సబ్ ఫీచర్

సంస్కృతం జాతీయ భాషగా వెలగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటయ్యాక భారతీయులు జాతీయ భావనను కోల్పోయారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు తమ భాషకు ఇచ్చే ప్రాధాన్యతను జాతీయతకు ఇవ్వలేకపోతున్నారు. మన దేశంలో అత్యధికంగా మాట్లాడే హిందీ భాష ‘జాతీయ భాష’గా ప్రజలు భ్రమపడేందుకు మాత్రమే ఉపయోగపడుతోంది. హిందీ మన జాతీయ భాషగా గుర్తింపునకు నోచుకోలేదు.
‘శిక్షా సంస్కృతి ఉత్థాన్ న్యాస్’ద్వారా మాతృభాషల ప్రాధాన్యతను పెంచే ప్రయత్నం జరుగుచున్నది. ఆయా రాష్ట్రాలలో వారి వారి మాతృభాషలో న్యాయస్థానాలలో వాదోపవాదనలు, న్యాయమూర్తుల తీర్పులను వెలువర్చాలనే ప్రతిపాదనలు చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలలోని న్యాయస్థానాలలో హిందీ భాషలో తీర్పులు వెలువడుచున్నవి. ప్రభుత్వ కార్యాలయాలలో ఉత్తర ప్రత్యుత్తరాలు హిందీ భాషలో జరగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి ప్రయత్నం దేశ ప్రజలకు ఆమోదయోగ్యమైనది కాదు. దీని ద్వారా జాతీయ భాష ప్రాధాన్యత లేదు. దేశ సమగ్రత కూడా కాపాడబడదు.
అనేక రాష్ట్రాలలో మాతృభాష మాధ్యమంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నీ ఆంగ్ల మాధ్యమంలోనికి మార్చబడుతున్నందున ఆయా రాష్ట్రాల మాతృభాషలన్నీ మరుగునపడుచున్నవి. కొంత కాలానికి మాతృభాషలకు కాలం చెల్లుతుందేమోనని ఆయా రాష్ట్రాల ప్రజల ఆవేదన. ప్రభుత్వాలే ఆంగ్ల మాధ్యమంలో పాఠశాలలను నడుపుతున్న కారణంగా తప్పనిసరైనందున ప్రైవేటు పాఠశాలలన్నీ ఆంగ్ల మాధ్యమంగా మార్చబడుచున్నవి. విదేశీయుల పరిపాలన వల్ల ప్రాధాన్యత కోల్పోతున్న భారతీయ భాషలను పునర్ నిర్మాణానికి మాతృభాషలో విద్యనందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ‘విద్యాభారతి’, దానికి అనుబంధంగా ఉన్న ‘శ్రీ సరస్వతీ విద్యాపీఠం’ద్వారా నడుస్తున్న శ్రీ సరస్వతీ శిశుమందిరాలలో కూడా విధిలేక మాతృభాషా మాధ్యమానికి తిలోదకాలు ఇచ్చి ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన జరుగుతోంది.
ప్రభుత్వం గుర్తించిన ఇరవై రెండు భారతీయ భాషలలో ఏ ఒక్క భాషను కూడా భారత జాతీయ భాషగా ఏ రాష్ట్రంలోని ప్రభుత్వాలు గాని, ప్రజలు గాని అంగీకరించరు. దేశంలో అధిక జనాభా మాట్లాడే ‘హిందీ’ని జాతీయ భాషగా ప్రకటిస్తే దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవు. ప్రత్యేకించి ‘తమిళనాడు’వారు పూర్తిగా వ్యతిరేకిస్తారు. 28 రాష్ట్రాలలోను, 9 కేంద్ర పాలిత ప్రాంతాలలోను ఏ ఒక్కటికూడా ‘సంస్కృతం’ భాషా ప్రాతిపదికన ఏర్పాటుచేయబడినవి కావు. ‘సంస్కృతం భాష’ మూలాలతోనే భారతీయ భాషలన్నీ ఏర్పాటుచేయబడినవి. భారతీయ సాహిత్యమైన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం, అర్థశాస్త్రం మొదలైన గ్రంథాలన్నీ సంస్కృత భాషలోనే వ్రాయబడినవి. మానవాళికి కావలసిన జ్ఞాన విజ్ఞానమంతా సంస్కృతం భాషాగ్రంథాలలోనే నిక్షిప్తమై ఉన్నవి. సంస్కృతం భాషను నేర్చుకున్నట్లయితే భారతీయులు ప్రపంచానికే జ్ఞానబోధ చేయగలరు.
భారతీయ రాజ్యాంగ నిర్ణయ సభ అధికార భాష గూర్చి చర్చిస్తున్న సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ సంస్కృతం భాషను జాతీయ అధికార భాషగా నిర్ణయించాలని ప్రతిపాదన చేశారు. అంబేడ్కర్ ప్రతిపాదనపై ఆనాటి విదేశాంగ శాఖ డిప్యూటి మంత్రి డాక్టర్ కేస్కర్, నిజాముద్దీన్ అహ్మద్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎల్.కె.మైత్రి, మద్రాసుకు చెందిన టి.టి.కృష్ణకుమారి, వి.కె.మునుస్వామిపిళ్ళై, కల్లూరి సుబ్బారావు, వి.సి.కేశవరావు, డి.గోవిందదాసు, పి.సుబ్బరాయన్, డాక్టర్ వి.సుబ్రహ్మణ్యం, దుర్గాబాయ్, దాక్షాయణి, వేలాయుధన్, పుదుక్కోటి, త్రిపుర, మణిపూర్ కూర్గులకు చెందిన మరికొందరు ప్రముఖులు అంగీకారం తెలుపుతూ సంతకాలు చేశారు.
310/ఏ నంబర్‌గల అధికరణలో భారత ప్రభుత్వం అధికార భాషగా సంస్కృతం ఉండాలని, పదిహేనేళ్ల పాటు మాత్రం అన్ని అధికార కార్యకలాపాలకు ఆంగ్లభాషను వినియోగిస్తూ అదనంగా సంస్కృతం భాషను అన్ని సందర్భాలలో తప్పనిసరిగా వినియోగించాలని ప్రతిపాదించారు.
సంస్కృతం భాషను అధికార భాషగా ప్రకటించే విషయంలో డాక్టర్ అంబేడ్కర్ స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారు. ‘మన దేశంలో అనేక భాషలు మాట్లాడే ప్రజలు వున్నారు. అన్ని భాషలలోను సంస్కృతం భాషా మూలాలు వున్నాయి. కాబట్టి సంస్కృతం భాషను జాతీయ-అధికార భాషగా ప్రకటించి అభివృద్ధిపరచినట్లైతే అనేక భాషల ప్రజలను భారత జాతీయులుగా కలిపి వుంచగలం. అప్పుడే ప్రపంచంలో భారత వాణిని సమర్థవంతంగా వినిపించగల శక్తి వస్తుందన్నదే నా ప్రగాఢ విశ్వాసం.’’ అని ఆయన అన్నారు. 310/ఏ నంబర్ గల అధికారణలో ప్రతిపాదించిన విధంగా 1965నాటికే సంస్కృతం భాషను జాతీయ భాషగా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈనాటికి కూడా అమలుజరుపకపోవడం పాలకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంగా భావించవలసి వస్తుందని విజ్ఞుల అభిప్రాయం.
సంస్కృతం భాషను జాతీయ భాషగా ప్రకటించక పూర్వమే సంస్కృతం భాషను అభివృద్ధిపరచాలి. ఆ భాషలో విద్యాబోధన చేయుటకు కావలసిన ఉపాధ్యాయులను తయారుచేయుటకు కావలసిన పాఠ్యక్రమం- సెలబస్, శిక్షణా కళాశాలలను ఏర్పాటుచేయాలి. వీటితోపాటు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు సంస్కృతం భాష బోధనకు కావలసిన పాఠ్యక్రమాన్ని- సెలబస్ తయారుచేయబడాలి.
1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆయా రాష్ట్రాలలోని మాతృభాష మాధ్యమంగా పాఠశాలలు నిర్వహించబడాలి. 3వ తరగతిలో సంస్కృతం భాషను, నాలుగవ తరగతిలో ఆంగ్లభాషను ప్రవేశపెట్టాలి. ఇంటర్ మీడియట్ మరియు ఆపై విద్యలన్నీ సంస్కృతం భాషామాధ్యమంలో నిర్వహించబడాలి.
ఇంటర్ మీడియట్, డిగ్రీలో చదువవలసిన రెండు లాంగ్వేజెస్‌లో సంస్కృతం, ఆంగ్లం భాషలను మాత్రమే పాఠ్యాంశాలుగా బోధించవలెను
భాషాపండితులుగా కావాలనుకునేవారు ఇంటర్ మీడియట్‌లోను, డిగ్రీలోను ఆయా రాష్ట్రాల మాతృభాష, సంస్కృతం భాష, ఆంగ్ల భాషలలో ఏదేని ఒక భాషను ప్రత్యేక సబ్జెక్ట్‌గా చదివినవారికి ‘‘బిఎడ్’’లో ఉపాధ్యాయ శిక్షణాకోర్సులో ఆయా భాషలలో శిక్షణ ఇవ్వవలెను. అట్టివారినే భాషా పండితులుగా గుర్తించవలెను.
సంస్కృతం భాష భారతదేశ అధికార-జాతీయ భాషగా అమలుజరుపబడితేనే భారతదేశ ప్రజలందరికీ మేమంతా ఒకే జాతీయులమనే ధ్యాస కలుగుతుంది. దేశ సమగ్రత కాపాడబడుతుంది.
సంస్కృతం భాష భారతదేశ అధికార భాష- జాతీయ భాషగా అమలుజరుపబడితేనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ భారత జాతి సమగ్రతకు చేసిన కృషికి మార్గదర్శనానికి భారత ప్రజలు ఇచ్చే నిజమైన నివాళులు. సమాజ హితంకొరకు మహానుభావులు అందించిన మార్గదర్శనాలు అమలుపర్చబడితేనే సమాజం కాపాడబడుతుందని తప్ప వారి స్మారకాలను నిర్మాణంచేస్తే సమాజ హితం చేకూరదు.

-బలుసా జగతయ్య 90004 43379