సబ్ ఫీచర్

విషజ్వరాల విలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విషజ్వరాలు వాటంతట అవి ఊరికే రావు. నేడు పల్లెలు, నగరాలనే తే డా లేకుండా దోమలు విజృంభించని ప్రదేశం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా దోమలు ఎలాగోలా ఇళ్ళలోకి చొరబడి మనల్ని కుడుతుంటాయి. ఇళ్లలో కిటికీలకు, ద్వారబంధాలకు ఇనుప మెస్‌లను అమర్చినా దోమలు కుట్టవనే భరోసా లేదు. స్నానాల గదిలో, బాల్కనీలో, చెట్లకొమ్మల్లో, చెత్తకుప్పల్లో దోమలు స్థిర నివాసం ఏర్పరచుకొని మన రక్తాన్ని పీల్చేస్తుంటాయి. వర్షాలు ముంచెత్తినప్పుడు దోమలు విజృంభించి మనల్ని కుట్టడం వల్ల డెంగీ, మలేరియా, చికన్ గున్యా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయి. నిరుపేదలు, కొండప్రాంతాల్లోని వారు తగిన వైద్య చికిత్సకు నోచుకోక అనారోగ్యంతో మంచాన మూలుగుతున్నారు.
వరద నీటి ప్రవాహంలో గ్రామాలకు గ్రామాలే ముంపునకు గురైనపుడు ఎక్కడ పడితే అక్కడ అపరిశుభ్రత తాండవించడం, ఎంతోమంది విషజ్వరాల బారిన పడడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం నిత్యకృత్యంగా మారింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో డెంగీ వ్యాధితో వేలాదిమంది మంచం పట్టారు. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో జ్వరపీడితుల సంఖ్య లెక్కకు అందడం లేదు. వ్యాధి తీవ్రతపై సర్కారు చెప్పే గణాంకాలు, వాస్తవంగా వ్యాధుల బారిన పడిన వారి సంఖ్యకు ఎలాంటి పొంతన ఉండడం లేదు. వర్షాల కారణంగా విష జ్వరాలు ముంచుకు వస్తాయన్న సంగతి వైద్య అధికారులకు, సర్కారుకు తెలియనిది కాదు. ముందస్తు చర్యలకు వైద్య బృందాలు గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటించి ఉంటే ఇంత పెద్దఎత్తున రోగాలు ప్రబలకుండా కొంత ఉపశమనం లభించి ఉండేది. డెంగీతో యాభై మంది ప్రాణాలు కోల్పోయారని వార్తలు వస్తున్నా, అలాంటిదేమీ లేదని ప్రభుత్వ అధికారులు బుకాయిస్తున్నారు.
దోమల నివారణతో తీరిపోదు..
విషజ్వరాలకు కారణమైన దోమలను నివారించడంతోనే సమస్య తీరదు. లార్వా దశ నుంచి సమూలంగా వీటిని అంతమొందించే విస్తృత కార్యాచరణ, పరిసరాల పరిశుభ్రత, మురుగునీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు దోమల వినాశక మందులను వాడాలి. నీరు నిల్వ ఉండే చోట ఈ మందులను పిచికారీ చేయించాలి. ప్లాస్టిక్ కవర్లు, పేపర్ ప్లేట్లు, గ్లాసులు, తాగి పారేసిన కొబ్బరి బొండాల్లో నీరు చేరుతుంది. ఫాగింగ్ కార్యక్రమాల్ని శానిటరీ సిబ్బంది చేపట్టడమే కాదు, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి.
హెల్త్ ఎమర్జెన్సీ..
ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ బాలల, వృద్ధుల, మహిళల ఆరోగ్య పరిస్థితులపై వైద్యశాఖ అధికారులు, సిబ్బంది అవగాహన పెంచుకొని రోగాలు వ్యాపించకుండా అప్రమత్తం చేయాలి. ప్రభుత్వ వైద్యశాలలకు తగినన్ని మందులు, వైద్య పరికరాలు, వౌలిక సదుపాయాల కోసం తగినన్ని నిధులు కేటాయించాలి. విషజ్వరాలను నివారించేందుకు ‘ఆరోగ్య అత్యయిక స్థితి’ని పాటించాలి. రోగుల ప్రాణాలను నిలబెట్టి వారిలో కొత్త ఆశలు నింపాలి. పటిష్టవంతమైన ఆరోగ్య వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రభుత్వాలు నిర్విరామంగా కృషి చేయాల్సి ఉంది.

-దాసరి కృష్ణారెడ్డి 98853 26493