సబ్ ఫీచర్

భరోసానిచ్చే బతుకు పుస్తకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాస్యబ్రహ్మ శంకర నారాయణ
ఉద్యోగ విజయాలు
పేజీలు:126,
వెల:రూ.150/-,
ప్రతులకు:శంకరనారాయణ,
102, సాయిపూజితా రెసిడెన్సీ,
ఎ.ఎస్.రాజునగర్, కూకట్‌పల్లి,
హైదరాబాద్-500 072.
ఫోన్:800833327
*
ఆత్మకథలనూ, జీవిత కథలనూ రాసిన అనేకమందిని చూశాం. యాత్రా విశేషాలను గ్రంథస్తం చేసినవారూ ఉన్నారు. నా కాశీయాత్రా చరిత్ర పేరుతో ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్ర విశేషాలను రాశారు. తెలుగులో వెలువడిన తొలి యాత్రావిశేష గ్రంథంగా ఇది పేరు పొందింది. అయితే ఉద్యోగ అనుభవాలకు మాత్రమే పరిమితమై హాస్యబ్రహ్మ శంకరనారాయణ ఉద్యోగ విజయాలు పేరిట పుస్తకం వెలువరించారు. ఇలా ఉద్యోగ జీవితంపై రాసిన తొలి తెలుగు రచయితగా శంకర నారాయణ ట్రెండ్ సెట్ చేశారు.
ఎవరికైనా బతుకు తెరువు ముఖ్యం. పనీ పాటా లేకుంటే సాపాటు కష్టమే. పని ఉంటేనే పదిమంది చేతా ప్రయోజకుడనిపించుకుంటాడు. అది లేకుంటే గాలివాటుకు తిరిగే జీవిగా ముద్రవేసి హీనంగా చూస్తారు.
ఏ రోజుకారోజు పని వెతుక్కునే వారిలో గొప్ప గుండె నిబ్బరం ఉంటుంది. రేపు నా రిక్షాకు బాడుగ దొరుకుతుందా? రేపు నాకు కూలీ దొరుకుతుందా? అని రోజువారీగా పనిచేసే శ్రామికులు దిగులు చెందరు. ఎటొచ్చీ మధ్య తరగతివారే ఉద్యోగ భద్రత కోరుకుంటారు. ఒకటో తేదీ పైనే ఆశలన్నీ నింపుకుని మిగిలిన ఇరవై తొమ్మిది రోజులూ కాలం వెళ్లదీస్తారు. ఉద్యోగమంటే ప్రయోజకత్వం గనుక ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టిన కొద్దికాలానికే పెళ్లిబాజాలు మోగుతాయి. దాంతోపాటే వీపుపై బాధ్యతల మోతలూ మార్మోగుతాయి. నెలనెలా జీతం వస్తుంటేనే సంసార సాగరం ఈదటం కష్టమయిన జీవికి ఉద్యోగం ఊడిందా ఇక అంతే సంగతులు. పై ప్రాణాలు పైనే పోయినంత పనవుతుంది.
ఎవరైనా జీవితంలో నాలుగయిదు ఉద్యోగాలు మారతారేమో! పని చోట పరిస్థితులు బాగాలేకో, బదిలీకి వీలు లేకో, మంచి జీతం కోసమో ఉద్యోగాలు మారతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే కడుపులో చల్ల కదలకుండా అక్కడే రిటైర్ కావచ్చు.
శంకర నారాయణ మాత్రం ఏకంగా 36 ఉద్యోగాలు మారారు. అదేం చిత్రమోగానీ ఏ ఉద్యోగమూ ఆయనకు భరోసానూ, భద్రతనూ ఇవ్వలేకపోయింది.. తన అపరాధమేమీ లేకుండానే కళ్లముందే ఉద్యోగాలు మంచుగడ్డల్లా కరిగిపోతుంటే ఈ మనిషి రోడ్డున పడి మళ్లీ ఉద్యోగ వేట సాగించాల్సి వచ్చింది.
చాలామందికి మాదిరే ప్రభుత్వ ఉద్యోగమంటే శంకర నారాయణకు తెగపిచ్చి. తెలుగు పాఠాలు చెప్పుకుంటూ నిలకడగా జీవితం సాగించాలని పరితపించిన ఆయన ఆశలన్నీ అడియాసలే అయ్యాయి.
ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపితే వారు చెప్పిన అమ్మాయి మెడలో తాళి కట్టారు. వాళ్లు అనుకున్నట్లు పెళ్లయిందిగానీ, తాను అనుకున్నట్లు ఉద్యోగం మాత్రం నిలబడలేదు. పెళ్లి శాశ్వతం. ఉద్యోగం అశాశ్వతం అనే తాత్విక గేయాలు పాడుకున్నారు.
‘నాలుగు రోజులు మీ కోసం చూశాను. చివరకు ఎవరో వస్తే వారికి ఉద్యోగం ఇచ్చాను’ అంటూ చేరాల్సిన లెక్చరర్ ఉద్యోగం చేజారిపోతే ఎంతటి నిరాశా నిస్పృహలు కలుగుతాయో మాటలకు అందదు.
హైదరాబాద్‌లో ఉద్యోగం రాగా, విజయవాడలో అంతకుముందు రోజే చేరిన అద్దె ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. అయినా ఆ ఇంటాయన చిర్రుబుర్రులాడకుండా రూ. 300లు చేతిలో పెట్టి మరీ ఆశీర్వదించి హైదరాబాద్‌కు పంపారు. ఇలాంటి పెద్దమనసున్న వారూ శంకర నారాయణకు తారసపడి కారు చీకటిలో కాంతిరేఖల్ని నింపారు.
‘నా జీవితంలో ఉద్యోగం మారడం అంటే ఒక దుఃఖంలో నుంచి ఇంకో దుఃఖంలోకి మారడమే’ అని శంకర నారాయణ నిర్వేదంగా రాసిన వాక్యాలు ఆయనపై సానుభూతితోపాటు గౌరవాన్ని పెంపొందిస్తాయి.
అగ్ని సంగీతం పేరిట నిప్పుల మాటల మంటలు రాజేసిన శంకర నారాయణ చివరకు ఒక దినపత్రికలో డెస్క్ ఇన్‌ఛార్జి ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం, తనకంటే సీనియర్ల చేత పని చేయించుకోవడం కోసం సందర్భానుసారం నవ్వుల పువ్వులను పండించాల్సి వచ్చింది. పత్రికల్లో కాలంతో పరుగులు తీస్తూ టెన్షన్లలో బతికే జర్నలిస్టులలో హుషారు నింపడం కోసం హాస్య చమత్కారాలను ఇంటిపేరుగా మార్చుకున్నారు.
కారణాలు ఏవైనా ఉద్యోగ అభద్రత నుంచి ఒక హాస్య బ్రహ్మ ఉదయించాడు. ఒకపక్క ఉద్యోగం చేస్తూనే వారాంత సెలవుల్లో హాస్యావధానాలు తెలుగువారి మనసులను దోచుకున్నారు. పైకి ఎంతో హుషారుగా కన్పించే హాస్యంతో కవ్వించే శంకర నారాయణ ‘వచ్చే ఉద్యోగం - ఊడే ఉద్యోగం’ తో గొంతులోనే గరళాన్ని నింపుకుని నీలకంఠుడై, బోళాశంకరుడై తెలుగు లోగిళ్లలో హాస్యాన్ని పండిస్తున్నారు.
‘ఉద్యోగం పోయింది, ఇక బతుకే లేదు’ అనుకుని నైరాశ్యంలో కుంగిపోయే వేతన బడుగు జీవులు తప్పనిసరిగా శంకర నారాయణ ఉద్యోగ విజయాలు చదవాలి. అప్పుడు వారికి బతుకుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. తనకు వచ్చింది అసలు కష్టమే కాదన్న అభిప్రాయమూ బలపడుతుంది.
ఏదీ దాచుకోకుండా ‘స్వీయ లోపం బెరుగుట పెద్ద విద్య’ అని నమ్మి చిత్తశుద్ధితో అన్ని విషయాలను అరమరికలు లేకుండా ఆవిష్కరించిన శంకర నారాయణ అభినందనీయుడు.
మధ్యతరగతి వారికి భరోసానిచ్చే బతుకు పుస్తకమిది.

-గోవిందరాజు చక్రధర్