సబ్ ఫీచర్

ర్యాంకులతో అవగాహన పెరగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు విద్య పరమావధి జ్ఞాన సముపార్జన. వ్యక్తి తన కాళ్ళపై తాను నిలబడగలననే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటం. కాలం మారింది. లక్ష్యాలూ మారాయి. ఈనాడు విద్యయొక్క అంతిమ లక్ష్యం ఉద్యోగం సంపాదించి నాలుగురాళ్ళు వెనకేయటం. అదీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా లక్షల ప్యాకేజీ సంపాదించటం. ఆపై న పశ్చిమ దేశాలకు వెళ్ళటం. మా పిల్లలు యూ.యస్.లో ఉన్నారు, జర్మనీ వెళ్ళారు అని చెప్పుకోవటం స్టేటస్ సిం బల్. ప్రపంచీకరణ నేపథ్యంలో చదువుకున్న, చదువుకొన్న వాళ్ళకు మంచి మంచి అవకాశాలు రావటం మం చిదే. మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, అంతకన్నా పేదవాళ్ళ పిల్లలు పడమటి గాలికి వెళ్ళి పది చేతులా సంపాదించటం గర్వకారణమే.
1990లో కంప్యూటర్ కోర్సులకు, 2000 దాటాక ఇంజనీరింగు విద్యకు గిరాకీ పెరిగింది. కాకా హోటళ్ళలా వాడవాడకూ ఇంజనీరింగ్ కళాశాలలు వెలిశాయి. అంతేగాక వైఎస్‌ఆర్ ప్రభుత్వం ఫీజుల రాయితీకి ద్వారాలు తెరిచేటప్పటికి పదో తరగతి పూర్తికాకముందే ఇంజనీరింగ్ పూర్తిచేసి, తమ పిల్లలు సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరటం, కంపెనీ ద్వారా యూ.యస్.కు వెళ్ళటం అనే లక్ష్యంతో పిల్లల తల్లిదండ్రులు కలలుకనటం. వాటి సాకారానికి ప్రయత్నించటం ఎక్కువైంది.
పై కలలు సాకారమవ్వాలంటే మీ పిల్లలు ఆంగ్లంలో పట్టు సాధించాలని, ఆంగ్లం వస్తేనే మీకు మంచి భవిత ఉంటుందని, లేకపోతే మీ పిల్లలకు ఎదుగుదల ఉండదని కార్పొరేట్ స్కూళ్ళు ఊదరగొట్టి, అదరగొట్టి, చెదరగొట్టి నర్సరీనుండే ఇంగ్లీషు మీడియంలో చదువు చెప్తామని ప్రలోభపెట్టి తల్లిదండ్రుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నాయి. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, తా ను ఇతరులకు మార్గదర్శకంగా ఉండే ప్రభుత్వం కూడా ప్రైవేటు పాఠశాలలను ఆదర్శంగా తీసుకుని ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టటం! ఒకనాడు ప్రభుత్వం పల్లెల్లో ఉండే పేద పిల్లల (ప్రతిభ కలిగిన)కోసం ఏర్పాటుచేసిన గురుకులాలను ఆదర్శంగా తీసుకుని వివిధ ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థలు వెలసి, ప్రజల బలహీనతలను సొమ్ముచేసికొని, ఆంగ్లంలో బోధన అనే ఎరనుచూపి కోట్లు కొల్లగొట్టి, తమ ఆధిపత్యాన్ని చాటుతున్నాయి. ఇవ్వాళ ఆ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యావ్యవస్థను తమ కనుసన్నలలో నడిపించుకుంటున్నాయని అందరికీ తెలిసిందే.
అయినా గురుకులాలు మాత్రం తమ ఉనికిని కోల్పోలేదు. ఒక్కసారి గణాంకాలను సరీగ్గా పరిశీలిస్తే వాస్తవాలు బయటకొస్తాయి. కార్పొరేట్ కళాశాలల్లో చేరే విద్యార్థులలో ఎంతమంది పరీక్షకు హాజరౌతున్నారు? తమ లక్ష్యాలను చేరుకొని విద్యార్థులేవౌతున్నారు? ఫలితాల్లో వారి వివరాలు ఎందుకుండవు? ఈ వ్యవస్థనుండి ఐఐటి లాంటి కోర్సులకు వెళ్ళిన విద్యార్థులు తమ ఆచార్యులను పరీక్షా దృక్పధంతోనే పాఠ్యాంశ బోధన చేయమని, నోట్సు ఇవ్వమని అడుగుతున్నారని చుక్కా రామయ్యగారి వంటి మేధావులు విచారించటం మనందరికీ తెలుసు. పరీక్షా దృక్పధంతో కొన్ని చాప్టర్లనే అరగదీసి, ఇరగదీసి బిట్లుగాచేసి వ్రాయించటమే సమగ్ర బోధనకాదని సర్వులకూ విదితమే. అందులో చదివిన విద్యార్థులకు క్రీడాప్రాంగణాలేవి? గ్రంథాలయాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే విద్యార్థుల పరీక్షలకు ఉపయోగపడే రిఫరెన్సు పుస్తకాలు తప్పవారికి విలువలను నేర్పే పుస్తకాలు ఉన్నా యా? విద్యార్థులకు పరీక్షలు, ర్యాంకులు అనే మాటలకు సంబంధించిన విషయాలు తప్ప మిగిలిన విషయాలు అక్కడ వినబడతాయా? విద్యార్థి సమగ్రాభివృద్ధికి ఉపయోగపడే బోధన అసలు ఉన్నదా? ఇవన్నీ విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యాధికులకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ తెలుసు. ఐతే ఇవన్నీ ఎవరూ ఆలోచించటం లేదు. తమ పిల్లవాడికి మంచి మార్కులు, ర్యాంకులు, ఉద్యోగమే పరమావధి అని భావించి, నలుగురితోపాటు నారాయణ అనుకుంటూ సందు దొరికినపుడు ఉపన్యాసాలు ఇవ్వటం బాధపడటం చేస్తున్నారు. కార్పొరేట్ వ్యవస్థలో విద్యార్థులు మానసిక ఒత్తిడి భరించలేక ఆత్మహత్యా ప్రయత్నాలు చేయటం చూస్తూనే ఉన్నాం.
ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులకోసం నాటి ప్రభు త్వం ప్రారంభ దశలో అన్ని వనరులనూ సమకూర్చింది. వాటి నిర్వహణకు ప్రత్యేక సంస్థను కూడా నెలకొల్పింది. వాటిమీద పూర్తి అజమాయిషీ ఆ సంస్థలోని అధికారులకు మాత్రమే ఉండేది. జిల్లా కలెక్టర్ జిల్లాలోని పాఠశాలలకు ఛైర్మన్‌గా ఉన్నా వీలున్నపుడు ఆ విద్యార్థుల ప్రతిభను చూసి, ఆనందపడటానికి మాత్రమే వెళ్ళేవారు. ఆ పాఠశాలల వైపు ఎవరూ కనె్నత్తి చూసేవారు కాదు. ఆ పాఠశాలల, కళాశాలల కార్యదర్శిగా వచ్చే వ్యక్తి ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లో, డిగ్రీ, బి.ఎడ్ కాలేజీల్లో వివిధ హోదాల్లో పనిచేసి ఆర్‌జెడి స్థాయి అధికారిగా పనిచేశాక మాత్రమే వచ్చేవారు.
విద్యావిషయ అనుభవజ్ఞులు పనిచేసి ఆ సంస్థ అభివృద్ధికి ఇతోధికమైన కృషిని అందించారు. అందులో విద్యనభ్యసించిన విద్యార్థులు విద్యతోపాటు మిగిలిన అంశాలలో సమగ్రమైన అభివృద్ధిని సాధించారు. ఎంతోమంది ఐఎఎస్, ఐపిఎస్, బ్యాంకు ఆఫీసర్స్, కమిషనర్లు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు వంటి ఉన్నత స్థానాలను అధిరోహించారు. గురుకులాన్ని దాటిన విద్యార్థి కచ్చితంగా ఉద్యోగాన్ని సాధిస్తాడు. కార్పొరేట్ విద్యార్థులు కూడా సాధించవచ్చు. కాని ఉద్యోగ బాధ్యత నిర్వహించే విషయంతో గురుకుల వ్యవస్థనుండి వచ్చిన వ్యక్తి తన ప్రత్యేకతను చాటుకుంటాడనేది వాస్తవం. దానిక్కారణం ఏమిటంటే గురుకులాల్లో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, పి.డి., పి.ఇటి, లైబ్రరీ వంటి వాటికికూడా నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారు. వారు తమ సబ్జెక్టు మాత్రమేకాక విద్యార్థులకు ఇతర విషయాల్లోకూడా తర్ఫీదును ఇస్తారు. అంతెందుకు ప్రతి ఏడాది పదవ తరగతి, ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ సమయంలో పేపరు చూడగానే ఇది గురుకులంలో చదివిన విద్యార్థి పేపర్ అని గుర్తించేవారు. అటువంటి గురుకులాలు కూడా ఈనాడు నిలువునా దోపిడీ చేస్తున్న కార్పొరేట్ వ్యవస్థను ఆదర్శంగా తీసుకోవటం శోచనీ యం. దీనిక్కారణం ప్రభుత్వమే.
1983లో గురుకులాలను పెంచి, ప్రతిభగల గ్రామీణ విద్యార్థులకు మరింత మందికి అవకాశాలను కల్పించాలని ప్రతి జిల్లాకు ఒకటి బాలురకు, మరొకటి బాలికలకు విస్తరించింది. అదే వరుసలో గిరిజన, హరిజన విద్యార్థులకోసం గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకులాలను విస్తరించింది. వాటిని విస్తరించినంత తొందరగా ఉపాధ్యాయులను, కార్యాలయ సిబ్బందిని, తగిన వనరులను ఏర్పాటుచేయలేకపోయింది. నిర్వహణాధికారులకు తగినంత మందిని నియమించలేదు. ప్రభుత్వ నిర్వహణాలోపాలు ఎన్ని ఉన్నా, అరకొర సౌకర్యాలతో చదువుకున్నా ఆ విద్యార్థులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
కార్పొరేట్ విద్యలో ర్యాంకులకే ప్రాధాన్యత. విషయ పరిజ్ఞానం పెరగదు. ఇతర విషయాలు తెలియవు. విద్యా ర్థులకు నేర్పేది, వారు నేర్చుకునేది, వివిధ రకాల ప్రశ్నలు, వాటి జవాబులు మాత్రమే. అంతేకాని పాఠ్యాంశంపై పట్టు ఉండదు. విషయావగాహనకు పాఠ్యాంశంపై పట్టును కలిగించి విద్యార్థిని ఆలోచింపజేసే విద్య కేవలం ప్రభు త్వ విద్యాసంస్థల్లో మాత్రమే లభిస్తుంది. ఎందుకంటే అక్కడ పనిచేసే బోధకులు ఆస్థాయ శిక్షణను పొంది ఉంటారు. కేవలం ర్యాంకులకోసం విద్య, విద్యార్థి మంచి భవిష్యత్తుకు సహాయపడదు.

- బచ్చు రాంబాబు