సబ్ ఫీచర్

నింగికెగసిన సాహితీ, సాంస్కృతిక దిగ్గజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిగ్గా సంవత్సరం గుర్తులేదు కానీ, ఐదారేళ్ళ క్రితం శ్రీకాకుళం జిల్లా, రాజాం పట్టణంలో ‘మిథునం’ చిత్ర నిర్మాత ఆనందరావు మొయిద గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావుగారు, గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ప్రధానంగా ఆనందరావుగారి గురువుగారైన చెళ్ళపల్లి సన్యాసిరావుగారిని సన్మానించదలిచారు. ఈ సందర్భంగా కారు దిగే సమయంలో అక్కడే వున్న నేను పొడుగ్గా రివటలా సాత్విక రూపానికి చిహ్నంగా నిలిచే గొల్లపూడి గారిని చూసి నమస్కరించి, కరచాలనం చేశాను. గత కొద్దికాలంగా చెన్నైలోగల ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ఉదయానే్న గొల్లపూడి మారుతీరావుగారు తుదిశ్వాస విడిచారనే వార్త తెలుసుకున్న నాకు ఒక్కసారిగా ఆనాటి సంఘటన కళ్ళముందు కదలియాడింది. ప్రేమాస్పదంగా ఆ మహానుభావుని నాటి చేతి స్పర్శ నా గుండెలను తాకినట్లయింది. గొప్ప వక్తగా ఆ సభలో గురువు ఔన్నత్యాన్ని తెలుపుతూ మాట్లాడిన మాటలు నా చెవుల్లో ఇంకా గింగురులు తిరుగుతూనే వున్నాయి. నా ఉపాధ్యాయ వృత్తికి ఆ మాటలు ఎంతో మార్గదర్శకంగా నిలిచాయని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. నేను ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా గుర్తుచేసుకోగలను. నేను మొట్టమొదట ఉపాధ్యాయునిగా విధుల్లో చేరిన పాఠశాలలో ‘పోలిరాజు’ అనే మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని చూసి ‘గొల్లపూడి’ అని నిక్‌నేమ్ పెట్టాను. ఎందుకంటే రూపంలో అచ్చం గొల్లపూడిగారిలానే గద్దముక్కుతో ఉండేవాడు ఆ విద్యార్థి. ఇపుడు నాకు ఆ కుర్రవాడు ఎక్కడ కనిపించినా, మాస్టారు మీరు పెట్టిన పేరుతోనే అందరూ నన్ను పిలుస్తున్నారని సరదాగా గుర్తుచేసుకుంటుంటాడు. అది ఆ విద్యార్థికి తీపి గుర్తుగా నిలిచిందని చెప్పవచ్చు. మొట్టమొదటగా వెండితెరపై నేనయితే అతనిని ‘త్రిశూలం’ సినిమాలో చూడడం జరిగింది. ఆ సినిమాలో ప్రధాన విలన్‌గా భూస్వామి పాత్రలో కనబరిచిన నటనా కౌశలానికి నేను ముగ్ధుడనయ్యాను. ఆ సినిమాలో ఫ్యూడలిస్టిక్ భావజాలాన్ని వొంటపట్టించుకున్న పెత్తందారీ పాత్రలో పూర్తిగా లీనమై తన నటనా వైదుష్యాన్ని పూర్తిస్థాయిలో వెండితెరపై ప్రదర్శించడం జరిగింది.
గొల్లపూడిగారు 1982లో ఉద్యోగానికి రాజీనామా చేసి ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తరంగిణి, ఛాలెంజ్, అభిలాష, స్వాతిముత్యం, మనిషికో చరిత్ర, ముద్దుల ప్రియుడు, ఆదిత్య 369, అసెంబ్లీ రౌడీ, సంసారం ఒక చదరంగం మొదలగు సినిమాలలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా విలక్షణమైన పాత్రలతో తన నట జీవితాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూ, 290 చిత్రాలలో నటించడం గమనార్హం. కథ, నాటకం, నవల, రేడియో, సినిమా ఏదైనా అతనిది ఓ ప్రత్యేకశైలి. సంపాదకునిగా, వక్తగా, కాలమిస్టుగా విభిన్న రకాలుగా అతను చక్కగా రాణించారని చెప్పవచ్చు. అనేక తెలుగు సినిమాలలో ఆయన కనబరిచిన నటనలో ఓ ప్రత్యేక శైలి ఉండటాన్ని ప్రేక్షకులు తరచూ గమనించేవారు. అందుకే ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారు. ఆయన రూపం ప్రత్యేకం. ఆయన ముక్కు గద్దముక్కులా ఉండేది. అందుకే ఆయనను తెలుగు ప్రేక్షకులందరూ గద్దముక్కు పంతులు అనేవారు. ఆయన హావభావ ప్రదర్శన మరీ ప్రత్యేకం. ఆయన నటనా నైపుణ్యంతో ఎందరో తెలుగు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసేవారు. దీనంతటికీ ప్రధాన కారణంగా ఆయన తొలుత సాంఘిక నాటకాలలో హెచ్చు స్థాయిలో నటించడమేనని చెప్పవచ్చు. ఆయన ఒక నాటక రచయితగా, దర్శకునిగా, నటునిగా ఉండడంవల్లనే సినీ రంగంలో సులువుగా రాణించగలిగారని చెప్పడంలో ఏ మాత్రం సంశయం లేదు. రచయితగా 14 ఏళ్ళ వయసులోనే ‘ఆశాజీవి’ అనే తొలి కథను రాయడం జరిగింది. తర్వాత రాసిన అనంతం, వందేమాతరం, కళ్ళు, ప్రశ్న మొదలగు నాటకాలకు యావద్దేశ నాటక రంగం జేజేలు పలికింది. మొత్తంగా చూసుకుంటే 9 నాటకాలు, 18 నాటికలు 12 నవలలు, 4 కథా సంపుటాలను ఆయన కలంనుండి వెలువరించారు. ‘అమ్మ కడుపు చల్లగా’ అనే పేరుతో తన అంతర్మథనాన్ని తెలియజేస్తూ ఆత్మకథను దిగ్విజయంగా సాహిత్య లోకంలోకి తీసుకురావడం జరిగింది కూడా.
గొల్లపూడి మారుతీరావు గారు 1939 ఏప్రిల్ 14వ తేదీన విజయనగరం జిల్లా బొబ్బిలి తాలూకాలోని నందిగాం గ్రామంలో ఓ మధ్యతరగతి సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లి అన్నపూర్ణ, తండ్రి సుబ్బారావు, భార్య శివకామసుందరి. విద్యాభ్యాసం విశాఖపట్టణం సిబిఎం హైస్కూల్లో, ఎ.వి.ఎన్. కళాశాలలో మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సాగింది. ఎయులో భౌతిక శాస్త్రంలో ఆనర్స్ చేశారు. తన జీవితకాలమంతా విశాఖపట్టణంలో నివాసముంటూ వచ్చారు. వృత్తిరీత్యా మొట్టమొదటిగా రేడియో ప్రయోక్తగా తరువాత స్టేషన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆ తర్వాత ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా దేశంలో పలు ప్రాంతాల్లో పనిచేశారు. తొలి రోజుల్లో గొల్లపూడి కొంతకాలంపాటు ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంపాదకుడిగా పత్రికా రంగంలో అడుగుపెట్టారు. 1960 జనవరి 13వ తేదీన చిత్తూరులో ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిషన్ ప్రారంభించడం జరిగింది. అక్కడ సంపాదకునిగా పనిచేశారు. సంపాదకునిగా, వ్యాఖ్యాతగా, విలేఖరిగా మరియు మాటల, నాటక, కథారచయితగా విభిన్న కోణాలలో పనిచేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు సినీ, సాహిత్య లోకంలో ఎనలేని కీర్తిని గడించారు. సినీరంగంలో ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాకుగాను ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా మొట్టమొదటగా నంది అవార్డు అందుకున్నారు. అనేక కథలు, నాటకాలు, నవలలు రచించి తెలుగు సాహితీ లోకంలో మంచి గుర్తింపును పొందారు. ఆయన రచనలు భారతదేశంలోగల కొన్ని విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశాలుగా రావడం గమనార్హం. తెలుగు నాటక రంగం మీద ఆయన రాసిన వ్యాసాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం థియేటర్ ఆర్ట్స్‌లో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. ఆయన కళ్ళు నాటకానికి ఉస్మానియా యూనివర్సిటీ వారి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌కు పాఠ్యపుస్తకం అయింది కూడా. ఆయన రచనలమీద పలువురు యువతీ యువకులు ఎంఫిల్ మరియు పిహెచ్.డిలు చేయడం విశేషం.
ఆయన కుమారుడు శ్రీనివాస్ పెళ్ళిపుస్తకం చిత్ర నిర్మాణ సమయంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. నాటినుండి ఆయన జ్ఞాపకార్థం గొల్లపూడి శ్రీనివాస్ స్మారక పురస్కారాన్ని నెలకొల్పి యావద్భారత దేశంలో సినీరంగంలో విశేష సేవలందించిన ప్రముఖులకు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా అవార్డు ఇవ్వడం జరుగుతున్నది.
ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర. ఉత్కృష్టమైన సాహితీ సేద్యాన్ని పండించిన నేల ఉత్తరాంధ్ర. అనేకమంది మహానుభావులనుగన్న నేలతల్లి ఉత్తరాంధ్ర. గురజాడ, గిడుగు, తాపీ, శ్రీశ్రీ, చాసో, కారా మాస్టారు, వంగపండు, రోణంకి అప్పలస్వామి, జె.వి సోదరులు, పి.జె.శర్మ, రావుగోపాలరావు, పి.సుశీలమ్మ మొదలగు ఉద్దండ సాహితీ, సాంస్కృతిక కళామూర్తులు నడయాడిన నేల ఉత్తరాంధ్ర. తమ అద్వితీయమైన ప్రతిభా పాటవాలతో విశేషమైన సాహిత్య సాంస్కృతిక సేవ చేసినవారు ఎందరెందరో ఈ గడ్డపై వెలుగులు విరజిమ్మారు. అలాంటివారి సరసన నిలిచి అనేక సాహితీ సౌరభాలను ప్రసరింపజేసి సినీ, నాటక లోకంలో మేరునగధీరుడుగా పేరుగాంచిన గొల్లపూడి మారుతీరావు కూడా ఉత్తరాంధ్ర వారు కావడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ ఆయన ఈ ప్రాంత ముద్దుబిడ్డ కావడం ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న పుణ్యంగానే భావించవచ్చు. శ్రీశ్రీలాగానే విశాఖపట్నం అంటే ఎనలేని మక్కువ గల వారు మారుతీరావుగారు. ఆ పట్టణంతో విడదీయరాని అనుబంధం కలిగినవారు గొల్లపూడి. ఆయన ఇటీవల ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ- నాటకరంగం లోపాన్ని సవరించాల్సిన అవసరాన్ని ఈ విధంగా చెప్పారు. ‘‘ప్రతిభ లేక కాదు, పదే పదే ప్రేక్షకుల్ని తనవైపు ఆకర్షించే వేదికలు లేకపోవడం, రుచి మరిగేదాకా నిలదొక్కుకునే వసతిని నాటకానికి కల్పించాలి. ప్రేక్షకుడికి వ్యసనమయ్యే దశకు నాటకాన్ని తీసుకురాగలగాలి. అప్పుడు నాటకరంగం దేనికీ తీసిపోదు’’ అని నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని తెలియజేవారు. గొల్లపూడి గారు యావత్ దేశంలోగల తెలుగు సాహితీ, సాంస్కృతిక కళాప్రియులను వదిలేసి శాశ్వతంగా కనుమరుగు కావడంతో కళామతల్లి విషణ్ణవదనంతో కానవస్తున్నది. నాటక, సినీరంగాలలో ఎనలేని సేవ చేసి ఓ కవిగా, రచయితగా, పత్రికా సంపాదకునిగా, వ్యాఖ్యాతగా, రేడియో ప్రయోక్తగా విభిన్న కోణాలలో తమ ప్రతిభను చాటుకున్న గొల్లపూడి నిజంగా ధన్యజీవే. సాహితీ, సాంస్కృతిక రంగాలలో విశేష కృషి కనబరిచిన గొల్లపూడి మారుతీరావుగారికి అక్షర నివాళులు అర్పిస్తూ రాసిన వ్యాసంగా దీనిని పేర్కొనడంలో ఔచిత్యముంటుందని నా భావన.

-పిల్లా తిరుపతిరావు 7095184846