సబ్ ఫీచర్

నేలపై హరివిల్లు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కళ్లకు కట్టే పండుగ సంక్రాంతి. మరే ఇతర పండుగలకు లేని విశిష్టత దీనికి ఉంది. సంక్రాంతి మాత్రమే సౌర గమనాన్ని అనుసరించి వస్తుంది. మిగతా పండుగలన్నీ చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. భోగి, మకర సంక్రాంతి, కనుమ పేరిట మూడు రోజులపాటు జరుపుకునే ముచ్చటైన ఈ పండుగ మన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. పల్లెల్లో సంక్రాంతి సందర్భంగా హరిదాసుల సందడి, కోడి పందాలు, గాలి పటాలు ఎగరవేయడం, ప్రతి ముంగిటిలోనూ రంగురంగుల ముగ్గులు, కుటుంబ సభ్యులంతా కలుసుకుని ఆనందంగా గడపడం వంటివి కనువిందు చేస్తాయి.
ఇది సూర్యుని సంక్రమణానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో సాగే గ్రహగతుల్ని నేలమీద ముగ్గుల రూపంలో గమనించే ఏర్పాటుని చేశారు మన ప్రాచీనులు. ఆవుపేడతో అలికిన నేల- ఆకాశానికి సంకేతం. ముగ్గుల్లో వేసే చుక్కలు నక్షత్రాలకి సంకేతం. ముగ్గులోని చుక్కల్ని తీరుగా కలుపుతూ, ప్రతి చుక్కనూ ఓ గడిలో ఉంచడాన్ని ‘ముగ్గు’గా పేర్కొంటారు. ఈ విధానమంతా ఏ గ్రహం ఎలా ప్రయాణిస్తుందో, ఖగోళంలో నక్షత్రస్థితి ఎలా ఉంటుందో తెలియజేయడమే ముగ్గులోని అంతరార్థం.
గ్రహగతిలో ఏ గ్రహం దేనితో మైత్రితో ఉంటుందో, ఏ గ్రహం దేనికి శత్రువో, ఏ గడి దేనికి అనుకూలమో అనే జ్యోతిష పరిజ్ఞానంతో రంగవల్లులను తీర్చిదిద్దేవారు. ముగ్గులో మధ్య గడిలో ఉండే సూర్యగ్రహానికి కుంకుమతో, సూర్యునికి ముందుగా ఉండే శనిగ్రహం గడిని నలుపులేదా నీలి రంగుతో నింపేవారు. ఏ గడిలో ఏ రంగును నింపాలన్న విషయమై ఒక నిర్దిష్టమైన పద్ధతిని పాటిస్తూ ముగ్గులను అలంకరిస్తూ ఉండేవారు ప్రాచీనులు. ఆనాటి సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఇప్పటికీ సంక్రాంతి వచ్చిందంటే చాలు- మగువలు ధనుర్మాసంలో ఒక్కో రోజు ఒక్కో రకం రంగవల్లులను ఇంటిముంగిట తీర్చిదిద్దుతూ తమ కళానైపుణ్యాన్ని చాటుకుంటారు. ముంగిట్లో ముగ్గులు ఇంటికి శోభనివ్వడమే కాదు.. శుభప్రదం కూడా. ఎవరి ఇంటి ముందు ముగ్గులు అలంకరించబడి ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుందనేది ఓ విశ్వాసం. మనం రోజూ తినే ఆహారం భూదేవి మనకు ఇచ్చిన వరం. అటువంటి భూమాతను సర్వాంగ సుందరంగా అలంకరించడమే ముగ్గు వేయడంలోని ఆంతర్యం. ఇంటిముందు ముగ్గు వేయడం పర్యావరణ కోణంలోనూ మంచిదే. వరిపిండితో వేసిన ముగ్గులు చిన్న చిన్న కీటకాలకూ, పక్షులకు ఆహారమవుతాయి. మన భూతదయకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. నడుము వంచి ముగ్గులు వేయడం వల్ల శరీరానికి కొంత వ్యాయామం జరుగుతుంది. రోజూ ముగ్గులు వేయాలన్న సంకల్పం ఉంటే ఉదయానే్న నిద్ర లేవడం వంటి క్రమశిక్షణ పద్ధతులు అలవడతాయి. రంగురంగుల ముగ్గులు మహిళల్లోని సృజనాత్మకతకు అద్దం పడతాయి. ఇక, మార్గశిర మాసంలో చలికి రకరకాల హానికారక కీటకాలు పుడతాయి. ముగ్గులోని కాల్షియం క్రిమికీటక సంహారానికి తోడ్పడుతుంది. ముగ్గులు వేయడం వెనుక ఇలాంటి ప్రయోజనాలు ఎన్నో దాగి ఉన్నాయి.

-రసస్రవంతి, కావ్యసుధ