సబ్ ఫీచర్

చిన్నపత్రికల వేగుచుక్క ‘మహోదయ’ శివరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్నఖాదీ అంచు పంచె,లాల్చీ,కండువా ధరించి ఎల్లప్పుడూ చిరునవ్వుతో, ఆత్మస్థైర్యంతో ఆయన పూర్ణపురుషునిగా కనిపించేవారు. ప్రజాసేవే పరమావధిగా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ శుభవేళ ‘మహోదయ’ వారపత్రికను (తెలుగు, ఆంగ్లం) శ్రీకాకుళం కేంద్రంగా తిమ్మరాజు వెంకట శివరావు స్థాపించారు. నేడు ఆయన భౌతికంగా లేకపోయినా ఆ పత్రిక ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. పెద్దపెద్ద పత్రికలే కాలగర్భంలో కలిసిపోతున్నప్పటికీ ఓ చిన్నపత్రిక కాలం విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ మనుగడ సాగించడం విశేషం. ‘మహోదయ’ అంటే శివరావు, శివరావు అంటే ‘మహోదయ’ అనే ముద్ర పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. శివరావుకు బాల్యం నుంచి కళలన్నా, చారిత్రక స్థలాలన్నా, దివ్యక్షేత్రాలన్నా ఎంతో ఇష్టం. పరోక్షంగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొనడమే కాకుండా దేశాభిమానంతో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించేవారు. సామాజిక సేవతో పాటు కవులు, గాయకులు, కళాకారులను ప్రోత్సహించేందుకు ‘మహోదయ’ను ప్రారంభించారు. నిజాలను నిర్భయంగా ప్రచురించి పత్రికా రంగంలో విలువలకు అగ్రతాంబూలం ఇచ్చారు. చరిత్ర, వర్తమాన రాజకీయాలపై ఆయనకు తిరుగులేని పట్టు ఉండేది. ఆయన రాసిన సంపాదకీయాలు, విశే్లషణలు పాఠకుల్ని అమితంగా ఆకట్టుకునేవి. కలాన్ని కత్తిలా వాడి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా రాజకీయ విశే్లషణలు చేసేవారు.
1966లో ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో ప్రారంభమైన ఉద్యమంలోనూ, 1972లో జరిగిన ప్రత్యేకాంధ్ర ఉద్యమంలోనూ ‘మహోదయ’ కీలక పాత్ర పోషించింది. 1975లో హైదరాబాద్‌లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ‘మహోదయ’ ప్రత్యేక సంచికను విడుదల చేశారు. నెల్లూరు ప్రాంతాన్ని అప్పట్లో ‘జమీన్ రైతు’ పత్రిక ఎంతగా ప్రభావితం చేసిందో అలాగే ఉత్తరాంధ్రను ‘మహోదయ’ అంతలా ప్రభావితం చేసింది. జాతీయ నాయకులు ఉత్తరాంధ్రలో పర్యటించినపుడు ప్రత్యేక సంచికలను శివరావు ప్రచురించేవారు. తమ ప్రాంత అవసరాలను పత్రిక ద్వారా నేతలకు తెలియజేసేవారు. 1948లో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విశాఖపట్నంలో ‘జలఉష’ నౌకను ప్రారంభించినపుడు ‘మహోదయ’ ప్రత్యేక సంచికను ఆయనకు శివరావు అందజేశారు. సింధియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వంకావాలా రూ.1001 మొత్తాన్ని పారితోషికంగా శివరావుకు అందజేశారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, స్వరాజ్య గీతాల ప్రజాగాయకుడు నంద కృష్ణమూర్తిని నెహ్రూకు పరిచయం చేసిన ఘనత శివరావుకే దక్కుతుంది.
‘విశ్వకవి’ రవీంద్రనాథ్ ఠాగూర్ 1933లో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించినపుడు శివరావుకు చెందిన కారులోనే విశాఖలో పర్యటించారు. లాభనష్టాల సంగతి ఎలాఉన్నా, ‘మహోదయ’ను మానస పుత్రికగా చూసుకొనేవారు. ఈ పత్రిక స్వర్ణోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఆంధ్రప్రదేశ్ చిన్నపత్రికల సంఘం వార్షికోత్సవం సందర్భంగా 1987లో హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ పురస్కారం ‘మహోదయ’కు లభించింది. సంపాదకుడైన శివరావుకు జస్టిస్ కె.రామస్వామి ఆ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ‘మహోదయ’ పేరిట ముద్రణాలయాన్ని కూడా ఏర్పాటుచేశారు. ‘మహోదయ’కు సంపాదక బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికలకు శ్రీకాకుళం జిల్లా ప్రతినిధిగా 30 ఏళ్లపాటు ఆయన వ్యవహరించారు. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆరుసార్లు ఎన్నికైన బొడ్డేపల్లి రాజగోపాలరావు తనకు ఆప్తమిత్రుడైనప్పటికీ ఎన్నికల వేళ ఆయన తన వృత్త్ధిర్మానికే కట్టుబడి ఉండేవారు. అన్ని రాజకీయ పార్టీల పట్ల సమదృష్టితో వ్యవహరించి, మిగతా పాత్రికేయులకు స్ఫూర్తిగా నిలిచారు.
రేగులపాడు జమిందారీ కుటుంబానికి చెందిన శివరావు1913 నవంబరు 13న జన్మించారు. వీరి స్వగ్రామం పాలకొండ. శ్రీకాకుళం పట్టణంలో స్థిరపడ్డారు. కళల పట్ల మమకారం ఉన్నందున శివరావు శ్రీకాకుళంలో రావి కొండలరావు, బండారు చిట్టిబాబు, దూసి బెనర్జీలతో కలిసి ‘సుకుమార్ ఆర్కెస్ట్రా’ను స్థాపించారు. ఆయనే పాటలు రాసేవారు. ‘ఆంధ్ర దేవాలయ వైభవం’ అనే గ్రామ్‌ఫోను రికార్డును రూపొందించడంలో ఆయన క్రియాశీలక పాత్రను పోషించారు. అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయ ప్రాంగణాన ‘విశ్వరథం అదిగో’ అనే పాట, ‘తలచి-వలచి’అనే జావళి నేటికీ శ్రోతల హృదయాల్లో మార్మోగుతుంది. ఆయన చేయూతతో సినీ నేపథ్య గాయకుడు జి.ఆనంద్, సినీనటుడు, రచయిత రావి కొండలరావు, మృదంగ విద్వాన్ నేమాని సోమయాజులు వంటివారు పేరుప్రఖ్యాతులు పొందారు. తనకు మరో మిత్రుడైన అరసవిల్లి దేవస్థానం ధర్మకర్త ఇప్పిలి జోగారావుతో కలిసి ‘లలిత కళాసమితి’ని స్థాపించి ద్వారం వెంకటస్వామి నాయుడు, మృదంగ విద్వాన్ అయ్యర్ వసంతకుమారిలను ఒకే వేదికపై సన్మానించారు. ‘మిస్ ప్రేమ బి.ఎ’ నాటకాన్ని రాసి రాష్ట్రం నలుచెరగులా ప్రదర్శింపజేశారు. ‘వంశధార తరంగాలు’ రూపకాన్ని రాసి ప్రదర్శించినందుకు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు రూ.5000 పారితోషికాన్ని అందించి శివరావును సత్కరించారు. ‘ఆంధ్రజాతి నీలం’ అనే రూపకాన్ని రాసి హైదరాబాద్‌లో అప్పటి రాష్టప్రతి నీలం సంజీవరెడ్డి దంపతుల ఎదుట ప్రదర్శించారు. దీన్ని మెచ్చుకొని సంజీవరెడ్డి స్వర్ణపతకంతో సత్కరించారు. శివరావు రాసిన దేముడు, త్యాగం, వీర మాంగల్యం తదితర నాటికలు ‘ఆకాశవాణి’లో ప్రసారమయ్యాయి. ఆయన రాసిన ‘సినిమా రాణి’ నాటికను మద్రాసులో ప్రదర్శించినపుడు అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.వి.రాజమన్నార్ ప్రశంసలు పొందారు. ఉత్తమ సంపాదకునిగా, రచయితగా గుర్తించి ఎన్నో సంస్థలు శివరావును సన్మానించాయి. ప్రస్తుతం ఆయన మనుమడు టి.వి.ఎస్.కిషోర్ సాయి ‘మహోదయ’ను నడుపుతున్నారు. 72 ఏళ్లుగా ‘మహోదయ’ కొనసాగడం శివరావు ఆశయసిద్ధికి నిదర్శనం. ‘మహోదయ’ మూడేళ్ల క్రితం మాసపత్రికగా రూపాంతరం చెందింది. 2002 నవంబర్ 22న శివరావు తుదిశ్వాస విడిచారు.

-వాండ్రంగి కొండలరావు 94905 28730