సబ్ ఫీచర్

భారతీయతను ప్రేమించే బౌద్ధగురువు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిబెటియన్ల ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా ఇటీవల బౌద్ధులనుద్దేశించి కొన్ని ‘రాడికల్’ భావాలు వ్యక్తం చేశారు. అవి అందరూ ఆలోచించదగ్గవి. ముఖ్యంగా బౌద్ధమత అవలంబికులు. మత విశ్వాసం కన్నా విజ్ఞానం ముఖ్యమని ఆయన ఇటీవల నాగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనంలో అన్నారు. ఏ రకంగా చూసినా ఇది గొప్ప పరిణామం. రాడికల్ వ్యక్తీకరణ. భారతీయ విలువలకు ఆయన పెద్దపీట వేశారు. మత విశ్వాసం కన్నా అందులోని అంతర్గత లక్ష్యాలను అర్థం చేసుకోవడానికి ‘విజ్ఞానం’ ఎంతో అవసరమని గుర్తుచేశారు. బౌద్ధులు 21వ శతాబ్దపు బౌద్ధులుగా ఉండాలని తాను చాలా కాలంగా చెబుతూనే ఉన్నానని, వర్తమాన ఆలోచనల్ని, విజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని ‘అధ్యయనం’ చేయాలని పిలుపునిచ్చారు.
కేవలం బౌద్ధమతం పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఆ ‘మతం’ చిరకాలం నిలవదని ఆయన కుండబద్దలు కొట్టారు. విజ్ఞానం ప్రాతిపదికగానే మతాన్ని అధ్యయనం చేయాలని మరీమరీ సూచించారు. ఇదెంతో కీలకమైన అవగాహన, ఆలోచన. దీనిపై మరి ఎంతమంది బౌద్ధులు మనసుపెట్టి ఆలోచన చేస్తారో? అన్ని వ్యాధులకు ఒకే మందు సంజీవనిలా పనిచేయదని, బౌద్ధం సైతం అంతేనని ఆయన నిర్మొహమాటంగా పేర్కొన్నారు.
పది దేశాల నుంచి వచ్చిన వందలాది మంది బుద్ధిస్టు సన్యాసులు, ‘స్కాలర్స్’ తదితరులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ తాను నలందా-టిబెటియన్ బుద్ధిస్టు మార్గాన్ని అనుసరిస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పుడున్న అనేక బుద్ధిస్టు మార్గాలలో ఇది సరికొత్తది. భారతీయ మూల భావనలకు దలైలామా అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అదే ఆయన మార్గంగా ఉబికి వచ్చింది. నాగపూర్‌లోనూ అదే ధోరణిలో ప్రసంగం చేశారు. భారతీయ సంప్రదాయ విలువలైన అహింస, కరుణ, ప్రేమ, దయాగుణం, సామరస్యం, సద్భావన అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వర్తమానంలో ప్రపంచశాంతిని సాధించేందుకు మత సామరస్యం కీలకమని, మతాల పేర కొన్ని గ్రూపులు-సంస్థలు ఘర్షణ పడుతున్నాయని, వాస్తవానికి మతాలన్నీ కరుణ-ప్రేమను బోధిస్తున్నాయని, హింసకు పాల్పడుతున్న వారి వైఖరి వైఖరి సరైనది కాదన్నారు.
కొన్ని మాసాల క్రితమే 84వ జన్మదినం జరుపుకున్న దలైలామా ఇప్పటికీ చాలామందిని ప్రభావితం చేస్తున్నారు. టిబెటియన్లకు ఆరాధ్యదైవంగా భాసిల్లుతున్నారు. 15వ దలైలామా ఎంపికపై కూడా ప్రస్తుత దలైలామా రాడికల్ భావాలను వ్యక్తం చేశారు. సంప్రదాయబద్ధంగా గాక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక చేయాలని ఆయన చెబుతున్నారు. ప్రస్తుత సంప్రదాయపద్ధతి ఫ్యూడల్ రూపంలో ఉందని, దానికి స్వస్తి పలకాలన్నది ఆయన ‘రాడికల్’ అభిప్రాయం. కొత్త దలైలామాను ‘అజ్ఞాత’ టిబెటియన్ల నుంచి ఎంపికచేస్తే తాము అంగీకరించబోమని చైనా ఇటీవల తెగేసి చెప్పింది. దాంతో ఈ విషయంలో వివాదం రగులుకుంది. టిబెట్ ఇప్పుడు చైనాలో అంతర్భాగం కాబట్టి చైనా ‘నియంత్రణ’ స్పష్టంగా కనిపిస్తోంది. 14వ దలైలామాకు ఆశ్రయమివ్వడం, అజ్ఞాతంగా ప్రభుత్వాన్ని (పాలనను) కొనసాగించేందుకు వీలుకల్పించడం లాంటి తదితర అంశాలపై చైనా భారత్‌పై ఆగ్రహంతో ఉంది. చాలా సందర్భాలలో ఈ ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తం చేసింది. దౌత్యపరమైన విరోధం పెంచుకుంది.
దలైలామా వారసుని ఎంపిక ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు చేపట్టాలన్న మాట ఇటీవల కాలంలో వినిపిస్తోంది. చైనా ఇందుకు కూడా అంగీకరించడం లేదు. టిబెట్ తమ భూభాగం కాబట్టి ‘మతగురువు’ను తామే నిర్ణయిస్తామని చైనా వాదిస్తోంది. తమను గత 60 ఏళ్లుగా అనేక అవమానాలకు, కష్టాలకు, కన్నీళ్ళకు గురిచేసింది కనుక చైనాపై టిబెట్ ప్రజలకు లేశమాత్రం ‘గురి’ లేదు. గతంలో పంచన్‌లామాను బంధించి చైనా హత్యచేసిందని టిబెటియన్లు బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుత దలైలామా భారత్‌లోని ధర్మశాలకొచ్చి ఆశ్రయం పొందడానికి కారణం చైనాయేనని టిబెటియన్లు మండిపడుతున్నారు.
క్రైస్తవమత దేశాలు ‘పోప్’ను ఎంపిక చేసినట్టు దలైలామా వారసుడిని ఎంపిక చేసే ‘హక్కు’ తమకు ఉందని చైనా వాదిస్తోంది. చైనా ఎలా వాదించినా, ఎంత వాదించినా దానిపై టిబెటియన్లకు విశ్వాసం లేదు. 1954లో ప్రస్తుత దలైలామా చైనాకు వెళ్లి మావో జెడాంగ్, డెంగ్ జియా వోపింగ్, చౌఎన్‌లై లాంటి కీలక కమ్యూనిస్టు నాయకులను కలిసి టిబెట్ వాదనలు వినిపించినా కనికరించకుండా 1959లో చైనా పీపుల్స్ ఆర్మీ (రెడ్ ఆర్మీ) టిబెట్‌లోకి ప్రవేశించింది. రాజధాని లాసాను నేలమట్టం చేసింది. వేలాది మంది బౌద్ధసన్యాసులను కాల్చి చంపారు. బౌద్ధ మఠాలను, ఆరామాలను, ఆలయాలను ధ్వంసం చేశారు. టిబెట్ జాతీయ భావనను పూర్తిగా తుడిచేశారు. టిబెటియన్లు చేసిన తిరుగుబాటు, ప్రతిఘటన పూర్తిగా విఫలమైంది. ఆ తరువాత చైనా సైన్యం మరింత రెచ్చిపోయి బౌద్ధాన్ని భూస్థాపితం చేసేందుకు కంకణం కట్టుకుంది. బౌద్ధ ధ్వజాల స్థానే ఎర్రజెండాలు ఎగిరాయి. బౌద్ధమతస్తులు పవిత్రంగా భావించే అనేక వస్తువులను, వారసత్వ సంపదను, చిత్ర-శిల్పకళను, గ్రంథాలను అగ్నికి ఆహుతి ఇచ్చారు. 1966-76 నాటి సాంస్కృతిక విప్లవ కాలంలో ఇది తారస్థాయికి చేరింది. ‘రీ ఎడ్యుకేషన్’ పేర కమ్యూనిజాన్ని బౌద్ధ సన్యాసులకు, అక్కడి ప్రజలకు బోధించారు. అనంతర కాలంలో అసంఖ్యాక చైనీయులను టిబెట్‌లో దింపి టిబెటియన్లను మైనార్టీ ప్రజలుగా మార్చేసింది. ఆ రకంగా టిబెటియన్లు తమ ‘ఆత్మ’ను కోల్పోయారు. ఈ సంక్షుభిత సమయంలో 1959-60లో దలైలామా తన అనుయాయులు, తదితరులతో టిబెట్ నుంచి ‘పారిపోయి’ భారత్‌కు వచ్చి ధర్మశాలలో ఆశ్రయం పొందారు. అప్పటినుంచి చైనా వీరిపై కత్తికట్టింది. విరోధులుగానే చూస్తోంది. సమయం-సందర్భం వచ్చినప్పుడల్లా బెదిరిస్తూనే ఉంది. వారికి ‘సాయం’అందించే వారిపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. భారత్‌పై అనేకమార్లు ఈ విషయమై విరుచుకుపడింది. దలైలామా వారసుని ఎంపిక విషయంలో ఇదే వైఖరి కనిపిస్తోంది.
1935 జూలై 6న జన్మించిన దలైలామా తానొక సాధారణ బౌద్ధ సన్యాసినని వినయంగా చెప్పుకుంటారు. ఈ వినయం, సామరస్యం, కరుణ, ప్రేమ, దయాగుణం ప్రదర్శించినందుకు ఆయన నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఈ అత్యున్నత ‘గౌరవం’ చైనా పాలకుల మనసును కరిగించలేదు. కించిత్ కూడా సడలింపు లేకుండా అదే ద్వేషభావం, తమను ఎదిరించారనే ఆక్రోశంతో రగిలిపోతున్నారు.
టిబెట్‌కు స్వాతంత్య్రాన్ని కోరడం లేదు, స్వతంత్ర ప్రతిపత్తి కల్పించినా సర్దుకుంటామని దలైలామా ఎన్నోమార్లు ప్రకటించినా చైనా పరిగణనలోకి తీసుకోలేదు. తమ విశ్వాసాలను, సంప్రదాయాలను గౌరవించాలని, తమ జీవన విధానాన్ని కొనసాగించేందుకు అంగీకరించినా చైనాలో అంతర్భాగంగా ఉంటామని దలైలామా పదేపదే చెప్పినా, రాయబారాలు పంపినా, అనేక వేదికల ద్వారా పేర్కొన్నా ఫలితం కనిపించడం లేదు. చైనా ప్రజలు తమ శత్రువులు కాదని దలైలామా అనేక ఇంటర్వ్యూలలో పేర్కొన్నప్పటికీ చైనా పాలకులు పట్టించుకోలేదు. చైనా ముఖ్యనాయకుల మనసు మారుతుందన్న ప్రగాఢ విశ్వాసంతో దలైలామా ఉన్నారు. అందుకే చైనాకు వెళ్ళి మాట్లాడతానని అనేకమార్లు అన్నారు. పలువిధాలుగా చర్చలు చేశారు. కాని పంచన్‌లామాను గతంతో బంధించి హతమార్చినట్టు తమ ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామాను చైనా బంధించి హతమార్చే అవకాశముందని టిబెటియన్లు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే చైనా వెళ్ళవద్దంటున్నారు. అలా ‘కమ్యూనిస్టు పులి’నోట్లో బౌద్ధం తల పెట్టినట్టు టిబెటియన్ల పరిస్థితి కనిపిస్తోంది. బౌద్ధంలో ‘గెలుగ్ మార్గా’నికి మార్గదర్శకుడిగా ఉన్న దలైలామా ఈ సంకటం నుంచి తన వారిని బయటపడేయగలరా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది.

-వుప్పల నరసింహం 99857 81799