సబ్ ఫీచర్

కార్మికుల ‘మైండ్‌సెట్’ మారాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సుఖాంతమైంది. ఎనె్నన్నో మలుపులు తిరిగి 55 రోజుల అనంతరం, ఎందరో బలిదానాల తరువాత సమ్మెకు తెరపడింది. సమ్మెను నడిపిన అశ్వత్థామరెడ్డి, ఆయన బృందం గాక సమ్మె బాణం ఎవరిపై ఎక్కుపెట్టారో వారు కార్మికుల మనసు దోచుకునేలా ఘన విజయం సాధించడం ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు.
1980 దశకంలో బొంబాయిలో మిల్లు కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించిన దత్తా సామంత్- ఇపుడు తెలంగాణ ఆర్టీసీ సమ్మె సందర్భంగా అనేకమార్లు గుర్తుకొచ్చారు. బొంబాయి మిల్లు యజమానుల సంఘం, మిల్లు కార్మికుల మధ్య వైరుధ్యాల వల్ల ఆనాటి సమ్మె సంవత్సరం పాటు కొనసాగింది. దాదాపు మూడు లక్షల మంది కార్మికుల కుటుంబాలు ఆ సమ్మెవల్ల చితికిపోయాయి. ఎందరో కన్నుమూశారు. మరెందరివో బతుకులు బుగ్గిపాలయ్యాయి. అయినా ‘మిలిటెన్సీ’ పోరాటం పేరిట దత్తా సామంత్ కొనసాగించిన సమ్మె ఇసుమంత ప్రయోజనం కార్మికులకు ఒనగూర్చలేదు. చాలామంది కార్మికులు భిక్షాటన చేయాల్సిన దీన పరిస్థితులు తలెత్తాయి.
ఆ దత్తా సామంత్ మాదిరి తెలంగాణలో ఇపుడు అశ్వత్థామరెడ్డి తదితరుల మొండి వైఖరి.. ‘మిలిటెన్సీ’ పోరాటం పేరిట సమ్మెను సాగదీయడం వల్ల ఆర్టీసీ కార్మిక లోకంలో ‘కల్లోలం’ ఏర్పడింది. మహిళలు తమ దీన స్థితిని మీడియా ముందు వ్యక్తం చేయడంతో చాలామంది కళ్లుచెమర్చాయి. అయినా కార్మిక సంఘ నాయకులు రాజకీయ పార్టీల మద్దతుతో, మరికొందరి ఆసరాతో అంతిమ విజయం తమదేనంటూ సమ్మెను ఉద్ధృతం చేయడం ఓ ‘చారిత్రక అవసరం’గా భావించి తమ స్థాయిని విస్మరించి, తమ పాత్రను గుర్తెరగకుండా ‘ప్రచ్ఛన్న ముఖ్యమంత్రి’ హోదాను ఆపాదించుకుని మాటల తూటాలను పేల్చారు. వాస్తవికంగా గాక మీడియాలో ఆ తూటాలు చాలా శక్తిమంతంగా పేలాయి. ఆ ‘భ్రమ’లో పడి రేపో మాపో సర్కారు పతనమై, తమకు మద్దతు ఇస్తున్నవారి ఆసరాతో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న ప్రధాన డిమాండ్ నెరవేరగలదన్న ‘అత్యాశ’తో అడుగులు వేశారు.
విచిత్రమేమిటంటే.. నాలుగు సంవత్సరాలలో 64 శాతం ఆర్థిక ప్రయోజనం అదనంగా అందుకుని మిగతా కార్పొరేషన్ల కన్నా ఎక్కువ జీతాలు అందుకుంటూ, ఎన్నో సౌకర్యాలు పొందుతూ కూడా మరిన్ని ప్రయోజనాల కోసం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కోసం సమ్మె కట్టడం అంత తార్కికంగా కనిపించదు. మిగతా కార్పొరేషన్ల కన్నా ఎక్కువ జీతాలు.. భత్యాలు.. సౌకర్యాలు అందుకుంటున్నామన్న ‘సోయి’ లేకుండా వ్యవహరించడం విడ్డూరం.
కార్మిక సంఘాలను నడిపే యూనియన్లు, వారి రాజకీయ మూలాలు... ఆ రాజకీయాలు- సిద్ధాంతాలు పూర్తిగా కాలం చెల్లినవని గుర్తించకపోవడంలో నాయకత్వం వైఫల్యం చెందిందంటే అతిశయోక్తి కాదు. ఆ రాజకీయాలు.. సిద్ధాంతాలు- కార్మికులు వేరు, యాజమాన్యం వేరు అన్న ‘సంకుచిత’ దృక్పథంతో, రంగు కళ్ళద్దాలు ధరించి చాలాకాలంగా చూస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా 21వ శతాబ్దంలో, వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధిని సాధించిన సందర్భంలో అది ఏమాత్రం ‘సత్యం’కాదు- వాస్తవం అసలే కాదు. ఈ ‘ఇంగితం’ విస్మరిస్తే అంతా తలకిందులుగా కనిపిస్తుంది. వామపక్ష రాజకీయ నాయకులు, నక్సలైట్లతో పాటు అందరూ ఈ ‘ఎర్ర’రంగు కళ్ళద్దాలతోనే వీక్షించడం కారణంగా సమాజ స్థితిగతుల్ని, సమ్మె అవసరాన్ని సరిగ్గా గుర్తించలేకపోయారు. కార్మికుల బలహీనతల్ని, భావోద్వేగాలను ఆసరా చేసుకుని తమ ‘ప్రతాపం’ ప్రపంచం ముందు ప్రదర్శించేందుకు ప్రయత్నించడం విషాదం.
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. వారే యజమానులన్న కీలక అంశాన్ని గుర్తెరగకుండా రాజుల కాలం నాటి రష్యా విప్లవం... చైనా విప్లవం... కార్మికుల సమరం... ఇట్లా దశాబ్దాల పూర్వపు భావజాలంతో ప్రభావితమై ఆ ఊపులో ఊపేస్తాం... గద్దె దింపుతాం... మెడలు వంచుతాం లాంటి తమోగుణం- రజోగుణం మాటల మత్తులో ఉద్రేకపడిపోవడంతో ఒరిగేది ఏమీ లేదని తేటతెల్లమైంది. సంస్థ తమది.. ఆ సంస్థకు తామే యజమానులమన్న భావన కలిగించకుండా సంస్థపై కత్తిగడితే తమ మెడపైనే ఆ కత్తి పడుతుందన్న ఇంగితం విస్మరిస్తే జరిగే పరిణామమేమిటో సమ్మె సమయంలో స్పష్టంగా కనిపించింది.
యాజమాన్యంతో తగువొచ్చినపుడు- నిరసన తెలపాలనుకుంటే ఎన్నో మార్గాలు చట్టం కల్పిస్తోంది. జపాన్‌లో అయితే కార్మికులు తమ నిరసనను అధిక ‘ఉత్పత్తి’ ద్వారా వ్యక్తం చేస్తారట. ఎక్కువ ఉత్పత్తివల్ల యాజమాన్యం లాభపడుతుందన్న భావనతో గాక తమ నిరసన మార్గంగా దాన్ని ఎంచుకోవడం విశేషం.
ఇలాంటి పద్ధతులు- నిరసనలు వామపక్ష రాజకీయాలను అనుసరించే వారికి గిట్టవు. ఎంతసేపు సంస్థకు ‘తాళం’ ఎప్పుడు వేయిద్దామా? అనే ఆలోచనతోనే అడుగులు ముందుకు వేస్తారు. ఆ రకంగా ‘‘పెట్టుబడిదారి వ్యవస్థ’’ను కుప్పగూల్చినట్టు ఆత్మసంతృప్తి చెందుతారు. ఈ సూత్రమే ఆర్టీసీకి వర్తింపజేస్తే అందులో ఏమైనా అర్థం కనిపిస్తుందా?.. పిడుక్కి- బియ్యానికి ఒకే మంత్రం తరహాలో వ్యవహరిస్తే విచక్షణ ఉన్నట్టా? లేనట్టా? వివేచన.. విచక్షణ.. విజ్ఞత అన్నీ సమ్మె హోరులో విస్మరించి ‘‘మిలిటెన్సీ’’నే పరమావధిగా భావించి, ఎటు పయనిస్తున్నామో తెలియక ఓ ప్రవాహంలో పడి కొట్టుకుపోవడంతో ఎవరి జీవితాలను ‘పణం’గా పెడుతున్నామన్న ధ్యాస కూడా లేకుండా మిలియన్ మార్చ్‌లు... దిగ్బంధాలకు వ్యూహాలు రచించడం విడ్డూరం. తాము కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కోమని చెప్పే రాజకీయ నాయకుల మాటలు ఎంతో హుషారునిస్తాయి, ఉద్రేక పరుస్తాయి. అలాంటి వారి అండ దొరకడమే అదృష్టంగా భావించి కార్మిక నాయకులు ఆవేశపడితే ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి? ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క లోక్‌సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ్ మాత్రమే వాస్తవిక దృష్టితో విశే్లషించి మాట్లాడారు. సూచనలు చేశారు.
మిగతా ప్రతిపక్ష నాయకులంతా ఎంతోకొంత లబ్దినాశించి, రాజకీయ ప్రయోజనం పొందేందుకు రెచ్చగొట్టారు తప్ప వర్తమాన రాజకీయ- సామాజిక- ఆర్థిక స్థితిగతులపై అవగాహనతో మాట్లాడిన పాపాన పోలేదు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా వినియోగం తగ్గి, ఆర్థిక చలనగతి తగ్గి, ఎందరో ఉపాధి కోల్పోతున్న దృశ్యం కనిపిస్తున్నా, ఆ వార్తలు వింటున్నా పట్టింపులేక తాత్కాలికంగా తమ పబ్బం గడుపుకోవడానికి ఓ ‘వేదిక’ దొరికినట్టు భావించడం ఈనాటి రాజకీయం కానేకాదు. దురదృష్టం ఏమిటంటే అదే నిజమైన రాజకీయమని భావించే రాజకీయ నాయకులు సమాజంలో ఎక్కువమంది కనిపించడం.
ఈ సమ్మె ఫలితం, పరిణామాల అనంతరమైనా గుర్తించాల్సింది- కార్మికుల మైండ్ సెట్ మారాలి అని. కార్మిక నాయకుల మైండ్ సెట్ మరింత త్వరగా మారాలి, వారికి మద్దతునిచ్చే రాజకీయ పార్టీల నాయకుల మైండ్ సెట్ సమూలంగా మారాలి. మాట తీరు మరీ మారాలి. ప్రజాస్వామ్యంలో హక్కులతోపాటు బాధ్యతల్ని మరింత గౌరవించాలన్న విజ్ఞత ప్రదర్శించాలి. హక్కులే తప్ప బాధ్యతల్ని పట్టించుకోమని మొండికేస్తే నష్టపోయేది.. కష్టపడేది... కన్నవారిని ఖేదానికి గురిచేసేది మనమేనని మరిచిపోరాదు. ఈ సమాజం మనది... ఈ దేశం మనది అని ఇంకెప్పుడు ‘సోయి’ తెచ్చుకుంటాం...? కమ్యూనిస్టు దృక్కోణం కరిగిపోయిందని ఇంకెప్పుడు తెలుసుకుంటాం...?

-వుప్పల నరసింహం 99857 81799