సబ్ ఫీచర్

ప్రపంచాన్ని కుదిపేసిన కమ్యూనిస్టు ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1848 ఫిబ్రవరి 21. ప్రపంచ విప్లవోద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. నిద్రాణంగా ఉన్న జర్మనీ తాత్విక పునాది నుండి నాడు విరిసిన గులాబి నేటికీ విముక్తి సుగంధాలు విరజిమ్ముతూనే ఉంది. నాడు జర్మనీ కార్మికవర్గ విముక్తి కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అనతి కాలంలోనే విశ్వనరుని విముక్తి గీతంగా మారింది. మార్క్స్, ఆయన జీవితకాల విప్లవ సహచరుడు ఫ్రెడరిక్ ఏంగెల్స్‌లు ఇద్దరు కలిసి చేసిన తొలి ఉమ్మడి రచన ఇది. లండన్ కేంద్రంగా పని చేస్తున్న ప్రవాస జర్మనీ విప్లవకారుల కోసం రూపొందించిన ప్రణాళిక. ప్రపంచ గతిని మార్చేసిన ఈ చిరుపుస్తకం ఇప్పటి వరకు జరిగిన చరిత్రంతా వర్గపోరాటాల చరిత్రే అని ఒక్క మాటలో తేల్చేసింది. ఈ వర్గపోరాటంలో అంతిమ విజయం కార్మికవర్గానిదేనని కూడా ప్రగాఢ విశ్వాసంతో ప్రకటించింది. బూర్జువా వర్గాన్ని కూలదోసి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న కార్మికవర్గం తొలుత వర్గ దోపిడీని కాలక్రమంలో వర్గాలను కూడా తొలగించే లక్ష్యంతో కృషి చేయాలన్నదే కమ్యూనిస్టు ప్రణాళిక చేస్తున్న మార్గదర్శనం. తొలుత జర్మన్ భాషలో అచ్చయిన ఈ గ్రంధం 1950 దశకం వచ్చేసరికి ప్రపంచంలో మూడోవంతు దేశాలను సోషలిస్టు దేశాలుగా మార్చటంలో కీలక పాత్ర పోషించింది.
20వ శతాబ్ది యావత్తూ క్రియాశీల ప్రత్యామ్నాయ రాజకీయాల్లో పాల్గొనే వారికి స్పూర్తినిచ్చే గ్రంధంగా ఉన్న ‘‘కమ్యూనిస్టు ప్రణాళిక’’ 1840 దశకంలో యూరప్‌లో కమ్యూనిజం, సోషలిజం గురించి తలెత్తిన అనేక ప్రశ్నలకు సమాధానంగా వెలుగు చూసిన గ్రంధం. చరిత్రకు సంబంధించిన సరికొత్త దృక్ఫథాన్ని, మానవజాతి చారిత్రకంగా అభివృద్ధి చెందుతూ నేడున్న దశకు చేరుకున్నదన్న సత్యాన్ని, మానవజాతి ఆవిర్భావం, పరిణామంలో నమ్మకాలు, విశ్వాసాల కంటే భౌతిక పరిస్థితులే నిర్ణాయక పాత్ర పోషించాయనీ తొలిసారి ప్రకటించిన గ్రంధం ఇది. ఆలోచనలకు, ఆచరణకు, చరిత్రకు మధ్య అవినాభావ సంబంధం గురించి సాధారణ జనానికి అర్థమయ్యేలా అందించిన గ్రంధం ఇది. ఈ గ్రంధం రాసేనాటికి కారల్ మార్క్స్ వయసు ముప్పయ్యేళ్లు మాత్రమే. జర్మనీలోని ట్రయర్ అనే చిన్న పట్టణంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మార్క్స్ కాలేజీ విద్యార్జన నాటికే విముక్తి భావాల ఏరికూర్చటంలో నిమగ్నమయ్యాడు. నూనూగు మీసాల నూత్న యవ్వన దశలోనే పరపీడనతో నిండిన నరజాతి చరిత్ర సమస్థానికి ఉన్న పునాదులు, దాని చలన సూత్రాలు గుర్తించటమే కాక పీడితులు విముక్తి కోసం పోరాడటానికి కావల్సి ఓ ఆయుధాన్ని కూడా కమ్యూనిస్టు ప్రణాళిక రూపంలో అందించాడు. శాస్ర్తీయ సామ్యవాదానికి ఏంగెల్స్‌తో కలిసి పునాదులు వేశాడు. కార్మికవర్గ దోపిడీని అర్థం చేసుకునే క్రమంలో ఏంగెల్స్ సాగించిన పరిశోధనే ఇంగ్లాండ్‌లో కార్మికవర్గ స్థితిగతులు అన్న బృహత్ గ్రంధం రూపం తీసుకుంది. వేగంగా రూపాంతరం చెందుతున్న పెట్టుబడిదారీ దోపిడీ రూపాలను అత్యంత సమీపంగా గమనించి, పెట్టుబడి చలన సూత్రాలతో జోడించి పెట్టుబడి లాభార్తిని తీర్చటంలో ప్రభుత్వాల పాత్రను, ఈ క్రమంలో కార్మికవర్గంపై పెరుగుతున్న దోపిడీ తీవ్రతను కళ్లకు కట్టినట్లు విడమర్చి చెప్పిన తొలి సంపూర్ణ గ్రంథం ఇంగ్లాండ్‌లో కార్మికవర్గ స్థితిగతులు.
లండన్‌లో తలదాచుకున్న ప్రవాస జర్మన్ విప్లవకారులు 1847 నాటికి లీగ్ ఆఫ్ జస్టిస్‌గా ఏర్పడి మార్క్స్‌ను కూడా తమతో కలిసి నడవమని కోరారు. ఏంగెల్స్‌తో కలిసి ఈ ప్రతిపాదన అంగీకరించిన మార్క్స్ లీగ్ ఆఫ్ జస్ట్‌ను కమ్యూనిస్టు లీగ్ గా పేరు మార్చి వివిధ పేర్లతో ఉన్న ఇతర ప్రజాతంత్ర, విముక్తి శక్తులను, మేధో చింతన సాగిస్తున్న వారిని, వివిధ స్థాయిల్లో సాగుతున్న కార్మికోద్యమాలకు నాయకత్వం వహిస్తున్న వారినీ ఏకం చేస్తున్న సమయంలో తమకంటూ ఓ కార్యక్రమం కూడా తయారు చేయమని కమ్యూనిస్టు లీగ్‌కు మార్క్స్ ఏంగెల్స్‌ను కోరింది. 1847లోనే ఏంగెల్స్ ఈ లీగ్ కోసం ఓ ముసాయిదా ప్రణాళికను ప్రతిపాదించాడు. దాన్ని మరింత పరిపూర్ణం చేస్తూ 1848 నాటికి మార్క్స్ కమ్యూనిస్టు ప్రణాళిక పూర్తి చేశాడు. అప్పటి వరకు జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌లలో కేవలం దోపిడీని వ్యతిరేకించే వారు, పెట్టుబడిదారీ వ్యవస్థ క్రూరత్వాన్ని తిరస్కరిస్తున్న వారు వ్యక్తం చేస్తున్న ఆకాంక్షలనే కాక గ్రీకు తత్వవేత్తలు మొదలు 19వ శతాబ్ది జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రెంచి తత్త్వవేత్తల వరకు కొనసాగిన విముక్తివాద స్రవంతికి చెందిన తత్వవేత్తలు అందించిన పాఠాల సారాన్ని క్రోడీకరించి శక్తివంతమైన భాషలో మార్క్స్, ఏంగెల్స్‌లు అందించిన గొప్ప రచన కమ్యూనిస్టు ప్రణాళిక. అత్యంత సంక్షిప్త వాక్యాలతో నరజాతి చరిత్ర మొత్తాన్నీ విశే్లషించి ‘‘యూరప్‌ను ఓ దెయ్యం వెంటాడుతోంది. అదే కమ్యూనిజం’’ అన్న హెచ్చరికతో ప్రారంభించి ‘‘పోరాడితే పోయేదేమీ లేదు. సంకెళ్లు తప్ప. పోరాడి గెలుచుకోవటానికి ఓ ప్రపంచమే ఉంది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి’’ అన్న సింహగర్జనతో ముగిసే ఈ చిన్న పుస్తకం తర్వాతి కాలంలో ప్రపంచ చరిత్రను తిరగరాసింది.
యూరోపియన్ దేశాల్లో 1848లో మొదలైన సాయుధ తిరుగుబాటులో మార్క్స్ ఏంగెల్స్‌లు ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఈ తిరుగుబాట్లను పాలకర్గాలు త్వరగానే అణచివేసినా బూర్జువా వర్గాన్ని ఓడించే సత్తా కార్మికవర్గానికి ఉన్నదన్న చారిత్రక సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. బహిష్కృతుడైన మార్క్స్ లండన్ చేరాడు. 1844-47లో వివిధ విప్లవ బృందాలను ఏకతాటి మీదకు తేవటానికి సాగించిన ప్రయత్నంలో వచ్చిన అనుభవాలు ఆధారంగా 1864 నాటికి తొలి కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ను స్థాపించారు మార్క్స్ ఏంగెల్స్. ప్రపంచ విప్లవోద్యమానికి కావల్సిన మేధో పునాదిని సమకూర్చటంలో, పెట్టుబడిదారీ విధానంపై సాగించే పోరాటంలో కార్మికవర్గానికి అవసరమైన తాత్విక సైద్ధాంతిక ఆయుధాలతో పాటు సంఘనిర్మాణాన్ని కూడా పీడిత వర్గానికి అందచేసిన మార్క్స్ ఏంగెల్స్‌లు చిరస్మరణీయులు.
మన కళ్ల ముందు జరుగుతున్న వర్గ పోరాటాలు, ఆ వర్గ పోరాటాలకు దారితీసే వర్గ సంబంధాల పై ఆధారపడే కమ్యూనిస్టుల సైద్ధాంతిక నిర్దారణలు అంచనాలు ఉండాలనీ, ఊహాజనిత పరిస్థితులు, ప్రతిపాదనలు ఆధారంగా ఉండకూడదని మార్క్స్ ఏంగెల్స్‌లు తమ జీవతానుభవం నుండి తేల్చి చెప్పారు. సమాజాన్ని అర్థం చేసుకోవటం, అందుకుగాను అధ్యయనం చేయటం సమాజాన్ని మార్చాలనుకున్న వారి తొలి కర్తవ్యమని కూడా ఈ గ్రంథం గుర్తు చేస్తోంది. కమ్యూనిస్టు ప్రణాళిక ద్వారా మార్క్స్ ఏంగెల్స్‌లు కమ్యూనిస్టుల రాజకీయ దృక్కోణంతో పాటు చారిత్రక పరిణామానికి సంబంధించిన కమ్యూనిస్టుల అవగాహనను కూడా ప్రపంచం ముందుంచుతోంది. ఈ అవగాహన ప్రజలకు చేరనీయడం వల్ల తమ దోపిడీ పాలనకు అవరోధం కలుగుతుందని ఆందోళన చెందేవారే నిజమైన చరిత్ర వైపు ప్రజలు దృష్టి మళ్లించకుండా ఉంచేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తారు. ఇప్పటి వరకు ఉన్న చరిత్ర అంతా వక్రీకరణకు గురైన చరిత్రే అనీ, దాన్ని సమ్ఱూంగా మార్చాలన్నదే ఈ దోపిడీ పాలకులు ముందుకు తెచ్చే తొలి నినాదం.
ఈ పరిస్థితుల్లో ప్రపంచ గతిని మార్చేసి ఈ బృహత్ గ్రంథాన్ని తెలుగు పాఠకులకు సరికొత్త అనువాదంతో అందుబాటులోకి తేవటం సాహసంతో కూడుకున్న పని. మన చరిత్ర మానవ చరిత్రలో అంతర్భాగమే. అందుకే మన చరిత్రను అర్ధం చేసుకోవాలన్నా మానవ చరిత్రను అర్థం చేసుకోవాలి. వేల సంవత్సరాలు మానవజాతి చరిత్రను, ఈ చరిత్రను నడిపిస్తున్న వర్గాలు, వాటి మధ్య సాగుతున్న పోరాటాన్ని అర్థం చేసుకోకుండా మన చరిత్రను అర్థం చేసుకోలేము. మన చరిత్ర తెలుసుకోవాలన్నా, మానవజాతి చరిత్ర తెలుసుకోవాలన్నా చదవాల్సిన గ్రంథం కమ్యూనిస్టు ప్రణాళిక. బోల్షివిక్ విప్లవం నాటికే 35 భాషల్లో 544 సార్లు అచ్చయిన ఈ గ్రంధాన్ని భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య తొలిసారి 1933లో తెలుగులో అనువదించి నాటి మద్రాసు రాష్ట్ర కమిటీ సభ్యులకు పంపిణీ చేశారు. అయితే ఇది పుస్తక రూపానికి నోచుకోలేదు. కంభంపాటి సత్యన్నారాయణ గారి అనువాదం పుస్తకరూపంలో అందుబాటులో ఉంది. రెండో అనువాదం రాచమల్లు రామచంద్రారెడ్డిది. సుందరయ్య ప్రణాళికతో పాటు ఏంగెల్స్ రాసిన ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిజంను సైతం అనువదించారు. బహుశా ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యంలో ఏ గ్రంధమూ ఒకే సారి లక్ష కాపీలు అచ్చయి ప్రజల ముందుకు వచ్చింది లేదు. ఈ రూపంలో కూడా 2020 ఫిబ్రవరి 21న రెడ్ బుక్ డే సందర్భంగా విడుదల కాబోతోన్న కమ్యూనిస్టు ప్రణాళిక గ్రంథం తెలుగు సాహిత్యంలో ఓ విన్నూత్న అధ్యాయానికి నాంది పలుకు తుందనటంలో సందేహం లేదు.

- కొండూరి వీరయ్య, 9871794037