సబ్ ఫీచర్

భలే కృష్ణ.. భళా రామకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడే ఎదుగుతున్న ఓ కుర్రాడికి -రెండు పాత
సినిమాలు ప్రేరణయ్యాయి. ఎందుకు
నచ్చుతున్నాయో తెలీదు కానీ -ఎన్నిసార్లు
చూస్తున్నాడో మాత్రం తెలుస్తూనే ఉంది. కాని -ఎప్పుడు చూసినా.. అప్పుడే చూస్తున్నట్టుండే భావన. చూసిన ప్రతిసారీ మది గదిలో ఏదో తెలీని ఆనందం. కొన్నాళ్లకు అర్థమైంది
-పదిమందికీ ఆనందాన్ని పంచటంలోని
పరమార్థమే కళ అని. తరువాత అదే అతని
చిటికెన వేలు పట్టుకుని నడిపించింది.
నడిపిస్తోంది. నడిపిస్తూనే ఉంది.
అలౌకిక కళానందంలో సుదీర్ఘ ప్రయాణం
సాగిస్తోన్న అతను -అక్కిరాజు సుందర రామకృష్ణ. వెనె్నల అతిథిగా కళానుభవాలను
మనసు ముచ్చట్లుగా పాడుతోన్న
గౌరవనీయ బాటసారి.
ప్రపంచాన్ని అర్థం చేసుకునే వయసొస్తున్న సమయంలో-
వీరాభిమన్యు చిత్రంలోని పాటా, పద్యం ఆయనకు కంఠస్థం. భామావిజయంలో యన్టీఆర్- దేవికల సాత్విక నటన, దర్శకుడి విజన్ ఆయనకు ప్రీతి. ఆ సినిమాలు చూస్తున్నపుడు ‘్భలే’ అన్న ఆనందం కలిగేది. ఆ ప్రేరణ ‘్భళా’ అన్న స్థితికి తీసుకెళ్లింది. ఘంటసాలకు ఏకలవ్య శిష్యుడు. అభినవ ఘంటసాల అయ్యాడు. యన్టీఆర్ కృష్ణ పాత్రకు నటనాముగ్దుడు. అభినవ కృష్ణ, నటనాభినవ రామకృష్ణ, ఏకైక జమునాకృష్ణ అయ్యాడు. అనేక కృష్ణావతారాలెత్తిన కళాకారుడే -అక్కిరాజు సుందర రామకృష్ణ.
***
అక్కిరాజు రామయ్యపంతులు, అన్నపూర్ణమ్మలది నరసరావు పేట. నలుగురు అన్నలు, ఇద్దరు అక్కల తరువాత పుట్టిన సంతానం రామకృష్ణ. తండ్రి మ్యాథ్స్, ఇంగ్లీషు టీచరవ్వడంతో అక్షరజ్ఞానం అబ్బింది. నరసరవుపేట రాజాగారి కోటలో షణ్ముఖి ఆంజనేయరాజు, ఏ.వి.సుబ్బారావు, రఘురామయ్యలలాంటి ఆ కాలంలో వున్న లబ్దప్రతిష్ఠులైన నాటక రంగ స్రష్ఠలు ప్రదర్శించే నాటకాలు చూసే అదృష్టం కలిగింది. వారిలా తానూ పద్యం పాట పాడాలన్న అభినివేశం పాఠశాలలో స్నేహితులు, ఉపాధ్యాయుల వెన్నుదన్ను తోడైంది. ఘంటసాల వారి పాటలు అంటే అక్కిరాజు మాత్రమే అన్నట్లుగా సాగింది పాఠశాల చదువు. దానికితోడు ఏ నటుడి గాత్రాన్నైనా, నటననైనా అనుకరణ చేసే విద్య అదనంగా చేరింది ఆయనలో. ముక్కామల, రాజనాల, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సిఎస్‌ఆర్ లాంటి అప్పటి లెజెండరీ నటుల ఆంగికం, వాచకం ఆయనలో ప్రస్ఫుటంగా ద్యోతకమయ్యేవి. వీరాభిమన్యు చిత్రంలో ‘చూచి.. వలచి.. చెంతకుచేరి’ అన్న శహనరాగంలో బాణీ గుండెకు హత్తుకుంది. రాజనాలపై చిత్రీకరించిన మాధవపెద్ది సత్యం ఆలపించిన ‘బానిసలమంటూ..’సాగే పద్యం మస్తిష్కంలో నిలిచిపోయింది. ఒకవైపు పాట, మరోవైపు పద్యం రామకృష్ణ ఎదుగుదలకు తోడ్పడ్డాయి. దానికితోడు నండూరి కృష్ణమాచార్యులు, ఆచార్య తిరుమల వంటి వారు ఎన్టీఆర్‌కన్నా నువ్వే గొప్ప కితాబిచ్చేశారు. అలా ఎందుకంటే.. ఎన్టీఆర్ నటన మాత్రమే చేయగలడు, పాడలేడు, నువ్వు పాడగలవు, నటించగలవు. అందుకే ఆయనకన్నా గొప్ప అంటున్నాము అన్నమాటతో సుందర రామకృష్ణ తనలోని నట గాయకుడిని నిద్రలేపాడు. నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ చదువు పూర్తయ్యాక 1965లో పియుసి చదవడానికి అన్నలు ఉన్నందువల్ల హైదరాబాద్ వచ్చేశారు. మళ్లీ డిగ్రీ చదవడానికి ఎస్‌ఎస్ అండ్ ఎన్ కాలేజీ, నరసరావుపేటకే వెళ్లిపోయారు. అక్కడ విద్యతోపాటు సంగీతం, నాటకం విభాగాల్లో కృషిచేశారు. ప్రతి సంవత్సరం బహుమతులు సుందరరామకృష్ణనే వరించేవి. అలా నటుడికి కావలసిన సామగ్రి, సరంజామా అంతా ఈ వయసులోనే నేర్చుకున్నారు. సినీమయం అయిన మద్రాస్ వెళ్లినా నాటకాలు ఆడి విజయం సాధించగలవు అన్న గురువుల మాట మరింత ధైర్యాన్నిచ్చింది. మళ్లీ ఎం.ఏ తెలుగు చదవడానికి హైదరాబాద్ నిజాం కాలేజీకి వచ్చాడు. ఎం.ఒ.ఎల్, పిహెచ్‌డి (వేంకట పార్వతీశ్వర కవుల పద్యకృతులు) పూర్తిచేశారు. పనిలో పనిగా నిజాం కాలేజీలోనే థియేటర్ ఆర్ట్స్‌లో ఎంఏ పట్టా కూడా అందుకున్నారు. దూరదర్శన్ ప్రారంభం నుండి ఆచార్య నాగార్జున, భువనవిజయంలో తెనాలి రామకృష్ణ లాంటి ఎన్నో ఎపిసోడ్స్‌లో నటించారు. దాదాపు అన్ని ప్రాంతాలలో భువనవిజయం 1000 ప్రదర్శనలు పూర్తిచేశారు. దూరదర్శన్ ఢిల్లీనుండి ప్రసారమైంది. మళ్లీ అడుగులు సినిమా కెమెరావైపు పడ్డాయి. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలో మెరుపులా ఓ చిన్న పాత్రలో మెరిశారు. తొలి టేక్ ఓకె అవగానే దర్శకుడు వెన్నుతట్టి ప్రోత్సహించారు. మళ్లీ నాటకాలవైపు వచ్చి లబ్దప్రతిష్ఠులైన అనేకమంది నట గాయకుల నాటకాలు ప్రదర్శించారు. ముఖ్యంగా సినీ నటి జమునతో కలిసి ప్రదర్శించిన శ్రీకృష్ణ తులాభారం ఖండాంతరాలు దాటి ప్రేక్షకులను అలరించింది. రాంగోపాల్‌వర్మ, నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన శివ చిత్రం గుర్తింపు తెచ్చింది. జీవిత-రాజశేఖర్‌ల ఇంద్రధనస్సు, ఆగ్రహంలో గవర్నర్‌గా, శివయ్య, ధర్మచక్రం, ఎగిరే పావురం, శ్రీవారికి ప్రియురాలు, దోషి నిర్దోషి, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, ప్రేమకథ, అన్నదమ్ములు, బాలచంద్రుడు, ప్రచండ భారతం, ప్రెసిడెంటుగారి పెళ్లాం, ముఠామేస్ర్తీ, సూర్య ఐపిఎస్, ధృవనక్షత్రం, సొగసు చూడతరమా లాంటి చిత్రాలలో నటించారు. చివరిగా ఠాగూరు చిత్రంలో నటించారు. సెట్స్‌లో గ్యాప్ వచ్చిందీ అంటే, అక్కిరాజు సుందరరామకృష్ణ పద్యాలు, పాటలను ఆయా సెట్స్‌లో వున్న నటీనటులు గుమ్మడి, గిరిబాబు, సారథి, ఎం.ఎస్.రెడ్డిలు ఇష్టపడి పాడించుకొని మరీ ఆనందించేవారు. అప్పటి తరం అంతగా ఆనందంగా సెట్స్‌లో గడిపేది.
రాజకీయ చదరంగం సినిమా షూటింగ్ జరుగుతోంది. పి.చంద్రశేఖర్‌రెడ్డి దర్శకుడు, లక్ష్మణగోరె కెమెరామెన్. ఏఎన్నార్, అక్కిరాజుల కాంబినేషన్‌లో షాట్ తొలి టేక్‌లోనే ఓకె అయింది. ‘‘నాతో కలిసి నటించినప్పుడు మీకేం భయమనిపించలేదా?’’ అని ఏఎన్నార్ ప్రశ్న. ‘‘మీతో కలిసి నటించడం ఆనందం కదా! ఆ ఆనందంలోనే భయం అనే మాటను మర్చిపోయాను’’ అని అక్కిరాజు జవాబు. ఆ తరువాత కాళిదాసు పద్యాలు, అమ్మవారి దండకం పాడించుకున్నారాయన. అదంతా విని ఓహో.. మీరు గాయకులు, నటులు అన్నమాట అని ఒక చెణుకు విసిరి నవ్వించారు ఏఎన్నాఆర్. ‘‘ఎన్టీఆర్‌తో శ్రీనాథ కవిసార్వభౌముడు షూటింగ్ జరుగుతోంది. సుబ్బరాయశర్మ, కోట శంకర్‌రావు, నేనూ సీన్‌లో ఉన్నాం. అనుకోకుండా నా పాత్రకే ఎక్కువ సుదీర్ఘమైన డైలాగులున్నాయి. అవన్నీ ఒంటబట్టించుకొని సింగిల్ టేక్‌లోనే చెప్పగానే ఉత్సుకత ఆపుకోలేని ఎన్టీఆర్ ఓవైపు రీల్ తిరుగుతున్నా మరోవైపు మీ పేరేంటి? అని అడిగేశారు. వెంటనే కెమెరామెన్‌తో సహా దర్శకుడు బాపు కట్ అనేశారు. నేను నటిస్తున్నా.. నా గురించి తెలుసుకోవాలని ఆయన ప్రయత్నం. కానీ అవతల షూట్ నడుస్తోంది. ఆ తరువాత ఆయనను కలిసి నా కృష్ణ పాత్రల ప్రయాణం గురించి చెప్పాను. ఆయన చాలా సంతోషించారు. ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీ ఏపి గెస్ట్‌హౌస్‌లో ఆయన వచ్చినపుడు ఆయన ముందే కృష్ణుడిగా నాటకం వేశా. ‘జమునగారు మీరు వేసిన కృష్ణతులాభారం నాటకం నేను గతంలోనే చూశాను బ్రదర్’ అని ఆప్యాయంగా దగ్గరకి తీసుకున్నారు’’ అని గుర్తుచేసుకున్నారు. ఓరకంగా జమున ప్రోత్సాహంతోనే శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణుడిగా వేసి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకున్నానంటారాయన. ఆంధ్రదేశం నుండి అమెరికా వరకూ ప్రతి పల్లెలో, పట్టణాల్లో ఈ నాటకం ప్రదర్శించడంతో నా జన్మ ధన్యమైంది అంటారాయన. ఓసారి అల్లసాని పెద్ద సీరియల్ షూటింగ్ జరుగుతోంది. ఛోటా కె నాయుడు కెమెరామెన్. డైలాగు మిస్ అయితే డబ్బింగ్‌లో చెప్పుకోచ్చు, కానీ పద్యం మొత్తం డబ్బింగ్‌లో చెప్పడం చాలా కష్టమైన ప్రక్రియ. అలా ఆయన డబ్బింగ్‌లోనే లిప్ మూవ్‌మెంట్‌కు అనుగుణంగా పద్యం పాడేశారు. అందరూ మెచ్చుకోవడంతో నూతన ఉత్సాహం వచ్చింది. పుష్పాల గోపకృష్ణ, లక్ష్మణ్ గోరె, విఎస్‌ఆర్ స్వామి లాంటి కెమెరామెన్లు అనేక చిత్రాల్లో నటించినపుడు సింగిల్ టేక్ ఆర్టిస్టుగా గుర్తింపునిచ్చారు. మర్యాద రామన్న, కుమ్మరి మొల్ల, స్వామి అయ్యప్ప లాంటి సీరియల్స్ నటించారు. తెలుగు సాహిత్యానికి సంబంధించిన ఎపిసోడ్స్‌లో భాగంగా శ్రీనాధుడిగా, భక్తపోతనలో, ఆదికవి నన్నయ్యలో నన్నయ్యగా, ద్రౌపది మాన సంరక్షణలో భీష్ముడిగా, చింతమణిలో బిల్వ మంగళునిగా నటనకు గుర్తింపు వచ్చింది. వీటన్నింటిలోకెల్లా శ్రీనాథుడిగా ఆయన పద్య పఠనానికి అద్భుతమైన పేరు వచ్చింది. పద్య పఠనంలోని విరుపు, రాగంలో ఆయనది అందెవేసిన కంఠం.
సతీమణి లక్ష్మీకుమారి, సంతానం బిళహరి, సుగాత్రి, జయదేవ్ ముగ్గురూ అమెరికాలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. ముఠామేస్ర్తీ షూటింగ్ జరుగుతోంది. చిరంజీవితో ప్రమాణ స్వీకారం చేయించే సందర్భంలో అక్కిరాజు గవర్నర్‌గా నటిస్తున్నారు. అక్కడికి వచ్చిన అల్లు రామలింగయ్య గవర్నర్ వేషధారిని చూసి ‘‘నార్త్‌నుంచి పిలిపించారా, ఎవరీయన’’ అడిగారట. అప్పుడు అక్కడ వున్న గుమ్మడి, ‘‘ఆయన పదహారణాల తెలుగవాడు, మంచి రచయిత, గాయకుడు’’ అని పరిచయం చేశారు. ఓహో! అలాగా, నేను మరోలా ఊహించుకున్నాను అంటూ ఆ తరువాత స్నేహితునిగా మారిపోయారు అంటూ గుర్తుచేసుకున్నారు అక్కిరాజు. సినిమాలే కాక సీరియల్స్, టెలీఫిలింస్, వ్యాపార ప్రకటనలు, డబ్బింగ్ లాంటి అన్ని ప్రక్రియలలో అభినివేశం ప్రదర్శించి ప్రతిభను చూపారాయన.

-సరయు శేఖర్, 9676247000