సబ్ ఫీచర్

టెన్షన్ వీడండి.. విజయం సాధించండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెన్షన్.. టెన్షన్.. నేడు మన పోటీ సమాజంలో చూస్తే.. తల్లిదండ్రుల విపరీత ఆలోచనలతో ప్రస్తుతం 3 సంవత్సరాలనుండి స్కూల్‌కు వెళ్ళే విద్యార్థి జీవితంలో స్థిరపడేంతవరకు పరీక్షల ఒత్తిడిని ఎదుర్కోవాల్సిందే. ఈ ఒత్తిడి జీవన ప్రపంచంలో మార్చి నెల వస్తుందంటే చాలు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ వంటి అకడమిక్ పరీక్షలకు సన్నద్ధం కావాల్సిందే. ఈ పరీక్షలు ముగియకముందే ప్రవేశపరీక్షలు ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, డైట్‌సెట్, లాసెట్, పీసెట్.. ఇలా విద్యార్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. ఎంతో కష్టపడి చదువుతున్నా, పరీక్షలలో సరైన మార్కులు సాధిస్తానా లేదా అనే భయం వెంటాడుతూనే వుంటుంది.
ప్రధానంగా విద్యార్థుల్లో పరీక్షల సమయంలో తీవ్రమైన ఒత్తిడి, ఏకాగ్రతగా చదవలేకపోవడం, ఆత్మవిశ్వాసం తగ్గడం, సానుకూల ఆలోచనలు లేకపోవడం మూలంగా విద్యార్థులు చదువులో వెనుకబడిపోతూ ఉంటారు. వీటన్నింటినీ అధిగమించాలంటే ఈ క్రింది చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. పరీక్షల్లో విజయం మీ స్వంతం అవుతుంది.
విద్యార్థులకు సూచనలు:
వాయిదా పద్ధతి ఉండకూడదు
పరీక్షలు ప్రారంభం అయ్యేదాకా పాఠాలు చదవడం వాయిదా వేసుకోకుండా తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించిన పాఠాలు ఎప్పటికప్పుడు చదువుకోవాలి. పరీక్షలు నిర్దేశిత సమయంలో రాయాల్సి వుంటుంది. కాబట్టి గతంలోని ప్రశ్నాపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రణాళిక ప్రకారం టైంటేబుల్ తయారుచేసుకొని ఎప్పటికప్పుడు సబ్జెక్టులను పూర్తిచేసుకోవాలి. బట్టీ విధానానికి దూరంగా ఉండాలి. పాఠ్యాంశాలను అర్థం చేసుకొని చదువుకొంటూ ఉండాలి. సందేహాలువస్తే స్నేహితులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వద్ద ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. కష్టమైన అంశాలను ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి. చదివేటప్పుడు అలసటగా వుంటే ప్రతి గంటకొకసారి పది నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి.
మనసు అధీనంలో ఉంచుకోవాలి
పరీక్షలకోసం ప్రిపరేషన్ అవుతూ ఉన్నపుడు మనసును ఆధీనంలో ఉంచుకోవాలి. ప్రశాంతమైన వాతావరణాన్ని తయారుచేసుకోవాలి. చదువుకు అంతరాయం కలిగే టీవీ, మొబైల్ ఫోన్, కంప్యూటర్, వీడియో గేమ్స్‌లను దూరంగా ఉంచాలి. ప్రిపరేషన్ అయ్యే గదిలో వెలుగు, చల్లటిగాలి ఉండునట్లు చూసుకోవాలి. ఏ సమయంలో విద్యార్థికి చదివితే అర్థం అవుతుందో ఆ సమయంలో చదువుకోవాలి. ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య చదివితే మనసు ప్రశాంతంగా వుంటుంది.
ఏకాగ్రత
పరీక్షలలో విజయాన్ని సాధించడంలో ఏకాగ్రత ప్రముఖ పాత్ర వహిస్తుంది. విద్యార్థులు చదివే అంశం పట్ల ఇంటరెస్ట్, సాధించాలనే పట్టుదల ఉంటే ఆ అంశం పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. పాఠ్యాంశాలను చదివేటప్పుడు ముఖ్యాంశాలను ఒక్క నోట్‌బుక్‌లో రాసుకోవాలి. ఏకాగ్రత సాధించడానికి ప్రతిరోజూ ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఆత్మవిశ్వాసం
విద్యార్థి సరైన దారిలో ఎదగడానికి ఆత్మవిశ్వాసం తప్పనిసరి. వ్యక్తిత్వ వికాసానికి, తనకు తానుగా గౌరవించుకోవడానికి, విద్యార్థిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి ఆత్మవిశ్వాసం ‘గుండె’ వంటిదని చెప్పవచ్చు. లక్ష్యసాధనలనో ఎన్నోరకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటికి ఎదురీదుతూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లినవారే ప్రపంచ విజేతలు అవుతారు. ఒక అంశం నేర్చుకోవాలనుకున్నపుడు అది ఎంత కఠినమైనా కానీ ఆ అంశం సాధనలో మిత్రులతో చర్చించడం, మేధావులు, విజేతల సహకారం తీసుకోవడం, సీనియర్స్ సలహాలను తీసుకొని ముందుకు వెళ్తే మీ లక్ష్యం మీకు దాసోహం అవుతుంది.

సానుకూల (పాజిటివ్) ఆలోచనలు
నెగెటివ్ ఆలోచనలవల్ల విద్యార్థిలో సాధించలేమోనన్న నిరాశావాద దృక్పథం ఏర్పడుతుంది. ఫలితంగా ఒత్తిడి ఏర్పడి, అది కాస్తా డిప్రెషన్‌గా మారుతుంది. లక్ష్య సాధనలో ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సానుకూల ఆలోచనలను మనసులో పెంపొందించుకొని మనోధైర్యంతో ముందుకు సాగాలి.
ఎగ్జామ్ టిప్స్
ఎగ్జామ్స్ సమయంలో విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో నేను బాగా రాస్తాను అనే భావతో వుండటం చాలా ముఖ్యం. అనవసర వ్యాపకాల్లో తల దూర్చకుండా చదువు విషయాలపట్ల ఆసక్తి చూపాలి. లిక్విడ్స్ లాంటి ఆహారాన్ని తీసుకోలి. గ్లాసు వేడిపాలు తాగితే శారీరక శక్తితోపాటుగా ఉత్సాహం లభిస్తుంది. ఎగ్జామినేషన్ హాల్లోకి తీసుకువెళ్ళే మెటీరియల్ ముందురోజు రాత్రే సిద్ధం చేసుకోవాలి. రోజూ హాల్‌టికెట్‌ను మరచిపోకుండా తీసుకెళ్లాలి. ఎగ్జామ్స్‌కు వెళ్లేటప్పుడు నీట్‌గా డ్రెస్ చేసుకుని, తల అందంగా దువ్వుకోవాలి. దీనివల్ల మీపైన మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పరీక్ష సమయానికంటే 45 నిమిషాల ముందుగానే వెళ్లాలి. ఎగ్జామ్స్ హాల్లో చిరునవ్వుతో, హ్యాపీగా వుండటంవల్ల పరీక్ష ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు సమాధానాలు తొందరగా గుర్తుకువస్తాయి. ప్రశ్నాపత్రంలో ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా అర్థం చేసుకుని చదివి, ప్రశ్న పూర్తిగా అర్థమైన తర్వాతే సమాధానం ప్రారంభించాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ - కాబట్టి బాగా వచ్చిన ప్రశ్నకు సమాధానం రాయాలి. పరీక్షా సమయంలో ఆన్సర్ షీట్‌లో కొట్టివేతలు లేకుండా మార్జిన్ చూపిస్తూ నీట్‌గా రాస్తే మంచి మార్కులు లభిస్తాయి. ఒకే ఆన్సర్‌ని రెండుసార్లు రాస్తే సమయం వృధా అవుతుంది. అలా రాయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం గుర్తుకురాకపోతే కొంతసేపు ప్రశాంతంగా ఆలోచిచాలి. అప్పటికి గుర్తుకురాకపోతే వేరే ప్రశ్నకు సమాధానం రాయాలి. పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్ ఇచ్చే సూచనలను శ్రద్ధగా వినాలి, పాటించాలి.
తల్లిదండ్రుల బాధ్యత
తల్లిదండ్రులు పిల్లలకు విద్యా సంవత్సరమంతా ఎక్కువ స్వేచ్ఛనిచ్చి పరీక్షల సమయంలో కఠిన నియమాలు విధించడంవల్ల పిల్లవాడు ఎక్కువగా వత్తిడికి గురవుతాడు. పిల్లవాడి శక్తి సామర్థ్యాలను తెలుసుకుని లక్ష్యాన్ని నిర్ణయించాలి. తమ పిల్లలతో మంచి స్నేహితులుగా ఉంటూ, వారిలోని ఆందోళనలు, భయాలను పోగొట్టాలి. పరీక్షలంటే భయం అనే నెగెటివ్ ఆలోచనల్ని విడిచిపెట్టి పిల్లల్లో పాజిటివ్ దృక్పథాన్ని కల్పించాలి. అపజయాలను ఎదిరించి.. విజయాల్ని సాధించిన గొప్ప మేధావులు, శాస్తవ్రేత్తలు వంటి మహావ్యక్తుల స్టోరీలను చెప్పి వారిని ఆదర్శవంతంగా తీసుకుని పిల్లల్లో సాధించాలనే తపన, పట్టుదల, ఏకాగ్రత, మనోధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని నింపాలి.

- డా॥ అట్ల శ్రీనివాస్‌రెడ్డి