సబ్ ఫీచర్

బడ్జెట్ తెచ్చే భావోద్వేగాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో రాజులు- రాజ్యాల మధ్య వైరం, వైరుధ్యాలుండేవి. వర్తమాన ప్రజాస్వామ్యంలో కేంద్రం-రాష్ట్రాల మధ్య వైరం, వైరుధ్యాలు కనిపిస్తాయి. అవి స్నేహపూర్వకమైనవి, స్పర్థతో కూడినవి కావచ్చు..
2020-21 సంవత్సరపు కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాక ఆ లక్షణాలు, స్పర్థ గుణాలు సుస్పష్టంగా బయటపడ్డాయి. ప్రచార, ప్రసార సాధనాల ద్వారా వాటిని ప్రజలందరూ చూశారు. ఇది దశాబ్దాలుగా కనిపిస్తున్న దృశ్యమే!, షరామామూలు విధానమే కావచ్చు కాని ప్రజాస్వామ్యంలో ఆ వైరుధ్యం, వైరం నాగరికంగా కనిపిస్తే సబబుగా ఉంటుంది.
బడ్జెట్ కొందరికి మోసం.. దగా, వివక్ష, అన్యాయం, అధర్మంగా కనిపించడంతో స్పందన తారాస్థాయికి చేరింది. మాటల తూటాలను పేల్చారు. ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. అందులో నికార్సైన వైరం.. వైరుధ్యం స్పష్టంగా దర్శనమైంది. అది మిత్ర వైరం, వైరుధ్యంగాక శత్రువైరం- వైరుధ్యంగా ధ్వనించడం కించిత్ కలవరపెడుతుంది.
ప్రజల సంపదకు పాలకులు ధర్మకర్తలు మాత్రమేనన్న మహాత్ముని మాటలను మననం చేసుకుంటే ఈ పాటల తూటాలు, ద్వేష పూరిత వాగ్భాణాలకు అర్థం లేదు.
ప్రతి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో తప్పక కనిపించే శీర్షిక ‘‘రూపాయి రాక-పోక’’. అంటే కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఎక్కడినుంచి వస్తాయి, ఏఏ రంగాల్లో ఖర్చుచేయబోతున్నారనే అంచనా సమాచారం క్లుప్తంగా అందులో కనిపిస్తుంది.
మనసుపెట్టి దాన్ని గమనిస్తే విషయం బోధపడుతుంది. అందులో ఎలాంటి గందరగోళం.. సంక్లిష్టత కనబడదు. ఆ ప్రతిపాదనల్లో రకరకాల రూపాల్లో పన్ను, సుంకాల రూపంలో వచ్చే ఆదాయం, పనే్నతర రాబడి, అప్పు ‘‘రూపాయి రాక’’గా కనిపిస్తే... పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా, పింఛన్లు, రాయితీలు, జీతాలు, పథకాలు, కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు, వడ్డీలు, రైల్వే, రక్షణ రంగ కేటాయింపు, ప్రణాళిక, ఆర్థిక సంఘాల ఖర్చు... ఇతర వ్యయాలు ‘‘రూపాయి పోక’’గా కనిపిస్తుంది. అంటే ఆదాయమెంతనో వ్యయం అంతే ఉంటుంది. మిగుల్చుకునేది ఏమీ కనిపించదు. దాచుకునేది...దోచుకునేది ఏమీ ఉండదు. పకడ్బందీగా ఆ లెక్కలు రూపొందిస్తారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ తతంగం అంతా ఉన్నతాధికారుల నేతృత్వంలో జరుగుతుంది. అంతటా జవాబుదారీతనం కనిపిస్తుంది. అనేక డేగ కళ్లు.. ఆడిట్ కళ్లు.. నిఘా కళ్లు వాళ్ళని వెన్నాడుతూ ఉంటాయి. దాంతో ‘‘ఒళ్లు దగ్గర పెట్టుకుని’’ బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది.
కొన్ని నిబంధనలు.. నియమాలు, నిర్దేశకాలు, అవసరాలు, ఆకాంక్షల కనుగుణంగా ‘‘సమాఖ్య’’ స్ఫూర్తి అనుసరించి కేటాయింపులుంటాయి. అందుకే బడ్జెట్ ఆదాయ - వ్యయాల లెక్క కాదు దేశాభివృద్ధి, లక్ష్యాలు, కార్యాచరణకు సంబంధించిందని నిపుణుల, సకారాత్మక ఆలోచనాపరుల అభిప్రాయం. దేశ సర్వతోముఖాభివృద్ధి, పౌరుల సుఖమయ జీవితం లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అందుకే అన్నారు.
ఎంత సానుకూల- సకారాత్మక దృష్టితో కేటాయింపులు చేసినా తమ రాష్ట్రానికి దక్కాల్సిన వాటా దక్కలేదని, తమకు అన్యాయం జరిగిందని, సవితి తల్లి ప్రేమ చూపారని, రాజకీయ కక్ష ప్రదర్శించారని, ద్రోహం చేశారని, మోసం జరిగిందని.. ఇలా పరుషమైన పదప్రయోగం వినిపిస్తుంది.
ఈ బడ్జెట్‌లో 2011 సంవత్సరపు జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రాలకు అందే పన్నులు- సుంకాల్లో వాటా తగ్గుతుందని తెలుస్తోంది. ఈ విధానం ప్రకారం దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నాయి, కొన్ని రాష్ట్రాల ఆదాయంలో ‘‘గండి’’ పడుతోంది. ఇదంతా ఆర్థిక సంఘం సూచనలు, కొలమానాల కారణంగా జరుగుతోందని వినికిడి. ఆ రకంగా కర్నాటక రాష్ట్రం ఎక్కువ ఆదాయాన్ని కోల్పోయి నష్టపోనున్నదని అంచనా.
దీని ప్రకారం రాజకీయ కక్ష, సవితితల్లి ప్రేమ, కొన్ని రాష్ట్రాలపై విరోధ భావంతో కేంద్రం వ్యవహరిస్తోందన్న ఆరోపణల్లో అర్ధం కనిపించదు. ఎందుకంటే కేంద్రంలో, కర్నాటకలో బిజెపి అధికారంలో ఉన్నది. ఆ పార్టీ తమ ముఖ్యమంత్రి పాలనకు నిధులకోత విధించి, ఆ రాష్ట్ర ఆగ్రహాన్ని చవిచూసి చెడ్డపేరు తెచ్చుకోవాలని భవించదు కదా? అన్ని రాష్ట్రాలకన్నా కర్నాటక రాష్ట్రం రూ. 8వేల కోట్లకు పైగా వాటాను కోల్పోనున్నదని తెలుస్తోంది. తమ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రానికి అన్యాయం చేయాలని ఏ రాజకీయ పార్టీ భావించదు, అయినా అలాజరుగుతోందంటే దానికున్న ‘‘మెకానిజం’’ వేరుగా ఉందన్న విషయం విస్మరించినప్పుడే రాజకీయ కక్షసాధింపు, సవితి తల్లి ప్రేమ, మోసం-దగా లాంటి పదాలతో విరుచుకు పడేందుకు ఆస్కారముంది.
దేశ బడ్జెట్ అయినా, ఇంటి బడ్జెట్ అయినా ‘పిండికొద్ది రొట్టె’ అన్న సూత్రంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకోకపోతేనే ఎక్కువ వైరం.. వైరుధ్యం తలెత్తుతుంది. ఆ ‘పిండి’ సమకూరడంలో, సమకూర్చుకోవడంలో అన్నివేళలా, అన్ని సమయాల్లో సానుకూలత, సకారాత్మక పరిస్థితులు కనిపించవు. ప్రకృతి.. ప్రపంచ పరిస్థితులు దీనిపై ప్రభావం చూపుతాయి. ఇది సాధారణ పౌరుడికన్నా ఆయా రాష్ట్రాల నేతలకు చాలాబాగా తెలుసు. వర్తమానంలో ఆర్థిక మందగమనం.. వనరుల అలభ్యత లాంటి అనేక విషయాలను గమనంలోకి తీసుకోవలసి వస్తుంది.
ప్రతిపాదిత బడ్జెట్ కాలంలో రూ. 2.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఉపసంహరణ (డిస్ ఇన్‌వెస్ట్‌మెంట్) చేయాలని ప్రభుత్వ ఆలోచన. అప్పులు కూడా భారీగా చేయనున్నది. పన్నులు.. సుంకాల ఆదాయానికి అదనంగానే ఇదంతా. అంటే కేంద్రం అప్పుచేసి, పెట్టుబడుల ఉపసంహరణకు పూనుకుని వివిధ పథకాలకు, రాష్ట్రాలకు సమకూర్చుతుంది. రాష్ట్రాలు తమ వాటా ఇంకా పెంచాలని పరుషంగా మాట్లాడి ఒత్తిడి చేస్తే కేంద్రం మరింత అప్పుచేయాలి... మరింత పెట్టుబడుల ఉపసంహరణకు పూనుకోవాలి. అలా తెచ్చిన అప్పులకు ‘వడ్డీ’కట్టాలి... ఆ భారమంతా తిరిగి ప్రజలపైనే పడుతుంది. రాష్టమ్రైనా, కేంద్రమైనా చేసే అప్పులకు వడ్డీ, అనుత్పాదక రంగాల్లో జరుగుతున్న ‘ఖర్చు’ ప్రజలేకదా భరించాల్సింది?
ప్రజల సంపదకు తాము ధర్మకర్తలమన్న మాట మరిస్తేనే ఇలాంటి విపత్తులు, సంక్షోభాలకు తిట్లకు బీజంపడుతుంది. సమాఖ్య భావనకు తూట్లుపడతాయి. ‘కేంద్రం మిధ్య’ అన్న ఆలోచనలు పెరుగుతాయి. వాస్తవానికి ‘‘రూపాయి రాక’’లో ఎక్కువ శాతం (్భగం)రాష్ట్రాల వాటాకిందకే పోతోంది. అంటే 20 శాతం ఆ పద్దు కిందకే వెళుతోంది. ఆ పద్దు పంపిణీ ఆర్థిక సంఘం సిఫార్సులు, గత నియమాల ప్రకారం జరుగుతుంది. అందులో కొన్ని రాష్ట్రాలు కొంత లబ్ధిపొందితే, కొన్ని రాష్ట్రాలు ఆర్థిక కోతకు గురవుతున్నాయి. లబ్ధిపొందిన రాష్ట్రాల ప్రజలు... ఆర్థిక కోతకు గురైన రాష్ట్రాల ప్రజలు ఈ దేశ పౌరులే?... పరాయి దేశ ప్రజలు కాదు. ఈ విశాల దృక్పథం... దృక్కోణం కనబరిచినట్లయితే స్పర్థ స్పర్థగా ఉంటుంది తప్ప ద్వేషంగా, క్రోథంగా మారదు. తమ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించాలన్న డిమాండ్ వాటి ఆవశ్యకతను వివరిస్తూ చేసే ప్రకటనలు పొరపాటు కాకపోవచ్చు కాని అది వైరంగా, విద్వేషంగా మారనంతవరకే అవి బాగుంటాయి.
ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. వ్యవసాయం పుంజుకునేందుకు ఆర్థికమంత్రి 16 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. రెండేళ్ళలో వ్యవసాయదారుల ఆదాయం రెండింతలయ్యేలా చూస్తామన్నారు. దేశంలోని అన్ని జిల్లాలు లబ్ధిపొందేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. నిధుల విడుదల చేయనున్నారు. ఆవిధంగా వాటాలో భాగంకోల్పోయామన్న రాష్ట్రాలకు ‘‘ఊతం’’ లభిస్తోంది. స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు భారీగానే అందుతున్నాయి. ఇది ఉపశమనమేకదా?
ఈ బడ్జెట్‌లో ప్రతి పౌరుడికి ఆర్థిక సాధికారతకోసం కార్యాచరణ కనిపిస్తోందని, గొప్ప దార్శనికత అగుపిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.
దేశంలోని అన్నివర్గాల ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాల కల్పన, అలాగే అధిక ఉత్పాదకత, ప్రైవేట్ రంగానికి సముచిత అవకాశం కల్పించనున్నారు. అంతేగాక మానవత్వం-కరుణతో సమాజం ఎదిగే లక్ష్యంతో బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆర్థికమంత్రి అభిప్రాయపడ్డారు. రక్షణశాఖకు, రైల్వేలకు పెద్దపీట వేశారు. త్వరలో మరిన్ని ప్రైవేట్ రైళ్లు రానున్నాయి. కనెక్టివిటి పెరగనున్నది. విమానాశ్రయాల సంఖ్య గణనీయంగా పెరగనున్నది. అంకుర సంస్థలను ఆదుకోనున్నారు.
కొసమెరుపు ఏమిటంటే... ఈ ప్రతిపాదనలకే ప్రభుత్వం దగ్గర సరిపడ డబ్బులేదన్న వాదనలు ప్రబలంగా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు వాటా పెంచి ఇచ్చేందుకు డబ్బు ఎక్కడినుంచి వస్తుంది? ఎవరికైన డబ్బులు ఊరికే రావుకదా??

- వుప్పల నరసింహం 9985781799