సబ్ ఫీచర్

సరిహద్దులను చెరిపేస్తున్న మోదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రం నుంచి దేశం, దేశం నుంచి ప్రపంచం వైపు నరేంద్ర మోదీ ప్రస్థానం స్పష్టంగా కనిపిస్తోంది. కొందరికి ఇది ఆమోద యోగ్యం, అంగీకార యోగ్యం కాకపోయినా వాస్తవం అవాస్తవం అవదు కదా? కళ్ళముందు కనిపిస్తున్న దాన్ని చూసేందుకు నిరాకరించడం ఏమాత్రం ‘నిజాయితీ’ అనిపించుకోదు.
ఎక్కడి గుజరాత్? ఎక్కడి ఐక్యరాజ్య సమితి? ఆ సమితిని సమ్మోహనపరిచే, జ్ఞానచక్షువులను మేల్కొల్పే ప్రసంగం.. ఎవరు అవునన్నా కాదన్నా ఇదొక అద్భుతం.. అమోఘం.. అనిర్వచనీయం. ఓవైపు విద్వేష ప్రవాహం కొనసాగుతున్నా, ‘రక్తపాతం’ గూర్చి కలవరిస్తున్నా, ‘రాడికలైజేషన్’ కలలు కంటున్నా, ఊచకోతల గూర్చి ఊహలు చేస్తున్నా మోదీ మాత్రం 150 ఏళ్ళ గాంధీ జయంత్యుత్సవాలు, 125 సంవత్సరాల క్రితం ‘ఉక్కు కండరాలు, ఇనుప నరాలు గల యువత చైతన్యవంతమై రుగ్మతల్ని రూపుమాపాల’ని పిలుపునిచ్చిన వివేకానందుని సౌభ్రాతృత్వ సందేశం, ఆధునిక పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో సరిహద్దులకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ‘సబ్ కేసాత్ సబ్‌కే వికాస్.. విశ్వాస్’ అన్న మంత్రాన్ని పఠించారు. ప్రాచీన భారత జీవన విధాన మూలాలు ‘ఇరుసు’గా నవ భారతదేశం ప్రగతిపథంలో పయనిస్తోందని, ప్రపంచం కలలను భారతదేశం తన కలలుగా పరిగణించి పరుగులు తీస్తోందని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మృదువైన గొంతుతో, స్వరమాధుర్యంతో పేర్కొన్నారు.
మారిన ప్రపంచాన్ని దర్శించకుండా, సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చిన విప్లవాలపై సంపూర్ణ అవగాహన లేకుండా ఎవరు మాట్లాడినా దానికి ‘ప్రాసంగికత’ కనిపించదు,ప్రామాణికత అసలే అగుపించదు. మోదీ మాత్రం మిగతా అనేక అద్భుత అంశాలతోపాటు వర్తమాన ఆర్థిక వ్యవస్థను రేఖామాత్రంగా చూపించి, అంతర్జాతీయ సంబంధాల్లో చోటుచేసుకున్న సమూల మార్పులను తెలిపి గిరిగీసుకుని, ఒంటరిగా మనలేని పరిస్థితులేర్పడ్డాయన్న వాస్తవ స్థితికి ఆయన అద్దం పట్టారు. ఈ వాస్తవ స్థితిని అవగాహన చేసుకోకుండా ఏ నాయకుడైనా తన ప్రజలకు సరైన మార్గదర్శనం చేయలేడు. ప్రధాని మోదీ ప్రస్తుత ప్రపంచ చలనగతిపై, డైనమిక్స్‌పై, పురోగమన శీలతపై నిష్పాక్షిక అంచనాతో అడుగులు వేస్తున్న ‘దృశ్యం’ మరోసారి ఐక్యరాజ్య సమితిలో దర్శనమైంది.
భారతదేశం యుద్ధాన్ని కాదు, బుద్ధిని, బుద్ధుడిని కోరుతోంది... వివేకాన్ని ఆశిస్తోందన్న ఒక్క మాటతో వేల సంవత్సరాల భారతీయ మానసిక స్థితిని కళ్ళకు కట్టారు. బుద్ధుడు, బుద్ధి... సంక్షేమం, వికాసం... ఇదే నేటి సమాజానికి అవసరమైన తారక మంత్రం. ఆ మంత్రాన్ని మోదీ ప్రతిభావంతంగా, ప్రభావశీలంగా సభముందు పెట్టారు. యుద్ధం చేయడం గొప్పకాదు, యుద్ధం చేయకుండానే విజయం సాధించడం గొప్ప అని ప్రాచీన చైనా యుద్ధ నిపుణుడు అంటారు. ఇప్పుడు మోదీ వ్యూహం అదేగా కనిపిస్తోంది. అటు హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వరకు మోదీ యుద్ధం చేయకుండానే, యుద్ధం మాట మాట్లాడకుండానే, అణ్వాయుధం గూర్చి ప్రస్తావించకుండానే అమోఘమైన విజయం సాధించారు. కోట్లాది ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ప్రపంచ నాయకులను అబ్బురపరిచారు, ఒకటికి నాలుగుమార్లు మోదీ మాటలను మననం చేసుకునేలా చేశారు. ఇంతకన్నా గొప్ప విజయం ఏముంటుంది? ఎక్కడుంటుంది? ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ భవనం వెలుపల సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి మోదీకి నైతిక మద్దతు ప్రకటించిన వారిలో కేవలం భారతీయులే కాదు, బెలుచిస్తాన్ లాంటి ఇతర ప్రాంతాలకు, దేశాలకు చెందిన వారున్నారు. స్వేచ్ఛకు, స్వాతంత్య్రానికి, విముక్తికి సంకేతంగా మోదీని వారు చూశారు, శ్లాఘించారు. బాజాభజంత్రీలను మోగించారు. పారవశ్యంతో నృత్యాలు చేశారు. వారంతా మోదీలో ‘మెసయ్యా’ను చూశారు. తమ కష్టాలను, బాధలను కడతేర్చే కార్యదక్షుడిగా మెరిసే కళ్ళతో తిలకించారు. ఉప్పొంగిన గుండెలతో మైమరిచి ‘మోదీ.. మోదీ..’ అన్న నినాదాలు చేశారు. ఈ ఒక్క ఘటన చాలదా? మోదీ ‘కరిష్మా’ ఏమిటో చెప్పడానికి?
భారత సంస్కృతిని, జీవన విధానాన్ని సంకుచితమైనదని భావించి దశాబ్దాలుగా ప్రచారం చేస్తూ తమ మేధోవైకల్యాన్ని ప్రదర్శిస్తున్న వారికిది ఏమాత్రం గిట్టడం లేదు. తాము నమ్మిన సిద్ధాంతాలే, ఆలోచనలే ఆఖరు.. ఆ తరువాత అంతా ‘శూన్యం’ కాబట్టి తమ భావాలను కాదని భారతీయ సంస్కృతి, జీవన విధానం, సహస్రాబ్దాలుగా అఖండంగా వెలుగుతున్న చైతన్యాన్ని ఎలా తెరముందుకు తీసుకొస్తారన్న ‘అక్కసు’తో శాపనార్థాలతో అశ్శరభ శరభ అంటూ శివాలు ఊగుతూ ఉన్నారు. ఇది విచిత్రం గాక ఏమవుతుంది?
భారత ప్రజల జీవనాడి ముఖ్యమా? విదేశీ సిద్ధాంతాలు ముఖ్యమా? అన్నది ఆలోచించకుండానే దశాబ్దాలుగా తెరమరుగైన సిద్ధాంతాల జపం చేస్తూ వున్నారు. ఆ సిద్ధాంతం సజీవంగా ఉందని చెప్పడానికి పడరాని పాట్లు పడుతున్నారు. వారిలో మావోయిస్టులు ముఖ్యులు.
అలాంటివారికి ప్రజల జీవనాడి తెలియదని ఎప్పుడో రుజువైంది. కేవలం ఊహాలోకాల్లో విహరిస్తూ పదబంధాల్లో బందీ అయి అక్కడక్కడే గానుగెద్దుల్లా తిరుగుతున్నారే తప్ప వికాసం గూర్చి, విశ్వాసం గూర్చి, సంక్షేమం గూర్చి, సాంకేతిక పరిజ్ఞాన రూపాంతరం గూర్చి, మానవ ఆకాంక్షల గూర్చి, మెరుగైన జీవితాలకై పడే ఆరాటం గూర్చి వారెప్పుడూ పట్టంచుకోలేదు. అసలు వారు ‘ప్రజాస్వామ్య’ ప్రక్రియనుగాక నియంతృత్వ పోకడను తలపై పెట్టుకునేందుకు పాటుపడుతున్నారు. ఆ నిరంకుశ భావన ‘గాలి’లో ఆవిరైందన్న ‘స్పృహ’ సైతం లేకుండా ఇంకా దానే్న కలవరించమంటే వారి దృక్పథం ఏపాటిదో అర్థమవుతోంది.
కురచ మనస్తత్వంతో సంకుచిత భావజాలంతో, ప్రగతిశీలం పేర కాలం చెల్లిన భావాలను ఆసరా చేసుకుని అటు దండకారణ్యంలో, ఇటు జనారణ్యంలో శక్తిసామర్థ్యాలను ‘వృధా’చేసే వారెలా జాతికి మేలు చేసిన వారవుతారు? ప్రజల ధనంతో సమకూర్చిన సౌకర్యాలను అనుభవిస్తూ ఆయుధాలతో, మందుపాతరలతో ‘ఇంప్రూవైజ్డ్’ బాంబులతో తిరగడం వల్ల, వాటిని ప్రయోగించడం వల్ల, యుద్ధాన్ని కోరుకోవడం వల్ల, వేర్పాటువాదులను, ఉగ్రవాదులను చేరదీసి వారితో ‘ఐక్యసంఘటన’ కట్టడం వల్ల ప్రజలకు వర్తమాన సాంకేతిక పరిజ్ఞానం... డిజిటల్ ఎకానమీ అవగతమవుతుందా? ఈ రెండు కొరవడినప్పుడు మన ‘ప్రయాణం’ తిరోగమనమని గుర్తుంచుకోవాలి. మావోలు ఆ ప్రయాణానే్న కోరుకుంటున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. కశ్మీర్ ఉగ్రవాదులు, ఈశాన్య రాష్ట్రాల వేర్పాటువాదులతో ‘స్వరం’ కలిపి, భారతదేశాన్ని ముక్కలు-ముక్కలు (టుక్డేటుక్డే) చేయాలని కంకణం కట్టుకోవడం ఏరకంగా ఆహ్వానించదగ్గ అంశమవుతుంది? విశ్వవిద్యాలయ విద్యార్థుల్లోనూ ఈ ‘విషం’ నింపి రోడ్లపైకి వదిలితే అదే రకమైన మానవాభ్యుదయమవుతుంది? ఏ రకంగా ఔన్నత్యమనిపించుకుంటుంది? విడ్డూరమేమిటంటే... భారత విప్లవ పార్టీలు ఆవిర్భవించి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రజలు ‘స్వర్ణోత్సవాలు’ జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఇటీవల ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ యాభై ఏళ్లలో ఆ విప్లవ పార్టీలు సాధించిందేమిటో అభయ్ చెప్పలేదు కాని విప్లవ పార్టీ (మావోయిస్టుపార్టీ)ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ప్రధాని మోదీ ఆవిష్కరించిన ప్రపంచానికి, ‘అభయ్’, ఆయన మిత్రులు గత 50 ఏళ్ళుగా ఆవిష్కరిస్తున్న ప్రపంచానికి ఎక్కడైనా పొంతన కుదురుతున్నదా? ఏ ప్రపంచం వాస్తవానికి, ప్రజల ఆకాంక్షలకు, అభివృద్ధికి, సంక్షేమానికి దగ్గరగా ఉందో ఎవరికివారే అంచనా వేసుకోవచ్చు. మావోలు పాక్ ప్రధానిలా రక్తపాతం (బ్లడ్‌బాత్), యుద్ధం, విద్వేషం, అసహనంతో కూడిన మాటలు మాట్లాడుతుంటే -గాంధీ, వివేకానంద, మార్టిన్ లూథర్‌కింగ్, నెల్సన్ మండెలా తదితర మహానుభావుల మనోభావాలకు అద్దంపట్టి వర్తమాన సందర్భాన్ని జోడించి విశ్వశాంతి, మానవ కల్యాణం గూర్చిన మాటలు.. చేతలు.. చైతన్యం మోదీ ప్రదర్శించారు. ఎవరు దేన్ని ఆలింగనం చేసుకుంటారో అది వారివారి సంస్కారాన్నిబట్టి ఉంటుంది. సంస్కారం సర్వదా సమున్నతమైనది. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు!

-వుప్పల నరసింహం 99857 81799