సబ్ ఫీచర్

‘గురుకుల’మే శ్రేయస్కరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెసిఆర్ నాయకత్వంలో 2014, జూన్ 2న అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పిజి ఉచిత విద్యను అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అరవై ఏళ్ల పాలనలో ప్రభుత్వాలు క్రమంగా ప్రభుత్వ రంగాలను నిర్వీర్యపరుస్తూ ముఖ్యంగా సగటు బడుగుజీవికి విద్యా, వైద్యరంగాలను దూరంచేశాయి. సంపన్నులకు ఒక చదువు, సామాన్యులకు ఒక చదువైంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ ప్రకటించిన కె.జి. టూ పి.జి.విద్య అనేది ఒక చారిత్రాత్మక, సాహసోపేత నిర్ణయం. ప్రపంచ దేశాలలోనే కాదు భారతదేశంలోని ఏ రాష్ట్రంలోకూడా ఇలాంటి సాహసోపేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టలేదు. ఈ ప్రభుత్వానికి ఒక ఉద్యమ నేపథ్యం ఉంది. ఇక్కడి ప్రతి సమస్యను లోతుగా అధ్యయనం చేశారు. విషయాన్ని అర్థం చేసుకున్నారు. వాటి పరిష్కారానికి పరిశోధనలు సల్పా రు. అందుకే క్రమంగా సానుకూల ఫలితాలు సాధిస్తున్నారు. తెలంగాణ సమాజంలో నూటికి డెబ్భైఐదు శాతానికి పైగా పేద, బడుగు, బలహీన, గిరిజన వర్గాలున్నాయి. తరతరాలుగా ఆ వర్గాలు విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు లేక దారిద్య్రం తో బాధపడుతున్నాయి. శాపంగా పరిణమించిన ఆ దారిద్య్రంనుంచి వాళ్లను వి ముక్తి కలిగించాలంటే ఆ వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలి. ఆకలితో నకనకలాడుతూ వచ్చే పిల్లలకు ఎంత గొప్పగా పాఠం చెప్పినా అది వాళ్లతలకెక్కదు. ఈ విషయాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల పిల్లలకు సన్న బియ్యాన్నందించి పౌష్ఠికాహారాన్ని సమకూరుస్తున్నది.
మూడేళ్ళ ప్రాయం నుంచే పిల్లలలో సహజాతాలు క్రమంగా వికసిస్తాయి. కాబట్టే పాశ్చాత్య దేశాలలో కిండర్‌గార్డెన్‌ను ప్రవేశపెట్టారు. వౌలిక పరిస్థితులలో మనదగ్గర కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వాటిని నెలకొల్పితే వీధిలోని పిల్లలు బడి ఒడిలోకి చేరతారు. రెండవది ఇటీవల రేషనలైజేషన్ పేరుతో పల్లెలలో ఉన్న పిల్లలు బడికి రావడంలేదని పాఠశాలల్ని మూసేస్తున్నారు. ఇంగ్లీషు మీడియం లేదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ పిల్లలను కోళ్ళగూడులాంటి ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కనీసం నాలుగైదేళ్ళపాటు ‘రేషనలైజేషన్’ ప్రక్రియకు స్వస్తిపలికి ఈలోపు ఆ పల్లెలలోని ప్రాథమిక స్కూళ్ళను బాగుపరచుకోవాలి. విద్యాలక్ష్యాలకు అనుగుణంగా టీచర్ ట్రైనింగునివ్వాలి. నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. ప్రాథమిక విద్యావిషయానికి వస్తే మనం బిహార్ కన్నా వెనుకబడి ఉన్నాం. పునాది పటిష్టంగా లేకపోతే దానిపై కట్టే భవనంకూడా పటిష్టంగా ఉండదు. మూడునుంచి ఐదేళ్ళపాటు వయసున్న పిల్లలను ‘అంగన్‌వాడీ’ల పేరుతో ఆయాలకు అప్పగించకుండా హెడ్మాస్టర్లకే వారి ఆలనాపాలనా బాధ్యతల్ని అప్పగించాలి. ఈ దశలో అక్కడ పిల్లలకు చదువుకాకుండా ఆట-పాటలు మన దేశ సంస్కృతి, నాగరికతలు గురించి మానవీయ విలువల గురించి నేర్పాలి. బాల గేయాలు, నీతికథలు ద్వారా వాళ్లలో నైతిక విలువల గురించి బోధించాలి. అవసరమైతే అక్కడ మహిళల్నే ‘కేర్‌టేకర్స్’గా నియమించాలి.
రెండవది గ్రామాలలోని ప్రాథమిక పాఠశాల నిర్వహణను స్థానిక సంస్థలకే అప్పగించాలి. ఇప్పటివరకు పాఠశాలల నిర్వహణలో మనం ప్రజల్ని ప్రజాప్రతినిధుల్ని భాగం చేయలేకపోయాం. వారి భాగస్వామ్యంలేకుండా మన లక్ష్యం పూర్తికాదు. ఉపాధ్యాయ సంఘాలు ఇంతవరకు నేరుగా రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేయడానికి అలవడ్డాయి. కాని క్షేత్రస్థాయిలో, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంలో పనిచేయడానికి అలవాటుపడలేదు. అది అవసరమని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. కాబట్టి ప్రాథమిక విద్య పునాది పటిష్టంకావాలంటే ఇటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం సమన్వయ దృక్పథంతో పనిచేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. ఈ సంవత్సరం నక్లెస్‌రోడ్డులో జరిగిన డా.బి.ఆర్.అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.సి.ఆర్. పేద బడుగు, బలహీన, దళిత, మైనార్టీవర్గాలకు చెందిన పిల్లలకోసం రెండువందల పైచిలుకు గురుకుల విద్యాలయాలను ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం హర్షణీయం. ఎన్‌రోల్‌మెంట్ పడిపోకుండా ఉండాలన్నా, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడాలన్నా ‘రెసిడెన్షియల్ సిస్టం’లోనే అది సాధ్యమవుతుంది కాబట్టి ప్రభు త్వం అందుకు నాంది పలికిందనుకోవాలి. పేద వర్గాల పిల్లలకు అవకాశం కల్పిస్తే మరెన్నో విజయాలు సాధిస్తారు. కాబట్టి సాధ్యమైనంతమేరకు ప్రభుత్వ పాఠశాలల్ని ‘రెసిడెన్షియల్’ పద్ధతుల్లోనే నిర్వహించాలి.

- చుక్కా రామయ్య