సబ్ ఫీచర్

‘నోటా’ ఓట్ల శాతం తగ్గుతోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులలో ఎవరి పట్లా తమకు ఆసక్తిలేని పక్షంలో- ఎవరూ ఇష్టం లేదని (‘నోటా’) ఓటు వేసే సౌలభ్యాన్ని భారత ఎన్నికల కమిషన్ ఓటర్లకు కల్పించి ఆరేళ్ళు గడిచాయ. ఈ ఆరేళ్లలో దేశం మొత్తంమీద నోటాకు ఓట్లువేస్తున్న వారి సంఖ్య తగ్గుతూ ఉన్నప్పటికీ, ఈ సంఖ్య షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్‌చేసిన స్థానాలలో పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.
2013లో ఎన్నికల కమిషన్ ‘నోటా’ను ప్రవేశపెట్టినప్పుడు, పోటీచేస్తున్న అభ్యర్థులలో ఎవ్వరిపట్ల ఇష్టంలేని పక్షంలో ఓటింగ్‌కు దూరంగా లేకుండా, ఆ విషయం వ్యక్తంచేసేందుకు ఈ సౌలభ్యం కలిగిస్తున్నట్లు తెలిపారు. ఒక విధంగా ఎన్నికలలో పాల్గొంటున్న రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థుల ఎంపిక తీరుపట్ల ఓటర్లు అసమ్మతి తెలపడంగా నోటాను పరిగణింప వలసివస్తున్నది. ఓటర్లు తేలికగా గుర్తుపట్టేందుకు వీరికి ఒక ప్రత్యేక ఎన్నికల గుర్తును కూడా 2015లో కమిషన్ కల్పించింది. నోటాను ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు మొత్తం 46 ఎన్నికలు జరిగాయి. వాటిల్లో రెండు లోక్‌సభ ఎన్నికలు కాగా, 44 అసెంబ్లీ ఎన్నికలు. 44 అసెంబ్లీ ఎన్నికలను 13 రాష్ట్రాలలో- ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, హర్యానా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, తెలంగాణలలో జరిగాయి. మొత్తం మీద 5671 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగగా, వాటిల్లో 3980 సీట్లు జనరల్ సీట్లుకాగా, 822 సీట్లు ఎస్సీలకు, 869 సీట్లు ఎస్టీలకు రిజర్వ్ చేసినవి. రెండుసార్లు, 1086 నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగగా, వాటిల్లో 820 జనరల్ సీట్లుకాగా, 168 ఎస్సీలకు, 98 ఎస్టీలకు రిజర్వ్ చేసినవి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ సీట్లలో అత్యధికంగా నోటా ఓట్లు నమోదయ్యాయి. ఈ నియోజకవర్గాలలో మొత్తం 8.49 కోట్ల మంది ఓటర్లు పాల్గొనగా వారిలో 2.31 శాతం మంది నోటాకు వేశారు. అంటే 19.65 లక్షల మంది నోటాకు ఓట్ వేశారు. ఇక ఎస్సీ రిజర్వ్ సీట్లలో 17.49 లక్షల మంది నోటాకు ఓట్ వేశారు. మొత్తం 13.34 కోట్ల మంది ఈ నియోజకవర్గాల్లో ఓట్లువేయగా, వారిలో 1.31 శాతం మంది నోటాకు ఓట్‌వేశారు. ఇక జనరల్ సీట్లలో నోటా ఓట్లు శాతం 1.30 శాతం మాత్రమే ఉంది.
లోక్‌సభ ఎన్నికలలో ఎస్టీ రిజర్వ్ సీట్లలో పోలైన మొత్తం ఓట్లలో 1.9 శాతం మంది నోటాకు ఓటు వేయగా, ఎస్సీ సీట్లలో 1.1 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. ఈ శాతం జనరల్ సీట్లలో 1 శాతంకన్నా తక్కువగా 0.9 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. లోక్‌సభ ఎన్నికలలోకన్నా నోటా ఓట్లు అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువగా ఉండటం గమనార్హం.
2019లో 38 అసెంబ్లీ, 27 లోక్‌సభ నియోజకవర్గాలలో గెలుపొందిన అభ్యర్థులకు వచ్చిన ఆధిక్యతకన్నా నోటాకు ఎక్కువ ఓట్లు పోలుకావడం జరిగింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అటువంటి నియోజకవర్గాలు 23 మాత్రమే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు లభించే ఆధిక్యతకన్నా నోటాకు పోలయిన ఓట్లు ఎక్కువగా ఉన్న సీట్లు 2013తో పోల్చుకొంటే తగ్గుముఖం పడుతున్నాయి. 2013లో మొత్తం అసెంబ్లీ సీట్లలో 9 శాతం గెలుపొందిన వారి ఆధిక్యతకన్నా నోటాకు ఎక్కువ ఓట్లు లభించాయి. అవి 2019 నాటికి 4.3 శాతానికి తగ్గాయి. అటువంటి సీట్లలో ఎస్టీ సీట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
2013లో గెలుపొందిన అభ్యర్థుల ఆధిక్యతకన్నా 15.71 సీట్లలో నోటా ఓట్లు ఎక్కువగా ఉండగా, 2019 నాటికి అవి 10.91 శాతానికి తగ్గాయి. కాగా, లోక్‌సభ ఎన్నికలలో ఎస్టీ సీట్లలో ఆ విధంగా నోటాకు ఎక్కువ ఓట్లువచ్చిన సీట్లు 2014లో 10.2 శాతం మాత్రమే ఉండగా, అవి 2019లో 14.29 శాతంకు పెరిగాయి. అయితే ఎస్సీ సీట్లలో అటువంటివి 2014లో నాలుగు ఉండగా, 2014లో ఒక నియోజకవర్గం మాత్రమే ఉంది. గత ఆరేళ్లలో నోటా ఓట్ల శాతం తగ్గుతూ ఉన్నప్పటికీ, పోల్ అవుతున్న ఓట్లు జనరల్ సీట్లకన్నా రిజర్వ్ సీట్లలో ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. 2019 లోక్‌సభ ఎన్నికలను మినహాయిస్తే, గెలుపొందిన అభ్యర్థుల ఆధిక్యతకన్నా, నోటా ఓట్లు ఎక్కువగా ఉన్న సీట్లుకూడా తగ్గుతున్నాయి. రిజర్వుడు సీట్లలో నోటా ఓట్లు ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటో స్పష్టంగా తెలియనప్పటికీ, ఒక అంచనా ప్రకారం కుల పెద్దలు అభ్యర్థులకు ఓటు వేయవద్దని ఇస్తున్న పిలుపుల కారణంగా జరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఉదాహరణకు ఎస్టీ రిజర్వ్ సీట్లలో గిరిజనేతరులు ఓటు వేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు.

-చలసాని నరేంద్ర