సబ్ ఫీచర్

బ్యాంకులు సామాన్యులకు సహాయపడుతున్నాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నత వర్గాలు, పారిశ్రామికవేత్తలకే పరిమితమైన బ్యాంకింగ్ సేవలను దేశంలోని రైతులు, వ్యవసాయదారులు, గ్రామీణ ప్రజానీకానికి, సాధారణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సదాశయంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1969 జూలై 19న బ్యాంకుల జాతీయం చేశారు. పేద మధ్యతరగతి వర్గాలను వడ్డీ వ్యాపారస్తుల నుండి విముక్తి కల్పించాలన్నది కూడా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. బ్యాంకులు సామాన్యులకు సహాయపడుతున్నాయా? అంటే బడా బాబులకు ఉపయోగపడినంతగా పేదలకు, రైతులకు ఉపయోగపడటం లేదనే చెప్పాలి. బ్యాంకులు జాతీయంచేసి 50 ఏళ్లు గడిచినా ఏ ఉద్దేశాలతో బ్యాంకులను జాతీయం చేశారో ఆ ఉద్దేశాలు కొంతవరకు మాత్రమే నెరవేరాయి. ఉన్నత వర్గాలు, పారిశ్రామిక వేత్తలకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. వాళ్లే బ్యాంకుల సొమ్మును బొక్కేస్తున్నారు. అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను మోసంచేసి వేల కోట్లు దిగమింగుతున్నారు. ఆ డబ్బుని రాబట్టే సరైన వ్యవస్థ మన దేశంలో లేకపోవడం బాధాకరం. ప్రభుత్వాలు కూడా తగిన రీతిలో పకడ్బందీగా చట్టాలను రూపొందించలేక పోతున్నాయి. దాంతో బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకులను మోసం చేయడం ఏడాదికేడాది పెరిగిపోతోంది. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులను మోసం చేసిన కేసుల సంఖ్య 15 శాతం పెరిగింది. మోసం చేసిన నగదు విలువ 73.8 శాతం పెరిగింది. వినియోగదారులు చేసిన మోసాలను బ్యాంకులు గుర్తించగలిగిన సరాసరి సమయం 22 నెలలుగా ఉంది. 2018-19లో బ్యాంకుల వినియోగదారులైన కొంతమంది పారిశ్రామికవేత్తలు రూ.71,542.93 కోట్ల మేర బ్యాంకులను మోసంచేశారు. ఈ మోసాలకు సంబంధించి 6,801 కేసులు నమోదయ్యాయి. 2017-18లో రూ.41,167.04 కోట్లకు సంబంధించి 5,916 కేసులు నమోదయ్యాయి. రుణ మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులకే అధిక వాటా ఉంది. బ్యాంకుల్లోనే అధిక మోసాలు వెలుగుచూశాయి.
2018-19లో వినియోగదారుల మోసాల వల్ల రూ.64,509.43 కోట్ల మేర ప్రభుత్వరంగ బ్యాంకులు నష్టపోయాయి. ఈ మొత్తానికి సంబంధించి 3,766 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానంలో ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు ఉన్నాయి. అంటే ఈ మోసగాళ్లు విదేశీ బ్యాంకులను కూడా వదిలిపెట్టలేదు. మోసాలన్నింటిలో రుణ ఎగవేతలే ఎక్కువగా ఉన్నాయి. కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నగదు జమలకు సంబంధించిన మోసాలు 0.3 శాతం మాత్రమే ఉన్నాయి. అయితే ఫోర్జరీ, మోసాలకు సంబంధించి 72 భారీ కేసులు నమోదయ్యాయి. రూ.లక్ష కన్నా తక్కువ రుణం తీసుకొని ఎగ్గొట్టిన వారి కేసులు 0.1 శాతం మాత్రమే ఉన్నాయి. అంటే భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నవారే బ్యాంకులను మోసం చేశారని స్పష్టమవుతోంది. ఇక్కడ ఒక విషయం మనం ముఖ్యంగా గమనించాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులైనా, ప్రైవేటు రంగ బ్యాంకులైనా రైతులకు, మధ్యతరగతివారికి, చిరు వ్యాపారులకు 50వేల రూపాయల రుణం కావాలంటే పాతిక రకాల నిబంధనలు విధిస్తారు. బంగారం, స్థిరాస్తులు, హామీలు... వంటివి కావాలి. చిరు వ్యాపారులు రూ.50 వేల రుణం తీసుకొని తమ కుటుంబాన్ని పోషించుకుంటారు. అలా కోటి రూపాయలతో 20 కుటుంబాలు బతుకుతాయి. వారి రుణ బకాయి చెల్లించకపోతే ముక్కుపిండి వసూలు చేస్తారు. ఇంకా ఏదైనా తేడా వస్తే ఆస్తులు వేలం వేస్తారు. ఈ బడా పారిశ్రామికవేత్తలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా ఎగ్గొట్టగలుగుతున్నారు? ఏడాదికేడాది బ్యాంకులకు ఈ రకమైన నష్టాలు పెరిగిపోతున్నా ప్రభుత్వాలు గానీ, బ్యాంకులు గానీ ఎందుకు పకడ్బందీగా వ్యవహరించడం లేదు? ఆ పారిశ్రామికవేత్తల కనుసన్నలలోనే ఈ బ్యాంకులు, ప్రభుత్వాలు నడుస్తున్నాయేమో అని అనిపిస్తోంది.
ప్రభుత్వాలు ప్రకటించే రుణ ప్రణాళికలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు 50 శాతం రుణాలు కూడా బ్యాంకులు వారికి ఇవ్వవు. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే సందర్భాలలో కూడా వారిని నానా వేధింపులకు గురిచేస్తారు. బడా వ్యాపారులకు ఇచ్చే దాంట్లో నాలుగవ వంతు రుణాలు చిరువ్యాపారులకు ఇస్తే కోట్ల మందికి ఉపాధి లభిస్తుంది. బకాయిలు తిరిగి చెల్లించే శాతం కూడా పెరుగుతుంది. తక్కువ మొత్తంతో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. చిరు వ్యాపారులు, రైతులు పరువు గురించి ఆలోచిస్తారు. అవకాశం ఉన్న మేరకు శాయశక్తులా బకాయిలు చెల్లిస్తారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోపీ పెట్టే వ్యాపారులకు అటువంటివి ఏమీ ఉండవు. అంతే కాకుండా వారివద్ద నుంచి బకాయిలు వసూలు చేసుకోవడానికి శక్తివంతమైన సాధనాలు ఏమీలేవు. రుణాలు ఇవ్వడానికి నియమ నిబంధనలు బలహీనంగా ఉన్నందువల్లే వారు అలా చేయగలుగుతున్నారు. అందువల్ల వారికి రుణాలు ఇవ్వడానికి హామీలు, నిబంధనలు కఠినతరం చేయవలసి ఉంది. అలాగే బకాయిలు వసూలు చేసుకోవడానికి కూడా కఠిన చట్టాలు చేయాలి. ఈ పరిస్థితులలో దేశంలో ఆర్థిక రంగం బలోపేతం కావడానికి, ఆర్థికాభివృద్ధికి బ్యాంకింగ్, బ్యాంకింగేతర రంగాలను పటిష్టపర్చవలసిన అవసరం ఉంది. అలాగే బ్యాంకులు సామాన్యులు, రైతులు, చిరువ్యాపారుల అవసరాలు తీర్చగలిగే విధంగా వారికి రుణాలు ఇచ్చే విషయంలో నిబంధనలు సరళతరం చేయాలి.

- శిరందాసు నాగార్జున 9440222914