సబ్ ఫీచర్

ఈ శిలలకు శిల్పి ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవాలయాలను నిర్మించేటప్పుడు ఆ కాలపు చరిత్ర ప్రతిబింబించాలని ఆగమశాస్త్రం చెప్పినట్టు ఎలాంటి దాఖలాలు లేవు. దేవాలయం అనేది భక్తికి, ఆధ్యాత్మికతకు ఆలవాలం. అందుకే అక్కడి పరిసరాలు తదనుగుణంగా వుండాలని భావించడం పరిపాటి. పవిత్రమైన దేవాలయం గాలిగోపురాలపై వివిధ భంగిమలలో శృంగార శిల్పాలు వుండటం గురించి సంఘసంస్కర్త, హేతువాది తాపీ ధర్మారావు‘దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు?’ పేరిట ఓ గ్రంథానే్న రచించారు.
ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలూ సాధించడం మానవజన్మ సార్థకతలోని అంశాలే! ఒకప్పుడు ఇంత వేగవంతమైన జీవితం లేదు. దేవాలయ సందర్శనం దినచర్యలో అందరికీ భాగంగా వున్న రోజులుండేవి. ‘కామిగాక మోక్షగామి కాడు’ అన్నాడు వేమన. శృంగారం పాపకార్యం కాదనీ, సృష్టికి మూలమైన అది కూడా ధర్మబద్ధంగా వుండాలనీ, లైంగిక బంధాలు సంతానోత్పత్తికై పవిత్రంగా వుండాలనీ తెలియచెప్పడానికి ఆనాడు దేవాలయాలపై ఆ చిత్రాలు ప్రబోధ దాయకాలుగా వుండేవనీ, మన దృష్టి వక్రీకరించి నేడు వాటిని అవగాహన చేసుకోవడంలో వైపరీత్యానికి లోనవడం వాటి తప్పుకాదనీ అనే మాట చెబుతున్న పెద్దలూ వున్నారు. భార్యా సమేతంగానే దేవుడిని పూజించడమూ వుంది మన హైందవ ధర్మంలో. వశిష్టాది మహర్షులు కూడా దాంపత్యధర్మం నిర్వర్తించినవారే. పరస్ర్తి వ్యామోహం పాపకార్యంగా చెప్పబడింది కానీ భార్యతో కూడిన శృంగారం, సృష్టికార్యం కాదు. దేవాలయాల నిర్మాణం కూడా శిల్పసౌందర్య సంభరితంగానే సాగింది. దశావతారాలనో, రామాయణ, భారత, భాగవత ఘట్టాలనో రాతి స్తంభాలపై చెక్కడం, పురాణ పురుషులను, ఆళ్వారులను శిల్పాలుగా మలచడమూ శిల్పులు చేసినపనే!
ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో
- అని కవి సినారె అన్నట్లు దేవాలయ శిలాప్రతిమల్లో శిల్పుల హృదయాలు, అభిరుచులు ప్రతిఫలించడం సహజమే! కళాకారుడు స్వేచ్ఛాజీవి అయినప్పుడే కళ స్వచ్ఛ సౌందర్యం సంభరితం అవుతుంది. ‘ఆడమంటె ఆడేది ఆటకాదు-పాడమంటె పాడేది పాట కాదు’ అన్నట్లు ఒత్తిడులతో, ఆజ్ఞలతో కళలు విరాజిల్లవు. అయితే సహజంగానే రాజుల, ప్రభువుల ప్రాపకాల కోసం వెంపర్లాడే కళాకారులుంటారు. సహజ పాండితీ మండితులై ‘రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు’ అని నిరసించి నరాంకితంగా కాక హృదయ దఘ్నంగా వర్తించే కళాకారులూ వుంటారు.
రాయలు కట్టించిన వసంత మంటపంలో చెక్కిన స్ర్తి ప్రతిమల్లో శిల్పి నాగరాజు ప్రేయసి మల్లీశ్వరి రూపు సాక్షాత్కరిస్తే- రాయలు నాగరాజును ‘మల్లీశ్వరి’చిత్రంలో దండించినట్లేమీ చూపలేదు సరికదా! అంతఃపుర ఆంక్షలను ధిక్కరించినా తను శిల్పకళా నైపుణ్యంతో నయనానందం కలిగించినందుకు క్షమించాడు. ‘రాయల కరుణ కృత్యం’అనే రేడియో నాటికలో ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు ఆ విషయానే్న శ్రవ్యమయం చేశారు. నిజమైన కవి అయినా, శిల్పి అయినా ఏ కళాకారుడైనా ప్రభువుల ప్రాపకానికి లోబడిపోతే అది ఎంత గొప్పకళ అయినా పదుగురి దృష్టిలో తేలిపోతుంది. సరే! ఒకప్పుడు రాచరిక వ్యవస్థలో ప్రభుశాసనాలకు అనుగుణంగా జీవికకోసం తలవొగ్గి నడుచుకున్న వారుండవచ్చు. నేడు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో వున్నాం. నేడు పాలకులు నిర్మించే ఏ భవనాలయినా, దేవాలయాలు అయినా ప్రజాధనం ఖర్చుపెట్టి చేస్తున్నవే! వారి సొంత సొమ్ములేమీ కాదు. యాదగిరిగుట్టలోని ‘శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని’ యాదాద్రిగా పవిత్రంగా పునర్నిర్మించాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించినప్పుడు ఆస్తికులంతా సంతోషించారు. ప్రజలలో సత్ప్రవర్తన, పాపభీతి కలిగే అవకాశాలు అటువంటి- పవిత్ర నిర్మాణాలతో స్ఫూర్తిమంతాలు కాగలుగుతాయని భావించడం సహజం. కానీ యాదాద్రిలో చెక్కిన శిల్పాలు కొన్ని ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. ఒక దేవాలయ ప్రాంగణంలో శ్రీ త్రిదండి చినజియ్యర్ స్వామి శిల్పాన్ని చెక్కినా ఇబ్బంది లేకపోయేదేమోగానీ సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మను, తెరాస పార్టీ గుర్తుఅయిన కారును, సీఎం సంక్షేమ పథకాల్లోని కేసీఆర్ కిట్‌ను దేవాలయ రాతి స్తంభాలపై చెక్కడం వివాదాస్పదంగా మారింది. కేసీఆర్‌కు తెలియకుండానే కేవలం శిల్పులే స్వేచ్ఛగా ఇలా చెక్కారని అధికారులు అంటున్నా, నిరసనలు వ్యక్తం కావడంతో ఇప్పుడు వాటిని తొలగించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాచరికపు ధోరణులు శోచనీయం మరి! ప్రతిపక్షపు ఎదురులేని ఆధిక్యత ఆర్జించినప్పుడు పాలకపక్షం మరింత జాగరూకతతో వ్యవహరించాల్సి వుంటుంది. సచివాలయానికి, శాసనసభకు వెళ్ళకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితులుండటం, ఆర్థికంగా పటిష్టంగా వున్న కొత్త రాష్ట్రాన్ని ‘పైసల్లేవ్, కోతలు తప్పవ్’ అంటూ అప్పులపాలు చేయడం, రజాకార్లతో కల్లోలం సృష్టించిన నిజాంను కీర్తిస్తూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడానికి వైముఖ్యం ప్రదర్శించడం, హిందూత్వం అంటే అదేదో భాజపాది అన్నట్లుగా హిందూగాళ్ళు, బొందూగాళ్ళు అంటూ ఎద్దేవా చేయడం వంటివన్నీ అప్రజాస్వామిక ధోరణులుగా ప్రజలకు అనిపిస్తే అది జనం తప్పుకాదు.
ఆర్థిక మాంద్యం కారణంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు కేంద్రం విధానాలే కారణమని దుయ్యబట్టడం సరేగానీ.. అసలు లభిస్తున్న ఆదాయ వనరులు ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయో అసెంబ్లీ, సచివాలయ కొత్త భవనాల నిర్మాణాలంటూ పాత వాటిని కూలగొడుతూ అనవసర వ్యయాలు పెంచడం, ప్రభుత్వ ప్రచారాలకు, కొత్తకొత్త నిర్మాణాలకు అధిక వ్యయం చేయడం ప్రజల్లో ‘బంగారు తెలంగాణ’ గురించిన ఆశలను, ఉపాధి ఉద్యోగాలతో తమ బతుకులు బాగుపడతాయన్న ఆకాంక్షలను నీరుకార్చినట్లే అవుతుంది. దైవం మీద భారం వేసిన దైవాధీనం సర్వీస్‌గా పాలన వుండడాన్ని ప్రజలు హర్షిస్తారా?
‘జీవమున్న మనిషికన్న శిలలే నయమనిపించును’ అన్నట్లుగా వ్యవస్థ మారితే ఆ దోషం ఎవరిది? భద్రమస్తు! ఉత్తిష్ఠోతిష్ఠ!!

-సుధామ 98492 97958