సబ్ ఫీచర్

ఆంగ్ల మాధ్యమంలో ప్రాథమిక పాఠశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది చాలా దురదృష్టకరమైన నిర్ణయం. వింత, విడ్డూరం, వెగటు కలిగించే తీర్మానం. సామాజిక వికాస మేథావి అనుకుంటున్న ఆర్. కృష్ణయ్య ఈ తీర్మానాన్ని చప్పట్లుకొట్టి స్వాగతించటం మరింత దారుణం. ఇది ప్రగతి నిరోధక తీర్మానం.
వెనుక చాలా సంవత్సరాలకింద ఒక తెలుగు సినిమాలో ‘దండయ్య మహారాజు’ అనే పాత్ర పగటిపూటంతా నిద్రపోవాలి, రాత్రిళ్ళు సకల సామాజిక కార్యకలాపాలు సాగించాలి! అని దండోరా వేసారు. పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టండి అన్నాట్ట వెనుకటికి ఒక అతి మేథా విజ్ఞాన విలసనుడు.
ఇంత ఆవేదన, పరితాపం ఎందుకో మనవి చేస్తాను. సోషల్ స్టడీస్, సైన్స్, భూగోళం, చరిత్ర చెప్పటానికి అవసరమైన పాఠ్యపుస్తకాలు ఒక్క నెలలో రూపొందిస్తారు కాబోలు. 2020 జనవరి నుంచి అమలుచేస్తామంటున్నారు కదా! లేక ఈ సబ్జెక్టులు (జ్ఞాన వాహికలు) పూర్తిగా తొలగిస్తారా?
భద్రిరాజు కృష్ణమూర్తి వంటి అంతర్జాతీయ గుర్తింపుకల భాషా విజ్ఞాన వేత్త, వివిధ విషయాల ఇంగ్లీషు పాఠ్యాలను, బోధ్యాలను తెలుగులో విడమర్చి చెపుతూ చెప్పాలి అని హితవు పలికారు.
సరే! ఇది మిలియన్ డాలర్ల అపూర్వ మేథా నిర్ణయమే అనుకుందాం. చిన్నపిల్లలకు ఇంగ్లీషు మాధ్యమంలో బోధించగల అయ్యవార్లను ఎక్కడనుంచి తీసుకుని వస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఒక సామర్థ్య పరీక్ష నిర్వహించండి. వాళ్ళకు ఎంత ఇంగ్లీషు వచ్చునో, వారు బోధించే శైశవ వయస్సు విద్యార్థులకు ఎంత వరకు ఇంగ్లీషులో భావప్రకటన చేయగల శక్తి అలవరచగలరో? తెలిసిపోతుంది. తనకే చిన్నపిల్లలకు బోధించగల శక్తి, సామర్థ్యం, ఆసక్తి, ఆర్జతం లేకపోతే ఇక ఆయన ఏమి పొడుస్తాడు? పుల్లాకు తూటుగా పొడవాల్సిందే!
ఇదెక్కడి అన్యాయం! అధర్మం! పిల్లల మనసులు స్వచ్ఛంగా, సహజంగా, ఆహ్లాదకర స్ఫురణతో ఎదగనీయకుండా, ఉపాధ్యాయులు ఇంగ్లీషు పరిజ్ఞానమే ప్రశ్నార్థకం కాగా, ఇకవారు బోధించేదేమిటి? బాధించటం కాక.
శ్రీశ్రీ శైశవ గీతి చదవాలి. ఆం.ప్ర. విద్యాశాఖామాత్యులుగారు (ఉడుతల్లారా! బుడతల్లారా! నవ్వుల్లారా, పువ్వుల్లారా? అని పాలుగారే చెక్కిళ్ళ ముద్దుమురిపాల పౌగండ వయస్సు చిన్నారులను ఉద్దేశించి మురిసిపోయాడు. ‘పౌడంగ’మంటే ప్రాథమిక పాఠశాల బోధకుడు చెపుతాడా? చెప్పగలడా?’ మిలటరీ డ్రిల్లులాగా బోధిస్తాడు కాబోలు ఇంగ్లీషుంబోలు మేథావిత. ఒక మనవి. స్వాతంత్య్రం రాకముందు యెల్లాప్రగడ సుబ్బారావు, స్వామి జ్ఞానానంద, కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణలు తెలుగు మాధ్యమంలోనే ప్రాథమిక విద్యనేర్చారే? వారికన్నా ప్రజ్ఞా ఘన నిధులను చేయగలరా? యద్భవిష్యులైన ఇప్పటి ప్రాథమిక పాఠశాలల పంతుళ్ళు.
రెంటికి చెడిన రేవడులనుగా మూసలోంచి తీస్తారు కాబోలు. ఎంత మోసం!
ఆంధ్రకేసరి ప్రకాశం ఆంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ ప్రసంగం తెలుగులోనే చేశారు. ఎంత గొప్ప విషయం! గాంధీ మహాత్ముడు ప్రాథమిక విద్యను ఇంగ్లీషు మాధ్యమంలోనే గడగడ తాగాడు కాబోలు!
మోచర్ల రామచంద్రరావని ఈయన్ను ఆంధ్ర గోఖలే- అనేవారట. ప్రజలు మెచ్చి అన్నారో! లేక తనకుతానై ఆపాదించుకున్నాడో చెప్పలేము. 1914లో యేలూరులో జరిగిన రెండో ఆంధ్ర మహాసభలో ప్రగల్భాతి శయంతో ఇంగ్లీషులో తన ప్రసంగం మొదలుపెట్టగా సభలో ఉన్నవారు ‘తెలుగు, తెలుగు’ అని కేకవేశారు. అప్పుడా తెలుగు గోఖలేగారు ముఖం చిన్నచేసుకుని ‘ఇంగ్లీషులోనే అలవాటుపడ్డాను, వ్యామోహభ్రష్టుణ్ణ్తెనాను క్షమించాలి. తెలుగు నేర్చుకుంటాను. ఇక ముందు తెలుగులోనే మాట్లాడుతాను’ అన్నాట్ట. ప్రకాశం పంతులుగారెప్పుడూ ఇంగ్లీషు మాటాడినట్టు వినపడదు తెలుగునాట. యెల్లాప్రగడ సుబ్బారావు, స్వామీజ్ఞానానంద, కట్టమంచి రామలింగారెడ్డి, సూరిభగవంతం, పి.వి.నరసింహారావుగారలు తెలుగునాట ఎప్పుడైనా ఇంగ్లీషు ఉపన్యాసాలు దంచారా? పొట్టుపొట్టుగా ఆసక్తి ఉంటే, అవసరమనుకుంటే ఇంగ్లీషు గొప్పగా నేర్చుకోవటంలో అభ్యంతరం ఎందుకుంటుంది.
శోచనీయమైన విషయం ఏమంటే ఇప్పుడు తెలుగు వ్యక్తుల మధ్య ఇ-మెయిళ్ళు ఇంగ్లీషులోనే రాసుకోవటం! ఎందుకు? తెలుగు ఎట్లా భావప్రకటన నిరూపణ సామర్థ్యం పెంచుకుంటుంది? తెలుగు పట్ల అంతటి నిరాదరణ, అనాదరణ ఎందుకు?
తెలుగు రాదంచు డంబాలు వల్లించే తెలుగోడా! చావరాదటరా అని ఆధునిక వేమన కాళోజి గింజుకున్నాడు కదా!
తెలుగు నేర్చుకోవటం అమ్మదగ్గర పాలు తాగటం, ఇంగ్లీషుకోసం పాకులాడటం ‘పోత పాల’ కోసం వెంపర్లాడటం అన్నాడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, వేటూరి ప్రభాకరశాస్ర్తీ మహాశయులు. అమెరికాలోనే తెలుగు పిల్లలకు తెలుగు నేర్పాలని అఘోరిస్తుండగా, మన పిల్లలు ఎప్పుడైనా (ఎప్పటికైనా) అమెరికా పోకపోతారా? అని నాలుకలు చప్పరించుకోవటం ఎంతవరకు సబబు! అవసరం అన్నీ నేర్పుతుంది! అని పెద్దల హితవాక్కు ఉంది కదా! కాకపోతే కాస్త కష్టపడాలి. తెలుగైతే ఇష్టపడి నేర్చుకుంటారు- చూడండి. స్వాతంత్య్రం రాకముందు తెలుగులో వచ్చే పత్రికలు శతాధికం, ద్వి, త్రి శతాధికంగా ఉండేవి. ఇప్పుడు అన్ని జిల్లాలనుంచి వచ్చే తెలుగు పత్రికలు నూరు పేర్లు చెప్పండి! చెప్పలేరు.
పాపం శమించుగాక! రేపు ఈ ప్రభుత్వం బదలాయింపు జరిగితే, మళ్ళీ తెలుగులోనే ప్రాథమిక విద్యకావాలని భవిష్య ముఖ్యమంత్రి మేథావి నిర్ణయం తీసుకుంటే గంద్రగోళ పరిస్థితులేర్పడవా! పడి లేచే కడలి తరంగం కాదా తెలుగు అప్పుడూ. ఊర పిచ్చుకలను మన దేశంలో నాశనం చేస్తాము. అమెరికాలో ఎంతగానో కనపడతాయి. ఎగరలేకుండా, నడవలేకుండా నగుబాటుపాలు చేస్తారా? తెలుగు పిల్లలను. మహామహా తెలుగు ప్రొఫెసర్లే ఇప్పుడు పూర్వకాలపు తెలుగు కావ్యాలు పాఠం చెప్పలేరు. అర్థం చేసుకోలేరు. బహుశా పాఠ్యప్రణాళిక నుంచి తొలగిపోయాయేమో! మరి తెలుగు ఎట్లా? వికాసం పొందుతుంది! సంస్కృతానికి ఎట్లాగూ దేవిడీమన్నా విధించాము? ఇక తెలుగుకు కూడా తల గొరిగిస్తే మురిపెం తీర్చుకోవచ్చు.

- అక్కిరాజు రమాపతిరావు