సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శీలం
ధనాన్ని పోగొట్టుకుంటే, ఎలాగోలా మళ్లీ సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం చెడితే, ఏ డాక్టరో నయం చేయవచ్చు. పదవినీ, అధికారాన్నీ కోల్పోతే. అదృష్టం బాగుంటే అవి మళ్లీ వస్తాయి. కాని శీలాన్ని కోల్పోతే? ఇక అంతే సంగతులు. పవిత్రత తిరిగిరాదు. అందుకే శీలాన్ని పరిరక్షించుకోవడంలో అంతా అత్యంత శ్రద్ధచూపాలి. సాయికి దగ్గర దారి సచ్ఛీలమే.
పాముల కన్న ప్రమాదం
మన గదిలో పాములు చేరినప్పుడు ప్రశాంతంగా ఉండగలమా? దుస్సంకల్పములనేవి విషసర్పముల కంటెను ప్రమాదకరమైనవి. మన మనసులో చేరేందుకు వాటికి ఏమాత్రము అవకాశమివ్వకూడదు.
మనసులో మాధవుని నింపు
నీవు బాగా పాండిత్యం సంపాదిస్తావు. ‘అహో! ఎంత బాగా మాట్లాడాడు’, అని ఘనమైన ప్రశంసలు పొందవచ్చు. చక్రవర్తివై భూమండలాన్ని పాలించవచ్చు. కోట్లాది ఆస్తిని సంపాదించుకోవచ్చు. ఏమిటి మిగిలింది? ఏం చేసినా, ఏం సాధించినా అది నీ హృదయాన్ని నిర్మలం చేస్తున్నదా అన్నది ప్రశ్న నీ లోపలవున్న దైవాన్ని ఆవిష్కరించుకొనేందుకు అది దోహదం చేస్తుందా?
దైవతత్వం నింపుకో
అందుకే నీ హృదయాన్ని భగవచ్చింతనతో నింపు. స్వార్థచింతనతో కాదు. దేవునికోసం నీవు తపించిపోవాలి. పైపై వ్యవహారం ప్రయోజనం లేదు. చింతన గాఢంగా వుండాలి. నీ గుండెలో ఎంత లోతుకు భగవచ్చింతన నిండిందో కొలుచుకుంటూ వుండు. నీలో సత్ప్రవర్తన. స్థైర్యం, సమదృష్టి పెరిగినకొద్దీ నీలో భగవంతుడి స్థాయి పెరుగుతూ వుందని అర్థం. అలాకాక నీ హృదయంలో భగవత్తత్వం మట్టం తగ్గిపోతూవుంటే ఆ ఖాళీలో కామం, క్రోధం, అసూయ మొదలయినవన్నీ జొరబడతాయి. అహంకారపు సెగలు పొగలతో హృదయ సీమను కలుషితంచేసి వేస్తాయి.
సర్వం బ్రహ్మమయం
మనసులో మాధవుని నింపుకో. అంతటా ఆయనే కనిపిస్తాడు. ‘సర్వం విష్ణుమయం జగత్’అన్నది ఒక యథార్థ విషయంగా గోచరిస్తుంది.
ఈరోజునుండే దీక్ష పూనండి. ‘నేను యిక మంచి పనులే చేస్తాను. మంచి విషయాలనే తలుస్తాను. మంచి వారితోనే సావాసం చేస్తాను’అని ఉన్నతమైన విషయాలను గురించే ఆలోచించండి! కబుర్లు చెబుతూ, గప్పాలుకొడుతూ, చౌకబారు సరదాలతో ఒక్క క్షణంకూడా వృథా చేయకండి!
అందరికీ అండాదండా
పండితులూ, పామరులూ, ముసలీ, ముతక, చిన్నా, పెద్దా అన్ని రాష్ట్రాలనుండి, అన్ని దేశాలనుండీ ప్రశాంతి నిలయానికి వస్తుంటారు. ఇంకెక్కడికీ పోవటానికి చోటులేని వారిక్కూడా ఈ ప్రశాంతి నిలయమే శరణ్యం. ఇక్కడ ఎవరూ పరాయివారు కాదు. అందరికీ రక్షకుడను నేను. అందరికీ అండాదండా నేనే. ఇది గుర్తుంచుకో. ఎవరిపట్లా కోపం, కార్పణ్యం, అసూయా, అహంకారం పనికిరావు. వినయశీలివి కా, మానవుని మంచితనంలో నమ్మకం పెంచుకో.
సత్సంప్రదాయాలు
మానవునిలో అంతరాత్మ అనేది వుంది. అది ఎప్పటికప్పుడు ఏది మంచీ, ఏది చెడూ అన్న సంగతి చెబుతూ వుంటుంది. అయితే మనిషి దానిని వినిపించుకోకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు. అది అంతర్వాణి. దానిని నీవు వినిపించుకోక పోవచ్చు. కాని వినబడకుండా చేయలేవు. అదెప్పటికీ వూరుకోదు. మూగవోదు.
కేరళ గ్రామీణ ప్రాంతాల్లో యిప్పటికీ ఒక సత్సంప్రదాయం వుంది. కొంతమంది పెద్దలు చుట్టూ పిల్లలను కూచోబెట్టుకొని రోజూ పడుకోబోయే ముందు అనేక శ్లోకాలను చదివిస్తుంటారు. ఆ శ్లోకాలలో ఎక్కువ భాగం భగవన్నుతికి సంబంధించిన స్త్రోత్రాలే. ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించుకొంటే ఎంతో బాగుంటుంది.
అంతరాత్మ పిలుపును విను. అది అన్నిటికన్నా ముఖ్యం. ఎందుకని? నీవే మాత్రం పక్కదోవపట్టినా, అదిలోనుండి నిన్ను హెచ్చరిస్తుంది. నిరసిస్తుంది. సరయిన దారికి మళ్లిస్తుంది. నీవు తలపెట్టింది ఎంత సిగ్గుమాలిన పనో, ఎంత శిక్షపడుతుందో, ఎంత అప్రదిష్ట కలుగుతుందో అని నీకు తెలియజెప్పుతుంది.
చివరకు మిగిలేది?
నీకు చివరకు మిగిలేది ఏమిటి? నీవు సంపాదించుకొన్న ఆస్తిపాస్తులేవీ నీ వెంట రావు. బంధువులు శవం వెంట శ్మశానం వరకే రాగలరు. కేవలం నీవు చేసుకొన్న మంచీ, చెడు మాత్రమే నీ వెంట వస్తాయి. అందుకనే నీవు ఈ బంధాలలో యిరుక్కోవద్దు. శారీరక సుఖాలకై వెంపర్లాడవద్దు. ముక్తిమార్గం గురించి ఆలోచించు.

ఇంకా ఉంది
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.