సబ్ ఫీచర్

బాబు అడుగులు మళ్లీ భాజపా వైపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? ఆ పార్టీ అధినేత చంద్రబాబు మదిలో ఏముంది? పొ త్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళడం ఎంత నష్టమో బాబుకు మరోసారి తెలిసొచ్చింది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏకైక అజెండా మోదీని పారద్రోలడం, జగన్‌ను ఓడించడం. మోదీని తిట్టిన తిట్టు తిట్టకుండా, చేసిన విమర్శ చేయకుండా కాలికి బలపం కట్టుకొని దేశమంతా తిరిగాడు. చిన్నాచితకా పార్టీలతో జతకట్టాడు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన్‌మోహన్ సింగ్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దేవెగౌడ, ములాయం ఇత్యాది పెద్ద తలకాయలతో వేదిక పంచుకొని మోదీపై తిట్లభేరి మ్రోగించాడు. మోదీకి వ్యతిరేకంగా అన్ని పార్టీల్ని ఏకం చేసి కేంద్రంలో పెత్తనం చేస్తామని ప్రకటించాడు. భాజపాతో తెగతెంపులు చేసుకొన్నాక ఎన్నికల్లో బాబు ఘోర ఓటమిని చవిచూశాడు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీల నాయకులు వీధుల్లో ఒకరిపై ఒకరు అరుచుకొన్నారు. ‘అక్రమాలను వెలికితీస్తాం, అవినీతిపరుడైన బాబుకు బుద్ధి చెబుతాం’ అని భాజపా నాయకులు కేకలుపెట్టారు. భాజపా ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, ‘యూటర్న్ బాబు.. బాహుబలిలో భల్లాల దేవుడు వంటివాడు.. అధికారం కోసం నిత్యం కుట్రలు పన్నుతున్నాడు. పోలవరానికి 7వేల కోట్లిచ్చాం. ఆ నిధులను ఏటిఎంలా వాడుకొన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టుల అంచనాలు పెంచుకొన్నారు. దేశద్రోహులతో బాబు చేతులు కలిపారు’ అని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత చంద్రబాబు ఇపుడు తన నోటికి తాళాలు వేసుకొని మోదీ స్మరణే మానేసి, కేవలం జగన్‌ను తిట్టడమే పనిగా సాగుతున్నాడు.
కాగా, చంద్రబాబు వ్యక్తిత్వం చాలా వింతగా వుంటుంది. ఆయనకు రాజకీయాలు, అధికారమే ముఖ్యం. అన్ని పార్టీల్ని ఏకతాటిపైకి తెచ్చి మోదీపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు ఆ పార్టీలతో స్నేహానికి మంగళ హారతులిచ్చేశాడు. మోదీపై తాను ప్రయోగించిన బుల్లెట్లన్నీ తిరిగి తనకెక్కడ తగులుతాయోనని ఆందోళనపడ్డాడు. అందులో భాగంగానే ఇపుడు కొత్త పాచికలు ప్రయోగిస్తున్నాడు. ఎలాగైనా తిరిగి బీజేపీ గూటికి చేరి సురక్షితంగా బైటపడాలన్నదే ఆయన ఎత్తుగడ. ఎన్నికల ముందు మోదీపై వేసిన రంకెల శబ్దం ఇంకా చెదరకముందే సరికొత్త అవతారం ఎత్తాడు. రాజ్యసభలో భాజపాకు బలం తక్కువ కావడం చంద్రబాబుకు కలిసొచ్చింది. లోపాయికారీ ఒప్పందమో లేక కొత్త ఎత్తుగడలో భాగమో కానీ బాబు నమ్మిన బంట్లు, బినామీలుగా చెప్పుకొనే నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపాలో చేరారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో వైకాపా వారు చంద్రబాబు విదేశీ పర్యటనల్లో దుబారా ఖర్చును విమర్శిస్తే, చంద్రబాబు జోక్యం చేసుకొని దేశాభివృద్ధికి ప్రధాని మోదీ చాలా దేశాలు తిరిగొచ్చారని ప్రస్తావించారు. ఇదే చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రధాని పర్యటనలపై పెద్దఎత్తున విమర్శలు గుప్పించాడు. చంద్రబాబు తన మనసులో ఏమనుకొన్నా దానికి ముందే స్కెచ్ వేసుకొంటాడు. భయం వల్లో భవిష్యత్ కోసమో భాజపా గూటికి ఎలాగైనా తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించేసుకొని తదనుగుణంగా అటు అడుగులు వేస్తున్నాడు. కాకుంటే ఆయన ప్రజల్ని చాలా తక్కువగా అంచనా వేసుకొన్నాడు. ఎన్నికలకు ముందు తానుచేసిన నృత్య విన్యాసాల్ని ప్రజలకు గుర్తుండవనుకొంటాడు. తానువేసిన ప్రణాళిక ఎవరికీ తెలియదనుకొంటాడు. భాజపాతో మళ్లీ పొత్తుకెళ్దాం అని ప్రకటించకుండా సన్నాయి నొక్కులు నొక్కడం ఆరంభించాడు. ఇటీవల విశాఖ జిల్లాలో తెదేపా సమావేశంలో తన అభీష్టాన్ని నర్మగర్భంగా ప్రకటించేశాడు. కేంద్రంతో విభేదించి మనం నష్టపోయామని చెప్పేశాడు. ఆ తర్వాత నెల్లూరులో జరిగిన పార్టీ సమావేశంలో మరింతగా మనసులో మాటను బయటపెట్టుకొన్నాడు. మోదీకి, తనకు సిద్ధాంతపర విభేదాలు తప్ప వ్యక్తిగతంగా విభేదాలు లేవంటూ సంజాయిషీ చెప్పుకొచ్చాడు. అదంతా ఆయన నాటకంలో భాగమేనని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ పుట్టుక కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే అన్నది అందరికీ తెలిసిందే. ఆ పార్టీ మూల పురుషుడు నందమూరి తారక రామారావు ఆనాడు కాంగ్రెసును అవినీతి పార్టీ అని, ఆ పార్టీ నాయకుల్ని ‘కుక్కమూతి పిందె’లని అభివర్ణించడం చారిత్రక అధ్యాయం. ఆ పార్టీ మూల సిద్ధాంతాన్ని చంద్రబాబు 2018వరకు కాపాడుతూ వచ్చాడు. యునైటెడ్ ఫ్రంట్ అవసరం కొద్దీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం కేసరిని చంద్రబాబు కలిసి మద్దతును అర్థించాడు. ఆ ఒక్క ఘటన తప్ప కాంగ్రెసుతో పబ్లిగ్గా తిరిగింది 2018నుండే.
2018 మార్చి 7న తెలుగుదేశం మంత్రులు మోదీ ప్రభుత్వం నుండి వైదొలిగారు. చంద్రబాబు భాజపాకి విడాకులు ఇచ్చేశారు. ఆనాటినుండి ఈయనకు కాంగ్రెస్‌పై ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలొచ్చేసరికి తారస్థాయికి చేరింది. మహాకూటమి పేరున కాంగ్రెసుతో జతకట్టి ఎన్నికల బరిలో దిగి పరాభవం పాలయ్యాడు. ఇటీవల జరిగిన లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్టుపెట్టుకోకుండా తెదేపా బరిలోకి దిగి భంగపాటుకు గురైంది. చివరికి విజయం వైకాపాను వరించడంతో తెదేపా అధినేత చతికిలపడ్డాడు. వెంటనే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఇప్పుడు భాజపాకు ప్రేమ ‘సిగ్నల్స్’ పంపే పనిలో బిజీగా గడుపుతున్నాడు.
భాజపాతో 2014 ఎన్నికల వరకు వైరం కొనసాగిస్తూ వచ్చిన బాబు చివరకు మళ్ళీ ఆ పార్టీతో పొత్తుకు అంగీకరించడం చాలా విచిత్రం. 2004, 2009లో ఓటమిపాలైన చంద్రబాబుకు 2014లో భాజపా ఆశాకిరణంగా కన్పించింది. 2014లో గెలవకుంటే తనకు రాజకీయ సన్యాసం తప్పదని ఆయనకు అర్థమైపోయింది. భాజపాతో పొత్తుకోసం వేగంగా పరుగులు తీశాడు. చివరికి జనసైన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ తలుపులు కూడా కొట్టి స్నేహగీతం పాడాడు. ఎలాగైతేనేం పాచిక పారి 2014లో గద్దెనెక్కేశాడు. రెండు పార్టీల మధ్య సఖ్యత 2018 జూన్ వరకు కొనసాగింది. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్న డిమాండ్‌కు బీజేపీ మంగళం పాడితే, ఆరోజు అర్ధరాత్రి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనకు చంద్రబాబు జైకొట్టడం తెలిసిందే.
రాష్ట్రంలో పరిస్థితులు వేగవంతంగాను, వైకాపాకు అనుకూలంగాను మారిపోసాగాయి. తనకు అధికారమే ముఖ్యం అని చంద్రబాబు భావించి వ్యూహాత్మకంగా పావులు కదిపి బీజేపీకి ‘తలాక్’చెప్పేశాడు. తిరిగి స్పెషల్ స్టేటస్ నినాదంతో భాజపాపై కత్తులు నూరుతూ, కాంగ్రెస్ తదితర పార్టీలతో చేతులు కలిపి మోదీని ఓడించాలని భావించి తానే భంగపడ్డాడు. ఎన్నికలు ముగిసి ఆరునెలలు కావస్తున్నాయి. కేంద్రంలోను, రాష్ట్రంలోను వైభవం కోల్పోయిన బాబు మదిలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఎలాగైనా భాజపాతో మళ్లీ పొత్తుపెట్టుకోవాలని తహతహలాడుతున్నాడు. ఇప్పుడు మోదీకి, భాజపాకు సంబంధించిన ఏ విషయంపైనా చంద్రబాబు స్పందించడం లేదు. ఆర్థిక సంక్షోభం ఏర్పడినా, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా, ఆర్టికల్ 370 ప్రవేశపెట్టినా ఎలాంటి ‘కామెంట్స్’ చేయడం లేదు. ఎన్నికలముందు భాజపాను ఆగర్భ శత్రువులా భావించినా తన ఎంపీలతో ఆర్టికల్ 370 రద్దుకు మద్దతుగా వోట్లు వేయించాడు. ‘త్రిపుల్ తలాక్’ బిల్లును వ్యతిరేకిస్తే బీజేపీ ఏమనుకొంటుందో అని ఓటింగ్ సమయంలో గైర్హాజర్ అయ్యేలా తమ సభ్యుల్ని ఆదేశించి చాణక్య నీతి ప్రదర్శించాడు. ఎన్నికల్లో మోదీపై చంద్రబాబు చేసినవన్నీ వ్యక్తిగత విమర్శలే. ఇప్పుడేమో తనకు మోదీతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవంటున్నాడు. మరి మోదీ ఏమంటారో? అమిత్‌షా అన్నీ మరచిపోయి, చంద్రబాబు కోసం తమ పార్టీ తలుపులు మళ్లీ తెరుస్తాడేమో? రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.
అన్ని కాలాలూ మనవి కావు. అన్ని ఆలోచనలూ నిజం కావు. చంద్రబాబు ఇప్పటివరకు వామపక్షాలు, జనసేన, బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలతో జతకట్టి వదిలేశాడు. ఇక కొత్తగా ఆయన పొత్తు పెట్టుకోవాల్సిన పార్టీ అంటూ ఏమీ మిగలలేదు. ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకం చేసి ఎన్నికల అనంతరం కొత్త ఫ్రంట్‌ను ఏర్పరచి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర వహిస్తానని చెప్పాడు. ఎన్నికల అనంతరం చతికిలపడ్డాక ఆ మాటల్నే మరచిపోయాడు. అసలు ఢిల్లీ వెళ్లడమే మానేశాడు.
గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం. 1984లో బీజేపీ మొదటిసారి పార్లమెంటుకు పోటీచేస్తే 2 స్థానాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. 2019 వచ్చేసరికి అదే పార్టీ 303 స్థానాలను కైవసం చేసుకొంది. చంద్రబాబుకు ఇవేమీ తెలియవని అనలేం. ఆయన నాయకత్వంలోని తెలుగుదేశానికి 1999లో బీజేపీతో జతకట్టినపుడు- 185 అసెంబ్లీ స్థానాలు దక్కగా, పొత్తు లేనపుడు 2004లో 47 స్థానాలు, 2009లో 93 స్థానాలు దక్కాయి. తిరిగి బీజేపీతో కలిసివెళ్తే 2014లో 102 స్థానాలు, ఒంటరిగా పోటీచేయగా 2019లో 23 స్థానాలు వచ్చాయి.
తాజా పరిణామాల్ని సునిశితంగా పరిశీలిస్తే చంద్రబాబు అడుగులు భాజపావైపే వేగవంతంగా పడుతున్నాయని అనిపిస్తుంది. తెలుగు తమ్ముళ్ళందర్నీ బీజేపీ లాగేసుకొంటున్నా ఆయన మనసు సైతం అటే లాగుతుంది. ఎన్నికల ముందు బీజెపీపై అంతెత్తున ఎగిరిపడ్డ చంద్రబాబు ఇప్పుడు అలా ప్రవర్తించడం లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నిచేసినా పల్లెత్తు మాట అనడం మానేశాడు. ఇప్పుడు చంద్రబాబుకు కావాల్సింది బీజేపీతో సఖ్యతే కాదు. కేంద్రం అండ వుంటే జగన్‌ను ఏమైనా చేయవచ్చు అన్నదే ఆయన ఆంతర్యం. అందుకోసం వేసే అడుగులు, చేసే ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

-డా. విజయకుమార్ 98863 81999