సబ్ ఫీచర్

ఆర్థిక మాంద్యం.. అరిగిపోయిన రికార్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెబ్బయి ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని కశ్మీరు సమస్య కేవలం డెబ్బయి రోజుల్లోనే తొలగిపోయింది. 370వ అధికరణం ఏ రణమూ లేకుండా బుట్టదాఖలైంది. గత పార్లమెంటు సమావేశాల్లో 30 బిల్లులను మోదీ ప్రభుత్వం ప్రవేశపెడితే, 20 బిల్లులు లోక్‌సభలోను, ఉభయ సభల్లో 14 బిల్లులు ఆమోదం పొందాయి. ముస్లిం మహిళలకు శాపమైన ముమ్మారు తలాక్‌ను నిషేధించే బిల్లు ఆమోదం పొందడంతో ఇక- ఉమ్మడి పౌరస్మృతి (కామన్ సివిల్‌కోడ్) అమలులోకి రావడం తథ్యమన్న మాటలు వినపడ్తున్నాయి. సంస్థాగత తీవ్రవాదమేకాక వ్యక్తిస్థాయి తీవ్రవాదం కూడా నేరమే అన్న బిల్లుకూ మద్దతు లభించింది. కశ్మీరులో 370, 35ఎ అధికరణాల రద్దు తరువాత మొదటిసారి సంపూర్ణ భారతం 73వ స్వాతంత్య్ర దినం జరుపుకొంది. ఇంత జరిగినా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, కశ్మీరు విషయంలో కేంద్రం వైఖరిని తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. కశ్మీరులో రాబోయే రోజుల్లో వ్యాపారాలు, పరిశ్రమలు వచ్చి ఆర్థిక పరిస్థితి బలపడే సూచనలు కన్పడుతున్న నేపథ్యంలో ‘ఆర్థిక మాంద్యం’ అంటూ కొందరు పాతపల్లవిని అందుకుని దేశం ఉత్సాహాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.
గత ఐదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వంలోని ఆర్థికమంత్రి అరుణ్ జెట్లీ అమరులయ్యారు. కాని ఆయన తెచ్చిన విప్లవాత్మకమైన జీఎస్టీ వంటి సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం జల మంత్రిత్వశాఖ ద్వారా మూడున్నర లక్షల కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధమైంది. కారణం మోదీ ‘1.0 ప్రభుత్వ హయాం’లో 2 నుంచి 2.8 ట్రిలియన్ల డాలర్లకు భారత్ ఆర్థిక వ్యవస్థ చేరింది. వచ్చే ఐదేళ్ళలో 5 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థను అధిగమించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఆశావహ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ‘అందని ద్రాక్ష’ అని అనుకోవడం లేదు. కాని అందుకు అందరూ విలువైన సలహాలు యివ్వాలి. అది వొదిలేసి ఆర్థిక మాంద్యం పాట పాడటం శోచనీయం. ప్రపంచ దేశాలు మాంద్యం గుప్పిట్లోనే వున్నాయి. అది యివాల్టి మాట కాదు. నోట్ల రద్దు వంటి చర్యలు తీసుకున్నా, మన జిడిపి 4 శాతానికి ఎపుడూ పడిపోలేదు. 6-7 శాతం మధ్య వుంటున్నది. ప్రపంచంలో ఏడు పారిశ్రామిక దేశాలు మాంద్యం తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్యయుద్ధం శృతిమించుతోంది. అమెరికా చైనాపై 250 బిలియన్ డాలర్ల సుంకాలను విధించింది. అది యింకా పెరగవచ్చు. ఆర్థిక మాంద్యం వల్ల బంగారం ధర పెరుగుతున్నదంటున్నారు. ఆటోమొబైల్ రంగంలో ఫిబ్రవరి 2020 తరువాత భారత్ స్టేజి 6 నిబంధనలు అమలుకానుండడంతో కొనుగోళ్ళు మందగించాయి. జనం కొనుగోళ్ళు వాయిదావేస్తున్నారు. ఇదీ మంచిదే. ధనం పొదుపవుతుంది. పొదుపు భారతీయ జీవనసూత్రం. పబ్లిక్ రవాణాలైన ఆర్‌టిసి, మెట్రో వంటివి ఊపందుకుంటాయి.
స్టాక్ మార్కెట్ల గురించి చాలామంది మాట్లాడుతుంటారు. కాని మదుపర్లు దేశ జనాభాలో 2 శాతానికి మించి వుండరు. మదుపర్ల డబ్బు ఆవిరైందని, మళ్ళీ మార్కెట్లు నిలదొక్కుకున్నాయని వార్తలొస్తుంటాయి. పెద్దనోట్ల సంఖ్యను తగ్గించమన్నా మోదీ ప్రభుత్వం మాటను పెడచెవినపెట్టిన ఆర్‌బిఐ మాజీ గవర్నరు రఘురాం రాజన్ లాంటివాళ్ళు ‘ఆర్థిక మందగమనం తీవ్ర ఆందోళనకరం’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటారు. కాని ఆయనే మళ్ళీ ప్రస్తుతం బ్యాంకుల పరిస్థితి బాగుందంటారు. ప్రస్తుత ఆర్‌బిఐ గవర్నరు శక్తికాంత్‌దాస్ కూడా బ్యాంకులు యిపుడిపుడే మొండి బకాయిల సంక్షోభం నుంచి బయటకు వస్తున్నట్లు చెప్పారు. కార్పొరేట్ పన్నులను తగ్గించడం ద్వారా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. అందుకే 27గా వున్న ప్రభుత్వ బ్యాంకుల సంఖ్యను విలీనాల ద్వారా కేంద్ర ప్రభుత్వం 12కు కుదించి వాటిని బలమైనవిగా రూపొందించే ప్రయత్నం చేస్తున్నది. ఇదో పెద్ద ఆర్థిక సంస్కరణ. బ్యాంకు బోర్డులు కూడా బలోపేతం కానున్నాయి.
బ్యాంకులకు మూలధనాన్ని పెద్దమొత్తంలో ప్రభుత్వం అందజేయనుంది. 1998లోనే నరసింహ కమిటీ బ్యాంకుల విలీనానికి సంబంధించిన సిఫారసులు చేసింది. బ్యాంకుల విలీనంతో బ్యాంకుల వ్యాపారాల విలువ లక్షల కోట్లకు చేరడం, బ్యాంకు లావాదేవీల సంఖ్య తగ్గడంతో ద్రవ్యవినిమయంలో వెసులుబాటు, బ్యాంకుల వ్యాపార విలువ పెరగడంతో మదుపునకు, ఋణాలకు వీలవడం, బలహీనమైన బ్యాంకులు విలీనాలతో బలపడడం, ఖాతాదారులకు భరోసా పెరగడం దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతం కావడం వంటి ప్రయోజనాలు కలుగనున్నాయి. బ్యాంకులు బలోపేతమయితే ఋణాలు లభిస్తాయి. ప్రజల్లో కొనుగోలుశక్తి పెరుగుతుంది. ఇప్పటికే జిఎస్‌టివల్ల టాక్సులు 40%నుంచి 18% పడిపోయాయి. బలమైన ద్రవ్యోల్బణ నియంత్రణవల్ల ధరలు స్థిరీకరించబడ్డాయి. నిరుద్యోగం వున్న మాట వాస్తవం. కాని వివిధ వౌలిక వసతుల నిర్మాణ పనుల ద్వారా అనేకమందికి ఉపాధి దొరుగుతూనే వుంది. ఖరీదైన వస్తువులు కొనేందుకు ఉత్సుకత చూపకపోయినంతమాత్రాన అదే ‘మాంద్యం’అని ప్రచారం చేయడం భారత్‌కు చెల్లుబాటయ్యే విషయంకాదు. 1997లో ఆగ్నేయాసియా దేశాల్లో ఆర్థిక సంక్షోభం వచ్చినపుడు, పరమాణు పరీక్షలు జరిపినందుకు భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించినపుడు, నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో భారత ప్రభుత్వం 20లక్షల మంది ప్రవాస భారతీయుల ద్వారా 4 బిలియను డాలర్ల సొమ్మును సేకరించగలిగారు. 1998లో రిసర్లంట్ ఇండియా బాండ్ల పేర 1999లో మిలీనియం డిపాజిట్ స్కీమ్‌ద్వారా భారత ఆర్థిక పరిస్థితిని దారిలోపెట్టేందుకు ఆయన ప్రయత్నించారు. భారత ప్రజలు, ప్రవాస భారతీయులు దేశం పిలుపును విన్న సందర్భాలనేకం వున్నాయి. విదేశీ పెట్టుబడులు సహజంగా సంక్షోభ సమయంలో తరలిపోతుంటాయి. కాని ఎఫ్‌డిఐలు 2019-20, ప్రథమ త్రైమాసికంలో ఏప్రిల్-జూన్‌లో 28% పెరిగినట్లు బిజినెస్ లైన్ పత్రిక పేర్కొంది. ఢిల్లీ, యూపీ, హర్యానాలు ఎఫ్‌డిఐల ద్వారా బాగా లాభపడినట్లు ఆ పత్రిక వ్రాసింది. 2018-19లో భారత్‌లో 44.36 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. జిడిపి మాత్రం ప్రథమ త్రైమాసికంలో 5% చేరిందని పత్రికలు, మేధావులు, ఆర్థిక నిపుణులు గగ్గోలుపెడ్తున్నారు. భూటాన్ వంటి చిన్న దేశాలు జిడిపి కంటె జిఎన్‌హెచ్ (గ్రాస్ నేషనల్ హాపినెస్)కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి.
భారత్ సహజసిద్ధమైన ఆర్థికవ్యవస్థ కల్గిన దేశం. మార్కెట్లతో సంబంధంలేకుండా మనుగడ సాగించడం భారతీయులు యుగయుగాలుగా నేర్చుకున్న విద్య. చట్టం చట్రంలోనే అంతా జరగాలనుకుంటే భారత్‌లో అది సాధ్యం కాదు. అందుకే అమలులో లేని చట్టాలను మోదీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. వేతన జీవుల సంక్షేమం కోసం 2019 వేతనాల కోడ్‌ను రూపొందించింది. దీని ప్రకారం కనీసం 50 కోట్ల మంది కార్మికులకు కనీస వేతన ప్రయోజనం అందనుంది. ఆగస్టు 8, 2019నాడు ఈమేరకు గెజిట్ విడుదలైంది. ఇది కార్మికుల జీవితాల్లో సంతోషం నింపే అంశమే. మోదీ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు కూడా సగటు మనిషికి సంతోషం కలిగించేవే. బిమల్ జలాన్ కమిటీ సిఫారసుల మేరకు రిజర్వు బ్యాంకు కేంద్రానికి 1.76 లక్షల కోట్లు యివ్వడం మాంద్యానికి కొంతమేర అడ్డుకట్టవేయచ్చు. ‘మరక మంచిదే’అన్నట్లు ‘మాంద్యం’కూడా మంచిదే. ఆర్థిక క్రమశిక్షణకుపకరించే అంశం అవుతుంది. గత ఆర్నెల్లుగా సార్వత్రిక ఎన్నికలవల్ల కూడా మాంద్యం చోటుచేసుకుంది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో 10% మించిన ద్రవ్యోల్బణం గత 5 ఏళ్ళుగా 3-4%కి పరిమితమైంది. ద్రవ్యలోటు ఆందోళనకర అంశమయినా ప్రభుత్వం క్రమంగా దాన్ని అధిగమించగల్గుతుంది. మోదీ ప్రభుత్వంలో ఆమేరకు విశ్వాసం ప్రజల్లో వుంది. దేశ జనాభా మనకు బలమేకాని భారం కాదు. జనబలంతో సమస్యలను అధిగమించిన సందర్భాలు అనేకం. ప్రజలు త్యాగాలు చేసేందుకు ఎపుడూ సిద్ధంగా వుంటారు. హోటళ్ళలో సామాన్యుడు తినే ఇడ్లీకి, దోశకు పాశ్చాత్య దేశాల్లోలాగ రాసి వుంచిన నాణ్యతా ప్రమాణాలుండకపోవచ్చు. కాని మన దేశంలో ప్రజలు సహజసిద్ధంగా అలవాటుపడ్డ ఆహారం, పచ్చళ్ళు, కూరగాయలు, పళ్ళు, సిరి ధాన్యాలు మన జీవనప్రమాణాలను ఆరోగ్యకరంగానే వుంచుతాయి. తప్పనిసరిగా పిజ్జాలు, బర్గర్‌లు తింటేనే జీవితం నడుస్తుందనుకోవడం భారత్‌కు అవసరం లేదు. ఆవకాయ పచ్చడి, పెరుగన్నం, అరటిపండు అత్యవసర స్థితిలో తినేసి మనం మనుగడ సాగించగలం.

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్ 96761 90888