సబ్ ఫీచర్

అభివృద్ధి వికేంద్రీకరణకే బహుళ రాజధానులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిగారు గత ఆరు నెలలుగా పాలనా రంగంపై పట్టు సాధించి సాహసోపేతమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇదివరకు ఏ ముఖ్యమంత్రీ చేయని ప్రజోపయోగకరమైన పనులతో పాటు రాష్ట్రాన్ని సమున్నతంగా నిలబెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాలు, సామాజిక వర్గాల మధ్యనున్న సామాజిక, ఆర్థిక అంతరాలను తగ్గించడానికి కృషిచేస్తున్నారు. చాలాకాలం మద్రాసు ప్రెసిడెన్సీ కింద ఉండి తమ చెమట ధారలను మద్రాసుకు, ఆ తర్వాత హైదరాబాద్ అభివృద్ధి కోసం తమనుతాము అర్పించుకున్నారు ఆంధ్రులు. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అలాగే ఉన్నా ఆ పట్టణం రాజధానిగా అద్భుతంగా అభివృద్ధి చెంది ఉండేది. ఇలా డెబ్భై ఏళ్ళు ఆంధ్రులు కష్టార్జితం తమకంటూ ఓ రాజధాని లేకుండా వృధానే అయింది. చాలా ఆలస్యంగా తమ రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే భాష, జాతి సమూహానికి చెందినవే అయినా మూడు ప్రాంతాలున్నాయి. రాయలసీమ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్రలుగా ఉన్న ఈ మూడు ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక, భౌగోళిక అంతరాలున్నాయి. అనేక చారిత్రక, రాజకీయ కారణాలవల్ల ఏర్పడిన ఈ అంతరాలను స్వతంత్య్రానంతర కాలంలోనైనా తగ్గించే ప్రయత్నాలు అంతగా జరుగలేదు. గిరిజన, ఆదివాసీ సంస్కృతి, అటవీ ప్రాంతం అధికంగా ఉన్న ఉత్తరాంధ్ర, మైదాన ప్రాంతం, సస్యశ్యామలమైన వ్యవసాయ క్షేత్రాలున్న మధ్యాంధ్ర, నీటి కరువు, పారిశ్రామిక వనరులు అధికంగా ఉన్న రాయలసీమ ఆయా రంగాల్లో అభివృద్ధిచెంది ప్రాంతాలమధ్య అభివృద్ధి అంతరాలు వీలైనంతవరకు తగ్గించడం పాలకుల బాధ్యత.
ఆ బాధ్యతను బాధ్యతాయుతంగా నెరవేర్చడానికి యువ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగమే ఇప్పటికే మూడు లక్షల కోట్ల అప్పుల భారంతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో లక్ష కోట్ల అప్పులపాలు చేయదలుచుకోలేదు. అందుకు భిన్నంగా రాష్ట్ర రాజధానిని సారవంతమైన వ్యవసాయ భూములున్న అమరావతి ప్రాంతంతోపాటు మూడు ప్రాంతాల్లో నిర్మిస్తానంటున్నాడు. దీంతో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి మూడు ప్రాంతాలు అభివృద్ధి అయ్యే అవకాశాలున్నాయి. నిజానికి రాజధానులు నిర్మించాల్సిందెక్కడ?. మన పూర్వ రాజులు రాజధానులను ఎక్కడ నిర్మించారు? గుట్టలు, కొండలు, వ్యవసాయ యోగ్యం కాని భూములున్నచోటనే కోటలు నిర్మించారు. పంట భూముల్లో కాదు. గుంటూరు ప్రాంతంలోని యాభైవేల ఎకరాల బంగారు పంటలు పండే భూములను సేకరించి వాటిని కాంక్రీటు వనాలుగా మార్చడం సరైందేనా? పంట భూముల్లో ఇండ్లు, కళాశాలలు, పరిశ్రమలు, ఇలాంటి రాజధానుల పేరుమీద కాంక్రీటు భవనాలు నిర్మించడంవల్ల జరుగుతున్నదేంటి? వ్యవసాయ భూమి తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ధాన్యగారం లాంటిది కృష్ణా, గుంటూరు జిల్లా ప్రాంత భూములు, సారవంతమైన ఆ భూముల్లో భవనాలు నిర్మించి వ్యవసాయ భూములను తగ్గించాలా? యాభైవేల ఎకరాల వ్యవసాయ భూమిని కాంక్రీటు వనంగా మార్చాలా? పట్టణాలు నగరాలుగా, మహానగరాలుగా, ప్రపంచ ప్రసిద్ధ నగరాలుగా మారడం రోజుల్లో, నెలల్లో ఐదు పది సంవత్సరాల్లో జరుగుతుందా? రాజధాని భవనాలకు అన్ని వేల ఎకరాలు అవసరమా?
‘రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే’ అనే విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తించాలి. అదీ లక్షల కోట్ల అప్పుచేసి నిర్మించడంవల్ల ప్రయోజనమేంటి? కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అన్నివర్గాల, వర్ణాల, ప్రాంతాల ప్రజలను అభివృద్ధిచేయడానికి డబ్బేది మరి? ఇవన్నీ గుర్తించే తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాంచాలనుకుంటున్నాడు? ఇందులో తప్పేముంది? అప్రజాస్వామికతేముంది?
యాభై వేల ఎకరాల భూమినిచ్చిన అమరావతి ప్రాంత ప్రజల భూములను అవసరమున్నమేర ఉంచుకొని, మిగిలిన భూములను తిరిగి ఇస్తే సరిపోతుంది. ఈ కాలానికి నష్టపరిహారంగా కొంత డబ్బూ ఇవ్వవచ్చు. దీంతో ఆ రైతు ఉపాధి అలాగే ఉంటుంది. ఒకేచోట రాజధానికి సంబంధించిన అన్ని కార్యాలయాలను ఉంచకపోవడంవల్ల ఎవరు నష్టపోతారు? ఆ భూములను తక్కువ ధరకు కొని కోట్లకమ్ముకునే రియల్ ఎస్టేట్ వ్యాపారులకోసమా ఈ బాధ! రాజధాని అధికార వికేంద్రీకరణవల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి మూడు ప్రాంతాల్లోని అభివృద్ధి అంతరాలు తగ్గే అవకాశముంది. దీనివల్ల భవిష్యత్తులో మరో రాష్ట్ర విభజన అంశాన్ని లేవనెత్తే పరిస్థితులూ దూరమవుతాయి. ఒకసారి మద్రాసునుండి మరోసారి హైద్రాబాద్ నుండి విడిపోయి, మరో విభజనను భరించే ఓపిక ఆంధ్ర ప్రజలకు లేదు. అలాంటి అవకాశాన్ని నివారించాలంటే మూడు ప్రాంతాల అభివృద్ధి జరగాలి. అందుకోసమే మూడు ప్రాంతాల్లో రాజధానులు. ఇదేం కొత్త కాదు. భారతదేశంలోని చాలా రాష్ట్రాలలో రాజధాని ఉన్న నగరంలోనే రాష్ట్ర హైకోర్టులు లేవు. ఈ అధికార, అభివృద్ధి వికేంద్రీకరణవల్ల అమరావతితోపాటు విశాఖపట్నం, కర్నూల్ మహానగరాలుగా అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు మహానగరాలు వచ్చే అవకాశముంది. ప్రాంతాల మధ్య అభివృద్ధి అంతరాలతోపాటు, అపోహలు తొలిగే అవకాశమూ ఉంది. ఆంధ్ర ప్రజలంతా కలిసి మద్రాసు, హైదరాబాదుల అభివృద్ధికోసం చేసిన కృషిని తమ రాజధానులకోసమూ చేసి తమ మధ్యనున్న ఐక్యతను దేశానికి చాటి చెప్పాలి. మూడు రాజధానులవల్ల మూడు ప్రాంతాల ప్రజలకు తమతమ పనులకోసం సమానంగా ప్రయాణం చేసే అవకాశమూ ఉంది.
ఒకే నగరం విపరీతంగా పెరగడంవల్ల మురికి కూపాలు, కాలుష్యం పెరిగి బతుకు దుర్భరమూ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలకు మూడు ప్రత్యేకతలున్నాయి. మధ్యాంధ్ర కోస్తా ప్రాంతం వ్యవసాయిక క్షేత్రంగా, మైదాన ప్రాంతంగా నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతం. ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రాకృతిక సౌందర్యంతో, గిరిజన సంస్కృతిక నేపథ్యం విశేషంగా ఉన్న భూమి. రాయలసీమ ప్రాంతం నీటి కరువున్న ప్రాంతమైనా పారిశ్రామిక ప్రగతికి విశేషావకాశాలున్న నేల. ఆయా ప్రాంతాల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి నమూనాను నిర్ణయించుకుంటే మూడు ప్రాంతాలు గొప్పగా అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి అంటే పిడికెడు మంది రియల్ ఎస్టేట్లతో కోట్లకు పరుగెత్తడం కాదు. మెజారిటీ ప్రజలు కనీసంగా ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతికి ఎదుగడం. మూడు ప్రాంతాల్లో రాజధానులను పెట్టడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి అందరూ మధ్యతరగతికైనా ఎదుగుతారని ఆశించే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొనుంటుంది. దీన్ని ఏ పార్టీ అయినాసరే ఎందుకోసం వ్యతిరేకించాలో అర్థంకాని విషయం.
అమరావతి ప్రధాన రాజధాని కేంద్రంగా మధ్యాంధ్ర ప్రాంతాన్ని వ్యవసాయిక కేంద్రంగా, వ్యవసాయాధారిత పరిశ్రమల కేంద్రంగా, తెలుగుజాతి సాంస్కృతిక కేంద్రంగా, విద్యాకేంద్రంగా అభివృద్ధి చేసి ప్రపంచంలోని మహానగరాల్లో ఒకటిగా క్రమక్రమాభివృద్ధి చెందేందుకు కృషి జరుగుతుందనడంలో సందేహం లేదు. కర్నూలులో హైకోర్టుతో న్యాయ కేంద్రంగా రాయలసీమ అభివృద్ధి చెందుతూ, నీటి కరువును రూపుమాపుతూ, పారిశ్రామికాభివృద్ధి చెందే విధంగా చర్యలుతీసుకుంటూ రాయలనాటి వైభవాన్ని రాయలసీమకు తీసుకొస్తారనడంలో అనుమానానికి తావులేదు. విశాఖపట్నం మరో రాజధాని కేంద్రంగా ఐ.టి.పరిశ్రమకు, సినిమా రంగానికి, గిరిజన అభివృద్ధికి, అటవీ సంపదను విశేషాభివృద్ధి చేస్తూ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దవచ్చు. ఇలా అమరావతిలో అసెంబ్లీ, సెక్రటేరియట్‌లతో రాజకీయ రాజధానిగా, కర్నూలును హైకోర్టుతో న్యాయ రాజధానిగా, విశాఖపట్టణాన్ని సినిమా రంగం, ఐ.టి. రంగంగా ఆర్థిక రాజధానులుగా తీర్చిదిద్దవచ్చు. ఇలా రాజధాని వికేంద్రీకరణ వల్ల ఇంతకాలంగా విస్మరణకు లేదా వివక్షకు గురయిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. దూరదృష్టితో, మానవీయ దృక్పధంతో యువ కిశోరం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న బహుళ రాజధాని నిర్ణయాన్ని స్వాగతిద్దాం.
రాజధాని నిర్మాణం పేరుమీద అయ్యే లక్ష కోట్లను సామాన్య ప్రజల విద్య, వైద్య, వ్యవసాయికాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తానన్న ముఖ్యమంత్రిగారిని అభినందిద్దాం. మూడు నగరాల్లో రాజధాని భవనాలతోపాటు ఇతర భవనాల నిర్మాణం జరిగి ఒకే రోజులో కాకుండా క్రమక్రమంగా రోమ్ మహానగరాలుగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మరోసారి ‘రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే’అన్న సామెతను గుర్తుచేస్తూ...

- డా. కాలువ మల్లయ్య 9182918567, 9849377578