సబ్ ఫీచర్

నిర్మలమ్మ మదిలో ఏముందో...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. భారత ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో భారత ప్రజల భవిష్యత్ ఎంతగానో ఆధారపడి వుంది. ఈ నేపథ్యంలో అందరి చూపు ఈ బడ్జెట్ సమావేశాల వైపు మళ్లింది. నిర్మల మదిలో ఏముందో? ఆమె వ్యూహప్రతివ్యూహాలు ఎలా వున్నాయో? మందగమనంలో వున్న భారత ఆర్థిక పరిస్థితిని ఎలా చక్కదిద్దనున్నారోనని యావత్ దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2018 - 2019 ప్రారంభంలో ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాయి. భూతల స్వర్గంలాగా రాణించిన అమెరికా కూడా ఉక్కిరిబిక్కిరయ్యింది. ఆర్థిక క్రమశిక్షణకు, అభివృద్ధికి మరోపేరు అని చెప్పుకుంటున్న చైనా కూడా ఈ మధ్యకాలంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. ఇటువంటి క్లిష్ట సమయంలో గత ఏడాది ప్రారంభంలో మన దేశం వృద్ధిరేటు 8 శాతాన్ని సాధించి ఔరా! అనిపించుకుంది. అయితే.. ఆరు నెలల తరువాత మన దేశ పరిస్థితి కూడా తారుమారు అయ్యింది. ఏడాది చివరకు పరిస్థితులు మరింత క్షీణించాయి. మొత్తం ప్రపంచం ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నది. సాక్షాత్ ఐక్యరాజ్యసమితికే నిధుల కొరత ఏర్పడింది. ఐక్యరాజ్యసమితి నందలి శాశ్వత సభ్యదేశాలు ఇతరత్రా మరికొన్ని దేశాలు ప్రతియేటా ఇచ్చే విరాళాలనందు కోత ఏర్పడడంతో సమితి సైతం కొంతమంది ఉద్యోగులను తొలగించింది. ఈ నేపథ్యంలో మన భారత పాలకులు మేకపోతు గాంభీర్యంతో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పటికీ మనకు ఆ దుస్థితి రాలేదు. కేవలం ఆర్థిక మందగమనం మాత్రమే వున్నది. గతంలో అనేక ఆర్థిక సంక్షోభాలను తట్టుకొని ముందుకెళ్లడమైనది. మళ్లీ గత వైభవం వస్తుంది. పేదరిక నిర్మూలన భారత్‌గా, అభివృద్ధి చెందిన భారత్‌గా రికార్డులకెక్కబోతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవంగా మన భారతదేశంలో సంపదను సృష్టించడానికి పుష్కళమైన వనరులు వున్నాయి. మహత్తరమైన మానవ వనరులు సంపదకూడా గణనీయంగా వుంది. ఈ మానవ వనరుల ద్వారా సహజ వనరులను, ఇతర వనరులను ఉపయోగించడంలో మన పాలకులు విఫలమవుతున్నారు. విఫలం అనడంకన్నా... కక్కుర్తితో, స్వార్థంతో వ్యవహరిస్తున్నారంటే బాగుంటుంది. రెండు సంవత్సరాల కిందట ప్రపంచ ధనిక దేశాలలో మన దేశానికి 6వ స్థానం వచ్చిందని పాలకులు ఎగిరెగిరి గంతులేశారు. అయితే.. కేవలం 1 శాతం నల్లకుబేరుల చేతుల్లో 70 శాతం మంది సంపద కేంద్రీకృతమై వుందంటే.. పాలకుల యొక్క స్వార్థం కాక ఇంకేమనాలి? ఈ వాస్తవ దృశ్యాన్ని ప్రపంచ ఆర్థిక సదస్సు 50వ వార్షిక సమావేశంలో ఓక్స్‌ఫామ్ అనే సంస్థ విడుదలచేసిన నివేదికలో తెలియజేశారు. రెండు సంవత్సరాల కిందట మన భారత ఆర్థికశాఖ వ్యవసాయ రంగంలో 2022 నాటికి రెట్టింపు ఆదాయం తీసుకురావాలని సమగ్రమైన ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళిక గురించి అప్పటినుంచి ఇప్పటి వరకు చర్చలు, సమావేశాలు, చైతన్య వేదికలు నిర్వహిస్తూనే వున్నారు. ఈ విధంగా కుంటుబడిన వ్యవసాయ రంగాన్ని, నత్తనడక నడుస్తున్న పారిశ్రామిక రంగాన్ని రెండు కళ్లుగా భావించి ముందుకు నడిపించాలి. మొత్తం పారిశ్రామిక వ్యవస్థ కేవలం 100 మంది నల్లకుబేరుల గుప్పెట్లో చిక్కుకుంది. ఇలా కాకుండా ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రజలను భాగస్వాములను చేసి సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు ప్రాధాన్యతనివ్వాలి. మార్కెటింగ్ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వమే చేపట్టాలి. అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధిచేయాలి. ఇలాగే.. వ్యవసాయం అంటే.. నిరాసక్తితో వ్యవహరిస్తున్న రైతులను ముఖ్యంగా యువతను చైతన్యవంతులను చేసి వ్యవసాయ రంగంలో కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను భారీ స్థాయిలో సృష్టించాలి. రైతులకు, వ్యాపారులకు మధ్య దళారీ వ్యవస్థలను రద్దుచేయాలి. ఈ విధంగా రైతు ఉత్పత్తులను రైతులే అమ్ముకునే విధంగా ప్రభుత్వ భాగస్వామ్యంతో నూతన విధానాన్ని తీసుకురావాలి. అటు పారిశ్రామిక రంగం, ఇటు వ్యవసాయ రంగం కొత్తపుంతలు తొక్కడానికి చేపట్టబోయే మార్గాలను అమలుచేసే బ్యూరోక్రాట్‌నందు, రాజకీయ రంగంనందు అవినీతిని దూరంచేయాలి. అప్పుడే.. మన భారతదేశ ఆర్థిక నావ సమస్యల సముద్రంనుంచి ఒడ్డుకు సునాయాసంగా చేరుతుంది. ఈ స్థాయిలో నిర్మల హృదయంతో, సానుకూల దృక్పథంతో, దూరదృష్టితో మన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆలోచిస్తారో.. సాదాసీదాగా ప్రతియేటా ప్రవేశపెడుతున్న బడ్జెట్ తరహాలోనే ఈసారి బడ్జెట్ కూడా కార్పొరేట్లకు కొమ్ము కాచే విధంగా తీసుకొస్తారో.. వేచి చూడాలి.

- తిప్పినేని రామదాసప్పనాయుడు, 99898 18212