సబ్ ఫీచర్

గంగిగోవు పాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడైతే ఏంటి? పాట పాడటం ఆమెకు ఆనందం. ఆ పాటను పదిమందీ వింటే మహాదానందం. తత్వం నుంచి మొదలైన గాత్రం ఆమెది. కులదైవాన్ని కీర్తించటంతో మొదలైన అభ్యాసమే -ఆమెను గాయనిని చేసింది. గురువుల కటాక్షంతో ఆ గాత్రం మరింత పదునుదేరింది. సినిమా ఆమెను పట్టించుకోలేదన్న బాధేం లేదు ఆమెకు. అదొక ఫ్లాట్‌ఫాం. అక్కడ పాడితే వేలమంది వింటారన్న చిన్న ఆశ అంతే. విధి సరైన అవకాశం ఇవ్వకున్నా -తను నమ్ముకున్న సరస్వతి మాత్రం ఆమె గొంతులో సుస్వరాలే పోసింది. ఆ అద్భుత గాయని -సినీ ప్రపంచానికి పెద్దగా తెలీని రామలక్ష్మి. భక్తి ప్రపంచానికి బాగా తెలిసిన నిత్య సంతోషిణి తల్లి.
*

కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేం. అందుకే -చేతనైనంత పత్రినిపెట్టి మనసా వాచా కర్మణా దైవాన్ని కొలిస్తే చాలంటారు పెద్దలు. నిరంతర గాన స్రవంతి సాగుతుండాలని కోరుకునే గాయని రామలక్ష్మి కూడా అలాగే ఆలోచించారు. తన పాటకు నలుగురూ వినే చోటుంటే చాలనుకున్నారు.
వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ్మే ఆమె కుటుంబం, నిరంతరం ఆయన భజనలతోనే కాలం గడిపేది. అలా బాల్యంనుంచే బ్రహ్మం పాటలు, తత్వాలను వింటూ పెరిగారు రామలక్ష్మి. దుబ్బాక కిష్టయ్య, వెంకటలక్ష్మి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. పెద్ద కూతురైన రామలక్ష్మి ఇంటర్ వరకూ చదివారు. కానీ ఆరో యేటనుంచే కుటుంబ పెద్దలు పాడుకునే బ్రహ్మం తత్వాలను హమ్మింగ్ చేయడం ఆరంభించారు.
కులదైవం వీరబ్రహ్మేంద్రస్వామి కావడంతో.. చిన్నప్పుడు విన్న ఓ హరి కథను గుర్తు చేసుకున్నారామె. అదే స్టేజీపై హరికథ మధ్యలో బ్రహ్మం తత్వాలను పాడారట. ఆ హరిదాసును రామలక్ష్మి తండ్రి కిష్టయ్య భోజనానికి ఆహ్వానిస్తే, ఇంటికొచ్చి రామలక్ష్మిని ఎత్తుకుని సరస్వతి రూపంగా భావించారాయన. సంగీతం నేర్పించమని సలహా ఇచ్చారు. అప్పటినుండి ఓవైపు సంగీతం నేర్చుకుంటూనే మరోవైపు కార్యక్రమాల్లో పాడేవారు. మొదట ఐదుగురు బాబాయిలు, ఐదుగురు అత్తయ్యలవద్ద పాడే విధానాన్ని ఔపోశన పట్టారామె. వారు పాడే హిందూస్తానీ భజన్స్ అలవోకగా నేర్చుకున్నారు. బ్రహ్మంగారి చరిత్రనే హరికథగా చెప్పే బాబాయిల శిష్యరికంలో తర్ఫీదు పొందారు. తమిళనాడు నుంచి వచ్చిన పుష్పవనం మాస్టారు వద్ద తొలిసారిగా సంగీతంలో సరిగమలు అభ్యసించారు. ఎస్ జానకి బావగారైన గరిమెళ్ల నరసింహారావు వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. కీర్తనలు అలవోకగా పాడి వినిపించేవారు. అలా పాడుతూ ఉండగా ఆకాశవాణిలో అవకాశం వచ్చింది. అక్కడ వారి పోటీలో నెగ్గి బి ఆర్టిస్టుగా ఎంపికయ్యారు. తరువాత బి హై కూడా ఆమె కిరీటంలో కలికితురాయి అయింది. అక్కడే పరిచయమైన గాయకులు చిత్తరంజన్‌దాస్, కెబికె మోహన్‌రాజ్, విజయలక్ష్మి శర్మలతో కలిసి అనేక పాటలు ఆలపించారు. ఆకాశవాణి డైరెక్టర్ పాలగుమ్మి విశ్వనాధం ప్రోద్బలంతో లైట్ మ్యూజిక్‌లో పాటలు పాడారు. భక్తిరంజన్, ఈమాసపు పాట, లలిత సంగీతం.. అనేక పాటలు శ్రోతలను దగ్గరచేశాయి. ఈమాసపు పాటలో ఆలపించిన అన్ని పాటలు రామలక్ష్మికి ఎనలేని గుర్తింపు తెచ్చాయి. ముఖ్యంగా ‘సాగుమా నీలమేఘమా’ అనే పాటకు గొప్ప గాయనీమణులే శ్రోతలుగా మారారు. ఈ మాసపు పాటలో భాగంగా ఆలపించిన ‘పుట్టకాడ ఎవరో- చెట్టు నీడ ఎవరో- పాలపిట్టకోసం ఈల వేసే చేనుగట్టు కాడ- పాము పుట్ట కాడ ఎవరో’ అన్న పాటను విన్న బంగారు పంజరం దర్శకుడు బిఎన్ రెడ్డి ఆకాశవాణికి వచ్చారు. ఆ పాట రికార్డు తీసుకెళ్లి ఎస్ రాజేశ్వరరావుకు అందించారు. ఇదే పద్ధతిలో పాట కావాలని ఆయనను అడిగారు. అదే పాటను ఎస్ జానకి చేత బంగారు పంజరంలో ‘చెట్టుకాడ ఎవరో.. నల్ల కనుల నాగస్వరం ఊదేది ఎవరో’ అంటూ పాడిస్తే.. ఆ పాట ఆంధ్ర దేశంలో విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత సినిమాల్లో పాడొచ్చు కదా అని అనేకమంది సలహా ఇవ్వడంతో తండ్రి కిష్టయ్య కూతురును తీసుకొని మద్రాస్ వెళ్లారు. 1960లో మద్రాసు వెళ్లి అనేక ప్రయత్నాలు చేశారు. ‘చిన్నప్పటినుండి లతామంగేష్కర్ పాటలు గ్రామఫోన్ రికార్డులో విని రాసుకునేదాన్ని. అవి తిరిగి ఉన్నదున్నట్టుగా పాడి వినిపించేదాన్ని. ఎంతోమంది ఆ పాటలు విని మెచ్చుకునేవారు. అలా వచ్చిన ధైర్యంతోనే మద్రాసు వెళ్లాను. మైలాపూర్‌లో ఓ ఇల్లు తీసుకున్నాం. అక్కడ శకుంతల అనే సంగీత విద్వాంసురాలివద్ద సంగీతం నేర్చుకున్నా. మా నాన్నగారు రాజేశ్వరరావు, ఘంటసాల, జి హనుమంతరావు, మాస్టర్ వేణులాంటి సంగీత దర్శకుల దగ్గరకెళ్లి నాకు అవకాశం దొరకడానికి ప్రయత్నాలు చేశారు’ అని గుర్తు చేసుకున్నారు ఆమె. అలా అందరి దగ్గరికెళ్లి ఆమె పాటలు వినిపించారట. అందరూ బాగుందని మెచ్చుకున్నారు కానీ అవకాశాలు మాత్రం రాలేదు. ముఖ్యంగా కూతురుకు మంచి భవిష్యత్తు ఉండాలని ప్రయత్నించే తండ్రిని చూసి ఆయా సంగీత దర్శకులంతా గర్వించేవారు. మీరు ఇక్కడవుంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా అవకాశం ఇస్తామన్న జవాబులే వచ్చాయి. అలా ఒకరోజు ఎస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాట రికార్డు చేస్తుండగా వెళ్లారు రామలక్ష్మి. సుశీల- ఘంటసాల ఆలపిస్తున్న ఆ పాట కులగోత్రాలు చిత్రంలోనిది. ‘నిలువగలేని వలపుల రాణి నీ కొరకే తపించెనులే..’ అన్న పాట రికార్డింగ్ జరుగుతోంది. సుశీల పాడే విధానాన్ని రామలక్ష్మి గమనించారు. అపుడు ఆమెకు అర్థమైంది, ఎలా పాడాలి మైక్ ముందు అనే విషయం. ‘ఆ తరువాత నన్ను నేను చాలా మార్చుకున్నా. అక్కడున్న మైక్ చాలా సున్నితమైందని, పెద్ద గొంతుతో పాడాల్సిన అవసరం లేదని, మనకున్న వాయిస్‌తోనే చక్కగా పాడితే రికార్డు అవుతుందని రాజేశ్వరరావు చెప్పారు. అందుకే ఆయనను నా గురువుగా భావిస్తాను’ అంటారామె. అలా దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు అవకాశాల కోసం ఎదురుచూశారు. కొంతమంది సంగీత దర్శకులు బృందగీతాలు కొన్ని చిత్రాలలో పాడించారు. అవి పెద్ద గుర్తింపులేనివే. ఆ తరువాత తండ్రి ఆరోగ్యం సహకరించకపోవడంతో మళ్లీ హైదరాబాద్ వచ్చేశారు. ఇక్కడే రేడియోలో ఆడిషన్స్ చేసి అటు ఆకాశవాణిలోను, ఇటు దూరదర్శన్ కార్యక్రమాల్లోనూ అనేక వేల పాటలు ఆలపించారు. బయట జరుగుతున్న నృత్య కార్యక్రమాలలో భాగంగా శోభానాయుడు, ప్రసన్నరాణి, సుమతి కౌవల్, ఉమారావు, ఆనంద్ శంకర్ లాంటి అనేకమంది నృత్య కార్యక్రమాలకు పాటలు పాడారు. చిత్తరంజన్, మోహన్‌రాజ్‌ల కాంబినేషన్‌లో పాడిన అనేక పాటలకు ఎంతో గుర్తింపు వచ్చింది శ్రోతలనుండి. అందులో భాగంగా పాటలో రాగాలు, భావాలు ఎలా వుంటాయో అర్థం చేసుకున్నారు. ఓ రోజు చిత్తరంజన్ వచ్చి ఓ సినిమా కోసం పాడాలన్నారు. కృష్ణ-విజనిర్మల-విజయలలిత ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న ‘విధి విలాసం’ చిత్రంకోసం హైదరాబాద్‌లోని పాటల రికార్డింగ్ జరుగుతోంది. ఆ రికార్డింగ్‌లో పాటలు పాడాలన్నారు. అలా విధివిలాసంలో పాడటం కోసం మాస్టర్ వేణు వద్దకు వెళ్లాం. మాస్టర్ వేణు చెప్పిన సలహాలతో చిత్తరంజన్ ప్రోత్సాహంతో ‘వల్లారి బాబోయ్ రాములోరయ్య’ అన్న పాటను పాడాను. అదేవిధంగా బేబి శ్రీదేవి, మాస్టర్ రాములపై చిత్రీకరించిన ‘మంచివాళ్ళు మా బాబులు మా మంచివాళ్ళు’ అనే పాటను ఆలపించారు. బేబి శ్రీదేవికి తొలినాళ్లల్లోనే గాత్రదానం చేశారు రామలక్ష్మి. ఆ తరువాత సినిమా పాటల కోసం ఏనాడూ వెంపర్లాడలేదు. సినిమా పరిశ్రమ అంతా మద్రాసులో వుండిపోవడం ఓ మైనస్ అయింది. ఆ తరువాత పెళ్లి, పిల్లలు. భర్త డాక్టర్ రామాచారి, ఇద్దరబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి లావణ్యలత కోఠి సంగీత నృత్య కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. చిన్న కూతురు నిత్యసంతోషిణి సినిమా ప్లేబ్యాక్ గాయనిగా అనేక పాటలు ఆలపించారు. ‘‘నా చిన్నకూతురు నేను సాధించలేనివన్నీ సాధిస్తున్నందుకు చాలా గర్వంగా వుంది. విశేషమేమిటంటే ఆమె ప్రతి దేవునిపై పాటలు పాడింది. నాకు రాని అవకాశాలు నా కెరీర్‌లో ఇపుడు నా బదులుగా నా కూతురు నిత్యసంతోషిణి అద్భుతంగా పాడి అందరి మన్ననలు పొందుతుండడం చూసి నేను విజయం సాధించాను అనుకుంటాను. ఇపుడు పిల్లలందరూ వారి జీవితాల్లో స్థిరపడిపోయారు. 1990 నుండే అనేకమందికి మా ఇంట్లోనే సంగీత పాఠాలు నేర్పిస్తున్నాను’’ అంటూ తన జీవిత ప్రస్థానాన్ని తెలియజేశారు. రామలక్ష్మి కంపోజ్ చేసిన ఓ రేడియో గీతం ఆలిండియా లెవెల్‌లో ప్రథమ బహుమతి సాధించింది. ఢిల్లీలో ఆమెకు, బృందానికి సత్కారం చేశారు. ‘సినిమా పరిశ్రమనుండి ఎటువంటి గుర్తింపూ లేకపోయినా నేను ఏనాడూ బాధపడలేదు. అంతా ఆ పైవాడే చూసుకుంటాడన్నదే నా అభిమానం’ అని గుండె నిబ్బరంతో చెప్పారు. సి.నారాయణరెడ్డి, దేవులపల్లి కృష్ణశాస్ర్తీ లాంటి గొప్ప కవులు రచించిన భావగేయాలు రామలక్ష్మి బాణీలు కట్టి అద్భుతంగా ఆలపించేవారు. ఆహ్లాదిని మ్యూజిక్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా ఎంతోమంది సంగీత కళాకారులను తీర్చిదిద్దారు. ఓసారి ఎస్.జానకి కలిసినపుడు ఆమె ముందు రామలక్ష్మి ఆలపించిన ఈమాసపు పాటలోని ‘సాగుమా నీలమేఘమా’ పాటను ఆలపించారు. అది విన్న ఎస్.జానకి అప్పటి కాలంలో ఈ పాట రేడియోలో వస్తే, నేను రాసుకొని మరీ ఈ పాటను నేర్చుకున్నానని చెప్పారట. అది విన్నపుడు నా ఒళ్లు పులకరించింది అని చెబుతారు రామలక్ష్మి. హైదరాబాద్ నేపథ్యంలో వున్న ఫిలిం టాలెంటెడ్ గిల్డ్ వారు ఓ కార్యక్రమం ఏర్పాటుచేసి ఘంటసాలకు, కె.వి.మహదేవన్‌లకు సన్మానం చేయడం, దానిలో నేను పాల్గొనడం నా జీవితంలో ఓ మధురమైన అనుభూతి అంటారు రామలక్ష్మి.

-సరయు శేఖర్, 9676247000