సబ్ ఫీచర్

ఆంగ్లం వెంటపడడం అనాలోచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకూ ఇకపై ఆంగ్లంలోనే విద్యాబోధన జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం అనాలోచితమైనది. తెలుగు భాష కు సమాధి కట్టి, ఈ భాషను మాట్లాడేవారి నాశనానికి పాలకులు తీసుకున్న నిర్ణయం ఇది. సుమారు 250 ఏళ్లు మనల్ని పాలించిన బ్రిటిష్ వారి అనుభవం ఏమి చెప్తున్నది? భారత్‌లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా, అది కుదరక ప్రాంతీయ భాషా మాధ్యమాలను మార్చకూడదనే బుద్ధి వారికి వచ్చినందునే- మా తరం వారలం బ్రిటిష్ హయాంలోనూ మాతృభాషా మాధ్యమంలో చదువుకోగలిగాము. ఆంగ్లేయులు ఎంత ప్రయత్నం చేసినా దేశ జనాభాలో ఎంత శాతం మందిని ‘ఆంగ్లాన్ని నేర్చినవారి’గా చేయగలిగారు? ఆంగ్లేయులు వెళ్లిపోయినా, స్వతంత్ర భారతంలో బోధనా మాధ్యమాన్ని మార్చే ప్రయత్నాలు చాలాసార్లు జరిగాయి.
‘తెలుగుదేశం’ హయాంలో చంద్రబాబు నాయుడు పాలిస్తున్నప్పుడు- పట్టణాభివృద్ధి శాఖామంత్రి తనది కాని అధికారాన్ని పైన వేసుకుని అన్ని పాఠశాలల్లోనూ తెలుగును తొలగించి ఆ స్థానంలో ఆంగ్లాన్ని విద్యార్థులపై రుద్ది, ఆ తర్వాత నాలుక కరుచుకుని వెనక్కి తగ్గడం తెలిసిందే. ఇపుడు ‘నేను వచ్చాను, చూస్కోండి’ అని విరగబడి ఆంగ్లభాషను తెలుగు విద్యార్థులపై మోపడం కొత్త ప్రభుత్వంలో విద్యామంత్రి నిర్ణయం అనాలోచితం కాదా మరి?
అనాదిగా వస్తున్నది, మనది, మనకొక గుర్తింపును ఏర్పరచినది, మన వారి ప్రయత్నంచే సంపన్నమైన భాష మనకున్నది. మన సంస్కారాలను పుణికిపుచ్చుకునేది, మన జీవితాలను సార్థకం చేసుకునేది అయిన విద్యను నేర్చుకుని దాని ద్వారా ప్రపంచ విజ్ఞానాన్ని, కళలను, సాంకేతిక జ్ఞానాన్నిగ్రహించి ముందుకు వెళ్లడానికని ఆలోచిస్తాం. ప్రపంచ విజ్ఞానం ఏ భాషలో నేర్చుకుంటే సులభంగా లభ్యమవుతుందో ఆ భాషను నేర్చుకోవడానికి కుతూహలం చూపుతాము. ఆ భాషలో అదనపు కోచింగ్ క్లాసులేర్పాటుచేసుకుంటాం. ఏ భాష నేర్చుకుంటే తక్కువ శ్రమతో ఉద్యోగాలు లభిస్తాయో లేక జీవనోపాధికి వృత్తులను నేర్చుకోగలమో ఆ భాషను నేర్చుకుంటాము.
ప్రాథమిక స్థాయిలో మన భాషను బాగా నేర్పి, అందులో ప్రావీణ్యతను సంపాదించాక అదనపు భాషను నేర్పడం ఉత్తమం. ప్రపంచంలో ఎన్నో దేశాలలో మాతృభాషలోనే విద్య గరపడంలో విశేషమిది. ఈ సౌలభ్యానికే విద్యను మన సంవిధానంతో కంకరన్ సబ్జెక్టుగా ఉంచారు. (అనగా కేంద్రానికీ, ప్రాంతాలకీ సంబంధించిన విషయంగా పరిగణించారు.) మన పాలకులు వారి పాలనా కాలంలో ఉన్న సామాజిక ప్రవాహాలలో కొట్టుకుపోక, మనమేమిటి? మన చరిత్ర ఏమిటి? సమాజంలో వచ్చిన ఒడిదుడుకులు, ఉత్థాన పతనాలను అర్థం చేసుకుని, మన స్వాతంత్య్రాన్ని ఎందుకు పోగొట్టుకున్నాం? మనకు గర్వించదగిన ప్రగతి పథం ఏది? ఆ పథంలో నడచిన మహనీయులు చూపిన మార్గాలననుసరిస్తూ, దూర దృష్టితో సమాజాన్ని ముందుకు నడిపించాలి. మన పూర్వీకులు నిర్మాణం చేసిన సంస్కృతినీ, విలువలనూ ఉపేక్షించడం విజ్ఞత కాదు. పైగా ద్రోహం కూడాను. ఎటువంటి భవిష్యత్తును నిర్మాణం చేయాలన్న ఆలోచన లేకుండా, మనకి మంచిదా? కాదా? అనే ఆలోచన లేకుండా తనకు తోచినదేయని గాని, ప్రజలు కోరుతున్నారనే మిష చూపి ఏదో ఒక విధానంలో పాలన సాగించడం వివేకం కాదు. పాలకులు తమ విధానాలను గూర్చి జాగ్రత్తగా యోచించాలి.
ప్రాథమిక స్థాయి నుండి హైస్కూలు స్థాయి వరకు ఆంగ్ల మాథ్యమంలో విద్యనందించాలని నిర్ణయం తీసుకోవడంలో ఔచిత్యమేమిటి? ప్రపంచమంతటా యునెస్కో సహా ప్రాంతీయ భాషలను రక్షించుకోవాలని ఆక్రోశిస్తూంటే పరాయి భాషను సమాజంపై రుద్దడానికి ప్రయత్నించడం ఆంగ్ల మానస బానిసత్వానికి చిహ్నం కాదా? మన జాతిని మళ్లీ ఆంగ్లేయులకు బానిసలుగా చేయడానికా? ఆంగ్ల మాథ్యమంలో బోధన ఆవశ్యకతను గూర్చి ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరిస్తూ, నేటి పోటీ ప్రపంచంలో ముందుకెళ్ళాలంటే ఆంగ్ల మాధ్యమం అవసరమన్నారు. అసలు మన ప్రాంతంలో విద్య ఎలా నడుస్తోందో ఆలోచించారా? ఐదవ తరగతి విద్యార్థులు సాధారణ పదాలు సరిగా వ్రాయలేకపోతున్నారు. పదవ తరగతి విద్యార్థికి డిక్టేషన్ చెప్తే చిన్న వాక్యాలనే సరిగా వ్రాయలేకపోతున్నాడు.
అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలలో మాతృభాషలోనే ఉన్నత స్థాయి వరకు విద్యను గరపుతున్నారే! ఉదాహరణకు యూరప్‌లోని అన్ని దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, పోలిష్, హంగేరి, డచ్, డేనిష్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రొమేనియా,గ్రీస్, రష్యా, ఆసియాలోని చైనా, జపాన్, కొరియా, థాయిలాండ్, ఇరాన్ ఇతర అరబ్ దేశాలలో మాతృభాషలోనే విద్యను గరపుతున్నారు. సుమారు 1,800 ఏళ్లు వేర్వేరు దేశాలలో తలదాచుకుంటూ వచ్చిన యూదులు మరచిపోయిన తమ హిబ్రూ భాషను పునర్‌నిర్మించి జాతీయ భాషగా చేసుకున్నారే! వీరెవరూ మనకు స్ఫూర్తినివ్వడం లేదా? బానిసత్వం వల్ల సంక్రమించిన ఆంగ్లానే్న పట్టుకుని వేలాడే దుర్గతి మనకెందుకు? మన సంపన్న భాషలను మరింత సంపన్నంగా చేసుకుందాం. ఆంగ్లాన్ని నెత్తిన పెట్టుకొనక కావలసినంత మేరకే వాడుకుని ప్రపంచంలో అవకాశాలను పుణికిపుచ్చుకుందాం.
మాతృభాషతోనే విద్యను ప్రారంభిద్దాం. ఎన్ని భాషలైనా విద్యార్థి నేర్చుకోవచ్చు. ఆ కుతూహలం నేటికీ విద్యార్థులలో కనబడుతూనే వుంది. పాపం! వారేం చేస్తారు? వారెప్పుడూ తల్లిదండ్రులకూ, పాఠశాల యజమానులకూ, పాలకులకూ బానిసలేగా! మనమేది చెప్తే అది చేస్తారు వారు. వారిని చెడగొట్టినా మంచి త్రోవను పెట్టినా- అందుకు బాధ్యత మనదే. ఆంగ్లాన్ని ఆరవ తరగతి నుండి ప్రారంభిద్దాం. ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఆంగ్లం ద్వారం వంటిదని భావిస్తే ఇపుడు చదువుతున్న ఉన్నత తరగతులలో ఆంగ్లానికి కాలాంశాల్ని ఎక్కువ చేద్దాం. మరో రెండు నాన్ డిటైల్డ్ పుస్తకాలను చదివిద్దాం. స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను ఏర్పాటుచేద్దాం. సింపుల్ ఇంగ్లీష్‌ను ముందు నేర్పి గుడ్ ఇంగ్లీష్ తర్వాత నేర్పడానికి చర్యలు తీసుకుందాం. ప్రపంచ విజ్ఞానాన్ని మన మాతృభాషలో వ్రాసి, ప్రచారం చేసి మాతృభాషలను మరింత సంపన్నం చేసే ప్రయత్నంలో మనం కూడా భాగస్వాములమవుదాం. ఎన్నైనా చేయవచ్చు. కాని మాతృభాషను పణంగాపెట్టి మాత్రం కాదు.

-ఆచార్య దుగ్గిరాల విశే్వశ్వరం 94401 56018