సబ్ ఫీచర్

రాజధాని గందరగోళం ముగింపు ఎప్పుడో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజధాని రైతుల నిరసనల పోరాటం 50 రోజులు దాటింది. రాజధాని విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతూనే వుంది. ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన పని తాను చేసుకుపోతూనే వున్నాడు. ఎవరి గోల వారిదే! చంద్రబాబు మాత్రం తన కొత్త నేస్తం సీపీఐ నారాయణను వెంటేసుకొని పొలాలెంబడి, పల్లెలెంబడి ‘జగన్’పై గర్జిస్తూ చిందులు వేస్తున్నాడు. పవన్‌కళ్యాణ్ మాత్రం తన పాత కొత్త నేస్తం బీజేపీతో తిరిగి చెలిమికి శ్రీకారం చుట్టేశాడు. ఆనాడు ‘పాచిన లడ్లు’, ‘ఉత్తరాది పెత్తనం’ అంటూ బీజేపీపై నానాయాగీ చేసి అప్పట్లో సరదాగా మాయవతిని కలసి ఆమె కాళ్ళకు ఓ దండం పెట్టొచ్చి మళ్ళీ ఇప్పుడు కాషాయ జెండాను కప్పుకొని గాజు గ్లాసుతో ఎంచక్కా ఛాయ్ తాగుతూ, తీరిక దొరికినప్పుడల్లా ‘జై అమరావతి’ అంటూ ఆవేశ ఆనందాల్తో మునిగిపోతున్నాడు. రోజుకో ఆరు గంటలు ఎంచక్కా విమానం ఎక్కి షూటింగ్‌లో పాల్గొంటూ కాస్తా హుషార్ తెచ్చుకొంటున్నాడు. ఈయనగారు అమిత్‌షా గడప త్రొక్కేముందు రాజధాని రైతన్నలకు పెద్దపెద్ద హామీలే గుప్పించి వెళ్ళాడు. అమరావతి రాజధానిగా ఎవరూ ఒక్క అంగుళం కూడా కదిలించలేరు అని, ప్రజాగ్రహంలో జగన్‌రెడ్డి కొట్టుకుపోతాడని, ఎన్నికల్లో తిరిగి వొక్క స్థానాన్ని కూడా గెలవలేడని, అవినీతిపరుడని, జైలు పక్షి అని ఎనె్నన్నో తిట్టిన తిట్లు తిట్టకుండా ‘జగన్’ని శాపనార్థాలు కూడా పెట్టి వెళ్లాడు. ఢిల్లీలోని కాషాయ గుహలో మాంత్రికుడి అమిత్‌షా సమక్షంలో ఏం మాయ జరిగిందో, ఏం మంత్రం పడిందో కాని పవన్‌బాబుగారు ఢిల్లీనుండి తెలుగు గడ్డపై అడుగుపెట్టాక అప్పటి హుషారు కాకిలా ఎగిరిపోయింది. అప్పుడప్పుడు అరుపులున్నాయే కాని గర్జనలు మాత్రం లేవు. ‘మాయ’‘మంత్రం’ ఏదైనా కాషాయ దుప్పట్లో కాస్తా వెచ్చదనం కన్పించినట్లుంది. ట్వీట్లు చేసుకొంటూ, ఇంకా రాజధాని రైతులకు ఆశలురేపుతూ బ్రతుకు గడుపుకొస్తున్నాడు. మళ్ళీ వచ్చేవారం రాజధాని రైతుల ముంగిట పవన్‌కళ్యాణ్ అంటూ ఓ ప్రకటన కూడా ఇచ్చేశారు.
రాజధాని విషయంలో ఎంత గందరగోళం నెలకొందో అంతకు పదింతలు బీజేపీ నాయకుల్లో కూడా స్పష్టంగా కన్పిస్తున్నది. ఒక్కో నాయకుడు ఒక్కో విధంగా సెలవిస్తుంటారు. చర్చాగోష్ఠిలో ఎవరైనా ఎదురుతిరిగి ప్రశ్నిస్తే ‘అబ్బే’ అదేం లేదు మా అందరిదీ ఒకే మాట అంటూ అందరి చెవుల్లో పూలు పెట్టేస్తారు. కాస్తా ఆలస్యం అయినా చాలామంది అమరావతికి జై అంటున్నా సోము వీర్రాజు మాత్రం ఒకటే కోరిక. మూడు రాజధానులే ముద్దు అంటూ ఒకే రాగం తీస్తున్నాడు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నాగారు మాత్రం అందర్నీ తన త్రోవలోకి తెచ్చుకొన్నట్లున్నాడు. ఈమధ్య జనసేన, బీజేపీ నాయకులిద్దరు కలసి చాలాసేపు ఏవేవో చర్చలు జరిపి, తర్వాత కొన్ని గ్రామాలు తిరిగి ‘రైతుకు అండగా వుంటాం’ అంటూ మళ్ళీ పాత పాట పాడేసి సేద తీరుతున్నారు. పాపం బీజేపీ మాత్రం ఏం చేయగలదు? తమకున్న వోట్లు శాతమే తక్కువ. కేడర్ కూడా తక్కువే. స్వయంగా ఉద్యమాన్ని నడపలేరు. పవన్‌గారేమో అన్నివేళల, అన్ని దినాల్లోనూ అందుబాటులో వుండరాయె. తమ ప్రతినిధులు మాత్రం క్రమం తప్పకుండా అన్ని ఛానల్స్‌లో జరిగే చర్చలకు హాజరై తామున్నామంటూ సంకేతాలిస్తుంటారు.
ఎరుపు రంగుకు కాషాయ రంగుకు శాశ్వత శతృత్వం కదా! ఇంకేముంది మరో ఆలోచన లేకుండా సీపీఐ పార్టీ చంద్రబాబు పసుపు దండులో చేరిపోయింది. నారాయణ చంద్రబాబు సంకనెక్కేశాడు. లేచింది మొదలు పడుకునే వరకు చంద్రబాబుతోనే పయనం. ఆయన తాన అంటే నారాయణ, రామకృష్ణలు తందాన అంటూ తిరుగుతున్నారు. చంద్రబాబుకు కూడా తోడుకోసం తపన. పవన్ అటు వెళ్ళిపోగానే కాస్త దిగులుపడిన చంద్రబాబుకు సీపీఐ పార్టీ మహావృక్షంలా కన్పించింది.
ఇక వందేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగే అయిపోయింది. ప్రజలు పూర్తిగా మరచిపోయారనుకొంటున్న సమయంలో ఆ పార్టీ అధిష్ఠానం కలవరం చెంది పీసీసీ నాయకుడిగా రఘువీరారెడ్డిని తప్పించి గత ఎన్నికల్లో తెలుగుదేశం పంచన చేరాలని విఫల ప్రయత్నంచేసిన శైలజానాథ్‌ను గద్దెనెక్కించింది. పత్రికాప్రకటనలు తప్ప ‘అమరావతి రాజధాని’ ఉద్యమంలో వీరి పాత్ర శూన్యం. అధికారికంగా జగన్‌పరిపాలనా వికేంద్రీకరణను ఈ పార్టీ కూడా వ్యతిరేకిస్తున్నది.
అమరావతికోసం అహర్నిశలు శ్రమిస్తూ, రైతులకు తోడునీడగా నిలిచి పోరాడుతున్న ఏకైక వ్యక్తి చంద్రబాబునాయుడు. ఎక్కడ తన భూములు, తమ అనుచరుల భూములు వాల్యూ పడిపోతాయన్న ఏడుపే చంద్రబాబు ఉద్యమం అంటూ వైఎస్‌ఆర్ పార్టీ తీవ్ర విమర్శలు చేసినా చంద్రబాబు మాత్రం నిజంగా ఉద్యమిస్తూనే వున్నాడు.
తన కలల సౌధం తన కళ్ళఎదుటే ఊరుదాటి వెళ్ళిపోవడం చంద్రబాబుకైనా, ఎవరికైనా బాధే. రైతులు తమకు నష్టం జరిగితే ఉద్యమం చేయాల్సిందే. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే. వాళ్ళ హక్కుల్ని ఎవరు కాదనరు. కాకుంటే చంద్రబాబునాయుడు చేస్తున్న పోరాటంలో అదుపు తప్పుతున్నాడు. మంచి, చెడులు విస్మరిస్తున్నాడు. జగన్‌ను తిట్టడంలో హద్దులు దాటుతున్నాడు. వ్యక్తిగత దూషణలు మంచివి కావు. ఎవరైనా హుందాగా వుండాలి. సద్విమర్శలు చేయాలి. రోజురోజుకూ చంద్రబాబు ప్రవర్తనలో చాలా తేడా కన్పిస్తున్నది. ఒక్కోసారి మరీ దిగజారుతున్నాడు. తన 40 సం.ల రాజకీయ అనుభవం ఏమైందో అన్పిస్తున్నది. జగన్ వయసులో తనకన్నా చిన్నవాడే కావచ్చు. అతను కూడా 151 స్థానాల్లో గెలుపొంది రాష్ట్ర చరిత్రలో క్రొత్త అధ్యాయానికి తెరతీశాడు. ఇది ఎవరూ కాదనలేని నిజం. తన పంధాలో తాను పోతున్నాడు. తన గమ్యం వేరుకావచ్చు, తన ఉద్దేశ్యాలు వేరు కావచ్చు. అడ్డుపడేందుకు చంద్రబాబుకు అధికారం లేదు. లక్ష్యసాధనలో విఫలమైతే, ప్రజలకు బాధలు కలిగితే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ‘చంద్రబాబు’ను మూల కూర్చోబెట్టినట్లే జగన్‌నూ ఇంటికి పంపిస్తారు. అధికారం శాశ్వతం కాదు. ప్రజల ఆమోదం, ప్రజాభిష్ఠం ఉన్నంతవరకే ఎవరైనా అధికారంలో ఉండగలరు. ఇది జగమెరిగిన సత్యం. మరి ఇవన్నీ చంద్రబాబుకు గాని, జగన్‌కు గానీ తెలియని విషయాలు కావు. నేల విడిచి సాముచేయడం ఎవరికీ మంచిది కాదు. మొన్న తెనాలిలో చంద్రబాబు చేసిన ప్రసంగం, అదివరకు ఆయనకున్న ఇమేజ్‌ను పాతాళానికి విసిరేసింది. జగన్‌ను ఉన్మాది అని, సైకో అని, నయా తుగ్లక్ అని, పిల్ల కుంక అని ఇంకా అనరాని చాలా తిట్లే తిట్టాడు. ఆయన తిట్ల దండకంను సబ్మిట్ చేస్తే చంద్రబాబుకు కూడా డాక్టరేట్ వస్తుంది. మరి తన కొడుకు లోకేష్ కూడా పిల్ల కుంకేగా! మరి 6 శాఖల్ని మంత్రిగా ఆయనకు ఎలా అప్పగించారు? వడ్డీతోసహా చెల్లించే రోజు దగ్గర్లో వుందట. చంద్రబాబు వైఖరికూడా పరస్పరం విరుద్ధంగా కన్పిస్తుంటుంది. ఆరోజు ఎల్.వి. సుబ్రహ్మణ్యంగారిని, ఎన్నికల కమీషన్‌ను, ఈనాడు అజయ్‌కల్లాం గారిని, జి.ఎన్. రావ్‌ను బండబూతులు తిట్టారు. మరోవైపు ఇప్పుడేమో ఐఎఎస్ ఆఫీసర్లు చాలా మంచివారని వాళ్ళను దూషించకూడదని, ఎల్.వి. సుబ్రహ్మణ్యం మంచి ఆఫీసర్ అని వ్యాఖ్యానిస్తాడు. 8 నెలలు అయినా పూర్తికాకుండానే రిజైన్ చేసి, ఎన్నికలకు పోదాం రండి అంటూ పాలక వర్గాన్ని సవాల్ చేయడం, రెఫరెండం కోరడం లాంటివి కాస్తా జుగుప్స అన్పిస్తాయి. చంద్రబాబుగారు రాజధానే లక్ష్యంగా ఉద్యమించాలే గాని, జగన్‌ను దించడమే లక్ష్యంగా సాగరాదు. నిజంగా 30 గ్రామాల రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీవల్ల ఎంత గందరగోళం నెలకొందో చూశాం. రాజధానికి ముగింపు ఎలావున్నా చంద్రబాబు ధోరణిలో మాత్రం మార్పు రావాలి.
ఇక జగన్‌గారి విషయానికొస్తే ఆయన 3 రాజధానులే లక్ష్యంగా, ధ్యేయంగా తన పని తాను చేసుకుపోతున్నాడు. విపక్షాలన్నీ ‘కోడై’ కూస్తున్నా తొణకక, బెదరక వెళ్తున్నాడు. చంద్రబాబు లాగా రోజూ మీడియాలో కన్పించాలన్న తాపత్రయం లేదు. ఈ 8నెలల కాలంలో ఒక్కసారీ ఆయన ప్రెస్ ముందుకు రాలేదు. చంద్రబాబు మాత్రం 8 నెలల కాలంలో కనీసం 200 సార్లయినా ప్రెస్‌మీట్స్‌తో, చిట్‌చాట్‌లతో గడిపి వుంటారు. ఇద్దరిలో పరస్పర విరుద్ధ్భావాలు. వైఎస్‌ఆర్ పార్టీ మాత్రం విపక్షాల విమర్శల్ని ఎప్పటికప్పుడు త్రిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా తాము మాత్రం విజయం సాధిస్తాం అన్న ధీమాతో ఆ పార్టీ నాయకులున్నారు. మరి న్యాయ పోరాటంలో ఎవరు గెలుస్తారో వాళ్ళదే విజయం ఖాయం.
చంద్రబాబు మాత్రం తన పోరాటంలో బీజేపీ, జనసేన పార్టీలు తప్పక సహాయపడుతాయని, వికేంద్రీకరణకు అడ్డుపుల్ల వేస్తాయని గంపెడు ఆశతో వుండగా ఫిబ్రవరి 4,5వ తారీఖున పార్లమెంటులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానం; జి.వి.ఎల్. నరసింహారావు ప్రెస్‌మీట్ పెట్టి రాజధాని గట్టిగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం పూర్తి నిస్పృహలో పడేశాయని చెప్పవచ్చు. ఇలాంటి గడ్డుకాలంలోనే ఫిబ్రవరి 6వ తారీఖున మరో బాంబు ఐ.టి.సంస్థలు పేల్చాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన అనేక మందిపై వొక్కసారిగా ఐటి సంస్థలు పెద్దఎత్తున దాడులుచేయడం ఆ పార్టీ నాయకులకు నిద్రలేకుండా చేసింది. మళ్ళీ చంద్రబాబును ఆలోచనలో పడేసింది. ఆ రోజుల్లో బాబుగారు కాంగ్రెస్ జెండా చేతబూని బీజేపీపై పెద్ద యుద్ధమే ప్రకటించాడు. సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీల్లేదని శాసనం చేశాడు. ఐనా ఒక్కసారిగా చంద్రబాబు సన్నిహితులందరిపైనా ఐటి సంస్థలు పెద్దఎత్తున దాడులు జరిపారు. అవి గతించిన రోజులు. ఇప్పుడు చంద్రబాబు బీజేపీ వొడిలోకి చేరాలని ఎనె్నన్నో ఎత్తులతో ముందుకెళ్తున్నాడు.
మరి ‘రాజధాని’లోని ఈ గందరగోళానికి ముగింపు ఎప్పుడో? ఎలా ముగుస్తుందో? విజేత ఎవరో? మరి ఢిల్లీలో ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంలా కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరుగుతున్న అమరావతి జేఏసీ బృందం ఏం మోసుకొస్తారో చూడాలి. రైతన్నలకు అండగా వుంటామన్న బీజేపీ అధికారికంగా పెద్ద షాకే ఇచ్చింది. ఏదిఏమైనా ‘నూతన సంవత్సరం’ రాష్ట్రాన్ని ఇంకా అంధకారం, గందరగోళంలోనే పడేసింది. నాయకుల ధోరణుల్లో కూడా చిత్ర విచిత్రాలు కన్పిస్తున్నాయి. రానున్న కాలంలో ఇంకా ఎవరెవరు ఇంకెన్ని రంగులు మారుస్తారో చూడాలి. రాజకీయం రంజుగావున్నా రాష్ట్రం నష్టపోతుందన్న బాధ మాత్రం అందరిలోనూ దాగి వుంది.

- డా. విజయకుమార్, 98863 81999