సబ్ ఫీచర్

మళ్లీ తెరపైకి ‘రెండో రాజధాని’..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం కేంద్ర పాలిత ప్రాంతంగా, దేశానికి రెండవ రాజధానిగా అవుతుందన్న ఊహాగానాలు ఇపుడు జోరుగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందన్న అంశం తెరపైకి వచ్చింది. ఒక దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఏర్పాటు చేస్తూనే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే తెలంగాణలో అంతర్భాగంగా వున్న హైదరాబాద్‌ను ఎలా కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారన్న విమర్శలు వినవచ్చాయి. ఆ తరువాత గత అయిదేళ్ల కాలంలో ఆ ఊసే లేదు. కానీ, ఇటీవల మళ్లీ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే అవకాశం వుందని, కేంద్రం ఈ అంశాన్ని పరిశీలిస్తుందని విస్తృతంగా ప్రచారం జరగడం గమనార్హం. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ వంటి సంస్థల సూచనలతో దేశ ప్రయోజనాల రీత్యా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అంతేకాకుండా దక్షిణాదిన బలపడాలన్న ఆలోచన భాజపాకు ఉంది.
కశ్మీర్ విషయంలో ఎవరూ ఊహించని రీతిలో మోదీ సర్కారు హఠాత్తుగా సంచలన నిర్ణయం తీసుకుంది. 370 ఆర్టికల్‌ను రద్దుచేసి దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టుకుంది. ఆ క్రమంలోనే హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఆలోచనలో వున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా ఈ విషయాన్ని మరోసారి చర్చల్లోకి తెచ్చారు. హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తన వద్ద సమాచారం ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఇటీవల చెప్పారు. కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగామ మారుతుందని ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత భాజపా చిక్కుల్లో పడింది. కాగా, మాజీ మంత్రి చింతా మోహన్ హైదరాబాద్ గురించే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తిరుపతికి మారుస్తారని తన అంచనాలను వివరించారు. అమరావతి ఎవరికీ అచ్చిరాదని, ప్రస్తుత ఏపీ సీం జగన్‌కు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. రాజధానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్తగా ఒక కమిటీని నియమించడం, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యల వల్ల రాజధానిని మార్చే అవకాశం వుందని పలువురు భావిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం విషయానికి వచ్చేసరికి అటు భాజపా, ఇటు తెరాస నేతలు అవన్నీ పుకార్లని కొట్టిపారేశారు. ఆ వార్తలన్నీ వదంతులు మాత్రమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.
ఈ విషయాలన్నీ ఇలా ఉంచితే, హైదరాబాద్‌ని ఏకంగా దేశ రెండో రాజధాని చేసే అవకాశం వున్నట్లు బలంగా వినవస్తోంది. అయితే ఈ అంశం ఇప్పటిదేమీ కాదు. హైదరాబాద్‌ని రెండవ రాజధాని చేయాలని, ఇక్కడ సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటుచేయాలన్న డిమాండ్లు ఎప్పటినుంచో వున్నాయి. దానికితోడు దేశంలో ఉత్తరాది ఆధిపత్యం ఎక్కువైపోయిందన్న విమర్శలు చాలా కాలంగా వినవస్తున్నాయి. దక్షిణాదివారికి ఢిల్లీలో భాష కూడా ఓ సమస్యే. ఈ నేపథ్యంలో దక్షిణాదిన రెండవ రాజధానిని ఏర్పాటుచేయాలన్న అంశం చాలాకాలంగా పరిశీలనలో వుంది. హైదరాబాద్‌ని దేశ రెండవ రాజధానిగా చేయాలని సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. ఇటీవల ఈ అంశంపై హైదరాబాద్‌లో సదస్సు కూడా నిర్వహించింది. కేంద్రంలో అధికారంలో వున్న భాజపా దక్షిణాది రాష్ట్రాల్లో బలం పుంజుకోవడానికి వ్యూహరచన చేస్తోంది. దక్షిణాది ప్రజల మనసులలో స్థిర స్థానం సంపాదించాలన్న యోచనలో ఆ పార్టీ వుంది. అందులో భాగంగా రెండవ రాజధానిని ఇక్కడ ఏర్పాటుచేసి దక్షిణాది ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులు బిజెపికి కలిసి వచ్చాయి.
ఢిల్లీ రాజధానిగా ఏర్పడి ఇప్పటికి 87 ఏళ్లయింది. దేశం నలుమూలల నుంచి వచ్చే వారితో ఢిల్లీలో రద్దీ పెరిగిపోయింది. వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో పొగ కమ్మేస్తున్నందున అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వమే హెచ్చరికలు జారీ చేస్తోంది. విద్యార్థులు కాలుష్య బారిన పడకుండా ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. కాలుష్యానికితోడు నీరు, వసతి, భద్రత తదితర సమస్యలు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌ను దేశానికి రెండవ రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్ కూడా రాజకీయ నాయకుల నుంచి వచ్చే అవకాశం వుంది.
ఈ అంశానికి సంబంధించి మహారాష్ట్ర మాజీ గవర్నర్, బిజెపి సీనియర్ నేత సిహెచ్.విద్యాసాగర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విజృంభించిన వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అలనాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న విధంగా హైదరాబాద్ నగరం దేశానికి రెండో రాజధాని అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విద్యాసాగర్‌రావు వంటి వ్యక్తి ఈ రకమైన కీలక వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది. 130 కోట్ల జనాభా, వివిధ భాషా సంస్కృతుల సమ్మేళనం అయిన భారతదేశానికి రెండవ రాజధాని అవసరం ఎంతైనా వుంది. సంచలన నిర్ణయాలతో భారతీయులందరినీ ఆకర్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా, దేశ రెండవ రాజధానిగా ప్రకటించే అవకాశం వుందని పలువురు భావిస్తున్నారు. అయితే- రాజకీయ, ప్రాంతీయ కారణాల రీత్యా హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.
రాష్టప్రతికి సిమ్లాలో వేసవి విడిది వుంది. ఎప్పటి నుంచో హైదరాబాద్ రాష్టప్రతికి శీతాకాల విడిదిగా వుంటోంది. సికింద్రాబాద్‌లోని బొల్లారంలో రాష్టప్రతి ప్రతి ఏడాది 15 రోజులు నివాసం ఉంటారు. పచ్చికబయళ్లు, ఔషధ మొక్కలు, రంగు రంగుల పూల తోటలు, పండ్ల తోటలతో ప్రకృతి శోభను సంతరించుకొని అత్యంత ఆకర్షణీయంగా వుండే ఈ భవనాన్ని 1860లో అప్పటి నిజాం నవాబు నజీరుద్దౌలా కట్టించారు. ఖర్చుపరంగా కొంత కలిసివచ్చే అంశం ఇది. ఈ నేపథ్యంలో సంస్కృతి సంప్రదాయాలు, వాతావరణం, వౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాల పరంగా హైదరాబాద్ దేశానికి రెండవ రాజధానిగా ఉండటానికి అనువైనదిగా పలువురు భావిస్తున్నారు.

-శిరందాసు నాగార్జున 94402 22914