సబ్ ఫీచర్

తెలుగుపై నిర్లక్ష్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు మన మాతృభాష. మధురమైన భాష. వనె్న తరగని భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తింపబడిన భాష. అచ్చ తెలుగు నుడికారాలు, ఛందస్సులు, పదప్రయోగాల్లో చురుక్కులు, చమక్కులు, ప్రాంతాల వారీగా యాసలు మొత్తంమీద మన తెలుగు నిజంగా వెలుగు భాషే. ఆధునిక తెలుగుభాషా సాహిత్య యుగకర్త అయినటువంటి గిడుగు వెంకట రామమూర్తి జయంతి (ఆగస్టు 29)ని మనం తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే.. 2025 సంవత్సరానికి హిందీ తప్ప మలయాళీ, బెంగాలీ, తమిళం మాత్రమే ప్రాంతీయ భాషలుగా ఉంటాయి. తెలుగు అంతరించిపోయే ప్రమాదం ఉందని యునెస్కోవారు చెపుతుంటే అది విన్న ప్రతీ తెలుగువాడి గుండె కలుక్కుమనక మానదు.
మన సమాజంలో ఇంగ్లీషు రావడమే ఒక జ్ఞానం; హిందీ నేర్చుకోవడమే జాతీయత అనే అభిప్రాయాలు నేడు బలంగా పాతుకుపోయాయి. సమాజంలో పైస్థాయికి ఎదగాలంటే అది ఇంగ్లీషు ద్వారా సాధ్యమనే భావం ఈనాడు వ్యాప్తిలో ఉంది. భారతీయులందరికీ ఒకే భాష ఉండాలనే అభిప్రాయంతో మనం హిందీని అదనంగా తెచ్చిపెట్టుకొంటున్నాం. ఆ రెండింటితోనూ ఏ విధంగానూ తక్కువ కానిది, సమాజానికి ఎక్కువ ప్రయోజనకరమైనది అయిన మన మాతృభాష తెలుగును ఉపేక్షిస్తున్నాం. ఏ సమాజానికైనా విద్యావిధానం మాతృభాషలో కొనసాగినప్పుడే దాని ఫలాలు ఎక్కువ మంది ప్రజలకు అందుతాయనే సత్యాన్ని పెడచెవిని పెడుతున్నాం. నిజానికి ఒక భాష ఎక్కువ మరో భాష తక్కువ అని సహజంగా ఏమీ ఉండదు. ఇతర దేశీయ విజ్ఞానాన్ని మనం తెచ్చుకొన్నప్పుడు దానితోపాటు ఆ ఇతర దేశీయ భాష కూడా వస్తుంది. పదార్థాన్ని ఒక పాత్రనుంచి మరో పాత్రలోకి మార్పుచేసినట్లు విషయాన్ని పరాయి భాషనుంచి మన మాతృభాషలోకి మార్చుకోవాలి. అప్పుడా విజ్ఞానం మాతృభాషీయులందరికీ అందడానికి అవకాశం ఉంటుంది. కానీ మన విద్యావేత్తలు పరాయి భాష ద్వారా వచ్చిన విజ్ఞానాన్ని మాతృభాష ద్వారా వినియోగంలోకి తీసుకొని రావడంలో ఉత్సాహం చూపడం లేదు. అందుచేత మాతృభాషా సమాజంలో విషయం మీద గల గౌరవభావం చేత, ఆ విష యం ఉన్న పరాయి భాష కూడా గొప్పదనే భావం కలుగుతోంది. అలాగే ఆ భాష వచ్చిన వారికి గౌర వం దక్కుతోంది. ఇలా అన్యభాషలు వచ్చిన అల్పసంఖ్యాకులు మేధావులుగా చెలామణీలోకి వచ్చి వారి ప్రయత్నలోపం చేత విజ్ఞానాన్ని తెలిసికోవడానికి అధికులైన మాతృభాషీయులకు అవకాశం లే కుండాపోతోంది. ఇది చాలా అసహజమైన సంఘ వినాశకరమైన లక్షణం.
నిజానికి భాషకు మనిషికి ఉన్న సంబంధం మానవ సమాజం ఆవిర్భవించినప్పటినుంచి ఉం ది. ప్రపంచంలో ఒక నిర్ణీత ప్రదేశం, ప్రత్యేక భాష, సంస్కృతి, చరిత్ర కలిగి ఉన్న జన సముదాయానికి ఒక జాతి అని పరిగణన. ఈనాడు భాషాపరంగానే జాతికి ప్రత్యేక గుర్తింపు కలగడం ఎక్కువైం ది. భాషకు పరమప్రయోజనం, మానవుల మధ్య భావ ప్రసరణకు ప్రధాన వాహికలా ఉపయోగపడటమే. భాషకు జాతి ద్వారానూ, జాతికి భాష ద్వా రానూ గుర్తింపు ఉంది. జాతి విధానం, ఆలోచనాసరళి కూడుకుని సంస్కృతిగా రూపొందుతుంది. సంస్కృతి రూపుదిద్దుకోడంలో జాతికి ముఖం వంటి మాతృభాష ప్రధాన పాత్ర వహిస్తుంది. మా తృభాషా సాహిత్యాల వికాసానికి సంస్కృతి నేపథ్యంగా ఉంటుంది. పర్యవసానంగా భాషకు అంతరంగంలా సంస్కృతి, సంస్కృతికి వెనె్నముకలా భాష ఏర్పడతాయి. ఇలా ఒక జాతి భాషా సంస్కృతులు పరస్పర సహకారంతో అభివృద్ధి చెందుతాయి. ఒక జాతికి, దాని భాషా సంస్కృతులకు విడదీయరాని సంబంధం ఏర్పడుతుంది. అందుచేత మన మాతృభాషా స్థాయిని ఎంత పెంచుకుంటే, మన సంస్కృతి అంత ఉచ్ఛస్థితిలో ఉంటుంది. ఈ రెండింటివలన సమాజం మరింత అభివృద్ధి సాధించగలుగుతుంది.
అయితే ప్రస్తుతం మన సాధారణ వ్యవహారంలోనేకాక విద్య, పాలన, రచన, వ్యాపారాది అనేక రంగాలలో ఆంగ్లభాషా పదాల వ్యవహారం అనివార్యమయింది. పరభాషా ప్రచారానికి నేటి ప్రసార మాధ్యమాలు ముఖ్య వేదికలుగా మారాయి. ఇవి ప్రజల భాషలను మరచి వేలంవెర్రిగా పరభాషా పదాలను, పాఠ్యరీతుల్ని అనుసరిస్తున్నాయి. నేడు టీవీ మాధ్యమంలో వాడే భాషను తీసుకుంటే వారు వాడే ఆంగ్ల పదాలకు సమానార్ధకాలైన తెలు గు పదాలు ఉన్నా వినియోగించడం లేదు. ఒక్క వాక్యం చెబితే ఒక్క ఆంగ్ల పదమైనా వాడడం తప్పనిసరి అన్నట్లు భాషను తయారుచేస్తున్నారు. ఇక మన తెలుగు సినిమాల సంగతి చెప్పక్కర్లేదు. తెలుగు సినిమాల్లో తెలుగు అంతంత మాత్రమే. ఉచ్ఛారణలు ఎలా ఉన్నా వాక్యంలో పదాల విరుపులు అర్ధాన్ని నాశనం చేసేలా తయారయ్యాయి. పాత్రోచిత భాషకోసం తపిస్తూ వ్యవహారిక భాషను భ్రష్టు పట్టిస్తున్నారు. పాటల్లో తెలుగు పదాల్ని ప్రత్యేకంగా ఏరుకోవాల్సి వస్తుంది. సినిమా పేర్లుకూడా తెలుగులో లేకుండా సగం తెలుగు, సగం పర భాషను ఆశ్రయించే స్థితిలో మన నిర్మాతలు, దర్శకులు ఉన్నారు. ఈ విషయం లో మన వార్తాపత్రికలు కొంతలోకొంత మేలనే చెప్పాలి. కానీ ఇటీవల కొన్ని పత్రికలు యధేచ్ఛగా పరభాషా పదాలను కావాలని చొప్పిస్తున్నాయి. ఒకప్పుడు తెలుగు సరిగా రాయడం రాకపోతే రోజూ వార్తాపత్రిక చదువుకుంటే చక్కటి తెలుగు వస్తుంది అనేవాళ్ళు. ఇప్పుడు ఆ మాటను వెనక్కి తీసుకోవాలేమో అనిపిస్తుంది. విద్య అంటే జ్ఞానంకోసం అనే అర్థంపోయి ఉద్యోగంకోసం, సంపాదనకోసం అనేది బలంగా నాటుకుపోయింది. అమెరికావంటి దేశాలకు ఉద్యోగస్తులను ఎగుమతిచేసే విద్యావిధానానికి మన దేశం ఎప్పుడో అలవాటు పడిపోయింది. ఇలాంటి విద్యావిధానంలో మాతృభాషలో బోధన గురించి ఆలోచించడం వింతగానే అనిపిస్తుంది. ప్రపంచం కుగ్రామంగా మారిన నేటి రోజుల్లో, అన్నిరంగాల్లో పోటీ పడాలంటే మనకీ ఆంగ్లంలాంటి అంతర్జాతీ య భాషలపై పట్టు వుండాలి. అలా అని చెప్పి మన తల్లిలాంటి మాతృభాషని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబబో మనం ఆలోచించుకోవాలి.

- కూసంపూడి శ్రీనివాస్ సెల్: 9000165971