సబ్ ఫీచర్

ముగ్గు ముచ్చట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుర్మాస వేళల్లో మన భారతీయ వనితామణులందరూ తమ తమ గృహ ప్రాంగణాలలో ముగ్గు వేయడానికి రంగంలోకి దిగారంటే చాలు- ఇక తమ కళానైపుణ్యంతో చూపరులను తప్పనిసరిగా ‘ముగ్గులోనికి దించేశార’న్నమాటే. ఈ ‘ముగ్గులోనికి దించేయడం’ అన్నది గొప్ప తెలుగు పలుకుబడి. ఈ పలుకుబడి సార్థకం అయ్యేలా- చక్కని ప్రకృతి దృశ్య చిత్రీకరణతో కవితాక్షరాల ముగ్గువేసి, పాఠకుల్ని ముగ్గులోకి దించేశారండీ- మన ఆధునిక తెలుగు కవులు ముగ్గులోకి దించేసిన ఒక ప్రకృతి దృశ్యాలు చూడండి.
అది మునిమాపు సమయం. ఆకాశమనే ముంగిలి. ఆ ముంగిట్లో రాత్రి అనే యువతి తెల్లని ముగ్గును వేయాలి అని అనుకుందట. ముగ్గువేసే ముందు సాధారణంగా మన వనితామణులు చుక్కలు పెడతారు గదండీ! అలాగే ఆ రాత్రి అనే తరుణి- నక్షత్రాలు అనే చుక్కల్ని పెట్టిందట ముందుగా. అలా చుక్కల్ని పెట్టిన తర్వాత వాటి అందాన్ని కాసేపు పరిశీలనగా చూస్తారు- నిలబడి మన పడతులు. అలాగే రాత్రి అనే ఆ యువతి కూడా ఆ చుక్కల్ని పరిశీలనగా చూస్తోందిట. ఇంతలో ఉన్నట్టుండి ఆమె ప్రియవల్లభుడు - చంద్రుడు వచ్చాడట. ఇంకేం, ఆ రాత్రి అనే వనితకు తొట్రుపాటు కలిగిందట. ఆ ప్రియుణ్ణి చూసే సంభ్రంలో- ఆ రాత్రి అనే వనిత చేతిలోని తెల్ల ముగ్గు ఒలికిపోయిందట. అలా చేతిలోనుండి ఒలికిపోయిన తెల్లని ముగ్గా? అన్నట్లుగా సంక్రాంతినాడు పుష్యమాసంలో పండు వెనె్నల అంతటా నిండిపోయి ప్రకాశిస్తోంది. గమనించారా? ఈ ప్రకృతి దృశ్యం ఎంత చక్కగా మనల్ని ముగ్గులోకి దించేస్తోందో? ఇంకా ఆకాశంలో ఆ రాత్రి అనే యువతి ముగ్గువేయక పోయినాసరే- ఈ అపూర్వ కల్పన పాఠకుల్ని ముగ్గులోకి దించేస్తోంది. ఇంతకీ ఇలా బొమ్మ కట్టించిన ఆ పద్యమిది:
చం ‘‘లలి మునిమాపు వేళన్ వదలన్ తెలిముగ్గిడ బూని
క్కల నిడి, వాని సౌరుగనగా నిలుచున్న నిశామృగాక్షి అ
వ్వల నరుదెంచుచున్న ప్రియవల్లభు గాంచిన సంభ్రమాన- ము
గ్గొలికెనొ చేతినుండి యననొప్పెను పౌషపు పండు వెనె్నలల్’’
ఈ పద్యంలో ఉత్ప్రేక్షాలంకారం ఉంది. ఈ చంపకమాలలోని మొదటి పదం ‘లలి’ అన్నది- ‘లలి’ అంటే ఉత్సాహం, సొగసు అని అర్థాలున్నాయి. ఆ రాత్రి అనే స్ర్తి- సొగసుగా ముగ్గును వేయడానికి ఉత్సాహాన్ని చూపించిందన్నమాట. కాబట్టి ఈ పద్యంలోని ఈ పదం వ్యర్థ శబ్దం కాదని గ్రహించాలి. పైగా ఇది స్వచ్చమైన దేశీయపదం. ఈ స్వచ్ఛత- ఆ ముగ్గు స్వచ్ఛతనూ, ఆ ముగ్గును వేయబోయే రాత్రి అనే ఆ తరుణి హృదయ స్వచ్ఛతా సౌందర్యాన్నీ చాటుతోంది. ఇక్కడ ఆమె సంభ్రమ చేష్టను బట్టి ఆ తరుణి ముగ్ధానాయిక అని తెలుస్తోంది. ‘‘ముందు చుక్కల నిడి వాని సౌరుగనగా నిలుచున్న నిశామృగాక్షి’ అని అనడంలో ముగ్గును వేసేటప్పటి ఆమె స్వభావ చేష్టనూ, ముఖ్యంగా స్ర్తిల సహజ స్వభావ చేష్టను గమనించిన ఈ కవిగారి సునిశిత పరిశీలనా దృష్టి వ్యక్తవౌతోంది. ఇంతకూ- ఈ పద్యం ‘శృంగార శ్రీకంఠం’ అను పేరుగల పద్య కవితా ఖండికల సంపుటిలోనిది. అందులోని ‘సంక్రాంతి’ అన్న పద్య కవితా ఖండికలోనిది. ఈ హృద్య పద్య కవి ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు.

- రామడుగు వేంకటేశ్వర శర్మ 9866944287