సబ్ ఫీచర్

అలీనోద్యమ రూపశిల్పి నెహ్రూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజనీతిజ్ఞుడు, శాంతిదూత, స్వాతంత్య్ర సమరయోధుడు, మన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దేశ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. ఆయన 1889 నవంబర్ 14న మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు అలహాబాద్‌లో జన్మించాడు. నెహ్రూ సంపన్న కుటుంబంలో జన్మించడం వలన ఇంటివద్దనే గుఱ్ఱపు స్వారీ, ఈత, వ్యాయామం, సాముగరిడీలు మొదలైన సాంప్రదాయ విద్యలన్నీ నేర్చుకున్నాడు. తన తల్లి వద్ద నుండి భారత రామాయణ గాథలను, ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామ కథలను, ముబారక్ అలీ మున్షీ వద్ద అరేబియన్ నైట్స్ కథలు, ఫర్డినాండ్ బ్రూక్స్ వద్ద ఆంగ్లం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి బారిష్టరు విద్యను పూర్తిచేశాడు. 1912లో భారతదేశానికి తిరిగి వచ్చి న్యాయవాద వృత్తిని చేపట్టాడు. 1916లో కమలాదేవిని వివాహం చేసుకున్నాడు.
నెహ్రూ 1916లోమొదటిసారిగా మహాత్మా గాంధీజీని కలుసుకున్నాడు. ఆయన పట్ల నెహ్రూ ఆకర్షితుడవడమే గాక, న్యాయవాద వృత్తిని వదలి స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఆ తర్వాత క్రమంగా గాంధీకి కుడిభుజంగా ఎదిగాడు. బార్డోలి సత్యాగ్రహం, సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా వంటి పలు ఉద్యమాల్లో నెహ్రూ పాల్గొన్నాడు. 1929లో నెహ్రూ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ ‘పూర్ణ స్వరాజ్’ తీర్మానాన్ని ఆమోదించింది. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమాలలో పాల్గొన్నందుకు తొమ్మిది పర్యాయాలు జైలుశిక్షను అనుభవించాడు. ఆ సమయంలో నెహ్రూ తన కుమార్తె ఇందిరకు రాసిన లేఖలు చాలా ప్రాముఖ్యత పొందాయి.
జైలు జీవిత కాలాన్ని వృథా చేయకుండా, ఆ సమయంలో గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఆటోబయోగ్రఫి లాంటి రచనలు చేశాడు. స్వాతంత్రోద్యమంలో భాగంగా నెహ్రూ, గాంధీతో కొన్ని అంశాలపై విభేదించినప్పటికీ ఆయన చివరి వరకు మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగానే పనిచేశారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు చేపట్టారు. 1947 నుండి 1964 వరకు ప్రధానిగా కీలక బాధ్యతలను నిర్వహించి పలు అభివృద్ధి పనులను చేపట్టి పంచవర్ష ప్రణాళికలను నిర్దేశించాడు. పండిట్ నెహ్రూ గొప్ప దార్శనికుడు. జాతి పునర్నిర్మాణానికి, అంతర్జాతీయ శాంతికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. అందుకే అతడిని ‘శాంతిదూత’గా దేశం కీర్తించింది. ప్రజాస్వామ్యం, మిశ్రమ ఆర్థిక విధానం, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, మతాతీత రాజ్యాంగం మన ధ్యేయాలని ప్రకటించిన మహామనీషి. ప్రధానిగా ప్రపంచ వ్యాప్తంగా మన దేశానికి గొప్ప స్థానం చేకూర్చాడు. అగ్రరాజ్యాల మధ్య సంఘీభావాన్ని, సమతుల్యాన్ని సాధించే లక్ష్యంతో అలీన విధానానికి అంకురార్పణ చేసి, కొత్త విదేశాంగ విధానాలను రూపొందించాడు. బహుళార్థక ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని ప్రకటించి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించాడు.
నెహ్రూకు గులాబీ పూలన్నా, పిల్లలన్నా చాలా ఇష్టం. అందుకే పిల్లలందరూ నెహ్రూను ముద్దుగా ‘చాచా’ అని పిలుస్తారు. బాలబాలికలందరికీ తల్లిదండ్రుల ప్రేమ లభించాలని, విద్య ద్వారానే బాలల భవిష్యత్ చక్కగా తీర్చిదిద్దబడుతుందని నెహ్రూ అభిలాష. ఆయన పుట్టినరోజును మన దేశంలో బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1955లో ‘భారతరత్న’ పురస్కారం లభించింది. నెహ్రూ 1964 మే 27న పరమపదించారు. ఆయన ప్రవచించిన పంచశీల సిద్ధాంతం, ఆయన వ్యక్తిత్వం ప్రజలందరికీ ఆదర్శప్రాయం. జవహర్‌లాల్ నెహ్రూ అపరిమితమైన దేశభక్తితో ‘శాంతిదూత’గా, ‘జాతి నిర్మాత’గా ప్రశంసలందుకొని చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలిచాడు.

-కందుకూరి భాస్కర్ 97034 87088