సబ్ ఫీచర్

సీఏఏ వ్యతిరేకులకు మిగిలింది బూడిద!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎట్టకేలకు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)వల్ల భారతదేశ ముస్లింలకు ఎటువంటి నష్టం జరగదని కాంగ్రెసు పార్టీ అంగీకరించింది. ఢిల్లీ అల్లర్లపై పార్లమెంట్‌లో జరిగిన చర్చ సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెసు నాయకుడు కపిల్ సిబాల్ ఈ విషయం చెప్పారు. హమ్మయ్య.. 52మంది పౌరులు మరణించాక, కోట్ల రూపాయల ఆస్తి అగ్గిపాలయ్యాక కాంగ్రెసు నాయకులకు ‘జ్ఞానోదయం’ కలిగింది. సంతోషం. కపిల్‌సిబాల్ ఈ ప్రకటన చేస్తున్నప్పుడు మరో నాయకుడు గులాం నబీ ఆజాద్ పక్కనే ఉన్నారు. వౌనంగానే ఆ ప్రకటనకు ఆమోదం తెలిపారు. పార్లమెంట్‌లో చర్చల అనంతరం సీఏఏ ఆమోదం పొందింది. అలా ఆమోదం పొందాక రాజకీయ లబ్దికోసం కాంగ్రెసు ఢిల్లీలోని రామలీల మైదానంలో సభ పెట్టి, చిరకాలంగా మైనార్టీలను ఓటు బ్యాంకుగా భావిస్తున్న ఆ పార్టీ నాయకులు ముస్లింలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. ఏకంగా సోనియాగాంధీ ఆ సభలో.. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాల్సిన సమయం.. అటోఇటో తేల్చుకోవలసిన సందర్భం వచ్చేసిందని ఆందోళనకారులను ఎగదోశారు. ఆ చట్టంవల్ల ముస్లింల పౌరసత్వం ప్రమాదంలో పడుతుందన్న అపోహను, భ్రమను, విషప్రచారాన్ని పెద్దఎత్తున చేపట్టారు. ఆ చట్టంపై సరైన అవగాహన, ఆలోచన లేనివారు, నిరక్షరాస్యులు ఆ మరుసటిరోజు నుంచే షాహిన్‌బాగ్‌లో రోడ్డును ఆక్రమించి టెంట్ వేసి ధర్నా పేర హంగామా ప్రారంభించారు. ఇక జామియామిలియా, జెఎన్‌యూలో చదువుకున్న ‘అజ్ఞానులు’ చట్టం ఏం చెబుతున్నదో, ఎవరినుద్దేశించి ఆ చట్టం తీసుకొచ్చారో కనీసం ఇంటర్‌నెట్‌లోనూ చదవకుండా రోడ్లపైకి వచ్చి, హింసాత్మక సంఘటనలకు పాల్పడి, వాహనాల దగ్ధకాండకు పూనుకొని ప్రజల్లో భయానక వాతావరణాన్ని సృష్టించారు.
ఇక షాహీన్‌బాగ్ వెనకాల ‘ఆప్’ నాయకులు, కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కనిపించారు. మణిశంకర్ అయ్యర్ లాంటి అగ్రనాయకులు అక్కడికెళ్ళి ఆందోళనకారుల్ని మరింత రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. చివరికి అర్బన్ నక్సల్స్ ప్రమేయం అందులో ఉందని కూడా వార్తలొచ్చాయి. ఇంతవరకు దండకారణ్యంలో గెరిల్లా పోరాటానికి, సాయుధ దాడులకు పాల్పడిన మావోలు ఇప్పుడు వారి పట్టణ కామ్రేడ్స్ నగర- పట్టణ ప్రాంతాల్లోనూ వీధి పోరాటాలకు పాల్పడాలని చాలాకాలం క్రితమే తీర్మానించుకున్నట్టు తెలుస్తోంది. ఆ తీర్మానాన్ని ఇప్పుడు ఢిల్లీలో ఆచరణలోపెట్టి అనుభవాన్ని గడించారనిపిస్తోంది. గతంలో మహారాష్టల్రోని భీమా కోరేగావ్ అల్లర్లలోనూ వారు తమ శక్తిసామర్థ్యాలను, నైపుణ్యాలను పరీక్షించుకున్నారు. ఇప్పుడు ఏకంగా మిగతా ‘వర్గాల’తో కలిసి ఈ చర్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. జెఎన్‌యూ విద్యార్థులు అనేకమంది షాహీన్‌బాగ్‌లో కనిపించిన సంగతి మరువరాదు. సమస్య ఎలాంటిదైననూ పది మంది పోగవుతే అందులో చొరబడి లబ్ధిపొందాలన్న ఆలోచన పరమదుర్మార్గమైనది. కొన్ని పార్టీలు, మావోలు ఆ సమయం కోసమే ఎదురుచూస్తూ అగ్నికి ఆజ్యంపోస్తూ ఉంటారు. షాహీన్‌బాగ్‌లో జరిగింది అదే..
టుక్డే టుక్డే గ్యాంగ్ రెచ్చిపోయింది. దేశాన్ని ముక్కలుముక్కలుగా విడగొడతామని, ఈశాన్య రాష్ట్రాలను దేశంనుంచి వేరుచేస్తామని, లా ఇల్లలా.. అల్లాహో అక్బర్.. అంటూ రక్తం మరిగించే నినాదాలు చేయడం ఎలా సబబు అవుతుంది? సీఏఏకు ఈ ఆజాదీ నినాదాలకు, దేశాన్ని ముక్కలు చేస్తామన్న ప్రతిజ్ఞలకు ఏమైనా సంబంధమున్నదా? హైదరాబాద్ ఎం.పి. అసదుద్దీన్ ఓవైసీ దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఆందోళనలకు మరింత ఊపిరిపోశారు. బారిస్టర్ చదివిన వ్యక్తి సీఏఏ చట్టంలో ఏముందో చదవకుండా, తెలుసుకోకుండా ఆవేశంతో ఊగిపోతూ తన సామాజిక వర్గానికేదో అన్యాయం జరిగిపోతోందని, లేని సమస్య ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్నాడు. వెయ్యిమందితో హైదరాబాద్‌లో నిరసన సభ జరుపుతామని అనుమతి తెచ్చుకుని పది లక్షల మందితో సిఏఏ వ్యతిరేక ప్రదర్శన నగరం నడిబొడ్డున నిర్వహించడం ఆయన తప్పుడు వ్యవహారాన్ని రుజువుచేసింది. ఈ వ్యితిరేకతను ఉపయోగించుకుని జాతీయ నాయకుడి అవతారమెత్తాలని ఆయన తీవ్ర ప్రయత్నం చేశాడు.
అది అలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఈ సమస్యను అంతర్జాతీయం చేసి భారత ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ముందుగానే కుట్ర పన్నారు. బహిరంగంగా కొందరు హింసాత్మక సంఘటనలకు పాల్పడి పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వచ్చేలా, అవి ట్రంప్ దృష్టికి వెళ్ళేలా పథకం పన్నారు. ఇప్పుడు రెచ్చగొట్టే ఆ ఉపన్యాసాలు టేపుల్లో అందుబాటులో ఉన్నాయి. షాహీన్‌బాగ్ తరహా ఆందోళనలు ప్రముఖ నగరాలకు విస్తరింపజేసి, ఆ ‘నమూనా’తో దేశంలో అశాంతిని పెంచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసి, ఢిల్లీలోనే జాఫ్రాబాద్ మెట్రోస్టేషన్‌వద్ద ముస్లిం యువతులు, వృద్ధులు, పిల్లలతో మరో శిబిరం తెరిచేందుకు పెద్దఎత్తున గుమికూడటం.. సమాంతరంగా హింసాత్మక సంఘటనలకు ప్రణాళిక రచించడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఢిల్లీలో కాలుపెట్టగానే కల్లోలం ‘సెగ’తగలాలన్న దుర్బుద్ధితో, దురాలోచనతో, విద్రోహశక్తులతో కలిసి అల్లర్లకు తెరలేపారు. పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్‌నుంచి కూడా అసాంఘిక శక్తులను రప్పించి పథకం ప్రకారం పిస్తోళ్లు, పెట్రోలు బాంబులు, ఆసిడ్ సీసాలు, ఇనుపరాడ్లు, ఇటుకలు, రాళ్ళు, ‘గులేర్లు’ ఏర్పాటుచేసుకుని విరుచుకుపడ్డారు. దాంతో మొత్తం 52 మందికి పైగా ప్రాణాలు విడిచారు. పోలీసు కానిస్టేబుల్, నిఘా అధికారిని అత్యంత క్రూరంగా హత్యచేశారు. డీసీపీ స్థాయి అధికారి తలను మహిళలు పగులగొట్టడమంటే ఇది ఏ రకమైన ఉన్మాదం? ఏ రకమైన విధ్వంసం? ఈ హత్యాకాండను ఎవరైన ఎలా సమర్థించుకుంటారు? కేంద్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు సీఏఏ పౌరసత్వం ఇస్తుందే తప్ప ఎవరి పౌరసత్వం లాగేసుకోదని పదే పదే పేర్కొన్నా, పత్రికల ద్వారా, మీడియా ద్వారా తెలిపినా వినిపించుకోకుండా అపోహను, అసత్యాన్ని మాత్రమే విద్రోహశక్తులను మాత్రమే విశ్వసించి, వారి మాటలనే నమ్మి దేశాన్ని అప్రతిష్టపాలు చేయడమేగాక, అనేకమంది ప్రాణాలు తీసి మురికి కాలువల్లో పారేయడం, దుకాణాలను దగ్ధంచేయడం, వ్యాపారాలకు అపారనష్టం కలిగించడం ఏ రకంగా వివేకమనిపించుకుంటుంది? పిస్తోళ్ళతో వీర విహారం చేయడం, పోలీసుల పైకే వాటిని ఎక్కుపెట్టడం ప్రజాస్వామ్యంలో ఏవిధంగా సమర్థనీయం? చివరికి సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తులైన న్యాయవాదుల మాటలను షాహీన్‌బాగ్ ఆందోళనకారులు చెవిమీద పెట్టకపోవడాన్ని ఏం సూచిస్తోంది? 21వ శతాబ్దంలో ప్రపంచమంతటా ప్రజాస్వామ్యం చిక్కబడుతున్న తరుణంలో ఇలా రాడికల్ పద్ధతులను, అప్రజాస్వామిక విధానాలను అవలంబించడంవల్ల ఒరిగేది ఏమిటి? అన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా? వాటన్నింటిని ‘సమాధి’ చేసి దేశాన్ని తగులబెట్టే కార్యక్రమంకోసం విదేశీ నిధులు స్వీకరించి, ఆ నిధులతో నిప్పు రాజేయడం ఎలా సమ్మతమవుతుంది? దొంగనే దొంగ అని అరిచినట్టు పథకం ప్రకారం దాడులుచేసి తాము బాధితులమని ప్రపంచానికి, అంతర్జాతీయ మీడియాకు ఎక్కడం విడ్డూరం. మానవ హక్కులు, పౌర హక్కుల నెపంతో అంతర్జాతీయ వేదికలెక్కేందుకు పన్నిన కుట్ర తేటతెల్లమైంది. ఇంత జరిగాక, ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసాక దేశ పరువుప్రతిష్ట మట్టిపాలయ్యాక, షాహీన్‌బాగ్‌లో ఆందోళనకారుల సంఖ్య పూర్తిగా పలచబడ్డాక, ఎంత ఒత్తిడితెచ్చినా ప్రభుత్వం చట్టాన్ని వెనక్కితీసుకునే ప్రసక్తేలేదని ఖరాకండిగా చెప్పాక, ఎవరూ ఎలాంటి పత్రాలను జాతీయ జనాభా పట్టిక సందర్భంగా చూపనవసరం లేదని ప్రకటించాక కాంగ్రెసు నాయకులు మెల్లిగా తమ ‘వైఖరి’ని మార్చుకోవడంవల్ల ఎవరు నష్టపోయారు? ముస్లిం మత ఛాందసవాదులైనా, మావోలైనా, అర్బన్ నక్సల్స్ అయినా, అంబేద్కర్ సేవ పేర హింసను ప్రోత్సహించేవారు వాస్తవాల్ని, వర్తమాన పరిస్థితుల్ని నిశితంగా పరిశీలించాలి. అవకాశం దొరికింది కదా అని ఆవేశపడితే వారికి మిగిలేది బూడిదే.

- వుప్పల నరసింహం, 99857 81799