సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మృదు మధురం
సహేతుకంగా మాట్లాడేవాడు నోరు పారేసుకోవాల్సిన పనేముంది? సాధకుని భాష వౌనమే! ప్రేమతోడి పలకరింపు ఎప్పుడూ మృదుమధురంగానే వుంటుంది. అక్కసు పట్టలేనివాడే అరుస్తాడు. భయపడ్డ వాడు కెవ్వుమంటాడు. వంచకుడు గుసగుసలుపోతాడు. కాని ప్రేమ హాయిగా జోలపాడగలదు. సేద తీర్చగలదు. బాధ నపనయించగలదు. ప్రేమ భాషణ సాధన చేయి. కక్షాకార్పణ్యాల కఠోర భాషణ మరచిపో.
సాధనా ఫలం
సాధన ప్రేమను పెంపొందించాలి. నీవు పలికే ప్రతి మాటనూ, చేసే ప్రతి పనినీ, నీకు తట్టే ప్రతి ఆలోచననూ నీ సాధన మధురంగా మార్చాలి. ధ్యానంనుండి లేచి వచ్చేటప్పుడు నీనుండి ప్రేమ పొంగులు వారాలి. నగర సంకీర్తన నుండి మరలే సమయంలో లోకం అంతా ఆ దివ్యశక్తి ప్రభావంవల్ల ప్రకాశిస్తోందన్న విశ్వాసం నీలో దృఢతరం కావాలి.
పరుసవేది
ఇంకొకరి తప్పులెనే్న ముందు నీ తప్పులు తెలుసుకో, అప్పుడే నీవు మరొకరికి చెప్పగలుగుతావు. గమ్మత్తేమిటంటే, నీలో లోపాలన్నప్పుడే నీకు అందరిలో లోపాలు కన్పిస్తుంటాయి. నీ లోపాలను దిద్దుకో! నీవు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రేమ రహస్యం అదే! దివ్యప్రేమ, విశ్వప్రేమ, ప్రేమకోసమే ప్రేమ (స్వార్థం ఎరుగని ప్రేమ) అదే పరుసవేది. (ఏ వస్తువును తాకిస్తే యితర వస్తువులన్నీ బంగారం అవుతాయో, దానిని పరుసవేది అంటారు).
కళాయి ఏది?
మంచి కూరగాయలు, మంచి చింతపండు, మంచి ఉప్పు, మంచి మిరపకాయలు తెచ్చి ఎంత మంచిగా వండినా, పాత్రకు కళాయి లేకపోతే వంట చిలుముపట్టి చెడిపోతుంది. అదే విధంగా జపం, ధ్యానం, యోగం మొదలైనవన్నీ మంచి కూరగాయల వంటివేగాని, మన హృదయంలో ప్రేమ అనే కళాయి గనుక లేకపోతే అంతా చెడిపోతుంది. కనుక పవిత్రమైన ప్రేమను హృదయంలో పెట్టుకోవాలి. అప్పుడు నీకు తప్పక దైవానుగ్రహము లభిస్తుంది.
సర్వం ప్రేమమయం
మానవతా విలువలైన సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలన్నిటిలోనూ ప్రధానమైనది ప్రేమ.
కనుక ప్రేమతో మాట్లాడిన ప్రతిమాట సత్యమే. ప్రేమతో చేసిన ప్రతీ పని ధర్మమే. ప్రేమను మనస్సులో చింతించడమే శాంతము. ప్రేమను చక్కగా అర్థం చేసుకోవటమే అహింస. సర్వమూ ప్రేమలోనే ఇమిడి వుంటున్నది. కనుక ఈ ప్రేమతత్త్వముతోనే మనము సేవా కార్యక్రమాలలో ప్రవేశించాలి.
ప్రేమతత్వం
ప్రేమ నేత్రములతో చూడదు. హృదయముతో చూస్తుంది. ప్రేమ చెవులతో వినదు. ప్రేమ శాంతముతో వింటుంది. ప్రేమ పలుకులతో పలుకదు. దయతో పలుకుతుంది. దయ, కరుణ, ప్రేమ ఇవి భిన్నపదములే కాని తత్వతః వేరుకాదు. ప్రేమతత్త్వము హృదయమునుండి ఆవిర్భవించినటువంటిది. ప్రేమ అమృతమైనటు వంటిది. ఆనందమైనటువంటిది. అనంతమైనటువంటిది. నిష్కామ ప్రేమ. నిర్గుణమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ భగవంతుణ్ణి బంధిస్తుంది. స్వార్థప్రేమ, సంకుచితమైన ప్రేమ కేవలం లోకమునే బంధింపజేస్తుంది. కాని ఈనాటి మానవుడు సత్యనిత్యమైనటువంటి ప్రేమతత్త్వమును గుర్తించుకొనలేక అనేక అవస్థలకు గురి అవుతున్నాడు.
ప్రేమను కలుషితం చేసేది స్వార్థం. అది నీకూ, దైవానికీ మధ్య తెరవేస్తుంది. ఎందుకని? నీకు నీ దేహంపై వున్న మమకారమే దానికి కారణం; ఇంద్రియాలకు నీవు దాసుడవుకావటమే కారణం.
కర్మయోగానికి స్ఫూర్తి ప్రేమ. భక్తియోగానికి ప్రేమే ఊపిరి. జ్ఞానయోగంలో ప్రేమ విశ్వజనీనం, అనంతం!
భగవంతుని అంతటా దర్శించేవారు అన్నిటినీ ప్రేమిస్తారు. ఆరాధిస్తారు. వైరాగ్యం సాధించే మార్గముకూడా ప్రేమే. భాగవతం ప్రేమ మాధుర్యంతో చిప్పిలుతూ వుంటుంది.
ద్వేషం దేనికి?
ఎవరిని గాయపరచినా, అది అపచారమే. అది నిన్ను నీవు గాయపరచుకోడమే. ద్వే షంతో ప్రేమ ను విషంగా మార్చుకోడమే. ఎందుకని? అంతటా అందరిలోనూ ఉన్నది సాయే! అంటే నీవేకదా! ఇక, నీ యిష్టం! నీవు అందర్నీ ప్రేమించ లేకపోతే కొంతమందినే ప్రేమించు. కాని యితరులను ద్వేషించకు. ఆ ద్వేషం నీ ప్రేమను పంకిలం చేస్తుంది; చంపేస్తుంది.
జీవన్ముక్తునికి ప్రేమ సహజం. కాని సాధకుడు దానిని కృషిచేసి పెంపొందించుకోవాలి. అందుకు మార్గాలేమిటి? సేవ, ఆత్మ విచారం. ప్రేమ పెదిమలనుండీ, తలకాయనుండీ జాలువారదు. అది గుండెల నుండి ప్రవహిస్తుంది.

ఇంకా ఉంది