సబ్ ఫీచర్

మనసెరిగిన మధుర స్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలో ఇంకా సంగీతతృష్ణ తరిగిపోలేదు. సర్కారైనా, సంగీత పోషకులైనా నాకు సహకరించి సహాయమందిస్తే -సంగీత పాఠశాల నెలకొల్పాలన్న తపన ఇంకా ఉంది. నాకు దొరికిన సరస్వతీ కటాక్షాన్ని నలుగురికీ పంచి, నాలుగు తరాలకు నిలిచే ఉత్తమ గాయనీ గాయకులను తయారు చేయాలన్న సంకల్పం బలంగావుంది. ఈ విషయంలో కళామతల్లి కరుణ ఎంతవరకూ ఉందో చూడాలి -అంటూ తపన పడుతోంది తొమ్మిది పదులు దాటిన బాలసరస్వతమ్మ. ఏనాటివో, ఎన్నటివో ముచ్చట్లను
గతవారం వినిపించి మనసు తేటపర్చిన ఈ తల్లి -ఈవారం కొన్ని జ్ఞాపకాలను మనకోసం ముచ్చట్లు చేసింది.. ఆమె మధురమైన గాత్రంతో. సరస్వతమ్మ పాటను పోలిన మాటలు -ఈవారం వెనె్నల పాఠకుల కోసం.
*
తొలి నేపథ్యగాయని మాత్రమే కాదు, తొలి డబ్బింగ్ చిత్రం ఆహుతిలోనూ శ్రీశ్రీ రచనను పాట పాడటం తన జీవితంలో మరువలేని రోజంటారు బాలసరస్వతి. సిఆర్ సుబ్బరామన్, రమేష్‌నాయుడు దర్శకత్వ పర్యవేక్షణలో అనేక పాటలు పాడారామె. ముఖ్యంగా వారిద్దరూ తన గాత్రాన్ని ఎంతో ఇష్టపడేవారని, అందువల్లే ప్రతి చిత్రంలో తనత ఏదోక పాట పాడించే ప్రయత్నం చేసేవారని గుర్తు చేసుకున్నారు. రాధిక, సువర్ణమాల, బిల్హణ తదితర చిత్రాల్లో సాలూరి హనుమంతరావు సంగీత సారథ్యంలో బాలసరస్వతి పాడిన అనేక పాటలు అప్పట్లో మార్మోగేవి. ‘వైవాహిక జీవితం సుఖంగానే గడిచినా, గాయనిగా కెరీర్‌కు అనేక ఆటంకాలు ఎదురవ్వడం పట్ల బాధపడాలో, పడకూడదో కూడా తెలిని పరిస్థితి నాది. రాజావారు పాటించే ఘోషా పద్ధతినుంచి నలుగురిలోకి వచ్చి పాటలు పాడాలని, తన పాటలు ఆంధ్రదేశం నలుమూలలా మార్మోగాలని ఎంత ప్రయత్నించినా కేవలం కొన్ని రికార్డులు మాత్రమే సాధించగలిగాను’ అంటూ గుర్తు చేసుకున్నారు ఆమె.
ఒకసారి అక్కినేని, అంజలిదేవి కలిసి నటిస్తున్న ‘స్వప్నసుందరి’ చిత్రంలో ఓ పాట పాడాలి. కానీ ఆ పాట మరెవరిచేత పాడించినా ఆ భావం రాదని సంగీత దర్శకుడి అభిప్రాయం. ఏమైనా సరే రావు బాలసరస్వతి పాడాల్సిందేనని పట్టుబట్టారాయన. చివరికి అక్కినేని నాగేశ్వరరావు పూనుకుని రాజావారి వద్దకెళ్లి ఆయన్ను ఒప్పించి రికార్డింగ్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం రావు బాలసరస్వతికి గుర్తులేకపోయినా, ఇద్దరూ కలిసి పాల్గొన్న ఓ ప్రెస్‌మీట్‌లో ప్రత్యేకంగా నాగేశ్వరరావే ఈ మాటను ఆమెకు గుర్తు చేయడంతో పొంగిపోయారామె. నా కారులోనే తీసుకొచ్చాను కదా, మీకు గుర్తుందా? అని అడగటంతో.. రావు బాలసరస్వతి నెమరేసుకుంటూ.. కారు మోడల్‌ని కూడా గుర్తు చేసుకుని చెప్పడం ఓ విశేషం. పెళ్లిసందడి, దాంపత్యం, వీరకంకణం, తెనాలి రామకృష్ణ, జయసింహ, రాజీ నా ప్రాణం, శాంతి, ప్రియురాలు, మానవతి, చెంచులక్ష్మి తదితర చిత్రాల్లో బాలసరస్వతి గాత్రం అజరామరంగా ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అయితే తెనాలి రామకృష్ణ చిత్రంలో ఝన్ ఝన్ కంకణములుగా పాట రికార్డు చేసినా -అది చిత్రంలో వాడకపోవడం తనను బాధించే విషయం అంటారామె. ఆ చిత్రంలో ముక్కామలకు ఆనందం కలిగించడానికి సురభి బాలసరస్వతి నర్తించే పాట అది. కాని ‘ఏం రాజకీయాలు జరిగాయో కానీ ఆ పాట అద్భుతంగా వచ్చినా, మరో పాటను వినియోగించారు. ఓరకంగా తెలుగు ప్రేక్షకులు ఆ పాటను వినలేకపోయారని నా బాధ’ అంటారామె అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ. జయసింహ చిత్రంలో ‘మదిలోని మధుర భావం’ పాట షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్, వహిదా రెహమాన్ కెమెరాముందు నటిస్తున్నారు. ఇద్దరూ తెలుగువాళ్లు అవ్వడంతో ఆ పాటలోనే లీనమైపోయి నటిస్తున్నారట. కట్ షాట్‌లు చెప్పడానికి కూడా దర్శకుడికి ఇబ్బంది ఎదురైంది. మీరు కెమెరానే చూడండిగాని పాటలో లీనమవ్వకండి అని చెప్పారట. ప్రియురాలు, మానవతి చిత్రాల్లో బాలాంత్రపు రజనీకాంతారావు రచించిన ‘మలయ పవనమా మలయ మారుతమా’, ‘ ఉందువో మధురనగరు ఉదయ చంద్రిక’ అనే పాటలు ఇప్పటికీ తనకు ఇష్టమైన పాటలంటారామె. ఈ విషయాన్ని బాలాంత్రపు రజనీకాంతారావు వందో జయంతి సందర్భంగా విజయవాడలో నిర్వహించిన సభలో రావు బాలసరస్వతి గుర్తు చేసుకున్నారు కూడా. అందుకు బాలాంత్రపు ఏమన్నారంటే ‘మీ గాత్రాన్ని వినే ఆ పాటలు రాయడం జరిగింది’ అని. తన గాత్రం కోసమే కొన్ని మధురమైన పాటలు పుట్టడం నా జీవితంలో ఓ మధురమైన విషయంగా భావిస్తానని చెబుతారామె. దేవదాసు చిత్రానికి సంబంధించి రికార్డింగ్స్ జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు సిఆర్ సుబ్బరామన్, సినిమాలో కథానాయికకు నేపథ్యగానం అందించిన రాణి, ఉడుతా సరోజిని లాంటివారు వున్నారు. చంద్రముఖి పాత్రకు ఎవరుచేత పాడించాలని మీమాంస ఎదురైంది. దానికి సిఆర్ సుబ్బరామన్ ఏమాత్రం తడుముకోకుండా ఎలాంటి భావాన్నైనా తన గాత్రంలో పలికించగల దిట్ట రావు బాలసరస్వతిదేవి అని ఆమె చేతనే చంద్రముఖిపై చిత్రీకరించిన అన్ని పాటలనూ పాడించారు. ఈ విషయాన్ని సుబ్బరామన్‌తో ప్రస్తావించినపుడు ‘చంద్రముఖి అంటేనే కోయిలలా పాడే అద్భుతమైన నృత్యకారిణి. కనుక, నీలాంటి గాత్రమే ఉండాలి’ అని ఆయన సర్దిచెప్పి పాడించారట. ఇక స్వప్నసుందరి చిత్రంలో ‘నటనలు తెలిసెనులే ఓ మగసిరి సొగసరివాడా.. నీ నటనలు తెలిసెనులే..’ అన్న కంపోజిషన్ చాలా వేగంగా వుంటుంది. దానికి తగ్గట్టు అంజలీదేవి నృత్యం చేయాలి. ఈ విషయానే్న అంజలిదేవికి చెప్పి ఇంత వేగంగా మీరు నృత్యం చేయగలరా అని అడిగి ఆ పాట రావుబాలసరస్వతి చేత అద్భుతమైన వేగంతో పాడించారు. ఇప్పటికీ ఈ పాట యూట్యూబ్‌లో దొరుకుతోంది. బహుశా అంజలీదేవి అంత వేగంగా మరే చిత్రంలోనూ నృత్యం చేయలేదేమో! ఈ విషయానే్న అంజలిదేవిని అడిగితే, ఆమె గాత్రానికి తగ్గట్టు నా నృత్యం తోడైతేనే పాట రసాభాసా కాకుండా వుంటుంది కదా! అందుకే కష్టమైనా సరే ఇష్టం చేశానంటారామె. ఏఎన్నార్ ఆ పాటలోవున్నా ఎటువంటి మూవ్‌మెంట్స్ వుండవు. ఆ తరువాత ఆయన స్పీడ్ మూమెంట్స్ నేర్చుకోవడానికి ఈ పాట కూడా ఓ కారణమని చెబుతారు.
1974లో రాజావారు రాజా ప్రద్యుమ్న మహీపతి సూర్యారావు కాలం చేశారు. తెలిసినవారు, బంధువులు, దాయాదులు ఆస్తులపై అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కళాకారులుగా పుట్టినవాళ్లకి కొట్లాటలు అస్సలు గిట్టవు. ప్రపంచంలోని అందమైనవాటిని చూసి ఆస్వాదించడం తప్ప దానివెనుక వున్న కుట్రలు, కుతంత్రాలు తెలియవు. అలా అస్తులన్నీ వేరేవారిపరమైపోగా మద్రాస్ చేరుకున్నారు బాలసరస్వతి. మళ్లీ కెరీర్ ప్రారంభిద్దామంటే, అప్పటికే ఫాస్ట్‌బీట్ పాటలు వెండితెరపై రాజ్యమేలుతున్నాయి. అలాంటి పాటలు పాడటం ఆమెకు ఇష్టంలేకపోయింది. లయ ప్రధానంగా సాగే ఇప్పటి పాటల్లో భాష, భావం ఉండటం లేదు. అసలు అవి ఎలావుంటాయో తెలుసుకోకుండానే పాడేస్తున్న గాయకులూ వచ్చేస్తున్నారు అంటారామె. ఎప్పుడూ కృత్రిమ గాత్రం వనె్నకురాదని, హృదయంలోనుంచి వచ్చే నాదమే చిరస్థాయిగా నిలుస్తుందని ఆమె అభిప్రాయం. పేరడీలు, మిమిక్రీలు పాటలుగా రాజ్యమేలుతున్న కాలంలో తనకు చోటు ఉండదన్న నిర్ణయానికి రావడానికి చాలారోజులు పట్టింది ఆమెకి. విద్వత్తు ‘ఇంత’వున్నా అతిగా ప్రచారం చేయడం, తమకంటే గొప్పవారు లేరని చెప్పుకోవడం లాంటి పద్ధతులు ఆమెకు నచ్చలేదు. పోనీ కొంత పేరు వచ్చాక తమ ప్రతిభకు మెరుగుపెట్టుకునే ఉద్దేశాలు కూడా ఎవరికీ ఉండటం లేదు. ఆవున్న వెలుగుతోనే ఇల్లు చక్కదిద్దుకోవాలని కమర్షియల్ వైపు ఒరిగిపోతున్నారు. అందువల్లనే సరైన పాటలు రావడంలేదు అంటారామె. పర్విన్ సుల్తానా, జగజ్జిత్‌సింగ్ పాటలంటే ఆమెకు చాలా ఇష్టం. అదేవిధంగా మర్చిపోలేని రోజు ఏదన్నా వుందీ అంటే, మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినరోజు అని చెప్పారు బాలసరస్వతి.
ఆరోజు 15-08-1947 స్వతంత్రం వచ్చిందీ అంటే తన పాట ఆకాశంలో ఎగిరినంత సంబరపడ్డారామె. ఆ రోజు ఉదయానే్న ‘ప్రభాత ప్రాంగణమున మ్రోగెను నగారా’ అన్న పాట మద్రాస్ ఆకాశవాణి ద్వారా ప్రజలకు వినిపించడంతో తన జన్మ ధన్యమైందని అంటారామె. ఆ రోజున స్వేచ్ఛాగానం చేసిన గాయకులంతా కలిసి ఓ ఫొటోగ్రాఫ్ తీసుకున్నారు. వారిలో అందరూ కాలంలో కలిసిపోగా ఒక్క నేను, సి కృష్ణవేణి మాత్రమే ఇపుడున్నాం. మేమిద్దరం కలుసుకుంటే అప్పటి మధురక్షణాలను గుర్తుచేసుకొని ఆనందిస్తూ వుంటాం. జీవితంలో ఇంతకన్నా ఆనందం మరొకటుంటుందా? అంటూ ఆమె కళ్లు చెమర్చాయి. ఇప్పటికీ తనలో సంగీతతృష్ణ తరగలేదని, తనకంటూ ప్రభుత్వ సహాయం ఏదైనా లభిస్తే సంగీత పాఠశాలను నెలకొల్పి భవిష్యత్తరాలకు మంచి పాటలు పాడే గాయకులను అందించాలన్న తపనతోనే ఉన్నానంటూ ముగించారామె.

-సరయు శేఖర్, 9676247000