సబ్ ఫీచర్

ముప్పుతిప్పల మూడు రాజధానులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటనతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
అమరావతిలో రాజధాని నిర్మాణంకోసం 33వేల ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించిన రాజధాని పరిసర గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
తమ ప్రాంతంలో రాజధాని వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తమ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రజలు భావించిన మాట నిజం. కనుక ఇప్పుడు అమరావతి ప్రాంతంలో పూర్తిస్థాయి రాజధాని కాకుండా పాక్షిక రాజధాని ఏర్పాటవుతుంది అనడంతో వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్లు అయ్యింది.
అలాగే ముఖ్యమంత్రి చేసిన మూడు రాజధానుల ప్రకటనతో అటు ఉత్తరాంధ్రలోనూ, ఇటు రాయలసీమలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తున్న వారు అధికార వికేంద్రీకరణ జరగడం మంచిదే అన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ ఉంటే, వ్యతిరేకిస్తున్న వారు మాత్రం అసెంబ్లీ ఓ చోట, సచివాలయం మరోచోట, హైకోర్టు ఇంకోచోట ఉండడంవల్ల పాలనాపరమైన సంక్లిష్టత ఏర్పడుతుంది, అన్నీ ఒకోచోట ఉంటే పరిపాలనా సౌలభ్యం ఉంటుంది అని అభిప్రాయపడుతున్నారు.
నిజానికి రెండు వాదనలు కాదనలేనివే. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కూడా అభివృద్ధి అంతా ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కావడం వల్ల రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ వట్టి చేతులతో వేరు పడవలసి వచ్చింది. సుమారు 16వేల కోట్ల రెవెన్యూ లోటు ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడింది.
అప్పుడు తొమ్మిదేళ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబునాయుడు సైబరాబాద్ పేరుతోనూ, హైటెక్ సిటీ పేరుతోనూ అభివృద్ధిని అప్పటి రాజధాని హైదరాబాద్‌కే పరిమితం చేయడంవల్ల ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది అనేది కొందరి వాదన. నిజానికి ఇప్పటికీ హైదరాబాదును నేనే అభివృద్ధి చేశాను అని చంద్రబాబు కూడా తరచుగా చెప్పుకుంటూ ఉంటారు. కనుక చంద్రబాబు ఇప్పుడు కూడా అదే తప్పిదం చేయబోతున్నారని రాజధాని నిర్మాణం మొదలైనప్పటినుంచే కొందరు విమర్శిస్తున్నారు.
అంతేకాకుండా పదేళ్లపాటు హైదరాబాదు ను ఉమ్మడి రాజధానిగా వాడుకునే అవకాశం ఉన్నా ఉన్నపాటున రాజధానిన అమరావతికి తరలించి హడావుడిగా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి, చదరపు అడుగుకి 50 రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తూ అద్దె భవనాలలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తూ ప్రజాధనాన్ని దుబారా చేశారని కూడా ఆయనపై విమర్శలు ఉన్నాయి. నిజానికి ఇవి ఏవీ తోసిరాజనలేనివి. రాజధాని అంశంలో వినిపించే మరో కోణం అమరావతి చుట్టుపక్కల ఉన్న భూములన్నీ చంద్రబాబువి, ఆయన బంధువులు, అనుయాయులు లేదా ఆయన కులం వారివి కనుకనే అక్కడ రాజధాని నిర్మించ తలపెట్టారు అని మరో వాదన.
అలాగే ఇప్పుడు జగన్ ప్రభుత్వం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగాను, కర్నూలును జ్యుడిషియరీ రాజధానిగాను ఏర్పాటుచేయాలనే ఆలోచనకు కూడా తమకు, తమ వర్గం వారికి/ కులం వారికి ఆయా ప్రాంతాలలో అధికంగా భూములు ఉండడమే కారణం అనేది ప్రతిపక్షాల వాదన.
ఏదిఏమైనా రెండు పార్టీల, 2 బలమైన కులాల ఆధిపత్య పోరు కారణంగా రాష్ట్రంలోని 6 కోట్ల ప్రజానీకం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.
నిజానికి రాజధాని విషయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైకాపా కానీ, గత ఐదేళ్లలో అధికారం వెలగబెట్టిన తెదేపా కానీ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు అనేకం ఉన్నాయి.
ప్రతిపక్ష తెదేపాకు ప్రశ్నలు:
1) పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును ఉపయోగించుకునే వెసులుబాటు విభజన చట్టంలో ఉన్నా కూడా హఠాత్తుగా, ఆగమేఘాల మీద రాజధానిని అమరావతికి మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?
2) విజయవాడ పరిసర ప్రాంతాలలో చదరపు అడుగుకి 50 రూపాయల చొప్పున అద్దె చెల్లించి మరీ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది?
3) అదే ఖర్చుతో పక్కా భవనాలు నిర్మించుకోగలిగిన అవకాశం ఉన్నా అది వదిలి ప్రజాధనాన్ని అద్దెలకోసం ఖర్చుపెట్టడం చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడికి తగునా?
4) ఒకేసారి శాశ్వత నిర్మాణాలకు పూనుకోకుండా తాత్కాలిక నిర్మాణాలు ఎందుకు చేపట్టినట్టు? దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం కావడం మినహా ప్రయోజనం ఏమున్నది?
5) ఒకసారి హైదరాబాద్ విషయంలో అనుభవం అయ్యాక కూడా తిరిగి అమరావతి విషయంలోనూ ఎందుకు అదే పొరపాటు చేయబోయినట్టు?
6) అసలు ఎంత ఆలోచించినా అర్థంకాని ప్రశ్న రాజధాని నిర్మాణానికి ఒకేసారి 33వేల ఎకరాల భూమిని సేకరించడం అవసరమా?
7) ఏదైనా దశల వారీగా దశాబ్దాలపాటు సాగవలసిన అభివృద్ధి ఛూమంతర్‌కాళీ అన్నట్టు ఎకాఎకిన పూర్తికావాలని ఎందుకు అనుకోవడం?
8) ఐదేళ్లపాటు ‘అమరావతి అమరావతి’ అని ఊదరగొట్టిన రాష్ట్రంలో ఏ ఇతర ప్రాంతంనుంచైనా అమరావతి ప్రాంతంలోకి వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారు ఎవరైనా ఉన్నారా?
అధికార వైకాపాకి ప్రశ్నలు:
1) ప్రభుత్వం ఏదైనా, అధికార పక్షం ఏదైనా రాజధాని వంటి కీలకమైన అంశాల విషయంలో ఒక నిర్ణయం తీసుకుని, అక్కడ కొన్ని వేల ఎకరాల భూమిని సేకరించి, అనేక నిర్మాణాలు చేపట్టిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అదే రాజధాని విషయంలో పరిపరి విధాల ప్రకటనలు చేసి ప్రజలను గందరగోళ పరచడం అవసరమా?
2) ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా కీలకమైన విషయాలలో నిర్ణయాలు మార్చుకుంటూ పోతే అది రాష్ట్రానికి లాభమా? నష్టమా?
3) ఇప్పుడు మీరు కొత్త నిర్ణయాలు తీసుకుని ఆ ప్రకారం కొంత ముందుకి వెళ్ళాక ఈసారి మరలా ప్రభుత్వం మారితే వారు మరో కొత్త నిర్ణయంతో ముందుకెళితే మధ్యలో నష్టపోయేది సామాన్య ప్రజలే కదా? ఈ పోకడ మంచిదేనా?
4) దేశంలోని వివిధ పవిత్ర భూభాగాల నుంచి సేకరించిన మట్టిని, పవిత్ర నదులనుంచి తెచ్చిన జలాలను ఉపయోగించి వేద మంత్రోచ్ఛాటనల మధ్య శంకుస్థాపన జరిగిన తర్వాత ఆ ప్రక్రియ మొత్తాన్నీ అవమానపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం ఎంతవరకు సమంజసం?
5) రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని ప్రజలైనా తమతమ పనుల నిమిత్తం రాజధాని చేకోవడానికి అమరావతి అనువైనదే.
6) అదే చిత్తూరు జిల్లావారు విశాఖకు వెళ్ళాలంటే, అలాగే విశాఖవారు కోర్టు పనుల నిమిత్తం కర్నూల్‌కి వెళ్లాలంటే దూరము, రవాణా సౌకర్యాలు తదితరాల కారణంగా కొంత ఇబ్బంది ఉన్నదా లేదా?
7) అసలు వీటన్నిటికీ మించి ఇప్పటికే వివిధ పక్షాలు ప్రశ్నిస్తున్నట్టు అసెంబ్లీ ఓచోట, సచివాలయం ఓచోట, హైకోర్టు మరోచోట ఇది పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా కష్టతరం కాదా?
8) సచివాలయ అధికారులు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న సమయంలో సచివాలయంనుంచి అసెంబ్లీకి రావడం, అయిపోయాక మరలా సచివాలయం చేరయం ఇవన్నీ అనేక వ్యయప్రయాసలతో కూడుకున్నవి కావా?
మొత్తానికి రాజధాని విషయంలో గత తెదేపా ప్రభుత్వంకానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ వెళ్లిన, వెళ్తున్న విధానం పారదర్శకంగా లేదు.
ఏదేమైనా ఇలాంటి కీలకమైన విషయాలలో ఇతర రాజకీయ పక్షాలు, నిపుణులు, సీనియర్ అధికారుల అభిప్రాయాలు తీసుకుని ఒక స్థిరమైన, అందరికీ ఆమోదయోగ్యమైన విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వమైనా ఒంటెత్తు పోకడలకు పోవడం మంచిది కాదు. నిజానికి గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ ఆ దిశగా ప్రయత్నమే చేయలేదు.

- శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కోర్శిపాటి, 9550463236