని చూపగా, ఆ దారిలో ఆ దేశ ప్రజలు సౌభాగ్యంతో తుల తూగుతుండగా, సౌకర్యాలతో జీవనం సాగిస్తుండగా భారతదేశంలో మాత్రం మావో పేర ఓ పార్టీని పెట్టి, శతాబ్దం క్రితం నాటి ఆలోచనలతో, అంతకు పూర్వపు సిద్ధాంతం పునాదిగా ‘కొత్త సమాజం’ నిర్మిస్తామని ‘సమసమాజం’ ఏర్పాటుచేస్తామని ప్రతిజ్ఞ చేసి దండకారణ్యంలో మకాం చేస్తే జనారణ్యం శోభిల్లుతోందా? ఈ వైఖరి ప్రపంచంతో కలిసి నడిచినట్టుగా ఉందా?
మరో విచిత్రమేమిటంటే.. ప్రపంచ ఆనుపానులు, చలనగతి, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, డిజిటల్ ఎకానమీ ప్రభావం, ప్రజల ఆలోచనల్లో, ఆకాంక్షల్లో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులపై అంచనా ఉన్న ‘అర్బన్ నక్సల్స్’ సైతం కళ్ళకు గంతలు కట్టుకుని ‘‘గుడ్డిగా’’ దండకారణ్యంలోని మావోల కనుసన్నల్లో మెదలడం.
భాగ్యనగరంలోని సరికొత్త పని సంస్కృతి, భావజాల విస్తృతి, టెక్నాలజీ ప్రాంగణాల విశ్వరూపం చూస్తూనే వాటి సేవలు అందుకుంటూనే తమ సంతానాన్ని, బంధువులను ఆ సంస్కృతి వైపు తరలిస్తూనే పైకి మాత్రం మావోయిజంపై దండకారణ్యంలోని ‘జనతన సర్కారు’పై ఉపన్యాసాలు చేయడం, వ్యాసాలు రాయడం, పుస్తకాలు ప్రచురించడం పూర్తిగా ద్వైదీభావం తప్ప మరొకటి ఎలా అవుతుంది? ఈ వైఖరి ప్రజల్ని- సాధారణ వ్యక్తుల్ని మభ్యపెట్టడం, తప్పుదారి పట్టించడం గాక ఏమవుతుంది? ఆ విధానం తిరోగమనం తప్ప పురోగమనం ఎలా అవుతుంది? ఈ తిరోగమనం కోసం ఆదివాసీలు, సాధారణ ప్రజలు ప్రాణత్యాగాలు చేయాలా? వారి కొత్త తరాలను బలివ్వాలా? అటు ఏవోబీలో, ఛత్తీస్‌గఢ్‌లో కాలం చెల్లిన ఆలోచనలతో ప్రజలపై ‘ప్రయోగం’ చేయడం సబబేనా?
భారత ప్రజలు గర్వపడే విధంగా చందమామ కక్ష్యలోకి చంద్రయాన్-2 ప్రవేశం జరిగింది. మరెన్నో విజయాలు అందుకోవడానికి ‘ఇస్రో’ అహరహం శ్రమిస్తోంది. ప్రపంచంతో కలిసి నడవడమంటే ఇది కదా?... భాగ్యనగరంలో ప్రపంచ స్థాయి సంస్థల్లో తెలుగు బిడ్డలు పనిచేయడమంటే ప్రపంచంతో కలిసి నడవడం కదా?... అనేక స్టార్టప్ సంస్థలతో సరికొత్త విప్లవానికి తెరలేపుతున్న తెలుగు యువత వేస్తున్న అడుగులు ప్రపంచంతో కలిసి వేస్తున్నవి కదా?... దీన్ని పూర్వాపరం చేస్తూ ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేస్తామంటూ దండకారణ్యంలో ఆదివాసీలతో కలిసి కవాతు చేస్తే అది ప్రపంచంతో కలిసి నడిచినట్టవుతుందా?... లేక సాంకేతిక విప్లవాలను స్వాగతించేందుకు యువత కదులుతున్న తీరు నిజమైన ‘కవాతు’ అవుతుందా?.. ఎవరికి వారే ప్రశ్నించుకుని సమాధానం చెప్పుకోవలసిన సందర్భాన్ని అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థల విస్తరణ, పురోగతి గుర్తుచేస్తోంది.

-వుప్పల నరసింహం 99857 81799